సమాథానం లేదు. వెనక్కు తిరిగి చూడలేదు.
"ఇప్పుడు పొలం అమ్మడం దేనికి? బ్యాంకులో వున్న డబ్బుతీసుకోండి. పెళ్ళిసింపుల్ గా చేసెయ్యొచ్చు. ఆ డబ్బు కట్నంగా ఇవ్వండి."
అనుకోకుండానే పద్మ అనేసింది.
సత్యనారాయణ విస్మయంగా భార్య ముఖంలోకి చూశాడు.
"ఏమిటలా చూస్తారు ? నేను మనస్పూర్తిగానే అంటున్నాను."
"ఇప్పుడా అవసరంలేదులే" ముభావంగా అన్నాడు.
"అంటే పొలం అమ్మేశారా ?"
"లేదు."
"అప్పు తెచ్చారా ?"
అన్ని వేలు నాకు అప్పు ఎవరిస్తారు?"
"మరి ?"
"వాళ్ళు మరోసంబంధం కుదుర్చుకున్నారు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారట."
తలుపు చాటుగా నిల్చుని అన్నా వదినలమాటలువింటున్న సరోజకు కాళ్ళకింద భూమి అందనట్టుఅన్పించింది తలుపు రెక్క పట్టుకుంది. కళ్ళు తిరిగినట్టు అయింది.
"అదేమిటి ?మనమ్మాయి నచ్చిందనీ, పదివేలు కట్నం ఇవ్వమనీ అడిగారుగా?" అన్నది పద్మ.
"డబ్బు చేదా? మరెవరో పదిహేను వేలు కట్నం ఇస్తున్నారట. పైగా పిల్లవంటిమీద బోలెడంత బంగారం వుందట. పిల్ల బాగుండదట ఎం. ఏ చదివిన ఆ ప్రబుద్థుడు 'అందం కొరుక్కు తింటానా' అని అన్నాడట."
"అన్యాయం ! దారుణం ! ఇంతకంటే పశువుల అమ్మకమే నయం" అన్నది పద్మ ఉద్రేకంగా-
సత్యనారాయణ నిట్టూర్చాడు.
"మీరు మరీ అంత ఇదయిపోకండి. మరో సంబంధం చూడండి. తన కలల సౌధం భూమిలోకి కుంగిపోతున్నట్టుగా ఆమె మనసు విల విలలాడిపోతున్నది.
"ఇక నేను ఏ సంబంధమూ చూడదలచుకోలేదు"
పద్మ సత్యనారాయణ ముఖంలోకి అయోమయంగా చూసింది.
"కట్నం ఇవ్వను. సంబంధాలు చూడను. నా చెల్లెల్ని చేసుకుంటానని వచ్చినవాడికి ఇచ్చి చేస్తాను" ఆవేశంగా అన్నాడు సత్యనారాయణ.
"ఈ రోజుల్లో అటువంటివాళ్ళు ఎక్కడుంటారు? అంత వున్నా చెల్లెలికి నచ్చాలిగా"
"దానికి నచ్చే దేమిటి? నాకు నచ్చినవాడికి యిచ్చి చేస్తాను. ఆ పిచ్చిలోపడే బంగారంలాంటి సంబంధాలు వదులుకున్నాను" పశ్చాత్తాపడుతున్నట్టు అన్నాడు సత్యనారాయణ.
పద్మ ఆలోచనలో పడింది.
"ఆ రంగారావుకు..." ఆగి భర్త ముఖంలోకి చూసింది.
సరోజకు దుఃఖం ఆగలేదు. గదిలోకి పరుగెత్తిమంచానికి అడ్డంపడి వెక్కి వెక్కి ఏడవసాగింది. అచ్చం సినిమాలో హీరోయిన్ ఏడ్చినట్టే దిండును కావలించుకొని ఏడవసాగింది.
"అతనికి పెళ్ళి కుదిరింది. కుర్రవాడు మంచివాడు. బాగా చదువుకున్న పిల్లా, అందమైన పిల్లే కుదిరింది. ఎల్లుండే పెళ్ళి" అన్నాడు సత్యనారాయణ బాధపడుతూ.
"అప్పుడే నా మాటవిని...."
సత్యనారాయణ ముఖంచూసి మాటల్ని మధ్యలోనే ఆపేసింది పద్మ.
"భోజనానికి లేవండి"
అంటూ పద్మ లోపలకు వెళ్ళింది. సత్యనారాయణ భారంగా భార్యను అనుసరించాడు.
సరోజకు కసికసిగావుంది. అన్నమీద కసి, వదిన మీద కసి.
అన్నయ్య కావాలనే ఈ సంబంధం వదులుకొని వుంటాడు. అందుకే వాళ్ళు మరో సంబంధం కుదుర్చుకొని వుంటారు.
కట్నం ఇవ్వాల్సి వస్తుందని అన్నయ్యే ఈ నాటకం ఆడాడు.
అతను తనను ఎంత ఇదిగా చూశాడు? తనను అతను ప్రేమించే వుంటాడు.
అమ్మానాన్నా మాట కాదనలేక మరో సంబంధం అంగీకరించి వుంటాడు కట్నం కోసం.
తను.... అతనికి మనసిచ్చి మరొకర్ని చేసుకోవాలా! తను చస్తే చేసుకోదు.
ఆ మాటే అన్నయ్యకు ఖచ్చితంగా చెప్పెయ్యాలి.
నవలల్లోని హీరోయిన్ లా తను జ్వలించిపోతున్నట్లూ దహించుకు పోతున్నట్లూ, ఊహించుకుంటూ అర్థరాత్ర్రి దాటాక గాఢనిద్రలోకి జారిపోయింది సరోజ.
సత్యనారాయణ భోజనం చేసి ఆఫీసుకు ఇవ్వమంది" అంటూ ఉత్తరం ఇచ్చింది.
కవిత పరిగెత్తుకుంటూ వచ్చి "అత్తయ్య ఇవ్వమంది" అంటూ ఉత్తరం ఇచ్చింది.
సత్యనారాయణ అందుకొని తెరవకుండా ఓ క్షణం ఉత్తరంకేసి అయోమయంగా చూశాడు.
ఉత్తరం తెరిచి చదవసాగాడు-
"అన్నయ్యా !"
"నేను నీకు చాలా బరువుగా వున్నానని తెలుసు. వదినకు నేను ఈ ఇంట్లో వుండటం ఇష్టంలేదనీ తెలుసు. నువ్వు నా కోసం డబ్బు ఖర్చు పెట్టవద్దు. కట్నాలు గుమ్మరించి పెళ్ళి చెయ్యక్కరలేదు. అసలు సంబంధాలే చూడవద్దు. నా అదృష్టం ఎలా వుంటే అలాగేజరుగుతుంది. నేను నష్టజాతకు రాలిని. అమ్మా నాన్నా లేనిదాన్ని.
అమ్మానాన్న బ్రతికి వుంటే నాకు నచ్చిన వాడికి ఎంత కట్నమయినా ఇచ్చి పెళ్ళిచేసేవాళ్ళు. కట్నంఇవ్వాల్సి వస్తుందని ఆ సంబంధం నువ్వు కావాలనే వదులుకున్నావని నాకు తెలుసు.
రాజారావుని చూసిన క్షణంలోనే అతను ణా మనసు దోచుకున్నాడు. అతనికిచ్చిన యీ మనసును మరొకరికి ఇవ్వలేను. మనసు ఒకచోటా, మనువు మరొకచోటా నావల్ల కాదు. అందుకే చెబుతున్నాను. ఇక ణా పెళ్ళి ప్రయాత్నాలు చెయ్యాకు.
నాకు ఇంత తిండి పెట్టటం కష్టంగా వుంటే చెప్పు. నేను దిక్కులేని వాళ్ళకోసం ఏర్పరచిన ఏ సేవాసదనానికో వెళ్ళిపోతాను. అంతేగాని నాకు మాత్రం బలవంతంగా పెళ్ళి చెయ్యడానికి ప్రయత్నించకు. అలా చేసినట్టయితే నువ్వు పెళ్ళి చేసేది నాకు కాదు. ణా శవానికి.
యీ ఉత్తరం వదినకు చూపించకు.
ఇట్లు
నీ చెల్లెలు"
సత్యనారాయణ ఉత్తరం చదివి స్థాణువులా నిలబడి పోయాడు.
"ఏవిటండీ? ఎక్కడనుంచి వచ్చింది ఆ ఉత్తరం"
"సత్యనారాయణకు భార్యమాటలు వినిపించలేదు. ముఖంమీద స్వేదబిందువులు మెరుస్తున్నాయి.
పద్మకు గాబరా వేసింది.
సత్యనారాయణ చేతిలోనుంచి ఉత్తరం తీసుకొని ఆత్రంగా చదివి రిలీఫ్ గా నిట్టూర్చింది.
"దీనికేనా యింత యిదయిపోతున్నారు"
"యిది చిన్న విషయమా?"
సత్యనారాయణ భార్య ముఖంలోకి అయోమయంగా చూశాడు.
"సరోజది తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానం. కలలు కనే వయసు. దానికి తోడు పనీ పాటా లేకుండా వెధవ పుస్తకాలు చదువుతూ ఏదేదో ఊహించుకుంటూ కూర్చుంటుంది పుస్తకాల్లోలాగ, సినిమాల్లోలాగ మనిషిని చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందనే భ్రమలో వుంది."
సత్యనారాయణ భార్య మాటలు వింటూ నిల్చుండి పోయాడు. ఆమె మాటల్లో నిజం ఉన్నదనిపించింది.
"మీరు ఈవిషయం పట్టించుకోనట్టే వుండండి. ఏమీ జరగనట్టే వుండిపోండి. ఈ విషయానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు కన్పించకండి" అన్నది పద్మ.
"ఏమిటి ఇది యిలా తయారైంది?" దిగులుగా అన్నాడు సత్యనారాయణ.
"మామూలే! ప్రత్యేకంగా ఆలోచించాల్సిందేమీ లేదు. మీరు ఆఫీసుకు వెళ్ళండి! నాలుగురోజులు పోతే అంతామామూలే అవుతుంది. భ్రమ తొలగిపోతుంది" అన్నది పద్మ.
సత్యనారాయణ మనసంతా ఎలాగో వుంది. ఆ రోజంతా పిచ్చిపట్టేవుంది. ఆఫీసుపని చెయ్యలేకపోయాడు.
కానీ ఆ రోజునుండి సత్యనారాయణ ఎదుటికి రావడానికే సరోజ జంకుతుంది. సత్యనారాయణ మాత్రం ఏమీ జరగనట్టే ప్రవర్తించసాగాడు.
సరోజ రాత్రుళ్ళు రాజారావును తల్చుకుంటూ బాధపడుతున్నట్టుగా అనుకొనేది.
ఏడవాలనిపించేది.
కాని ఏడుపు వచ్చేది కాదు.
నిద్రపోకుండా రాత్రంతా బాధపడాలనిపించేది.
కాని పది దాటగానే నిద్రముంచుకొచ్చేది.
నవలల్లోని హీరోయిన్స్ లా తనకు ఏడుపు ఎందుకు రావడంలేదు?
ప్రియుడు దూరం అయిన ప్రేయసికి నిద్రే రాకూడదు. మరి తనకు అంత నిద్ర వచ్చేస్తుందేం?
ఆకలి కాకూడదు. కానీ కొంచెం వేళతప్పితే తనకు పిచ్చేత్తినట్లు అయిపోతుందేం?
ప్రియుడికి దూరం అయిన ప్రియురాలు తిండి సహించక, నిద్రపట్టక ఏ క్షయవ్యాధికో గురై చచ్చిపోవాలి. కాని తన కెందుకలా జరగటం లేదు.
ఎంత ఆలోచించినా సరోజ ఆలోచనలకు సరైన సమాధానాలు దొరకడం లేదు?
అతనుకూడా తనను తలచుకుంటూ బాధపడుతున్నాడా? తప్పక బాధపడుతూ వుంటాడు.
అయితే మరిమరో అమ్మాయిని ఎందుకుచేసుకోవడానికి ఒప్పుకున్నాడు? తండ్రికి భయపడి వుంటాడు. తండ్రి ఆత్మ హత్య చేసుకుంటానని బెదిరించి వుంటాడు.
అంతే అయివుండాలి.
ఆరోజు తనను ఎలా చూశాడు? ఆ కళ్ళలో ఎంత ఆరాధన వుంది.
సరోజ తనను భగ్నప్రేమికురాలుగా ఊహించుకుంటూ కూర్చునేది. నవలలోని హీరోయిన్స్ తో తనను పోల్చుకొంటూ చదివిన నవలలే మళ్ళీ మళ్ళీ చదవసాగింది.
సరోజ వరండాలో కూర్చుని తన అభిమాన రచయిత్రి నవల చదువుతూ వుంది. ఎవరో వచ్చిన అలికిడికి తలెత్తి చూసి లేచి నిలబడింది.