Previous Page Next Page 
మానిని మనసు పేజి 12


    అకస్మాత్తుగా ఓ స్త్రీ ఏడుపు వినిపించింది.
    తృళ్ళిపడ్డాను. అర్ధరాత్రి స్త్రీ రోదన.
    గడియారంకేసి చూశాను. సరిగ్గా రెండయింది.
    ఏడుపు ఎటునుంచి వస్తుందో ముందు అర్ధం కాలేదు. ఆలకించాను. పక్కవాటాలోంచి అని తెలిసింది.
    భార్యాభర్తలు పోట్లాడుకున్నట్టున్నారు అనుకున్నాను.
    మళ్ళీ టీ తాగాను.
    ఇంకా సన్నగా ఏడుపు విన్పిస్తూనే ఉన్నది.
    నాకు నిద్రవస్తోంది. చదువుతున్నది అర్ధంకావడం లేదు. తలమీదగా ముసుగు తన్నిపెట్టి పడుకున్నాను.
    తెల్లవారి పరీక్ష రాసి వచ్చాను.
    చంద్రవదన మా ఇంట్లో నుంచి బయటికొస్తూ వాకిట్లో ఎదురైంది. తలవంచుకుని వెళ్ళిపోయింది. ఆమె ఎప్పటిలా ఉత్సాహంగానే ఉన్నది. ప్రణయ కలహం కాబోలు అనుకున్నాను రాత్రి వినిపించిన ఏడుపును గుర్తుచేసుకుంటూ.
    మళ్ళీ ఆ రాత్రి సన్నగా ఏడుపు విన్పించింది. నా చేతిలో పుస్తకం కింద పడిపోయింది. ఆలకించాను. అంతలో ఎవరో పీక నొక్కుతున్నట్టు కీచుగా స్త్రీ రోదనం.
    దుర్మార్గుడు. అంత చిన్నపిల్లను ఎందుకు బాధ పెడ్తున్నాడు? శాడిస్టా? అయివుండాలి.
    కొంతసేపటికి నిశ్శబ్దం.
    నాకు మళ్ళీ చదువుమీదకు మనసుపోలేదు. నిద్రపోయాను. నిద్రమాత్ర వేసుకొని మరీ నిద్రపోయాను.
    ఇలాగే మరో రెండురోజులు విన్పించింది.
    పరీక్షకు హడావుడిగా వెళుతున్నాను. అతను సైకిలు పట్టుకుని నిలుచున్నాడు. చంద్రవదన టిఫిన్ బాక్స్ అందిస్తున్నది. అతను ఏదో అన్నాడు. ఆమె కిసుక్కున నవ్వింది.
    అతనుకూడా అందముగా ఉన్నాడు. పొడవుగా హుందాగా ఉన్నాడు. ఆ అమ్మాయి అంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతుందో నాకు అర్ధంకాలేదు. పాపం నటన అయి ఉండాలి. లేకపోతే మరీ సతాయిస్తాడేమో.
    ఆ రాత్రికూడా అదే ఏడుపు మరీ దారుణంగా ఉన్నదా ఏడుపు. అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆడదాని ఏడుపు. గుండెల్ని బద్ధల కొట్టే ఏడుపు. నేను నిలువునా వణికిపోయాను.
    మంచం దిగాను తలుపు తెరిచాను. అమ్మను లేపాను.
    అమ్మ నా రూమ్ లోకి వచ్చింది.
    అంతా నిశ్శబ్దం.
    అమ్మ నావైపు అదోలా చూసింది.
    "నిజమమ్మా. ఇప్పుడే ఆపేసింది. రేపు నిన్ను లేపుతానుగా."
    "నీకు పీడకల వచ్చిందేమో తల్లీ. నన్ను నీ రూములో పడుకోమంటావా?"
    అమ్మమీద కోపమొచ్చింది. అక్కరలేదన్నాను. అమ్మెళ్ళిపోయింది.
    "రాత్రి నేను చెప్పింది నువ్వు నమ్మలేదుకదూ? అతను రోజూ ఆ అమ్మాయిని బాధిస్తాడనుకుంటాను. రోజూ ఏడుస్తుంది" అన్నానమ్మతో.
    అమ్మ నా ముఖంలోకి ఏదోగా చూసింది.
    "ఏమిటే నన్నలా చూస్తావ్?"
    "ఆఁ ఏం లేదులే. అమ్మాయి చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు."
    "అంటే నేను అబద్ధం చెబుతున్నానని నీ అభిప్రాయమా?"
    "నీకు బహుశా పీడకలలు వస్తున్నాయ్యో ఏమోనని భయపడుతున్నాను."
    "లేదమ్మా. నేను చదువుకుంటూ కూర్చునే ఉంటాను."
    "అంతగా చదవద్దే అని నేను అందుకే మొత్తుకోవడం."
    "నీదో చాదస్తం" విసుక్కుంటూ అమ్మదగ్గరనుంచి లేచి నా రూములో కెళ్ళిపోయాను.
    ఆరోజునుంచి అసలు విషయం కనుక్కోవాలనే పట్టుదల నాలో పెరిగింది. వాళ్ళిద్దర్నీ ఓ కంట కనిపెట్టసాగాను.
    అమ్మ నామాట నమ్మడంలేదు.
    నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు భయం భయంగా చూడసాగింది.
    అమ్మా నాన్నా ఏదో మాట్లాడుకోవడం విన్నాను. "దాన్ని డాక్టర్ కు చూపించండీ. ఆ చదువు మాన్పించండీ" అంటోంది. నన్ను చూసి సంభాషణ ఆపేశారు.
    అమ్మ భయం తల్చుకుని నేను నవ్వుకున్నాను.
    కాలేజీకి శెలవులు.
    ఆ అమ్మాయి మధ్యాహ్నం అమ్మదగ్గరకొచ్చింది.
    నన్ను చూసి సందేహిస్తూ గడపలోనే నిల్చుంది.
    అమ్మ స్నానం చేస్తున్నది.
    "రండి. నిలబడిపోయారేం?" నవ్వుతూ ఆహ్వానించాను.
    ఆ అమ్మాయి ముఖం ఇబ్బందిగా పెట్టింది.
    "రండీ!"
    "పిన్నిగారు........"
    "స్నానం చేస్తోంది రండి కూర్చోండి" అన్నాను.
    ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది.
    ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాను. జాలిగా చూశాను. కాని ఆ  అమ్మాయి మొఖంలో ఎలాంటి బాధ కన్పించలేదు. కళ్ళల్లో ఉత్సాహం తొంగిచూస్తున్నది. ఆ వయసు అలాంటిది. ఎన్ని కష్టాల్నయినా సులభముగా భరించగల వయసు అనుకున్నాను.
    "నాతో మాట్లాడుకూడదా?"
    ఆ అమ్మాయి ఇబ్బందిగా చూసింది.
    "మీరు పెద్ద చదువులు చదువుతున్నారు. మీతో నేనేమి మాట్లాడగలను" అన్నది ఆ అమ్మాయి తలవంచుకునే.
    "దానికేమిటి? మీరంటే నాకిష్టం" అన్నాను.
    ఆ అమ్మాయి పెద్దకళ్ళను పైకెత్తి రెప్పలు టపటప లాడించి చూపులు కిందకు దించుకుంది.
    ఆ అమ్మాయిని కబుర్లలోకి దించాను.

 Previous Page Next Page