Previous Page Next Page 
మానిని మనసు పేజి 11


    "కొత్తగా పెళ్ళయిన దంపతులు. చిలకా గోరింకల్లా ఉన్నారు. ఆ అమ్మాయి కుందనపు బొమ్మలా వుంది" అమ్మ ప్రారంభించింది.
    "సరేలే నాకు టిఫిను పెట్టు" అన్నాను. ఎందుకో అమ్మ వాళ్ళ గురించి అంతగా చెప్పడం నాకు రుచించలేదు.
    భోజనాల దగ్గర అమ్మ నా పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. నాన్న నా ముఖంలోకి చూశారు. నేను ముఖం చిట్లించుకున్నాను. నా ముఖంలోని భావాలను చూసి అమ్మగాని నాన్నకానీ ఏమీ అనలేకపోయారు.
    రెండురోజుల వరకు పక్కవాళ్ళ గురించి నేను పట్టించుకోలేదు. వాళ్ళను చూడాలనికూడా అనిపించలేదు నా చదువు గొడవలో నేనుండిపోయాను.
    ఆరోజు ఆదివారం...
    నేనే కూర్చుని చదువుకొంటున్నాను. పరీక్షలు దగ్గరకొస్తున్నాయ్.
    ఎవరో వచ్చిన అలికిడి అయి తలెత్తి చూశాను.
    పచ్చగా, పొట్టిగా, బొద్దుగా జపాన్ బొమ్మలావున్న ఒక అమ్మాయి కన్పించింది. ఆ అమ్మాయికి పద్దెనిమిదేళ్ళు వుండవచ్చు అనుకున్నాను. నేను ఆ అమ్మాయిని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ వుండిపోయాను.
    ఆ అమ్మాయి నన్ను చూసి నిలబడిపోయింది. చేతిలో గిన్నెలు ఉన్నయ్. చేతులకేసి చూశాను. పచ్చటి చేతి గోళ్ళకూ, కాళ్ళక గోరింటాకు... బంగారానికి కెంపులు పొదిగినట్టు వున్నయ్.
    ఆ అమ్మాయి ఓ క్షణం నా ముఖంలోకి చూసింది. పెద్ద పెద్ద కళ్ళు. ఆ కళ్ళల్లో అమాయకత్వం... ముఖంలో ముగ్ధత్వం... నాకు కవిత్వం రాదు. వస్తే రాసేసి వుందును.
    ముఖానికి పెద్ద కుంకంబొట్టు వున్నది. చిన్నబొట్టు పెట్టుకోమని చెప్పాలనిపించింది.
    మెళ్ళో చంద్రహారం పసుపుతాడుతో పెనవేసుకొని వుంది. మెడా, బొట్టూ చూస్తే పెద్ద ముత్తయిదువులా అన్పించింది.
    కాళ్ళకేసి చూశాను. కాళ్ళకు గోరింటాకుతో పారాణి పెట్టింది. గజ్లెల పట్టా గొలుసులు, కాళ్ళకు సన్నటి మట్టెలు.
    ఆ అమ్మాయి తలవంచుకొని లోపలకు చనువుగానే వెళ్ళిపోవడం నాకింకా ఆశ్చర్యాన్ని కలిగించింది.
    "ఎవరండీ?" అన్నాను వెనుకనుంచి.
    ఆమె జవాబు ఇవ్వలేదు.
    కనీసం వెనక్కు తిరిగికూడా చూడలేదు.
    నేను వెర్రిదానిలా చూస్తూ వుండిపోయాను.
    నేను ఆశ్చర్యంనుంచి కోలుకోకుండానే ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. ఈసారి చేతిలో గిన్నెలు కన్పించలేదు. నాకేసి చూడకుండా వెళ్ళిపోయింది.
    ఆ అమ్మాయిని గురించి ఆలోచిస్తూఅమ్మను అడిగి తెలుసుకుందామనుకుంటూ ఉండగానే అమ్మ ఒక ప్లేటులో పకోడీలు తెచ్చి నాముందు పెట్టింది.
    "చంద్రవదన తెచ్చింది" నేను అడక్కుండానే అమ్మ చెప్పింది.
    "చంద్రవదనా? ఇప్పుడొచ్చిన అమ్మాయి పేరు చంద్రవదనా?"
    "ఔను. నీకింకా ఆ పిల్ల పేరుకూడా తెలియదా?" అమ్మ ఆశ్చర్యంగా అన్నది.
    "అసలు ఇంతకూ ఆ పిల్ల ఎవరు?"
    "మన పక్కవాటాలో అద్దెకుంది వీళ్ళేగదా?"
    "అలాగా!" సాలోచనగా అన్నాను.
    "పిల్ల బుద్ధిమంతురాలు. పిన్నిగారూ పిన్నిగారూ అంటూ చుట్టుకు చుట్టుకు తిరుగుతోంది. కలుపుగోలుతనం..." అమ్మకు ఎవరైనా నచ్చితే ఎంత పైకి ఎత్తుతుందో నాకు తెలుసు.
    "మరి నేను పలకరిస్తే పలక్కుండా వెళ్ళిపోయిందే?" రోషంగా అన్నాను.
    "వినలేదేమో. పిల్ల బంగారు బొమ్మ. చిదిపి దీపం పెట్టొచ్చు."
    "ఇక నీ పంచాంగం ఆపు. నేను చదువుకోవాలి" అన్నాను విసుగ్గా.
    అమ్మ ఓ క్షణం నా ముఖంలోకి చూసి లోపలకు వెళ్ళిపోయింది.
    పరీక్షలు దగ్గిరపడ్తున్నాయి.
    ఆ అమ్మాయిని నేను మళ్ళీ చూడలేదు.
    నేను ఉండగా ఎందుకురాదో నాకు అర్ధంకాలేదు. బహుశా చదువుకోలేదేమో. నన్ను చూస్తే ఆత్మహీనతా భావం కలుగుతుందేమో. చదువుకొనేవాళ్ళు గర్వంగా ఉంటారని భయమేమో. కారణం నిర్ణయించుకోలేకపోయాను.
    రాత్రిళ్ళు వంటిగంటవరకూ చదువుతూ కూర్చునేదాన్ని.
    దాదాపు పన్నెండువరకు పక్క వాటాలో నుంచీ నవ్వులూ, మాటలూ విన్పించేవి. నా మనసు చదువుమీద లగ్నమయేది కాదు. చిరాకు వేసేది.
    పరీక్షలకు ముందు శెలవలు ఇచ్చారు. నేను ఇంట్లోనే వుండి చదువుకుంటున్నాను. చంద్రవదన అప్పుడప్పుడు వచ్చేది. నన్ను చూసీచూడనట్టే అమ్మ దగ్గరకు వెళ్ళేది. నాకు ఒకోసారి వళ్లు మండిపోయేది. అంతలోనే పాపం పల్లెటూరి పిల్ల, అమాయకురాలు అని సర్దుకొనేదాన్ని. ఏది ఏమైనా ఆ అమ్మాయిని మాత్రం నేను కళ్ళు పెద్దవి చేసుకు చూసేదాన్ని. నా కళ్ళకు ఆమె చాలా ముద్దుగా కన్పించేది. కవులు వర్ణించే ముగ్ద ఇలాగే వుంటుంది కాబోలు అనుకునేదాన్ని.
    అతన్ని నేను చూడలేదు. అతన్ని చూడాలనే కుతూహలం కూడా కలగలేదు.
    కొద్దిరోజులు గడిచాయి. నేను రాత్రంతా చదివి పరీక్ష రాసివచ్చి మధ్యాహ్నం కొద్దిరోజులు మాత్రం నిద్రపోయేదాన్ని. క్లాసు రావాలన పట్టుదలతో బుర్ర పనిచెయ్యక పోయినా పుస్తకం చేతిలో పట్టుకొని కూర్చునే కళ్ళు మూసుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకునేదాన్ని.
    ఆరాత్రి... అప్పటికే రెండు పేపర్లు రాశాను. శ్రద్ధగా చదువుతున్నాను. మధ్య మధ్య కళ్ళు మూతలు పడ్తున్నాయి. ప్లాస్కులోని టీ వంచుకొని తాగాను. దాదాపు పన్నెండున్నర అయింది.
    పక్క రూమ్ లో నుంచి సన్నగా నవ్వులూ, మాటలూ వినిపించాయి. టీ సిప్ చేస్తూ వినడానికి ప్రయత్నించాను. సరిగా విన్పించలేదు.
    మళ్ళీ చదువులో మునిగిపోయాను. అలా ఎంతసేపు చదివానో నాకే తెలియదు

 Previous Page Next Page