Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 11


    "మధూ! బాధపడుతున్నావా?"
    "లేదండీ! గర్వపడుతున్నాను."
    అజయ్ తృప్తిగా నిట్టూర్చాడు.
    "అజయ్! నాదొక చిన్న కోరిక మన్నిస్తావని ప్రామిస్ చెయ్యగలరా?" చెయ్యి చాపుతూ అడిగింది.
    "మన్నించడమా? శిరసా వహిస్తాను. ప్రామిస్! ఏమిటో చెప్పు" చేతిలో చేయి ఉంచి అన్నాడు.
    వెంటనే నా మెళ్ళో తాళి కట్టండి. మీ దాన్నిగా చేసుకోండి అంది.
    "మధూ!" చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. ఒక్క నిమిషం ఆగి మధూ ఏది చెబుదామనుకుని వచ్చానో, అది చెప్పకుండానే నా నోరు మూసేశావు.
    "అంటే?"
    యుద్ధ రంగంలోకి వెళుతూ వెళుతూ నీ మెడకి ఉరితాడు లాగా తాళికట్టి నీ భవిష్యత్ కి సంకెళ్ళు వెయ్యమంటావా? మాధవి తల నిమురుతూ బాధగా అన్నాడు.
    అజయ్! పదిమందిలోనూ తాళి కట్టలేదని నేనింకా పరాయిదాన్నే అనుకుంటున్నారా? ఏనాడయితే కలసి ఏడడుగులు నడిచానో ఆనాడే మీదాన్నయిపోయాను. ఆడది మనసిచ్చిననాడే మాంగల్యాన్ని మనసుకు కట్టుకుంటుంది. ఆ బంధాన్ని తెంచడం భగవంతుడికి కూడా చాత కాదు. అజయ్! ఒకవేళ, మన పెళ్ళయ్యాకే మీరు యుద్ధానికి వెళ్ళవలసొస్తే కట్టిన తాళి ఉరిత్రాడవుతుందని విప్పేసేవారా చెప్పండి? అజయ్ వొళ్ళో తల పెట్టుకుని భుజాలని రెండు చేతులతోటీ పట్టుకుని సూటిగా అడిగింది.
    ఆమె గొంతులోని ఆర్ధ్రత అతన్ని కరిగించి వేస్తోంది.
    నీకు తెలీదు మధూ! మిలటరీ వాడి జీవితం యుద్ధరంగంలో దినదిన గండంలా వుంటుంది. అటువంటప్పుడు పెళ్ళాం, పిల్లలూ అనే బంధాన్ని పెంచుకోవడం వ్యర్థం.
    మాధవి పెద్దగా నవ్వుకుంది.
    ఆశ్చర్యంగా ఆమెకేసి చూశాడు అజయ్.
    "ఐతే మిలటరీ వాళ్ళందరూ బ్రహ్మచారులుగానే వుంటారా? బాగుంది మీరు చెప్పేది! ఏ క్షణాన ఏమవుతుందోనన్న భయం ఒక్క మిలటరీ వాడికే కాదు, అందరికీ వర్తిస్తుంది. అందుకని ఏ బంధాలూ లేకుండా వుండగలమా? ఇంపాజిబుల్" పకపకా నవ్వింది.
    నువ్వు చెప్పేది నిజమే. కానీ యుద్ధ సమయంలో మిలిటరీ వాళ్ళకు ప్రమాదాలెక్కువ.
    అలా అనుకోవడం పొరపాటు. ప్రమాదం ప్రతిచోటా వుంది. కారులో తిరుగుతున్నా, విమానంలో ఎగురుతున్నా, చివరకు ఏమీ చెయ్యక ఇంట్లో కూర్చున్నా, ఆ సమయం ఆసన్నమైతే ప్రమాదం వెతుక్కుంటూ వస్తుంది.
    "మధూ! నా మాట విను. తెలిసి తెలిసి ప్రమాదాన్ని కోరుకోవడం ఎందుకు? మరెవరినయినా చేసుకుని సుఖపడు. నువ్వు హాయిగా వుండడమే నాకానందం."
    అలాగా! సరే ఐతే. కానీ మీరూ నేనన్నట్లు చెయ్యాలి కొంటెగా అంటుంది.
    చెప్పు తప్పకుండా చేస్తాను.
    మీరు మిలటరీలో చేరకండి.
    అదెలా సాధ్యం? నేను మాటిచ్చాను. రాసిచ్చాను.
    "ఐతే ఇదెలా సాధ్యం. నేను మనసిచ్చాను, ప్రేమించాను.
    నన్ను తికమక పెడుతున్నావ్ మధూ!
    లేదు. నన్నర్థం చేసుకోమంటున్నాను. అజయ్! అమ్మమ్మకి మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి. మీ జీవిత భాగస్వామిగా, మీ అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని నాకు కలగజేయండి. మీదాన్నిగా నిలిచిపోయే అర్హత నాకు ప్రసాదించండి. కళ్ళలో నీరు తిరుగుతూ వుంటే పైట చెంగుతో కళ్ళద్దుకుంటూ అంది మాధవి.
    "ఆవేశపడకు మధూ! బాగా ఆలోచించు" లాలనగా అన్నాడు.
    నిశ్చయమైన నిర్ణయానికి ఆలోచనెందుకు? మీరు పరిస్థితులకు వెరసి కాదంటున్నా, నేను ఎప్పటికీ మీదాన్నే. దయచేసి కాదనకండి. మీరు వెళ్ళేటప్పుడు వీరపత్నిగా మీ నుదుట తిలకం దిద్ది సాగనంపే సౌభాగ్యాన్ని నాకు కలిగించండి. పదండి. అమ్మవారి గుడికెళదాం. జన్మజన్మలకీ ఈ బంధం గట్టిపడాలని భగవంతుణ్ణి వేడుకుందాం. దైవ సాన్నిధ్యంలో దండలు మార్చుకుందాం. నా మెళ్ళో అమ్మవారి ముందు పసుపుతాడు కట్టండి. నాకదే పదివేలు...ప్లీజ్ చెయ్యిపట్టి లేపుతూ అంది.
    మధూ! నీకు మతిపోయిందా ఏమిటి? పెద్దవాళ్ళెవరికీ చెప్పకుండా పెళ్లెలా చేసుకుంటాం! ఇది జరిగే పనేనా! మా నాన్నగారూ మీ అమ్మమ్మా కనీసం వాళ్లైనా లేకుండా ఎలా మధూ!
    మా అమ్మమ్మ సంగతి నాకు ఒదిలెయ్యండి. కానీ మీ నాన్నగారు ఈ పరిస్థితిలో పెళ్ళికి ఒప్పుకోకపోవచ్చును. పెళ్ళికి ఒప్పుకున్నా వెంటనే మీరు వెళ్ళడానికి ఒప్పుకోక పోవచ్చును. ప్రస్తుతం ఈ విషయం నాన్నగార్కి తెలీకపోవడమే మంచిది.
    "అవును కానీ నువ్వు బాగా ఆలోచించుకున్నావా?"
    అజయ్!...అజయ్! అనుక్షణం నీ తలపులతోనే బ్రతుకుతూన్న నాకు ఆలోచనకి టైము కావాలా? క్షణ మాత్రమైనా మీ భార్యననిపించుకుంటే చాలు. ఈ జీవితానికింకేమీ అఖ్ఖర్లేదు. ఆ... పదండి. ఆలస్యమైతే గుడి మూసేస్తారు, ఇంకేమీ చెప్పకండి... చెయ్యిపట్టి లాగుతూ తీసికెళ్ళిపోతోంది.

 Previous Page Next Page