Previous Page Next Page 
పిపాసి పేజి 11


    "సరే... అయితే ఆఫీసుకెళ్ళి ఫోన్ చేసొస్తాను" అన్నాడు మధన్.


    "సరే"నంది రాధిక. పదకొండుగంటలకి సత్యం మధన్ ఆఫీసుకి బయలుదేరారు. రాధిక ఇంట్లో వుంది.


    తలుపులేసుకుని భావిజీవితాన్ని గురించి, తియ్యని కలలుకంటూ హాయిగా నిద్దరపోయింది రాధిక.


    ఆఫీసుకెళ్ళి టెలిఫోను నెంబరు తెలీకపోవడంవల్ల కలెక్టరాఫీసుకి ఫోన్ చేసి, ఎలాగయితేనేం, కాల్ బుక్ చేశారు. ఇంతాచేస్తే శ్రీహరిగారు సెలవుమీద వున్నారని తెలిసింది. చేసేదిలేక వెంటనే ఉత్తరాని ఎక్స్ ప్రెస్ డెలివరీ పోస్టు చేశారు. మధ్యాహ్నం దాక ఎలాగో ఆఫీసులో కూర్చుని, సత్యం తనూ కలిసి, రూమ్ కి బయలుదేరారు. ఒంటిగంటకల్లా. ఒక ఆటోని పిలిచి ఎక్కి కూర్చున్నారు.     


    "సత్యం. నేనొక నిర్ణయానికొచ్చాను రా. రాధికని నేను పెళ్ళిచేసుకుంటాను. ఈ విషయంలో నీ సలహా ఏమిటి?" అడిగాడు మధన్?        


    "నువ్వు ఒక నిర్ణయానికొచ్చాక, నేనేం సలహా ఇస్తాను."


    "సత్యం నా నిర్ణయం తప్పంటావా?"


    "తప్పనను, కానీ, సమాజానికి ఎదురీదగలవో లేవో అని భయపడుతున్నాను."    


    "నాకా భయంలేదు. నేను నిజమని నమ్మినదాన్ని లోకంచేత నా నమ్మకం నాది. నన్ను నమ్మని లోకంతో నాకు సంబంధం లేదు. ఉద్రేకంగా చెబుతున్నాడు మధన్.    


    "మధన్ నువ్వు ఆవేశంతో అంటూన్న మాటలివి. సంఘం ఒక ముళ్ళకంచెలాంటిది. ఆ కంచే దాటుతూన్నప్పుడు ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోవాలి గానీ. తొందరపడి దూకితే, ముళ్ళు బరికేస్తాయి. ఆమె పేరుమోసిన నాట్యకత్తెగా వేలమందిని ఆకర్షించి కనకవర్షం కురిపించింది. అన్నివేళ కళ్ళల్లోపడ్డ ఈమెని, సంఘం సగౌరవంగా చూడలేదు."


    "ఏం? ఎందుకని? నాట్యం చేసినంతమాత్రాన ఆమెకి మామూలు మనిషిగా బతికే హక్కేలేదా?"       


    "ఉందికానీ కేవలం నాట్యం చెయ్యడమేకాదు, కానిచోట పెరిగింది. లేని నిందలు పొందింది, లోకం దృష్టిలో ఆమె పతిత."


    "అందుకే లోకం ఆమెకి పవిత్రస్థానాన్నివ్వదు."


    "సత్యం.... నిజంగా ఆమె పతితే అయినా, పవిత్రంగా బతకాలని కోరుకున్నప్పుడు, ఆమెకి పవిత్ర స్థానాన్నివ్వకుండా, పైగా చిత్రవధచేసి, పాతాళానికి తొక్కేసేదే సంఘం యొక్క ముఖ్యోద్దేశమైతే, నిజంగా ఆ సంఘానికీ నాకూ ఏ సంబంధమూ లేదు. అక్కర్లేదు. మనసులేని ఈ సంఘంతో సంబంధం వుంచుకోవడంకంటే. సంఘంతో ఏం సంబంధమూ లేకుండా, నా మనసు మెచ్చే పన్లుచేసుకుంటాను" ఆవేశంతో వనికిపోతూ అన్నాడు మధన్.   


    "మధన్... అది నిజంగా నువ్వనుకున్నంత తేలికే అయితే, ప్రతివాళ్ళు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా విడివిడిగానే వుండేవారు."     


    "కావొచ్చు. కానీ మనకు భయపడి పారిపోయే సమాజం మనం సృష్టించిందే సత్యం. మనం సృష్టిని చూసి మనమే ఝడుసుకుంటూ కర్తవ్యాన్ని విస్మరించడం, ధర్మాన్ని ద్వంసం చెయ్యడం. న్యాయమా చెప్పు' అన్నాడు సత్యం జవాబుకోసం ఎదురుచూస్తూ.     


    "మధన్ నీలాంటివాడు కోటికొక్కడున్నా చాలు. సమాజం బాగుపడుతుంది. రాధిక నిజంగా అదృష్టవంతురాలు. విష్..... యూ.... గుడ్ లక్..... కానీ.....?"


    "కానీ ఏమిటి?" ప్రశ్నార్థకంగా సత్యం కళ్ళల్లోకి చూశాడు మధన్.


    "మీ అమ్మా నాన్నా ఒప్పుకుంటారంటావా?"


    "అమ్మని ఒప్పించాను. అమ్మ నాన్నని ఒప్పించాలి."


    "ఓ.... అయితే యింకేం? నువ్వు చేస్తున్నది ఒక మహోన్నతమైనది. సాదారణంగా ఏ యువకుడు చెయ్యని పని, ఒక విధంగా నువ్వు త్యాగశీలివి మధన్. నీకు బోలెడు డబ్బున్న అమ్మాయిలూ. పేరు ప్రతిష్టలువున్న అమ్మాయిలూ దొరకొచ్చు. కానీ అవన్నీ వొదిలిపెట్టి రాధికని చేసుకోవాలన్న నిర్ణయం ఎంతో ఆదర్శమైనది. నాకు చాలా సంతోషంగా వుంది మధన్" అన్నాడు సత్యం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ...   


    ఆటో యింటి ముందు ఆగింది. డబ్బులిచ్చి పంపేశాడు సత్యం.


    మధన్ తలుపుకొట్టాడు. పలకలేదు. గట్టిగా పిలిచాడు. అయినా లాభం లేకపోయింది. తలుపు మీద దబాదబా బాదుతూ తట్టాడు. "వొస్తున్నా" అంటూ అడుగుల చప్పుడు వినిపించింది. గబుక్కున తలుపులు తెరుచుకున్నాయి. రాధిక కళ్ళు నులుముకుంటూ, తలుపుకు ఒక పక్కగా నుంచుంది.       


    "మంచి నిద్రలో వున్నట్టున్నావే?" అన్నాడు మధన్.


    "బాగా నిద్దరపట్టింది. ఇంత హాయిగా నిద్దరపోయి ఎన్నేళ్ళయిందో, మీరు చాలాసేపు నుంచున్నారా? అంది, తనేదో పొరపాటు చేసినట్టుగా బాధపడుతూ.


    లేదు. ఇప్పుడే వచ్చాం. రెండు సార్లు పిలిచాను, మూడోసారి తలుపులు బాదేశానుగా "నవ్వుతూ అన్నాడు మధన్."


    "చెల్లెమ్మా..... భోజనం సంగతేమిటి?" అన్నాడు సత్యం.


    "ఆకలిగాలేదన్నయ్యా.... వేడి కాఫీ వుంటేచాలు."


    "ఓయ్".... అంటూ ఒరేయ్ మధన్.... నువ్వుండరా నేవెళ్ళిఅయిదు నిమిషాలలో కాఫీ, టిఫినూ పట్టుకొస్తాను" అంటూ ఫ్లాస్కు తీసుకుని బయలుదేరాడు సత్యం.

 Previous Page Next Page