Previous Page Next Page 
పిపాసి పేజి 12


    "మీ ఇద్దరినీ చూస్తూవుంటే నాకెంతో సంతోషంగా వుంది. రామలక్ష్మణుల్లా వున్నారు. జీవితంలో ఇటువంటి స్నేహానికి మించిన ధనం మరోటి లేదు." అంది రాధిక వారికేసి ముచ్చటగా చూస్తూ.    


    "అవును రాధీ..... మనసు విప్పి మాట్లాడుకోవాలంటే స్నేహితుల్ని మించిన ఆప్తులు మరెవరూ లేరు ఈ లోకంలో, సత్యానికీ నాకు స్నేహం ఒక రెండేళ్ళనుంచే అయినా మేము కలుసుకున్న వేళావిశేషం, ప్రాణస్నేహితులమైపోయాం." కోటు విప్పి కుర్చీకి తగిలిస్తూ అన్నాడు మధన్.  


    "మధన్, సూటులో నువ్వు ఎంతో బాగున్నావు" అంది చిరునవ్వుతో రాధిక.


    "నీకు జ్ఞాపకం వుందో లేదో రాధీ.... చిన్నప్పుడు. నా పుట్టినరోజుకి అమ్మ నాకు ఒక తెల్లటి నెహ్రూ కోటు షేర్ వాణి అంటారు అది కుట్టించింది. అది చూసి నువ్వు గబగబా, రాజమ్మగారింటికి వెళ్ళి వాళ్ళతోటలోంచి ఒక ఎఱ్ఱగులాబీ కోసుకొచ్చి, నా కోటుకి తగిలించి, "ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? నెహ్రూలా వున్నావ్! అన్నావు జ్ఞాపకం వుందా?" రాధిక కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అన్నాడు మధన్.  


    "రాధిక నవ్వుతూ, జ్ఞాపకం లేదు. రాజమ్మగారిల్లు కొద్దికొద్దిగా జ్ఞాపకం వుంది" అంది.       


    "అన్నట్టు మధన్.... నాన్నగారితో మాట్లాడావా?" అంది రాధిక మధ్యలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు.


    "నాన్నగారు సెలవులో ఉన్నారట రాధీ పదిహేనురోజులు. అందుకే ఉత్తరం ఎక్స్ ప్రెస్ డెలివరీ పోస్టు చేశాను."  


    "ఎందుకు సెలవు పెట్టారో? ఆరోగ్యం ఎలా వుందో ఏమిటో?" అంది ఆలోచిస్తూ రాధిక.    


    "ఏదో ఊరికే పెట్టుంటారులే. అయినా మన ఉత్తరానికి జవాబు వస్తుందిగా?"


    "జవాబేవొస్తుందో, అమ్మా నాన్నా బయల్దేరి వస్తారో."


    "లేకపోతే తమర్ని నన్ను తీసుకురమ్మంటారో అక్కడికి నవ్వుతూ అన్నాడు మధన్."    


    "అమ్మా నాన్నా నన్ను చూసిగుర్తుపడతారో లేదో?" అంది అనుమానంగా రాధిక.


    "ఊ.... నేను గుర్తుపట్టగాలేనిది, కన్నతల్లీ తండ్రీ గుర్తుపట్టరూ?"  


    "మధన్! అసలు నువ్వు నన్ను ఎట్లా గుర్తుపట్టావో నాకే ఆశ్చర్యంగా వుంది" అంది అతని మొహంలోకి చూస్తూ రాధిక.


    "ప్రేమించే హృదయం వుండాలి మేడమ్ మైండ్ కూడా వుండాలి. అప్పుడే తను ప్రేమించే వ్యక్తిని ఎక్కడున్నా, ఎలా వున్నా చూడగలుగుతాడు మనిషి." అన్నాడు అప్రయత్నంగా.     


    "అంటే.... మధన్.... నువ్వు నిజంగా నన్ను అంతగా ప్రేమిస్తున్నావా?"


    "అవును రాధీ....." అని ఏదో చెప్పబోయేలోపల తలుపు తోసుకుని సత్యం లోపలి కొచ్చాడు. "ఏమిట్రా ఇన్ని తెచ్చావ్" అన్నాడు పొట్లం విప్పుతూ మధన్.   


    "కొట్టెయ్యవోయ్, ఆడపిల్లలా మాట్లాడకు" అంటూ గ్లాసులు, ప్లేట్లూ తెచ్చి పెట్టాడు.      


    రాధిక మూడు ప్లేట్లలోనూ, ఉప్మా, దోసెలూ, సర్ది గ్లాసుల్లో మంచి నీళ్లుపోసి పెట్టి, మధన్ కి, సత్యానికీ చెరో ప్లేటూ అందించి, తనో ప్లేటు తీసుకుంది.


    కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురూ, కాఫీ ఫలహారాలు కానిచ్చారు. "సత్యం నాలుగయింది, ఇక వెళదామా రా" అన్నాడు మధన్.     


    "చెల్లెమ్మా. గెట్ రెడీ....." అన్నాడు సత్యం.


    "ఫైవ్ మినిట్స్" అంటూ లోపలికెళ్ళింది రాధిక.


    ఊదారంగు జార్జెట్టు చీర, అదే రంగు బ్లౌజు వేసుకుని, కాటుక కళ్లు మిలమిలా మీనాల్లా కదులుతూ వుంటే, ఎఱ్ఱటి కుంకం బొట్టు, నుదుటున చందమామలా తళుక్కుమంటూ వుంటే. చేతిలో సూట్ కేసు పట్టుకు నుంచుంది రాధిక "పదండి" అంటూ.  


    ఆకాశంలో పయనిస్తున్న నీలిమేఘంలోంచి జారికిందరాలిన ఒక మేఘంలా అనిపించింది. రాధిక మధన్ కి. ఆమె అందాన్ని చూస్తూ వుండిపోయాడు మధన్.   


    "నేను టాక్సీని పిలుచుకొస్తాను" అంటూ బయటికెళ్లాడు సత్యం.


    "రాధీ...."


    "ఊఁ"


    "ప్రపంచంలో ఉన్న అందాన్నంతా ఒక్కచోట ఏకంచేసి నిన్ను సృష్టించాడు భగవంతుడు.   


    "కాని అంతకన్నా ముఖ్యమైనది నీకే ఇచ్చాడు."


    "ఏమిటది?"


    "అందమైన మనసు..."


    "ఊఁ.... ఫరవాలేదు, మాటలు కూడా బాగానే వొచ్చు." నవ్వుతూ అన్నాడు మధన్.


    "మనసుగల మనిషితో మాట్లాడుతూ వుంటే మాటలు వాటంతట మాట్లాడడానికి సిగ్గుపడే చంటిపిల్లలు , తల్లి ఒడిలో కూర్చుని గొప్పగా కబుర్లు చెపుతారు, ఎందుకంటావ్? తల్లి ఒడిలో ఉన్న వెచ్చదనం, ఆప్యాయత, అటువంటివి. ధైర్యంగా పాప మాట్లాడగలుగుతుంది.


    "అబ్బో..... కవిత్వం కూడా చెప్తున్నావే. వెరీగుడ్ ." కొంటెగా నవ్వాడు మధన్.


    "కవ్వించే మనిషుంటే, కవిత్వం ఎందుకు రాదూ?" అంటూ సిగ్గుతో నాలిక్కరుచుకుంది. మధన్ కేసి చూస్తూ.  


    టాక్సీ వచ్చేసింది. సత్యం దిగి లోపలికొచ్చేడు, చేతిలో పెద్ద ప్యాకెట్ వుంది. ఆ పొట్లాన్ని రాధిక చేతి కందించాడు. "ఏమిటన్నయ్యా ఇది" అంది పొట్లాన్ని ఇటు అటూ తిప్పుతూ రాధిక.


    "నా చెల్లెలికొక చిన్నకానుక."

 Previous Page Next Page