మళ్ళీ జ్వరం రాలేదుగదా? చేతిలో ఉన్న గ్లాసు స్టూలుమీద ఉంచింది. అరచేతిని నుదురుమీద చిన్నగా వేసింది. రాజారావు నుదురు చల్లగా చేతికి తగిలింది. చెమటపట్టినట్లుగా కూడా ఉంది. చెయ్యి తీసుకోబోయేంతలో రాజారావు చెయ్యి ఆమె చేతిమీద వుంది. అతని చెయ్యి కూడా చల్లగానే ఉంది. ఆమె చెయ్యి రాజారావు నుడురుకు, అతని అరచేతికీ మధ్యన ఉండిపోయింది. ఆమె తన చేతిని తీసుకోవటానికి ప్రయత్నించలేదు. ఏదో అనూన్యమైన అనుభూతితో ఆమె హృదయం నిండిపోయింది. ఇంతకాలం తనలో చెలరేగిన అశాంతికి కారణం తెలిసినట్లనిపించింది. ఈ క్షణంకోసమే తను జన్మించినట్టూ, ఈ క్షణమే తన జీవితానికి అర్ధం ఏర్పడినట్లూ అనిపించింది.
"ఇలా....ఇలా....చచ్చిపోవాలనే నా కోరిక" అన్నాడు రాజారావు కలలో కలవరిస్తున్నట్లు.
అరుంధతి గబుక్కున చెయ్యి లాగేసుకుంది. మధురస్వప్నం చెదిరిపోయింది. రాజారావు కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
"ఎలా వుంది? జ్వరం తగ్గిందికదూ?" తన కంఠం తనకే ఏదోగా వినిపించింది అరుంధతికి. కొంచెం వణుకుకూడా ఉంది ఆ కంఠంలో.
రాజారావు కళ్ళను గట్టిగా మూసుకున్నాడు. కళ్ళల్లో తిరిగిన నీటిని బయట పడకుండా ఉంచే ప్రయత్నంలోనే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కాని రెండు కళ్ళ కొనలనుంచీ కన్నీరు చెంపలమీదగా కారి కంఠంమీద నిలిచింది. అరుంధతి అయోమయంగా చూసింది. రాజారావు ఏడుస్తున్నాడా? తుపాకిగుండ్లకు ఎదురు నిలబడే రాజారావేనా ఏడుస్తూంది? ఎదురుగా మృత్యువు కనిపిస్తే నిర్లక్ష్యంగా నవ్వేయగల ధీరగంభీరుడేనా దుఃఖిస్తున్నాడు? తను చూస్తున్నది నిజమేనా? అవును నిజమే. ఎంత బలవంతంగా ఆపుకోవాలన్నా ఆ కన్నీరు ప్రవహిస్తూనే వుంది ఎందుకు? తనవల్లనేనా? కాదు - బాధగా ఉండి ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేనప్పుడే ఆత్మీయులు దగ్గరలేని కొరత బాధిస్తుంది. భార్యాపిల్లల్ని తలచుకొని బాధపడుతున్నాడేమో? ఆమె మనస్సులో లోతుగా ఏదో గుచ్చుకున్నట్లనిపించింది. కాదు - అతని దుఃఖానికి కారణం అది కాదు. అది కానే కాదు.
"ఎందుకా కన్నీళ్ళు, బాధగా ఉందా?" అరుంధతికి ఆ కన్నీరు తన కొంగుతో తుడవాలనిపించింది. అతని తలను తన గుండెలో దాచుకోవాలనిపించింది. కాని ఏదీ చెయ్యలేని అసహాయత.
కళ్ళు తుడుచుకున్నాడు. కనురెప్పల్ని అతి ప్రయత్నంమీద తెరిచాడు. పెదవులు కదిలాయి. చిరునవ్వు విరిసింది. దుఃఖంలో నవ్వు! ఎంత లోతుగా, భావగర్భితంగా వుంది ఆ నవ్వు!
"ఈ జావ తాగండి! మరీ నీరసంగా ఉన్నారు" అంటూ జావను అందించింది అరుంధతి.
రాజారావు మౌనంగా గ్లాసు అందుకొని మందు తాగినట్లు గబగబా తాగేశాడు. రెండోగ్లాసుతో మంచినీళ్ళు ఇచ్చింది. టవల్ ఇచ్చి, గ్లాసు లోపల పెట్టటానికి వెళ్ళింది.
అతను ఎందుకో చాలా బాధపడుతున్నాడు. మాటల్లో పెట్టి కాసేపు మరిపించాలి అనుకుంటూ లోపలకు వచ్చింది అరుంధతి. మంచం పక్క వున్న స్టూలుమీద కూచుంది.
"అవునూ, ఆ రోజు మీరు మామిడి తోటలో ఎందుకున్నారు?"
రాజారావు మాట్లాడలేదు. ఆలోచనలో పడ్డాడు.
"పడుకోండి నీరసంగా వున్నారు. చెప్పరూ? ఆ రోజు మీరక్కడికెలా వచ్చారు? నా బిడ్డను మీ ప్రాణాలొడ్డి తెలియకుండానే రక్షించటం తమాషాగా లేదూ?" అంది అరుంధతి.
రాజారావు తేలిగ్గా నవ్వేశాడు.
"పోనియ్ లెండి! అంత చెప్పటానికి ఇష్టంలేకపోతే బలవంతం ఏమీలేదు" అంది చిరుకోపంగా అరుంధతి.
"కోపంలో నువ్వు ఇంకా అందంగా వుంటావు" అన్నాడు రాజా కన్నార్పకుండా చూస్తూ.
అరుంధతికి ఇబ్బందిగా ఉంది. అక్కడనుంచి పారిపోవాలని ఉంది. చిత్రం! పోవాలనీ వుందీ! ఉండాలనీ వుందీ! విరుద్ద భావాల సమ్మేళనం తమాషా అనుభూతి.
"నేను అడిగింది చెప్పకపోతే వెళ్ళిపోతాను. మీ చొక్కామీద రక్తపు మరకలు ఎందుకయ్యాయి?" అంటూ అరుంధతి రాజా ముఖంలోకి చూసింది. సూటిగా, క్షుణ్ణంగా చొచ్చుకొనిపోయే రాజారావు చూపుల్ని ఎదుర్కోలేక పక్కచూపులు చూడసాగింది.
"చెబుతాను విను; మేము ఉన్న స్థావరాలమీద పోలీసులదాడి జరిగింది. సాయుధ పోరాటమే జరిగింది. వాళ్ళుకూడా కొందరు చనిపోయారు. నా పక్కనేవున్న కామ్రేడ్ గుండెల్లో గుండు తగిలింది. నా కళ్ళముందే ఒరిగిపోతున్నాడు. నేను చేతుల్లోకి తీసుకున్నాను. అప్పటికి పోలీసులు పారిపోయారు. మా వాళ్ళు అంతా మా చుట్టూ చేరారు.
"మీరు వెళ్ళిపొండి. మళ్ళీ ఎక్కువ మందితో రావచ్చు" అన్నాడు గుండు దెబ్బతిన్న సోదరుడు నీరసంగా.
"ఇలా వదిలి వెళ్ళం! నిన్ను కూడా తీసుకెళతాం!" అన్నాడు నేను.
"నన్ను మోసుకెళ్ళే ప్రయత్నంలో మీరు చిక్కటం నాకు ఇష్టంలేదు. నేను ఎలాగూ బతకను. మీరు త్వరగా తప్పుకోండి." అన్నాడు అతను.
"కొందరు వదిలేసి వెడదాం అన్నారు. కొందరు వీల్లేదు అన్నారు. చివరకు అతణ్ణి మోసుకెళ్ళటానికే నిర్ణయించాం" కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు రాజారావు. అరుంధతికి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రంగా వుంది.
"ఆ తరువాత?"
"అతనూ, నేనూ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నాకంటే కనీసం రెండు సంవత్సరాలయినా చిన్నవాడు. వివాహంకూడా చేసుకోలేదు. కత్తిలా కోసుకొనిపోయే స్వభావం అతనిది. చాలా ఉద్రేకం, ఉత్సాహం ఉన్నవాడు. చివరకు నా భుజాలమీదే ప్రాణం విడిచాడు. దూరంగా ఏదో అలికిడయ్యింది. మా నాయకుడు ఆజ్ఞాపించాడు అందర్నీ తప్పుకోవలసిందిగా. ప్రాణ స్నేహితుణ్ణి, తోటి కామ్రేడ్ ని అలా-మృతదేహం కావచ్చు- దిక్కులేనట్లు వదిలేసి పారిపోయాము. తప్పదుమరి. మా ఆశయసిద్ధికోసం మేము మా సున్నిత భావాల్ని చంపుకోక తప్పదు. ఆ కుర్రవాడు లక్షాధికారి. ఏకైక పుత్రుడు. అతనికి తండ్రి చేస్తున్న దురాగతాలు నచ్చలేదు. రాజకుమారుడిలా బతకవలసినవాడు, ఇలా దిక్కులేని చావు చావటానికి సిద్ధపడ్డాడు. ఎందుకని? అతను మనిషి! మనుషులందరూ సుఖించాలని కలలు కన్నాడు. ఆ కలలు వాస్తవంలోనికి మార్చే ప్రయత్నంలో మృతవీరుడయ్యాడు!" రాజారావు ఉద్రేకంగ చెప్పుకుపోతున్నాడు- అరుంధతి మంత్రముగ్ధలా వింటూ కూచుంది.
"బహుశా ఆ స్నేహితుణ్ణి తలుచుకొనే ఆయన ఏడ్చి ఉంటారు" అనుకుంది.
"ఇందాక ఏడ్చింది మీ కామ్రేడ్ ను తలచుకొనేనా?"
రాజారావు ఓ క్షణం మౌనంగా ఉండిపోయాడు. "మృతవీరుల్ని తలచుకొన్నప్పుడు దుఃఖం రాదు. వాళ్ళలా నేనుకూడా ఎప్పుడు దేశంకోసం త్యాగం చేసే అవకాశం పొందగలనా? అని ఆలోచిస్తాను" అన్నాడు.
అరుంధతి చిత్రంగా చూసింది. దేశంకోసం ప్రాణాలర్పించటానికి ఆరాటమా? అలాంటి సాహసి కన్నీరు కార్చడమేమిటి?
"నిజం చెప్పండి. ఇందాక ఎందుకా కన్నీరు?"
విషాదంగా నవ్వాడు. "కొన్ని విషయాలు చెప్పేవి ఉంటాయి. కొన్ని అర్ధం చేసుకోనేవి ఉంటాయి. అర్ధం చేసుకోవలసిన విషయాలు చెబితే వాటి విలువ పోతుంది" అన్నాడు రాజారావు.
అరుంధతికి నిజంగానే అర్ధం కాలేదు. వెర్రిమొఖం వేసింది. బహుశా వంట్లో బాధగా ఉందేమో అనుకుంది.
"బాధగా ఉందా?"
"అవును." అతని కంఠం అదోలా పలికింది.
"ఎక్కడ? తలనొప్పా?" ఆదుర్దాగా ప్రశ్నించింది.
"కాదు - గుండెల్లో!" ఆ మాట గుండెల్లోనుంచే వచ్చింది.
"డాక్టర్ కు కబురుచేస్తాను." తత్తరపాటుతో లేచింది. రాజారావు చెయ్యి పట్టుకున్నాడు.
"అక్కరలేదు. కూర్చో!" అన్నాడు.
అరుంధతి చేతికేసి చూసుకుంది. రాజారావు గబుక్కున తప్పుచేసినవాడిగా ఆమె చేతిని వొదిలేశాడు.
"గుండెనొప్పి అంటూ డాక్టర్ని పిలవొద్దంటారేం?"
"డాక్టరు వచ్చి ఏం చేస్తాడు?"
"మందిస్తాడు. ఆ మాయదారి ఎద్దు కుమ్మినందువల్లనేగా గుండెలు దెబ్బతిన్నాయి" బాధగా అంది అరుంధతి.
"ఇది దానివల్ల వచ్చిన నొప్పికాదు. అలాంటి నొప్పుల్ని ఎన్నింటి నయినా లెక్కచేసే ఘటంకాదు ఇది. నా హృదయపు అట్టడుగు పొరల్లో ఎక్కడో లోతుగా నాకు తెలియకుండానే గాయం తగిలింది. దాని బాధ భరించే శక్తి నాకు లేకుండా వుంది. అలాంటి శక్తికోసమే నా ప్రాణాలన్నింటినీ కూడదీసుకుంటూ నా శరీరంలోని ప్రతి జీవాణువుతోను ప్రతి నిముషం పోరాడుతున్నాను. నాతో నేనే పోరాడుతున్నాను" అన్నాడు రాజారావు ఎక్కడో దేనినో దూరంగా చూస్తున్నట్టు చూస్తూ.
అరుంధతికి వెంటనే అర్ధం కాలేదు. ఆ అందమయిన చిరుసోగకళ్ళను వెడల్పు చేస్తూ నిలబడింది. లీలగా అర్ధం అయినట్లనిపించింది. అనిపించటం కాదు, అర్ధం అయింది. కోటి వీణలు ఒక్కసారి ఆమె చుట్టూ స్పందించాయి. ఆ మధుర ధ్వనిలో తను కలిసి కరిగిపోయింది. ఒక్కసారి అతని గుండెలమీదకు వాలిపోయి, ఇది నిజమేనా? అబద్దమైనా నిజమేనని చెప్పండి." అంటూ అడగాలనిపించింది.
కాని, అక్కడ నిల్చోలేకపోయింది. ఒక్కసారిగా వెనుదిరిగి గబగబా పరుగెత్తినట్లే వెళ్ళబోయింది.
"అరూ!" అది రాజారావు పిలుపు కాదు. అది మనిషి గుండెల్ని చీల్చుకుంటూ వచ్చిన పిలుపు. ఆ పిలుపును కాదని ముందుకు అడుగువేసే శక్తి అరుంధతికే కాదు, ఏ స్త్రీకీ వుండదేమో! గడపలోనే ఆగిపోయి నిలబడి పోయింది ఓ క్షణం. అరూ! అలా రాజారావు తనను పిల్చాడా? అరుంధతి, ఎవరో చెయ్యిపట్టుకొని నడిపించుకొస్తున్నట్లు వచ్చి రాజారావు మంచం పక్కనే నిలబడింది తల వంచుకొని.
"క్శమిమ్చు౧ నిన్ను అలా పిలిచే అధికారం నాకు లేదు" అప్రయత్నంగానే అనేశాడు.
అరుంధతి మాట్లాడలేదు. ఆమె ముఖంలో సిగ్గూ, భయం, ఆనందం, విషాదం పెనవేసుకుంటున్నాయి.
మళ్ళీ రాజారావే అడిగాడు మార్దవంగా- "చోదు౧ నీకు భగవంతుడి మీద నమ్మకం వుందా? నాకు లేదు. అందుకే అడుగుతున్నాను."
"వుంది."
"నీ భగవంతుణ్ణి ఒక కోరిక కోరుకో!"
"ఏమిటది? కళ్ళతోనే భయంగా ప్రశ్నించింది.
"నిన్ను నానుంచి రక్షించమనీ; అమ్మకూ, సీతాపతికీ ద్రోహం చెయ్యకుండా నిగ్రహించే శక్తిని నాకు ప్రసాదించమనీ!" అన్నాడు రాజారావు జీరపోయిన కంఠంతో.
అరుంధతి ఆ గదినుంచి పరుగెత్తుకెళ్ళింది, మంచంమీద పడిపోయింది. "భగవాన్! నన్ను క్షమించు. ఆ ఆదర్శమూర్తిని అవమానించకు." ముఖాన్ని దిండులో దాచుకొని, కుమిలి కుమిలి ఏడ్చింది. అలా ఎంతసేపు ఏడ్చిందో? అత్తగారు వచ్చి పిలిచేవరకూ తెలియనే తెలియదు. గబ గబా ముఖం తుడుచుకొని, అత్తగార్ని తప్పించుకొని వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది అరుంధతి. కళ్ళూ ముఖం బాగా వాచిపోయి వున్నాయి.
"అలా వున్నావేం?" అత్తగారి మాటలు చురుగ్గానే తగిలాయి అరుంధతికి. మాధవి లేచి ఏడుస్తుంటే జవాబివ్వకుండానే వెళ్ళిపోయింది. శాంతమ్మ కోడలికేసి సాలోచనగా చూసింది.
రాజారావు కప్పుకేసి కన్నార్పకుండా చూస్తూ పడుకొని వున్నాడు.
"హార్లిక్స్ తీసుకోండి" అతి మృదువుగా అంది అరుంధతి.
గబుక్కున లేచి కూచున్నాడు రాజారావు. ఆమె చేతిలోని హార్లిక్స్ గ్లాసును అందుకున్నాడు. ఒక్క గుక్కలో తాగి ఖాళీగ్లాసు అందించాడు. అలా గ్లాసు తీసుకుంటున్నప్పుడూ, ఇస్తున్నప్పుడు కూడా అరుంధతి చెయ్యి తగలకుండా ప్రత్యేక జాగ్రత్త తీసుకున్నాడనిపించింది ఆమెకు. ఆమెవైపు చూడనుకూడాలేదు. అరుంధతి మనస్సుకు ఏదో లోతుగా గుచ్చుకున్నట్లనిపించింది. బరువుగా అడుగులు వేస్తూ గది బయటకు వెళుతున్న అరుంధతి పాదాలనుమాత్రం చూస్తూ వుండిపోయాడు రాజారావు.
13
రాజారావు లేచి తిరుగుతున్నాడు. కాని, ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అప్పుడప్పుడు గుండెనొప్పి వస్తూనేవుంది. రెండు మూడుసార్లు రక్తం వాంతులు కూడా చేసుకున్నాడు. గుండెలు బాగా దెబ్బతిన్నాయనీ, చాలాకాలంపాటు జాగ్రత్తగా ఎక్కువ శ్రమ పడకుండా వుండాలని చెప్పాడు డాక్టర్. అతని గుండెలు గాజుబుడ్డిలా వున్నాయనీ, ఏ కాస్త ఒత్తిడికయినా పగిలిపోవచ్చుననీ, అందుకే విశ్రాంతి ముఖ్యమని చెప్పాడు. డాక్టర్ చెప్పిన మాటల్ని రాజారావు అంతగా లక్ష్యం చేసినట్లనిపించలేదు. అరుంధతి గుండెలు అవిసిపోయినట్లు అనిపించింది. రాజారావు వచ్చి దాదాపు నెలరోజులవుతుంది.
ఒకనాటి సాయంకాలం అందరూ కూచుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. మాధవి రాజారావు గుండెలమీదకు పాకుతూవుంది.
"అవునురా! ఆ రోజు నువ్వు మామిడితోటలో ఏం చేస్తున్నావు?" ప్రశ్నించాడు సీతాపతి.
అవును. తను ఆ విషయాన్ని అడిగి తెలుసుకోనేలేదు అనుకుంది శాంతమ్మ.
రాజారావు వాళ్ళకూ, పోలీసులకూ జరిగిన పోరాటాన్ని గురించీ, తనతోటి కామ్రేడ్ ఎలా పోలీసు తుపాకికి బలి అయిందీ, అతను తన భుజాలమీదనే ఎలా అసువులు విడిచిందీ చెప్పాడు.
"ఆ తర్వాత మేమంతా ఎక్కడెక్కడికి వెళ్ళాలో నిర్ణయించబడింది. నన్ను ఈ ఊరు పక్కనేవున్న ఒక వూళ్ళో వుండవలసిందిగా శాసించాడు మా నాయకుడు. అతడిని నేనెరగను. కాని, చాలాకాలంగా ఇలా మా పార్టీకి సాయం చేస్తున్నాడట. చేలకు అడ్డంపడి నడిచాను. తెల్లవారి కూడా ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా చెట్లమాటుగా వెళుతున్నాను. ఈ వూరు కాలవగట్టునుంచే నేను వెళ్ళవలసిన వూరికి కాలిబాట వుంది."
"అదేవూరు?" అన్నాడు సీతాపతి కుతూహలంగా.
"చెప్పకూడదు. పార్టీ రహస్యం!"
"యథాలాపంగా అడిగాలే. ఆఁ! ఆ తర్వాత-"