"అక్కడికే వెళ్ళాడు. ఆడిస్తానని పిల్లనుకూడా తీసుకువెళ్ళాడు."
"వాడు తోటకు నీళ్ళు పోస్తూ దాన్ని ఏ చెట్టుకింద వదిలిపెట్టి వుంటాడో! ఎందుకు పంపించావు? నేను వెళ్లి తీసుకొస్తాను" అంటూ మరో మాటకు ఎదురుచూడకుండానే వెళ్ళిపోయాడు సీతాపతి. పెట్టి తెరచి కొత్తబట్టలు సర్దుతూ కూచున్న అరుంధతి ఏదో ఆలోచనలో పడింది.
"చూడమ్మా, బయట ఏదో గోలగా వుంది. మాధవి ఎక్కడుంది?" మంచంలో పడుకొని వున్న శాంతమ్మ అరుంధతిని ఉద్దేశించి అంది.
అరుంధతి గబగబా బయటకు వచ్చింది. రంగడూ మరో ఇద్దరూ వీధి వాకిలినుంచి లోపలకు వస్తున్నారు. ఏవో గొడవగా మాట్లాడుతున్నారు.
"అమ్మగోరూ! ఇయ్యాల మన బుల్లెమ్మగోరు చచ్చిపోయేవోరేనమ్మా!" అన్నాడు రంగడు ఏడుపుమొఖం పెట్టి.
"ఏం జరిగింది?" వెళ్ళి ఆత్రంగా పిల్లను తీసుకుంది.
"భద్రయ్యగోరి కోడెదూడ కుమ్మేసేదే నమ్మగోరూ!" అన్నాడు పుల్లయ్యగారి పాలేరు.
"నువ్వేం చేస్తున్నావురా దున్నపోతా?" అంది అప్పుడే అక్కడకు లేచివచ్చి గడపపట్టుకుని నిల్చున్న శాంతమ్మ.
"ఆడు చెట్లకు నీళ్ళు పోస్తున్నాడమ్మగోరూ! బుల్లెమ్మని ఒక చెట్టుకింద కూచోబెట్టినాడమ్మ. అంతలో భద్రయ్యగోరి పోట్లగిత్త తాడు తెంచుకొని పరుగెత్తుకొచ్చిందమ్మ. నేను మా తోటలో చేత్తుండాను. దూరాన్నుంచి కేకలు ఏసినా" అన్నాడు పుల్లయ్యగారి చిన జీతగాడు రాముడు.
"నేను తలెత్తి చూసేటప్పటికే కోడెదూడ అమ్మాయిగోరికి అల్లంత దూరంలో ఉందండమ్మా! నాకు కాళ్ళు సేతులు వణికిపోయినాయ్. అంతలో మెరుపులా వచ్చిండు ఒక చాకులాంటి మడిసి. మన వూళ్ళో మడిసి కాదండమ్మా! గిత్తకు ఎదుర్రొమ్మిచ్చి దాని కొమ్ములు పట్టుకున్నాడు. ఆపన్న నాసామి రంగా ఆ గిత్త ఆయన్ను కుమ్మేసింది. చూడండమ్మా! గుండెల్లో కుమ్మిందమ్మా! ఆ బాబు అల్లంత దూరంలో ఎగిరి పడ్డాడు. అంతలో మేమందరం కలిసి గిత్తను పట్టేశాం" అన్నాడు రంగడు.
"మరి ఆ దెబ్బలు తగిలిన ఆయన్ను అక్కడే వదిలేసి వచ్చారా? బాగా దెబ్బలు తగిలాయా?" ఆదుర్దాగా అడిగింది అరుంధతి.
"ఏమోనమ్మా మనిషికి తెలివున్నట్టులేదు. చొక్కా అంతా నెత్తురు మరకలు కనిపిస్తున్నాయి. దెబ్బలు బాగానే తగిలాయమ్మగోరూ! నేను బుల్లెమ్మగోరిని తీసుకొని పరుగెత్తుకొచ్చినా."
"పాపం! ఎవరో ఏమిటో! దేవుడులా అడ్డుపడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడో ఏమిటో వెళ్ళి చూడండి. మనింటికి తీసుకురండి" అంది శాంతమ్మ.
"అక్కడ ఇంకా మనుషులున్నారమ్మా! భద్రయ్యగారి జీతగాడూ పుల్లయ్యగోరూ అందరూ ఉన్నారు. మన బాబుగోరు తోట దగ్గరే ఎదురయినారు. చెప్పాను. అటుకేసి ఎల్లారు, ఆరు తీసుకొస్తారమ్మా!" అన్నాడు రంగడు మళ్ళీ వెళ్ళటానికి బద్ధకిస్తూ.
శాంతమ్మ మాధవికి దిష్టి తీయించింది. దేవుళ్ళకు మొక్కుకుంది బిడ్డ గండం గడిచి బయటపడినందుకు.
వాకిలిముందు హడావిడిగా ఉంది. సీతాపతీ మరో ముగ్గురు కలిసి ఓ మానవాకారాన్ని లోపలకు చేరవేయటం కనిపించింది అరుంధతికి. ఇంకా కొందరు ఊళ్ళో పెద్దమనుషులు కూడా ఉన్నారు. అరుంధతి లోపలకు వెళ్ళిపోయింది. అరుంధతికి వాళ్ళంతా ఎప్పుడు వెళ్ళిపోతారా, తన బిడ్డ ప్రాణాలు కాపాడిన ఆ పుణ్యాత్ముణ్ణి ఎప్పుడు చూద్దామా అని ఉంది. శాంతమ్మకుకూడా ఆత్రంగానే ఉంది. మగవారి ముందుకు వచ్చే ఆచారం లేదు. అందుకే లోపల ఓ గదిలో చాటుగా ఉండిపోయారు.
సీతాపతి లోపలకు హడావిడిగా వచ్చాడు. ముఖం పాలిపోయివుంది. "అరూ! మంచినీళ్ళు!" అన్నాడు.
అరుంధతి గబగబా ఓ పెద్ద గ్లాసునిండా నీళ్ళు ముంచి ఇస్తూ "ఎవరండీ అతను?" అంది.
"మన రాజా!" అంటూ గ్లాసు తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. అరుంధతి ఆత్రంగా పరుగెత్తబోయింది.
"వెళ్ళకు మగవాళ్ళున్నారు" అంది శాంతమ్మ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ.
అరుంధతి ఉచ్చుపడిన లేడి అయిపోయింది. మతిపోయినదానిలా చూస్తూ కూర్చుంది.
రాజా కళ్ళు తెరవగానే చుట్టూ జనాన్ని చూసి కలవరపడ్డాడు.
"రాజా! ఎలా ఉందిరా?" అన్నాడు ముఖంమీద వంగుతూ సీతాపతి.
అందరూ ఆశ్చర్యంగా సీతాపతివైపు చూశారు.
"ఇతను నీకు తెలుసా?" అన్నాడు పుల్లయ్య.
"మామయ్య కొడుకు, రంగారావు" అన్నాడు తమాయించుకొని. "నేను రాజా అని పిలుస్తాను" అన్నాడు అడక్కుండానే.
"ఆ గడ్డం అదీ పెంచుకొని, పిచ్చివాడిలా వుండేవాడే అతనా?" భద్రయ్య అడిగాడు.
సీతాపతి ఔనన్నట్టు తల పంకించాడు.
"ఎంతమార్పు? ఇప్పుడు బాగానే వున్నట్లున్నాడు."
రాజా బాధగా మూలిగాడు. పక్కకి వత్తిగిలి పడుకున్నాడు. ఒక్కొక్కరే అందరూ వెళ్ళిపోయారు. ఎందుకయినా మంచిది, ఊళ్ళోవున్న డాక్టరుకు చూపించమన్నారు.
సీతాపతి లోపలకు వచ్చాడు.
"నా షర్టంతా రక్తం మరకలు వున్నాయి. మారుస్తాను. ఎవరూ ఏమీ అడగలేదూ?" అన్నాడు రాజారావు నీరసంగా.
"లేదు, ఎక్కడో గాయం తగిలి వుంటుందనుకున్నాం. అయినా హడావిడిలో అదేమీ పట్టలేదు. ఆ రక్తంమరకలేమిటి?" అన్నాడు సీతాపతి.
"తరువాత చెబుతాను. ముందు చొక్కా మార్చాలి. నీ చొక్కా ఒకటి తీసి ఇవ్వు" అంటూ వాకిలికేసి చూస్తూ వుండిపోయాడు రాజారావు. అరుంధతి నిల్చొనివుంది. కళ్ళనిండా నీళ్ళు తిరిగివున్నాయి. విషాదం మూర్తీభవించినట్లు వుంది. శాంతమ్మ "నాయనా! ఎంత పని జరిగింది?" అంటూ రాజాపక్కనే మంచంమీద కూచుంది. రాజా షర్టుకువున్న మరకలు చూస్తుంటే అరుంధతికి కళ్ళు తిరిగినట్లుంది. తలుపుపట్టుకొని తమాయించుకొని కళ్ళు తుడుచుకుంది.
"వేడిపాలు ఓ గ్లాసు తీసుకురా!" అన్నాడు సీతాపతి-రాజాను లేపి కూర్చోబెడుతూ. అలా కూర్చుంటున్నప్పుడు రాజా చాలా బాధపడుతున్నాడని తెలుసుకున్నాడు సీతాపతి.
"నాకు పాలు వద్దు, కాఫీ కావాలి" అన్నాడు రాజారావు. అరుంధతి అక్కడనుంచి కదిలి వెళ్ళిపోయింది.
షర్టు మార్చుకొని పడుకున్నాక రాజారావుకు అకస్మాత్తుగా గుండెలో పోటులా వచ్చింది. ఒక్కసారిగా వాంతి చేసుకున్నాడు. అంతా రక్తమే! శాంతమ్మ గుండెలు బాదుకుంది. సీతాపతి డాక్టరుకోసం పరుగెత్తాడు. కాఫీ గ్లాసు చేత్తో పట్టుకుని నిల్చున్న అరుంధతి నిశ్చేష్టురాలే అయింది. "ఆ గ్లాసు అక్కడ పెట్టిమంచినీళ్ళు తీసుకురా" అంది శాంతమ్మ-రాజారావు తలను రెండు చేతులతో పట్టుకుని.
అరుంధతి పరుగెత్తికెళ్ళి గ్లాసుతో నీళ్ళు తెచ్చింది. రాజారావు నోటికి గ్లాసు అందించింది. రాజారావు పుక్కిలించి వూశాడు. ఆ తరువాత మంచినీళ్ళు తాగాడు. అంతసేపూ రాజారావు పట్టుకున్నా, అరుంధతికూడా గ్లాసు పట్టుకునేవుంది. ఆ తరువాత ఒక్కొక్క గుక్క కాఫీ తాగించింది శాంతమ్మ. రాజారావుకు ప్రాణం కొంచెం తేరుకున్నట్లయింది.
అరుంధతి బూడిద తెచ్చి వాంతి అయిన ప్రదేశంలో పోసింది. అరుంధతి శుభ్రం చేస్తుంటే శాంతమ్మ వారిస్తూ రంగణ్ణి పిలవమన్నది కాని అరుంధతి వినిపించుకోకుండా శుభ్రంచేసి, తరవాత పేడతో అలికింది. ఏనాడూ చెయ్యని అరుంధతి చేయతయ్యీ కాకుండా అలుకుతూ వుంటే శాంతమ్మ చూస్తూ కూచుంది.
అరుంధతి పనిచేస్తుంటే రాజారావు నొచ్చుకున్నాడు.
"వళ్ళు మండిపోతుంది. జ్వరం వచ్చినట్లుంది" అంటూ శాంతమ్మ రాజారావు నుదురుమీద చెయ్యివేసి చూసింది. అరుంధతి చేస్తున్న పని ఆపి తలెత్తి చూసింది. రాజారావు పెదవులమీద నిర్లక్ష్యంతో కూడిన నవ్వు కనిపించి ఇట్టే మాయమయింది. అరుంధతి పని పూర్తిచేసి బయటకు వెళ్ళింది.
సీతాపతి డాక్టర్ను వెంటబెట్టుకొచ్చాడు. శాంతమ్మ లేచి భుజం నిండుగా పమిట తీసుకుంటూ ఓ ప్రక్కగా నిలబడింది. డాక్టరు పరీక్షించి ఎద్దు కుమ్మటంవల్ల గుండెలు బాగా కదలబారాయనీ, పదిరోజులు మంచంమీదనుంచి కదలకూడదనీ చెప్పాడు. ఇంజక్షన్ ఇచ్చి రాత్రికి బాధ తెలియకుండా మాత్రకూడా ఇచ్చాడు. రోజూ వచ్చి ఇంజక్షన్ ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
డాక్టర్ను బయటవరకు సాగనంపి సీతాపతి లోపలకు వచ్చాడు. రాజారావు మంచంమీద పక్కగా కూచున్నాడు. అంతలో అరుంధతి పిల్ల నెత్తుకొనివచ్చి నిల్చుంది.
"నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను రాజా! నా బిడ్డ ప్రాణాలను కాపాడావు. నీ ప్రాణాలమీదకే తెచ్చుకున్నావు" అన్నాడు సీతాపతి రాజారావు రెండు చేతుల్ని పట్టుకొని. కళ్ళల్లో నీరు తిరిగింది.
"ఏడ్చావులే ఋణం ఏమిటి! అసలు ఆ పిల్ల నీ కూతురని కూడా నాకు తెలియదు. పసిబిడ్డను ఎద్దు కుమ్మేయబోతుంటే ఏ మగాడు చూస్తూ వూరుకుంటాడు?" అంటూ రాజారావు అరుంధతి చేతిలో వున్న పిల్లవైపు చూశాడు. మాధవి బోసిగా నవ్వింది.
"రా తల్లీ, చూడు మామయ్య! ఇవ్వాళ మామయ్య రాకపోతే ఈ పాటికి నువ్వేమయివుండేదానివో!" అంటూ పిల్చాడు సీతాపతి.
అరుంధతి పిల్లను కిందకు దింపుతూ చిన్నగా "బాబాయి" అంది.
పిల్ల తప్పటడుగులు వేస్తూ వెళ్ళి మంచం పట్టుకుని నిల్చుని "బాబాయి" అంది.
"నీకంటే పాపకే నేనెవర్నో తెలుసురా! నేను మామయ్యనెలా అవుతాను? నీకు అన్నను, అయితే పాపకు పెద్దనాన్నను" అన్నాడు రాజారావు పాపను చూస్తూ. శాంతమ్మా సీతాపతీ నవ్వుకున్నారు. అరుంధతికి సీతాపతికంటే రాజారావు పెద్ద అని తెలుసు. కాని సీతాపతి కంటే నాజూగ్గా ఓ ఐదు సంవత్సరాలయినా చిన్నవాడిలా కనిపిస్తాడు. రాజా సీతాపతికంటే చిన్న అనుకుంటేనే ఆమెకు బాగుటుంది.
"ఈ ఊళ్ళో మంచి డాక్టరే వున్నాడే?" అన్నాడు రాజారావు.
"యల్.ఐ.ఎం. పాసయ్యాడు. ఈ వూరి కుర్రాడే. బస్తీ వ్యామోహం లేకుండా, వున్న ఊళ్ళో వైద్యసహాయం వుంటుందని ఇక్కడే వుండిపోయాడు. మంచి కుర్రవాడు" అన్నాడు సీతాపతి.
రాజారావు కళ్ళు కూరుకుపోతున్నాయి. బలవంతంగా రెప్పల్ని ఎత్తుకున్నాడు.
అరుంధతి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి "మందు ఇవ్వండి" అంది భర్తకు మంచినీళ్ళు గ్లాసును ఇస్తూ.
"పడుకో రాజా! ఎక్కువ మాట్లాడకు. ప్రొద్దుపోయాక పాలు మాత్రం ఇవ్వమన్నాడు డాక్టరు" అంటూ మందుబిళ్ళ నోట్లోవేసి మంచినీళ్ళు పోశాడు సీతాపతి. శాంతమ్మ రాజారావు మోకాళ్ళవరకూ దుప్పటి లాగింది. అందరూ బయటకు వచ్చేశారు. అతను కళ్ళుమూసుకొని పడుకున్నాడు.
సీతాపతి తను వెళ్ళేటప్పటికి రాజారావు ఏ స్థితిలో పడివుందీ వర్ణించి చెప్పాడు అరుంధతికి, శాంతమ్మకూ.
"ఆ రక్తం ఏమిటి చొక్కానిండా?" అరుంధతి అంతవరకూ తనను వేధిస్తున్న ప్రశ్న వేసింది.
"నాకూ తెలియదు. అది ఇప్పుడు తగిలిన దెబ్బకాదు. ఇప్పుడే అడగటం ఎందుకులే అని అడగలేదు. ఏదో పెద్ద అపాయం నుంచే బయటపడివుంటాడు."
సీతాపతి అన్నం తింటున్నాడు. శాంతమ్మ అన్నం వడ్డిస్తూంది. అరుంధతి చిన్నగా రాజా గదిలోకి వచ్చింది. రాజా కళ్ళు మూసుకొని వున్నాడు. చిన్నగా వెళ్ళి మంచం దగ్గర నిలబడింది. రాజా ముఖాన్ని చూస్తూ నిలబడింది. ఎన్ని యుగాలయినా అలా చూస్తూ నిలబడిపోవాలనిపించింది. పసిపిల్లవాడిలా నిర్మలంగా వున్న ఆ ముఖాన్ని ఎంతసేపు చూసినా చూడాలనే అనిపించింది. జ్వరం ఎలా వుందో? అప్రయత్నంగానే రాజారావు నుదురుమీద చెయ్యివేసింది. వెంటనే ఆమె చేతిమీద రాజారావు చేయి పడింది. ఆమె చేతిని లాక్కోకుండా తన నుదురుమీద గట్టిగా అదుముకున్నాడు. అరుంధతి గాభరాగా చెయ్యి లాగేసుకుంది. రాజారావు నిద్రపోతున్నాడనుకుంది.
"జ్వరం ఎలా వుంది?" అంది గాభరాగానే.
"నువ్వే చెప్పాలి. నా జ్వరం నాకెలా తెలుస్తుంది?" అన్నాడు రాజారావు ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ.
"వేడిగానే ఉంది. పాలు తెస్తాను. ఉండండి!" అతనివైపు చూడకుండానే అనేసి, గదిబయటకు వచ్చింది.
శాంతమ్మ పాలగ్లాసు తీసుకెళుతుంటే అరుంధతికి నిరాశే కలిగింది.
అరుంధతి మనస్సంతా శ్రావణమాసపు ఆకాశంలా ఉంది. విషాద మేఘాలు ఆవరించాయి. రాత్రంతా నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూనే ఉంది. రాజా పట్టుకున్న చేతిని మళ్ళీ మళ్ళీ చూసుకోసాగింది. ఆ స్పర్శ ఇంకా ఉన్నట్టే అనిపిస్తూంది. మళ్ళీ రాజా రాకుండా ఉంటేనే బాగుండేదేమో? తన బిడ్డ ఏమయిపోయేది రాజా రాకపోతే? పక్కన ప్రశాంతంగా నిద్రపోతున్న భర్తమీద జాలి వేసింది.
12
రాజారావుకు జ్వరం ఎక్కువయింది. నాలుగురోజులు మూసినా కన్నెరగడు. సీతాపతి పొలం వెళ్ళకుండా ఆ నాలుగురోజులు ఇంట్లోనే ఉండిపోయాడు. శాంతమ్మ రాజా మంచం దగ్గిరే ఉండి సేవలు చేసింది. అరుంధతి ఇంటిపని చూసుకోవడం తప్పించి రాజాకోసం ఏమీ చెయ్యలేకపోయింది. అరుంధతికి రాజాపక్కనే కూచుని రాత్రింబవళ్ళు సేవలు చెయ్యాలని ఉంది. తన అసహాయతమీద తనకే జాలి వేస్తుంది. ఆమె అనుభవిస్తున్న ఆవేదనకూ, ఆరాటానికీ అంతులేదు. మానసిక సంఘర్షణలో ఆమె సున్నితమైన హృదయం విలవిల్లాడిపోతూంది.
ఆనాడే జ్వరం తగ్గింది. నార్మల్ కు వచ్చింది. రెండురోజుల్లో పథ్యం పెట్టవచ్చని చెప్పాడు డాక్టర్.
సంక్రాంతి పండుగ ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. రాజా జబ్బువల్ల పండుగ చెయ్యలేదు. కాని వచ్చినవాళ్ళకు లేదనకుండా ధాన్యం దోసిళ్ళతో పెట్టారు.
సీతాపతి పనిమీద ఏలూరు వెళ్ళాడు. శాంతమ్మ రెండు మెతుకులు నోట్లో వేసుకుందో లేదో నిద్ర ముంచుకొచ్చింది. వారంరోజుల బడలిక ఒక్కసారిగా బయటపడ్డది.
"అమ్మాయ్! కాసేపు పడుకుంటాను. నువ్వు అన్నంతిని రాజాకు సగ్గుబియ్యం జావ పెట్టి ఇవ్వు" అంటూ శాంతమ్మ మంచానికి అడ్డంపడింది. అరుంధతి భోజనం చేసింది. పిల్లను నిద్రపుచ్చింది. రాజాకోసం జావకాచి గాజుగ్లాసులో పోసుకుని అతని దగ్గరకు వచ్చింది. రాజారావు కళ్ళుమూసుకుని పడుకున్నాడు. బక్కగా, పేలవంగా, నీరసంగా కనిపిస్తున్న రాజారావును ఒక్కక్షణం కన్నార్పకుండా చూసింది. అంతలో ఆమెకు ఏదో అనుమానం వచ్చింది.