Previous Page Next Page 
ప్రణయ వీచికలు పేజి 11

సీత కొంతసేపు నిల్చుని దూరంగా ఖాళీగా వున్న ప్రదేశంలో కూర్చుంది. క్రితంరోజు రాత్రి గురించీ, ఆ అజ్ఞాతవ్యక్తి గురించి, తన భవిష్యత్తు గురించీ ఆలోచిస్తూ కూర్చుంది.
తను ఏం పాపం చేసింది? ఏదో చేసే ఉండాలి! అందువల్లనే తల్లిదండ్రులకు దూరం అయింది. రాక్షసుడిలా బాబాయి పెంపకంలో దుర్భంగా జీవిస్తోంది.
ఈ జీవితంకంటే తను తనతల్లిదండ్రులతోపాటు చనిపోయి వుంటే బాగుండేది. వాళ్ళతోపాటు చర్చి యార్డ్ లో ప్రశాంతంగా దీర్ఘనిద్రలో వుండి వుంటే ఈ నరకం తప్పి వుండేది. ఈ భయంకరమైన జీవితాన్ని విరమించుకోవాలనే వచ్చింది. కాని... అతను తనకు ఆపని చెయ్యనివ్వలేదు. పైగా వాగ్దానం చేయించాడు.
స్ట్రియన్ టీచింగ్స్ ప్రకారం తన తల్లిదండ్రులు మరో ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని కొన్ని సంవత్సరాల నుంచి వదలివెళ్ళి వాళ్ళ మధ్య హాయిగా వుండివుంటారు.
హాయిగా వుండి వుంటారా? తన కష్టాలను చూసి బాధపడుతూ ఉండరా?
ఏమో! ఎవరికి తెలుసు? చనిపోయాక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
అతను వస్తే బాగుండును. వస్తాడు తప్పక.
"హలో! ఏం చేస్తున్నారు?"
సీత తుళ్ళిపడి వెనక్కి చూసింది.
ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయింది.
ఇది నిజమా! అతను నిజంగా తన ఆలోచనలు తెలుసుకొని వచ్చాడా? లేక తన భ్రమా?
"ఏమిటలా చూస్తావ్?"
"మీగురించి ఆలోచిస్తున్నాను. మీరు కన్పిస్తే బాగుండునని ఆలోచిస్తున్నాను. నిజంగానే మీరు వచ్చేశారు" పసిపిల్లలా మాట్లాడుతున్న సీతను అతను చూస్తూ నిల్చున్నాడు.
"ఈరోజు వుదయం నుంచీ - మీ గురించే ఆలోచిస్తున్నాను. పొద్దుట మీకోసం ఇక్కడ వెదికాను."
అతనికి నవ్వొచ్చింది.
"నేనేం వస్తువునా వెదికితే దొరకడానికి" అతని కంఠం తమాషాగా ధ్వనించింది.
సీత కళ్ళు టపటపలాడిస్తూ అతన్ని చూసింది.
అతనిలో ఏదో మార్పు వున్నట్టు గమనించింది. కొద్దిక్షణాల తర్వాతగాని ఆ మార్పుకు కారణం అతను నిన్నటిలా టర్బన్ కట్టుకోకపోవడం అని తోచలేదు.
"ఎలా వున్నావ్?"
"మీరేనా డాక్టర్ గార్ని పంపించారు? నా క్యాబిన్ మార్పించినందుకు మీకు నా కృతజ్ఞతలు" ఉప్పొంగుతున్న ఉత్సాహంలో మునిగిపోతూ అన్నది సీత.
"నేను ఆ ఏర్పాటు చేశానని ఎందుకనుకొంటున్నావు?"
"మీకంటే నాగురించి ఆలోచించేవాళ్ళు ఇంకెవరూ లేరు. మీకు నేను జీవితమంతా రుణపడి వుంటాను."
"అంతంతమాటలెందుకు!"
అతను మాట్లాడుతున్నాడు.
సీత అతని ముఖంలోకి చూస్తున్నది.
మసక చీకటిలో అతని ముఖంలోని భావాలు స్పష్టంగా కన్పించడంలేదు. అయినా అతను తనవైపు జాలిగా చూస్తున్నట్టుగా తోచింది సీతకు.
"నేను ఇక్కడ వుంటాననీ, మీకోసం ఎదురు చూస్తున్నాననీ మీకు తెలిసిందా?"
"తెలిసిందా-ఇందరి మధ్యలో తిరగటానికి సిగ్గుపడుతున్నానని కూడా తెలిసింది."
"నిజమే! కాని మీకివన్నీ ఎలా తెలిశాయి?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
"నేను నీగురించి ఆలోచించాను. నువ్వు ఏమేమి ఆలోచిస్తున్నావో తెలుసుకోవడానికి ప్రయత్నించాను."
"అలా తెలుసుకోవడం సంభవమా?"
"సంభవమే కాని అలా తెలుసుకునే శక్తిని సంపాదించడానికి ట్రైనింగ్ అవసరం."
సీత రెండు అరచేతుల్నీ దగ్గరకు చేర్చుకొని చూడసాగింది. ఆమెకు ఎలాగో ఉన్నది. చేతులు ఎలా పెట్టుకోవాలో! ఎలా అతని ముందు కూర్చోవాలో తెలియనట్టుగా ఇబ్బంది పడసాగింది.
అంటే అతను తను చెప్పకుండానే తన ఆలోచనలన్నీ తెలుసుకోగలడా! "నీ మాటలు రహస్యమయంగా ఉన్నాయి. నువ్వు కూడా మిస్టీరియస్ గా ఉన్నావు. నువ్వు ఎవరో నాకు తెలియదు. నీపేరు తెలియదు. అయినా నీగురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను" ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె చెంపలు కెంపురంగును పులుముకొన్నాయి.
అతను అదోలా నవ్వాడు.
"నువ్వు నన్ను రెండుసార్లు రక్షించావు. ఒకసారి ఆత్మహత్య నుంచి కాపాడావు. రెండోసారి మా బాబాయి దెబ్బలనుంచి తప్పించావు" ఆ కంఠంలో ఏదో గరగరలాడింది.
"ఇకపై మీ బాబాయి నిన్ను కొట్టడు."
అతను చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వు కూడా ఆమెకు రహస్యమయంగా తోచింది.
"అవన్నీ వదిలేయ్. ఆ విషయాలు గురించి ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు."
ఆమె అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది.
"ఇప్పుడు నువ్వు సంతోషంగా వున్నావని నేను అనుకుంటున్నాను. మీ బాబాయి అంటే ఇంతకుముందులా భయపడటంలేదని కూడా అనుకుంటున్నాను."
"అవును. మా నాన్న ఇండియా గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. ఇండియా ఎంత త్వరగా చూస్తానా అనే ఆరాటం తప్ప, బాధల గురించి ఆలోచించడం లేదు. మా నాన్నకు ఇండియా అంటే ఇష్టం, అదే నాకూ ఇష్టం" అన్నది చిన్నపిల్లల ధోరణిలో.
"అవును నేను కోరుకునేది కూడా అదే. నువ్వు అక్కడ ఆనందంగా గడపాలి. అంతేకాదు. హిందువుల ఫిలాసఫీ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇటీజ్ రియల్లీ థ్రిల్లింగ్. నీకు ఇంతకుముందు తెలియని ఒక అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తావని నా నమ్మకం."

 Previous Page Next Page