రాధిక గబగబా పొట్లం విప్పి చూసింది. "చీర.... ఎంత బావుందో....." అంటూ ఇటూ అటూ చూసి, "ఇప్పుడెందుకన్నయ్యా ఇది" అంది కృతజ్ఞత నిండిన మనస్సుతో." చెల్లెలికి పసుపూ కుంకం ఇవ్వడం ఎందుకేమిటమ్మా..... పదికాలాల పాటు చల్లగా వుండమని ఆశీర్వదించడం."
రాధిక కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి, గబగబా లోపలికి వెళ్ళి. చీర కట్టుకువొచ్చి, సత్యం కాళ్ళకి నమస్కారం చేసింది.
"ఏమిటమ్మా యిది" అంటూ ఆమె భుజాలు పట్టుకుని లేవనెత్తాడు సత్యం, చెక్కిళ్ళు మీంచి కారుతూన్న కన్నీటిని తుడుస్తూ.
"అన్నయ్యా.... పదిమంది వున్న కుటుంబంలోనే పుట్టిన తల్లికి తండ్రికి, తోబుట్టువులకీ అందరికీ దూరమై మమతా మంచికీ నోచుకోని చోట పెరిగాను. ఆప్యాయత, అనురాగం, అంటే వినడమే కానీ, అనుభవించలేదు జీవితంలో కన్నీరు తప్ప ఏ ఆశ్రయమూ లేదనుకున్న నాకు మమతలు నిలయాన్నే చూపించారు. మీ ఋణం జన్మజన్మలకీ తీర్చుకోలేను." పొంగుకొస్తూన్న దుఃఖాన్ని అణుచుకోలేక, మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని ఏడుస్తోంది రాధిక.
"ఛ.... తప్పు..... కన్నీళ్ళు పెట్టకూడదు. జరిగినదంతా ఒక పీడకలలా మర్చిపోవాలి" అంటూ తల నిమురుతూ బుజ్జగించాడు సత్యం.
"నీలాంటి అన్నయ్య ఈ అనుబంధం ఏ నాటిదో? ఎక్కడి సత్యం, ఎక్కడి, రాధిక, ఊరిలోని ఉప్పురాయి, అడవిలోని చెట్టుకాయి కలిపి ఊరగాయ చేసినట్టు, ఎక్కడి ఎక్కడి వాళ్ళనో కలిపి, ఒక్క తాటిపైన నడిపిస్తాడా దేముడు." అన్నాడు మధన్, రాధిక, సత్యాన్ని చూసి.
"అవునురా. అతని లీలలు అద్భుతం. నా అన్నవాళ్ళెవరూ లేని నాకు, ఈ బంధాలేమిటి?" అన్నాడు సత్యం.
"ఏమిటి మీకెవరూ లేరా?" ఆశ్చర్యంగా అడిగింది రాధిక.
"లేరూ చెల్లీ.... చిన్ననాడే తల్లిని పోగొట్టుకున్నాను. నాన్నగారు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ఆమె ఆజ్ఞ ప్రకారం, నాకు వాళ్ళని చూసే హక్కు కూడా లేదని శిక్షవేశారు నాన్నగారు అంతే.
ఏకాకిగా బతికాను. ఒంటరిగా తిరిగేవాణ్ణి. నాకు ఎవరూ స్నేహితులు కూడా లేరు. మధన్ ఒక్కడే, ఈ ఆఫీసులో చేరాక నాకు స్నేహితుడయ్యాడు. వాళ్ళమ్మగారు నన్నూ ఓ కొడుకులా చూస్తారు. ఇప్పుడు దేముడు నాకు బంగారం లాంటి చెల్లెల్నిచ్చాడు." అన్నాడు సత్యం రాధికని చూస్తూ.
అతని మొహంలో విషాద రేఖలు గోచరించాయి. రాధిక ఆశ్చర్యంగా అతనికేసి చూసింది.
"ఆశ్చర్యంగా వుందా?"
"అవునన్నయ్యా.... ఎప్పుడూ నవ్వుతూ, హాయిగా నిశ్చింతగా తిరిగే నీలో ఇంత దుఃఖం గూడు కట్టుకునుందంటే ఆశ్చర్యంగానే వుంది...." అంది అతనికేసి చూస్తూ.
"చెల్లీ.... విషాదాన్ని తలుచుకుని విలపిస్తూ కూర్చోడం కన్నా, చేదులాంటి గతాన్ని దిగమింగి, భవిష్యత్తును తియ్యగా చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. అంతేకాకుండా, మన స్నేహితులు, శ్రేయోభిలాషులు, మన సంతోషంలో పాలుపంచుకుంటే, ఆనందంకానీ, మన బాధల్ని వారికి పంచి పెడితే ఏం లాభం? అందుకే ఎప్పుడూ నవ్వుతూ వుండడం నేర్చుకున్నాను.
"బాగా చెప్పావన్నయ్యా. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం."
"ఒరేయ్. మీరిద్దరూ సరిగ్గా దొరికారు. బాధల్ని మరిచిపోవాలి అనుకుంటూ అనుక్షణం జ్ఞాపకం ఉంచుకుంటున్నారు." అన్నాడు నవ్వుతూ. మధన్ రాధిక కూడా నవ్వేశారు.
మధన్, రాధిక సత్యం దగ్గర శెలవు పుచ్చుకుని, టాక్సీలో కూర్చున్నారు.
"నువ్వూ రాకూడదూ" అన్నాడు మధన్ సత్యాన్ని.
"తరవాతొస్తాలే. ముందు మీరు వెళ్ళండి" అన్నాడు.
టాక్సీ కదిలింది. ఇద్దరి మనసుల్లోనూ రకరకాల ఆలోచనలు కదులుతున్నాయ్.
"రాధీ.... ఏమిటలా చూస్తున్నావ్?"
"నాజీవితం గురించే మధన్. బురదలోంచి బయటకొచ్చాను. ఎంత కడుక్కుందామని ప్రయత్నించినా, దాని తాలూకు చిహ్నాలు మనసును కలచి వేస్తుంటాయి. అడుగడుగునా జ్ఞాపకం వొస్తుంటాయి."
"గతం ఎప్పుడూ ఒక గైడె పుస్తకంలా ఉండాలి కానీ, భూతంలా ఊహించుకుని భయపడకూడదు."
"ఏమో! నాకేదో భయంగా వుంది, మధన్. జరిగిపోయిన కాలం కన్నా, రాబోయే భవిష్యత్తు అయోమయంగా వుంది..."
"అంతా నీ భ్రమ, ఎందుకటువంటి పిచ్చి ఊహలు? అనవసరంగా మనసు పాడుచేసుకోకు." ఆప్యాయంగా హెచ్చరించాడు మధన్.
"మధన్.... నీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలీటం లేదు నువ్వు మామూలు మనిషివి కాదు. దేవుడివి."
"అదుగో.... ఈ పొగడ్తలే ఒద్దన్నాను."
"పొగడ్తకాదు. కృతజ్ఞత."
"నాకు కావలసింది కృతజ్ఞత కాదు."
"మరేమిటో" అతని కళ్ళలోకి చూసింది రాధిక.
"అభిమానం"
"ఓస్.... అంతేనా..... బోలెడంత వుంది."
"ఊ...." ఇద్దరూ నవ్వేశారు.
టాక్సీ ఇంటిముందు ఆగింది. మధన్ దిగి తలుపు పట్టుకునుంచున్నాడు రాధికని దిగమని.