అందరూ వెళ్ళిపోయాక తేరుకున్న మున్సబు "దొంగ ముండాకొడకా! వాళ్ళని తన్నరా అంటే నీతులు చెప్పి పంపుతున్నావా! మీరు మీరు అంతా ఒకటేరా" అన్నాడు ఆగ్రహంగా.
వాడు సమాధానం యివ్వలేదు.
"యుద్దాన్ని వాయిదా వేశాడు వాడు!" అన్నాడు శేఖర్.
"ఇదిగో చౌదరి! వీళ్ళని కొంచెం ఓ కంట కనిపెట్టి వుండకపోతే తర్వాత విచారించాల్సి వస్తుంది!" అన్నాడు శేషయ్య.
"కాలికిందేసి తొక్కుతా!" అన్నాడు నాయుడు.
"చూసి తొక్కు!" అన్నాడు చౌదరి.
పేక కలుపుతూ మాటలు కలుపుతోన్న నాయుడు ఆగి "మనం తలుచుకుంటే వీళ్ళెంత? మిడతల్లా మాడి పోతారు తుపాకి తీసి కాల్చడం మొదలుపెడితే ఇద్దరు చచ్చారా అంతా లొంగిపోతారు!" అన్నాడు దర్పంగా అతని కళ్ళలో కోపం మెరుపులు మెరుస్తోంది.
"గాడిదని చంపి గల్లుకు బోయానన్న సామెత విన్లేదా? పదేండ్ల నాడులా లేదు దేశం! వీళ్ళని హరిజనులని చేసింది గవర్నమెంట్ అన్ని హక్కులు, రక్షణలూ కల్పించారు. ఇంకా మనవూరు నయం. మితిమీరలేదు!" అన్నాడు శేషయ్య.
"తెగేదాకా లాక్కూడదు."
శేఖర్ మాటలకి ఉక్రోషంగా, "అయితే ఆగాడిద అప్పు ఎగ్గొడితే చూస్తూ వూరుకోమంటావా?" అన్నాడు చౌదరి.
శేఖర్ సమాధానం చెప్పలేదు.
"ఈ సమస్యని నాయుడే పరిష్కరించాలి."
చౌదరి వైపు చూశాడు నాయుడు.
"రాజకీయం నెరపొద్దు. రేపు జానయ్యని యింటికి పిలిపించు, అయినా నీకు చంద్రమ్మని చూస్తే భయంలే." దెబ్బ కొట్టెండనుకున్నాడు నాయుడు.
చౌదరి ముఖం బిగుసుకు పోయింది.
"సరే సరే మనలో మనకు మాటలెందుకు? మనం కట్టుగా వుంటే ఊరు మన క్రింద వుంటుంది. చీలితే వూరు మనల్ని క్రింద చేస్తుంది" అన్నాడు శేషయ్య. ఆ మాటలతో వాతావరణం తేలిక పడ్డట్టయింది.
అందరూ పేకాటలో పడిపోయారు.
4
మునిమాపు వేళకి తిరిగొచ్చాడు సోము.
అతనింటికి చేరేసరికి ఆ వార్త కారు చిచ్చులా గూడెం అంతా వ్యాపించింది. చంద్రమ్మ దిగులుగా భయంగా ఎదురుచూస్తోంది తండ్రీకొడుకుల కోసం.
సోముని చూడగానే ఆమె ముఖం వికసించింది.
"ఏమిటి గలాభా అయ్యిందట?" ఆత్రంగా అడిగింది.
"ఏం లేదులే"
"నా దగ్గర దాస్తావా? మీ నాయన చేసేవన్నీ యిట్టాగే వుంటాయి, ఆ రోజు వాని దగ్గర అప్పు వద్దంటే యినలా! చెల్లేసేటప్పుడు చదువుకున్నోళ్ళని పిలచకపోమంటే యివడు. ఆ అప్పు తీర్చలేక సచ్చిపోతన్నాం!" అంది.
సోము ఆఁఊఁ అన్లేదు. గొడ్లకి మేత వేయబోయాడు.
అతని వెంటే వెళ్ళింది చంద్రమ్మ. "రచ్చబండ దగ్గరికి పిలిపించిండంట గదా?"
"ఉహు! వెళతా వుంటే కేకేసి నాడు"
"పాడు వూరు! ఒకటికి రెండు కల్పిస్తారు. నీపై చేయి చేసుకున్నాడా నాయుడు? నువ్వు తిరిగి కొట్టబోయినావా?" భయం భయంగా అడిగింది.
నివ్వెర పోయాడు సోము "ఇదెవరు చెప్పారమ్మా!"
"ఎవరో లే! పోలమ్మ శాయమ్మతో అంటుంటే రాములమ్మ యిందట భయం భయంగా చెప్పింది. అయినా ఆ పోరిది వాళ్ళ మనిషి గదా!"
"అంతా అబద్దం! మాటకు మాట సమాధానం చెప్పి నందుకే అంతెగరి పడినాడు. కొట్టబోయి వుంటే యింకే మయ్యేదో!"