'కామేశం లేడా?'
'ఉన్నారు. స్నానం చేస్తున్నారు. కూర్చోండి. వదినగారు ఏం చేస్తున్నారు. చూసి చాలా రోజులైంది'
'ఆమెకు తీరికెక్కడ?
పొద్దుట పూజలూ పురస్కారాలు. ఈ మధ్య ఎవరో స్వాములవారు వచ్చి రామ మందిరంలో భగవద్గీత మీద ఉపన్యాసాలు ఇస్తున్నాడుగా? అక్కడికి వెళ్తున్నది.'
'ఏం రామనాథం. ఈ మధ్య కన్పించడం లేదు?' స్నానం చేసి బయటికి వచ్చిన కామేశ్వరరావు పలుకరించాడు.
అంతలో రమేశ్, సునంద చాక్లెట్ చప్పరిస్తూ ఎగురుకుంటూ వచ్చారు.
'ఎక్కడివిరా అవి?' సుందరమ్మ అడిగింది.
'రామనాథం మావయ్య కొనిచ్చాడు' అంది సునంద చప్పరిస్తూ.
'ఎందుకన్నయ్యా ఇవన్నీ?'
'అదేంటి చెల్లమ్మా అట్టా అంటావ్? పిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసుగా? మీ వదినకు ఇక సరేసరి. అందుకేనేమో ఆ భగవంతుడు నాకు సంతానాన్ని ప్రసాదించలేదు'
'అట్లా ఎందుకనుకోవాలి? ఇప్పుడు మీ ఇద్దరికీ ఏమంత వయసు మించి పోయిందని?'
'పెళ్ళయి పద్దెనిమిదేళ్ళయింది. ఇంకా ఏం పుడతారు?'
'డాక్టర్ను కన్సల్టు చేసి వుండాల్సింది' అన్నాడు కామేశ్వరరావు.
'అవునన్నాయ్యా ఆ పని చేసి వుండాల్సింపది'
'మీ వదిన చాదస్తం నీకు తెలుసుగా? పూజలూ పునస్కారాలూ చేస్తుంది. తీర్ధ యాత్రలు చేసింది. ముడుపులు కట్టింది. డాక్టరు దగ్గరకు మాత్రం వచ్చేది కాదు. భగవంతుడు కరుణించాలి కాని డాక్టరేం చేస్తాడు అంటుంది. ఇంకా ఇప్పుడు ఈ వయసులో డాక్టర్లు ఎందుకమ్మా?'
సుందరమ్మ ఇచ్చిన వేడి కాఫీ తాగి కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు రామనాథం.
'పాపం! అన్నయ్యకు పిల్లలు లేరనే బాధ తప్ప ఇంకేబాధ లేదు' సుందరమ్మ అంది వెళ్ళిపోతున్న రామనాథాన్ని చూస్తూ జాలిగా.
'నాకే అంత ఆస్తి వుండి పిల్లలు లేకపోతే ఏం చేసేవాణ్ణో తెలుసా?'
'ఏం చేసేవారేంటి?'
'నువ్వు చెప్పు ఏం చేసేవాణ్ణో?'
'నన్ను వదిలి మరో పెళ్ళి చేసుకునేవారు'
'అప్పుడూ పుట్టకపోతే?'
'మరోదాన్ని...'
'అయినా పుట్టకపోతే'
'అయితే ఏం చేసేవారో చెప్పండి'
'ఒక అనాథ బిడ్డను తెచ్చి పెంచుకునేవాణ్ణి'
'ఎవరో కన్నబిడ్డనా?'
'ఎవరు కన్నారనే దానికంటే ఎవరు పెంచారన్నదే ముఖ్యం'
'నిజమేననుకోండి. అయినా తల్లెవరో, చ తండ్రెవరో, ఏ కులమో...'
'కులమా? పసి బిడ్డలకు కులం ఏమిటి? ఎవరి దగ్గర పెరిగితే అదే కులం. అయినా కులాలు ఏర్పాటు చేసుకుంది మనమేగా? మానవుడు పుట్టినపుడు కులాలు లేవుగా?'
'అది కాదండి బుద్ధులు...'
'బుద్ధులా? మీ అన్నయ్య కొడుకు అలా తయారయ్యాడేం? ఓకే తండ్రికి పుట్టిన ఇద్దరు ఒకే బుద్ధి కలిగి వుండరేం?'
'ఏమో" ఆలోచనలో పడిపోయింది సుందరమ్మ.
* * *
'సత్యం బొత్తిగా పాడయిపోతున్నాడండీ. వాడ్ని కాస్త మందలించండి' భోజనం చేసి ఈజీ చైర్లో కూర్చున్న భర్తకు వక్కపొడి అందిస్తూ అంది సుందరమ్మ.
'ఏం చేశాడు?'
'ఎప్పుడూ అలగా వాళ్ళతో తిరగడమే. ఆ గుడిసెల్లో పడి వుంటున్నాడండీ. వాడి స్నేహితులంతా వాళ్ళే. బొత్తిగా పుస్తకం పట్టుకోడు'
కామేశ్వరరావు మౌనంగా వుండిపోయాడు.
'పది దాటిపోయింది. వాడింకా ఇంటికి రాలేదు. అర్దరాత్రిదాకా ఈ వయసులో తిరుగుళ్ళేమిటండీ. నిండా పద్నాలుగేళ్ళు లేవు.'
కామేశ్వరరావు ఉలకలేదు. పలకలేదు.
'అదుగో వచ్చినట్టున్నాడు. గట్టిగా మందలించండి'
సత్యం తల్లిదండ్రులను చూసీ చూడనట్టే లోపలకు వెళ్ళిపోతున్నాడు.
'సత్యం ఇలారా?' కామేశ్వరరావు మామూలుగానే పిలిచాడు.
సత్యం ఆగి, వెనక్కు తిరిగి, తండ్రి దగ్గరకొచ్చి నిలుచున్నాడు.
'ఎక్కడికెళ్ళావు?'
'బుర్రకథ చెబుతుంటేనూ?'
'బుర్రకథా? ఏం కథ?'
'భగవత్ సింగ్ కథ'
'ఓ! అలాగా? బాగా చెప్పారా?'
'చాలా బాగుంది నాన్నా! రేపు కూడా వుంటుంది. నువ్వు కూడా రాకూడదు?'
'ఎక్కడ?'
సత్యం వెంటనే సమాధానం ఇవ్వలేదు.
'ఇంకెక్కడ ఆ మాదిగ పల్లెలోనే అయి వుంటుంది' అన్నది సుందరమ్మ.
'అ...అవును!' జంకుతూ అన్నాడు.
'నువ్వు తప్పు చేశావు. అవునా?' కామేశ్వరరావు కుర్చీ ముందుకు జరిగి నిటారుగా కూర్చున్నాడు.
'నేనేం తప్పు చెయ్యలేదు'.
'మరి మాదిగ పల్లెలో కథ విని వస్తున్నాని చెప్పడానికి జంగాల్సిన అవసరం ఏముంది? పైగా భగత్ సింగ్ కథ విని వస్తున్నావు.'
ఈయన చాదస్తం కూలా? మందలించమంటే వాడు తప్పేం చేయలేదన్నట్టు మాట్లాడతాడేం? సుందరమ్మ మనసులోనే విసుక్కుంది.
'అది సరే! చదువు నిర్లక్ష్యం చేస్తే ఎలా. నువ్వు రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నావ్. నిండా పధ్నాలుగేళ్ళు లేవు. ఇలా బలాదూర్ తిరగడం నేను సహించను. నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే నువ్వెక్కడ తిరిగినా నాకభ్యంతరం లేదు.
సత్యం పలక్కుండా నిలబడ్డాడు.
'సరే! వెళ్ళు! అన్నం తిని పడుకో!' అన్నాడు తండ్రి.
'అన్నం తిన్నాను'.
'ఎక్కడ్రా? ఆ మా...'
'సుందరీ!' కామేశ్వరరావు మందలిస్తున్నట్లుగా అన్నాడు.
'సరే! వెళ్ళి పడుకో' తండ్రి ఆమాట అనగానే లోపలకు వెళ్ళబోయాడు.
'ఒరేయ్! ముందా బట్టలు మార్చుకో!' దాదాపు అరిచినట్టే అంది సుందరమ్మ.
'ఎందుకూ?' తీవ్రంగా వుంది సత్యం కంఠం.
'ఎందుకేమిటి? ఎవరెవర్ని అంటుకొచ్చావో?'
'అంటుకుంటే ఏం? వాళ్ళు మాత్రం మనుషులుకారా? కుక్కల్ని కోళ్ళను అంటుకుంటాం. కాని బట్టలు మార్చం. మనుషుల్ని అంటుకుంటే బట్టలు మార్చాలా?'
వీడు చాలా ఎదిగిపోయాడు. మంచి ఆలోచనలే! వయసుకు మించిన ఆలోచనలు అనుకున్నాడు కామేశ్వరరావు కొడుకు కేసి ఆశ్చర్యంగా చూస్తూ.