Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 11

    'ఇప్పుడే దాని పెళ్ళికేం తొందరండీ. వాడు డాక్టరయితే బోలెడంత సంపాదిస్తాడు. చిన్నవాళ్ళ చదువూ, పిల్ల పెళ్ళి వాడే చూసుకుంటాడు.'
    'వాడు డాక్టరు ఎప్పటికి అవుతాడు? మరి రామం, చంద్రం కూడా డాక్టరే చదువుతామంటే? అప్పటికి నీ పెద్దకొడుకు సంపాదన పరుడు కాలేడుగా?'
    సుందరమ్మ ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు.
    ఎం.ఎస్.సి. చదివితే లెక్చరర్ గా వెళ్ళొచ్చు. వాడు డిస్టింక్షన్ లో పాసవుతాడని నాకు నమ్మకం వుంది'
    'వాడు చాలా తెలివైనవాడు. శ్రద్ధగా చదువుతాడు. మంచి మార్కులతో పాసయ్యాడు. డాక్టరు సీటు తేలిగ్గా వస్తుంది. రామం, చంద్రం, సంగతి తర్వాత చూసుకోవచ్చు. వాళ్ళకు బాగా మార్కులు వస్తే అప్పుడే ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం రఘును... జంకుతూ ఆగిపోయింది.
    'డాక్టరీ చదవాల్సిందేనంటావ్?'
    'వాడికి డాక్టరు కావాలనే వుంది. మీరు ఒక ఐదేళ్ళు కష్టపడండి. ఆ తర్వాత ఈ సంసార భారాన్ని వాడి భుజాల మీద వేసి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు'.
    'ఎంత పిచ్చిదానివి సుందరీ' అనాలనుకున్నాడు. 'అలాంటి పిచ్చి ఆశలు నాకేం లేవు. కన్నాం కనుక వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనది' అన్నాడు.
    'అంటేవాడ్ని డాక్టరు చదివించనంటారా?'
    'చూద్దాంలే!'
    'చూద్దాంలే కాదు. బిడ్డ చాలా ఆశపడ్తున్నాడు.'
    'సరేలే!'
    సుందరమ్మ ముఖం సంతోషంతో చాటంత అయింది.
    'మీకు మాత్రం కొడుకు డాక్టరు కావాలని వుండదా ఏం? భర్త ముఖంలోకి మురిపెంగా చూస్తూ అంది.
    కామేశ్వరరావు పళ్ళెంలో చేయి కడుక్కుని లేచాడు.
    'అయ్యో అదేమిటి? మారు వడ్డించుకుని మజ్జిగ పోసుకోనేలేదు.'
    'వద్దు కడుపు నిండిపోయింది.' అంటూ వంటింట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు.
                                *   *   *
    కామేశ్వరరావు స్కూలునుంచి అలసటగా వచ్చి, వసారాలో వున్న ఈజీ చైర్ లో వాలిపోయాడు. సుందరమ్మ దోసకాయ చెంబుతో మంచినీళ్ళు అందించింది. చెంబెడు నీళ్ళు గటగట తాగి ఖాళీ చెంబు అందించాడు.
    సుందరమ్మ వేడి వేడి కాఫీ కప్పు అందిస్తూ అంది 'ఇవ్వాళ మరీ అట్టా దివాళా తీసినట్టున్నారేంటి? ట్యూషన్స్ తగ్గించుకోమంటే తగ్గించుకోరు'
    'తగ్గించుకుంటే ఎలా? అది సరే రెండోవాడు వచ్చాడా?'
    'ఆ వచ్చాడు. ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడు'.
    'పరీక్షలు ఎలా రాశాడట'
    'బాగానే రాశానన్నాడు. మంచి మార్కులు వస్తాయంటున్నాడు. ఇంజనీరింగులో సీటు కూడా వస్తుందంటున్నాడు.
    'ఇంజనీరింగా?'
    'అవునండీ! వాడికి ఇంజనీరు కావాలని వుంది'
    'ఊహూ! ఉంటుంది. ఎందుకుండదూ? సరేలే! నీళ్ళు తోడు స్నానం చెయ్యాలి. ఆ... అమ్మాయి ఏది?'
    'అలిగి పడుకుంది. పొద్దుటి నుంచి అన్నం కూడా తినలేదు.
    'అన్నం తినలేదా? ఎవరేమన్నారు? నువ్వే ఏదో అని వుంటావు'
    'భలేవారే నేనేమంటాను?'
    'మరి ఎందుకు కలిగింది?'
    'మామిడి పిందెల నెక్లెస్ చేయించమని రెండు రోజులుగా ఒకటే ఏడుపు. ఇవ్వాళ అన్నం తినకుండా మొండికేసింది.'
    కామేశ్వరరావు భార్యమాటలు అర్ధం కానట్టుగా అయోమయంగా చూశాడు. మరుక్షణం అతని ముఖం గంభీరంగా మారింది.
    'మామిడి పిందెల నెక్లెస్ కావాలంటుందా? మరి నువ్వేమన్నావ్?'
    'ఇప్పుడు డబ్బులేదు. తర్వాత చేయిస్తాం అన్నా'
    'తర్వాత. అంటే ఎప్పుడు చేయిస్తావ్?'
    'ఏదో చెప్పాలిగా?'
    'నువ్వే పిల్లల్ని చెడగొడ్తున్నావ్. వాళ్ళు చిన్నవాళ్ళు కష్టం సుఖం తెలియనివాళ్ళు. ఆశలే తప్ప ఆలోచనలు లేనివాళ్ళు. నువ్వు పెద్దదానివి. తల్లివి. మన పరిస్థితుల్ని వాళ్ళకు అర్ధం అయేలా చెప్పాలి. వాళ్ళు కోరిన కోరికలా తీర్చడానికి మనం లక్షాధికారులమా? ఆఫ్టరాల్ ఒక బడిపంతుల్ని. పెద్దవాడి చదువే నన్ను ఊపిరి పీల్చుకో నివ్వడంలేదు' విసుక్కున్నాడు.
    'మీ వరస మరీ బావుంది. ఆడపిల్లకు నగలు పెట్టుకోవాలని వుండదా ఏం? మొన్న పేరంటానికి వెళ్ళింది. దాని ఈడు వాళ్ళంతా వంటినిండా నగలతో వచ్చారట. అది బోసి మెడతో వెళ్ళింది. దానికి వాళ్ళ మధ్య కూర్చోవాలంటే సిగ్గేసిందట. ఇంటికొచ్చి ఎంత గుణిసిందో?'
    'నువ్వూ వెళ్ళావుగా ఆ పేరంటానికి!'
    'వెళ్ళాను'
    'అసలు సంగతి చెప్పు. తోటి పేరంటాళ్ళ మధ్యన నువ్వే సిగ్గుపడి వుంటావు. మీ చూపులు ఎప్పుడూ మీకంటే పైవాళ్ళ మీదే వుంటాయి. కిందకు చూడరు. కనీసం నీకు మెళ్ళో బంగారు మంగళసూత్రం తాడైనా వుంది. నగలు దిగేసుకున్న మెడల్నే ఎందుకు చూస్తావు? నూలుతాడు వున్న మెడలకేసి ఎందుకు చూడవు?'
    'అయ్యో! అయ్యో! నన్ను...నన్నేనా ఆ మాటలు అంటున్నారు? నేను ఏనాడైనా మిమ్మల్ని ఇది కావాలి అది కావాలి అని అడిగానా? నగలు అడిగానా? పట్టు చీరలు కావాలని అడిగానా?' సుందరమ్మ గొంతు బొంగురు పోయింది.
    'అదికాదు సుందరీ! నిండా పదేళ్ళు లేని ఆడపిల్లకు నగల మీద వ్యామోహం ఏమిటి? అది మన పెంపులో లోపంగా నీకు అన్పించడం లేదా? దానికి చదువు మీద బొత్తిగా శ్రద్ధలేదు. నువ్వు మరీ ముద్దు చేసి చెడగొడ్తున్నావని నా ఉద్దేశం'
    'బాగుంది వరుస! దానికి చదువు మీద శ్రద్ధ లేకపోతే నన్నేం చేయమంటారు?
    ఆడపిల్ల! చదివినంత వరకు చదువుతుంది. అదిప్పుడు పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా? ఒకయ్య చేతిలో పెట్టిందాకానే మన బాధ్యత'
    'ఆడపిల్లకు కూడా చదువు అవసరమే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి వాళ్ళకు ఇవ్వాలి. రేపు నీ కూతుర్ని కట్నం చాల్లేదని అల్లుడు వదిలేస్తాడనుకో'...
    'అయ్యో! అవేం మాటలండీ అశుభం మాటలు! ఇవ్వాళ మీకు మనసు బాగున్నట్టులేదు. లేవండి. నీళ్ళు తోడతాను' అంటూ సుందరమ్మ లోపలకు వెళ్ళింది.
    పెద్దకొడుకు రఘు విశాఖపట్నంలో ఎంబిబియస్ చదువుతున్నాడు. రెండోవాడు రామం గుంటూరులో, ఇంటర్ రాసి ఇంటికి వచ్చాడు శెలవులకు. మూడోవాడు చంద్రం ఊళ్ళోనే చదివి పది రాశాడు. నాలుగోవాడు సత్యం. ఎనిమిది చదువుతున్నాడు. చిన్నవాళ్ళిద్దరూ ఆరు, నాలుగు క్లాసుల్లో వున్నారు.
    సత్యం స్కూలుకు సరిగ్గా వెళ్ళడు. ఇంటిలో పుస్తకం చేత పట్టుకోడు. తండ్రి ఒకటి రెండుసార్లు కొట్టి వదిలేశాడు.
    'అమ్మాయ్! సుందరమ్మా!'
    'ఎవరూ? రామనాథం అన్నయ్యా! రండి! రండి!'

 Previous Page Next Page