వస్తున్న ఆగ్రహాన్ని అణుచుకున్నాడు సోము. సమాధానం యివ్వలేదు.
"రేయ్ రేపు చౌదరి పొలానికి పన్లకి వెళ్ళకపోతే యిదిగో చూడు! ఆ వేప చెట్టుకు కట్టేసి చింత బరికెల్తో బాదిస్తా! దెబ్బకి దెయ్యం దిగిపోతుంది తెలుసా? ఆఁ"
నరాలు పొంగేయి పళ్ళు పట పట మన్నాయి. నాయుడి ముఖంలోకి తీక్షణంగా చూశాడు సోము.
"అల్లా మిర్రి మిర్రి చూశావంటే అయ్యేది అవుతుంది?"
"ఏమవుతుంది?"
"తోలు వలిపిస్తా!"
"ఎందుకంటే!"
"ఎందుకేమిటీ? ఇలా నాకు ఎదురు నుంచుని సమాధానాలు చెపుతావా? లేచి నించున్నాడు నాయుడు.
"మీరే పిలిచారు అడిగారు సమాధానాలు చెప్పాను. తప్పయితే క్షమించండి, వెళుతున్నాను!"
"ఒరేయ్" సింహనాదం చేశాడు నాయుడు. అతని కి ముఫ్ఫైయేళ్ళ పాలనలో అలా సమాధానం యిచ్చిన వాడు లేడు.
నాయుడి కేకలు విని దూరంగా వున్న వాళ్ళ పరివారం వచ్చారు ఆదరా బాదరాగా ఆదుర్దాగా.
"మరియాదగా చెబుతున్నా! ఈ రాత్రికి మీనాయన వచ్చి క్షమాపణ చెప్పుకుని, రేపు చౌదరి చేనుకి పనికి వెళితే సరే సరి" లేదా రేపు పంచాయితీ పెట్టిస్తాం.
"ఎందుకండి."
"అప్పు తీసుకుని ఎగ్గొడితే వూరుకోమంటావా? నరికి పోగులు పెడతాం జాగ్రత్త!"
"అంత కష్టమెందుకు? కోర్టుకి వెళ్ళండి." పళ్ళు పట పట నూరేడు నాయుడు. అతనేదో అనబోయాడు.
"మీకు అప్పులిచ్చింది కోర్టుల కెళ్ళటానికి కాదు. అయినా నయాన భయాన అది వసూలు చేసుకోలేని దద్దమ్మ లకి కోర్టు. నాకేం రేపు యీ వేళకి నా అప్పు నయాపైసలతో సహా వసూలు చేసుకుంటాను!" అన్నాడు చౌదరి.
"ఒరేయ్ పిల్లకాకీ! నీకు యీ పెద్ద పెద్ద మాటలూ వ్యవహారాలూ ఎందుకురా? మీ నాన్న చూసుకుంటాడు లేమ్మా! వెళ్ళు! వెళ్ళు!" అన్నాడు ఈ కరణం లౌక్యంగా.
"ఎక్కడికి వెళ్ళతాడు పొగరుపోతు వెధవ! మాటకి మాట చెప్పడం నేర్చుకున్నాక అప్పుతీర్చాలని తెలియదూ? వాడు చేస్తేనేం వాడినాయన చేస్తేనేం తీర్చాల్సిందే! అప్పు కట్టందే అడుగు ముందుకి వెయ్యకూడదు. అప్పు కిందకి పొలం జప్తు చేయడమెందుకు? దున్నలా వున్నాడు వీడినే జప్తు చేస్తే సరి. గాడిదలా చాకిరీ చేయించి అర కడుపుకి కూడు పెడితే తిక్క తిరిగి దారికొస్తడు" అన్నాడు మున్సబు.
"భేషయిన మాట చెప్పారు." అన్నాడు శేఖరు.
నరనరం మండిపోయింది సోముకి, తీక్షణంగా చూశాడు.
"విన్నావా పెద్దల తీర్పు? ఇప్పుడు చెప్పు రేపు పొలానికి వస్తావా పన్లోకి ఇప్పుడు చాకిరికి వెళతావా? అప్పు పూర్తిగా తీరేదాకా ఆ యింట్లో బానిసవి నువ్వు."
"అసలెంత యివ్వాలండీ!" అడిగాడు ఓ యువకుడు.
'నీయమ్మ-నీకెందుకురా, నోర్మూసుకో-అసలు, వడ్డీ లెక్క అడిగేకాడికి వచ్చార్రా మీరు?" బూతులు తిట్టాడు మున్సబు.
'ఏందయ్యో అల్లా తిడతావు. తిడితే పడుండేవాళ్ళు ఎవళ్ళూ లేరు యిక్కడ జాగ్రత్త" జవాబిచ్చాడు ఆ యువకుడు.
ఆ సమాధానానికి మునసబు ముఖం మారిపోయింది. చప్పున తిట్లకి లంకించుకుని కోపంతీరక దూకేడు క్రిందకి అంతలో వాళ్ళ మనుషులు జోక్యం చేసుకున్నారు.
నలుగురూ మీదికి వచ్చారు.
"మామా, చిన్నాయనా! ఏమిటిదీ, వీళ్ళకోసం మనం మనం కొట్టుకోవాలా? ఆగండి. డేనియల్ చేసిన తప్పేమిటి?"
"ఒరే సోమిగా, చడువుకున్న గాడిద మేసే గాడిదని చెడగొట్టిందన్నట్టుగా నువ్వందర్నీ చెడగొడుతున్నావు. పద, పద ఎల్లుండి ఎల్లుండి మీ నాయనొచ్చి మాటాడతాడు ఆ యిషయాలు" అని తలారి ఎసోబు అందర్నీ తరిమేశాడు లౌక్యంగా.