ఆమె పెదవులపై చిరునవ్వు మాయమైంది. అంతవరకూ ప్రశాంతంగ వున్న ఆమె చూపులు వాడిగా ఉన్నాయి.
"మీ పేరు సుధాప్రియా?"
ఆమె పెదవులు కదిలాయి.
హాయిగా నవ్వింది.
రెప్పలు టపటపలాడించింది.
"నా పేరు విమలాచౌదరి. మీ సుధ నాలాగే ఉంటుందా?" తెల్లని అందమైన పలువరసమీద కదిలిన వెన్నెలలాంటి కాంతి వంపులు తిరిగిన పెదవులపైకి జారింది.
"సుధకాదు" ఏమిటో కంగారుగ వుంది కృష్ణకు.
"యస్. యస్. ప్రియసుధ అన్నారుకదూ?"
"నో! నో! సుధాప్రియ, సుధాప్రియ అన్నాను. ఆమెలాగ ఉన్నారన్నాను."
"ఆమె మీకేమవుతుంది?"
"ఏమీకాదు."
"ఓ. ఐసీ!" విమలాచౌదరికి ఏమీ కన్పించడంలేదు. ముఖం ప్రశ్నార్ధకంగా పెట్టింది.
పక్కసీట్లో కూర్చున్న పెద్దమనిషి చిరాగ్గా కదిలాడు.
అతడిమీద ఓ చిరునవ్వు పారేసి కదిలి వెళ్ళిపోయింది విమలాచౌదరి.
కృష్ణ సర్దుకొని కూర్చున్నాడు.
ముందున్న ట్రేలోకి చూశాడు.
"బ్రెడ్ స్లయిసులూ, కేక్, స్వీటూ, బట్టర్ ప్లాస్టిక్ లో ప్యాక్ చేసి పెట్టబడివుంది. కేక్ ప్యాకెట్ తీసి విప్పసాగాడు. చేతులయితే స్వాధీనం లోనే ఉన్నాయికాని మనసుమాత్రం లేదు.
అసలు తను ఆ హోస్టెస్ ను పేరెందుకు అడిగినట్టు?
ఆమె తను ఫోటోలో చూసిన జగన్ ప్రియురాలిలా వుందా!
ఆమె నవ్వు అలాగే వుందా?
తన కళ్ళకు అలా కన్పించిందా?
తన మనసుకు అలా అన్పించిందా?
జగన్ ప్రియురాలు తన సుధేనని ఒప్పుకోడానికి మనసు తిరగబడుతోందా?
ఆ సుధాప్రియ, తన ప్రియసుధ కాదని మరో ఆడది అనే భావనను తన మనసు అందజేయడానికి చేసే ప్రయత్నమా?
అందుకే ఏర్ హోస్టెస్ లో ఆమె రూపాని చూడడానికి తను ప్రయత్నించాడా?
ఆమె నవ్వుతో ఫోటోలో ఉన్న మోనోలిసా నవ్వును పోల్చుకోడానికి ప్రయత్నించాడు తను.
మనిషిని పోలిన మనుషులుంటారు.
జగన్మోహన్ ప్రేమించిన ప్రియలో తన సుధా పోలికలున్నంత మాత్రాన ఆమే సుధ అని ఎలా నిర్ధారణ చెయ్యగలడు?
జగన్ ఆమె పేరు సుధాప్రియ అని చెప్పాడు.
తన భార్యపేరు ప్రియసుధ.
పేరులో తేడా వుంది.
ఆ తేడా ఎంత?
కుడి ఎడమలాంటిది.
ముందూ వెనక.
ఒకవేళ జగన్ ప్రియసుధ అనబోయి సుధాప్రియ అని చెప్పాడేమో? తనే పొరపాటున అలా విన్నాడేమో?
లేక సుధే తన పేరు పెళ్ళికి ముందు మార్చేసుకుందేమో?
అంతే అయిఉండాలి. సదేహంలేదు.
తండ్రిపేరుకూడా ఒకటే__రమణమూర్తి.
పోలీసాఫీసారుకూడాను.
ఇంతకంటే వేరే రుజువులేం కావాలి?
ప్రియే, సుధ!
తన భార్యే జగన్ ప్రియురాలు, మోనో తల్లి.
మామ-ఛ! ఛ! మామేమిటి మామ? ఆ పోలీసోడు తనను మోసం చేశాడు. పెళ్ళికాకముందే పిల్లను కసేసిన కూతురిని తన మెడకు కట్టాడు.
ఇప్పుడాలోచిస్తూంటే అర్ధమవుతోంది సుధ అంత ప్రేమనెందుకు వలకపోస్తుందో! ఒక్క క్షణంకూడా తనను విడిచి ఉండలేకపోవడానికి కారణంకూడా ఇప్పుడు తెలుస్తూంది.
అంతా నాటకం!
ఎంత చేద్దా పోలీస్ వాడి కూతురేగా?
మరో గంటకో, గంటన్నరకో నాటకంమీద తెర దించపోతున్నాడు తను.
మోనోలిసా కథ ముగియబోతూంది.
"వెళ్ళు! వెళ్ళు! నీ తండ్రిదగ్గిరకే వెళతావో - నీ మాజీ ప్రియుడి దగ్గిరకే వెళతావో-వెళ్ళు! ఇంకా నిలబడ్డావేం! లేకపోతే మెడపట్టుకొని...."
"మిస్టర్ వాటీజ్ దిస్ నూసెన్సు?" పక్కసీట్లోని పెద్దమనిషి గుడ్లురిమి చూశాడు.
"సారీ సర్!" కృష్ణ ఉలిక్కిపడ్డాడు.
పక్కయన చొక్కామీద పడిన, వెన్ననూ, టమోటో సూప్ ను తుడవడానికి ప్రయత్నించాడు.
"లీవిట్!" ఏవగింపుగా ముఖం పెట్టి సీట్లో లేచి నిలబడ్డాడు ఆ పెద్దమనిషి. కృష్ణకేసి ఓసారి గుర్రుగా చూసి టాయిలెట్ కేసి వెళ్ళాడు.
కృష్ణ తల లజ్జతో వాలిపోయింది.
ఉద్రేకంలో ఏం చేశాడో గుర్తు తెచ్చుకున్నాడు.
సుధను మెడబట్టి గెంటే ప్రయత్నంలో ముందున్న ట్రేను తోసేశాడు. అది ఆ పక్కాయనమీదకు దొర్లింది.
"వాట్ హాపెండ్? నో బంప్! ట్రే ఎలా పడింది?" ఓ ట్రేలో కాఫీకప్పు పెట్టుకొచ్చిన ఎయిర్ హోస్టెస్ అడిగింది.
"జస్టు లైక్ దట్! ఊరికేనే!" నీళ్ళు నమిలినట్టు చెప్పాడు కృష్ణ.
"ఓ! ఈజ్ ఇట్ సో!" అంటూ విమలాచౌదరి కృష్ణ ముఖంలోకి అదోలా చూసింది.
కళావిహీనంగా వున్న అతని ముఖం చూస్తూ ఆవిడ కలవరపడింది.
"ఆర్ యూ ఆల్ రైట్?" ఆ గొంతులో ఎంతో సానుభూతి ఉంది. ఆదరణ ఉంది.
"థాంక్యూ! బాగానే ఉన్నా. ఏమీలేదు. ఐయామ్ ఆల్ రైట్." కృష్ణ కంఠంలో కృతజ్ఞతాభావం ధ్వనించింది.
"ఆర్ యూ షూర్?"
"యస్! యస్! చౌదరీ! థాంక్యూ!" కృష్ణ ఆమె చేతిలోనుంచి కాఫీకప్పు అందుకోవడానికి చెయ్యి ముందుకు చాచాడు.
"నన్ను చూస్తూనే మీరు అప్ సెట్ అయ్యారు. కారణం తెలుసుకో వచ్చా?" కప్పుఅందిస్తూ మెల్లగా, మృదువుగా అంది మిస్ చౌదరి.
మిమ్మలిని చూడగానే కాదు. మీ పేరు సుధాప్రియ కానందుకు అప్ సెట్ అయ్యాను" కాఫీ సిప్ చేస్తూ అన్నాడు.
"మీరు అనేదేమిటో....?"
"అర్ధంకావడంలేదుకదూ? నాకే అర్ధం కావడంలేదు. ఇక మీకెలా అవుతుంది?" ఖాళీకప్పు ఆమె చేతిలో ఉన్న ట్రేలో పెట్టాడు.
ఆమె చేతులు వణికాయి.
ట్రేలో ఉన్న కప్పు తొణికి కిందపడింది.
హోస్టెస్ కంగారుగా వంగి కప్పు తీసుకొంటూ కృష్ణవేణి కేసి బెదురూ బెదురుగా చూసింది.
కలవరపడింది.
"హిమస్టబీ ఏ సైకిక్" అనుకొంటూ తిరగిచూడకుండా, వయ్యారపు నడకలను వదిలేసి, తరుముతున్న లేడిపిల్లలా గబగబా వెళ్ళిపోయింది.
"లేడీస్ అండ్ జెంటిల్ మెన్__నౌ ఉయ్ ఆర్ క్రాసింగ్ రివర్ కృష్ణా__"
మైక్రోఫోన్ లో నిండుగా, పొందికగా వున్న కంఠం వినిపించింది.
చల్లటి గాలివచ్చే నాబ్ ను ముఖం ఎదురుగా తిప్పి పెట్టుకొన్నాడు కృష్ణ.
ఉడుకులాన్ పేపర్ తీసి ముఖం అద్దుకున్నాడు.
తను నలభయినిముషాల్లో బేగంపేటలో దిగుతాడు. మరో పది, పదిహేను నిమిషాల్లో లగేజ్ క్లియరెన్స్ ఇరవై, ఇరవైఅయిదునిమిషాల్లో ఇంటికి చేరతాడు.