Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 10

    "ఏమిటి? దొరికిందా?" ఆవిడ అపనమ్మకంగా అడిగింది.

    "దొరకొచ్చు ఆ అమ్మాయితోబాటు రూంలో వున్న మరో అమ్మాయి అడ్రసు దొరికింది" చెప్పాడు.

    ఆవిడ అతను నోటుచేసుకున్న అడ్రస్ వైపు చూసింది. "వంగర వీర వెంకట నాగలక్ష్మీ భ్రమరాంబ, 36-శ్రీనగర్, హైదరాబాదు-48"

    అతను అడ్రస్ జేబులో పెట్టుకుని, వేనుతిరుగుతూ "చాలా థ్యాంక్స్" అన్నాడు.

    "ఇప్పుడు హైదరాబాదు వెడుతున్నారా?" అడిగింది ఆవిడ కుతూహలంగా.

    "ఔను" అన్నట్టు తల వూపాడు.

    "ఆ అమ్మాయి కోసం ఎందుకంత కష్టపడుతున్నావు?"

    అతను తీవ్రంగా చూసి, అంతలోనే కొద్దిగా నవ్వుతూ "ఎందుకంటే....ఎందుకంటే....నా ప్రాణం చిరునామా ఆమె మనసు దగ్గిర దొరుకుతుంది కాబట్టి...శలవు"

    అతను వెళ్ళిన వైపే చూస్తూ "ఇంతటి ప్రేమను పొందిన ఆ 'వర్షిణి' ఎవరో చాలా అదృష్టవంతురాలు" అని నిట్టూర్చింది వార్డెన్.
   
                                                       *    *    *

    హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో...36వ నెంబరు ఇంటిలో- ముందుగదిలో తండ్రి తెలుగు పాఠం పిల్లలకి బోధిస్తూ వుంటే, పెరటి వసారాలో దిగులుగా కూర్చుని వుంది వంగర వీర వెంకట భ్రమరాంబ. ఆమె చేతిలో 'రుక్మిణీ కళ్యాణం', అందులో 'షారుక్ ఖాన్' ఫోటో వున్నాయి.

    ఆమె తదేకంగా చూస్తోంది. అందులో దాచిన 'షారూఖ్ ఖాన్' ఫోటోని! బయట్నుంచి తండ్రి కంఠం వినపడుతోంది.

    కళలు అరువది నాలుగు. అవి ఇతిహాసము, కావ్యాలంకారమూ, నాటకము, గాయకత్వమూ, కామశాస్త్రమూ..." తండ్రి చెప్తుంటే వింటున్న భ్రమరాంబ వుస్సూరని నిట్టూర్చింది. చిన్నప్పటినుండి తండ్రి ఆమెకి బోలెడు భాష నేర్పించి ప్రబందాలూ, కావ్యాలూ అన్నీ చెప్పేశాడు. ఆరోఏట పురుత్తువి చరిథమూ, ఎనిమిదోయేట శ్రీ హర్ష నైషధమూ, పదోయేట ప్రభావతీ ప్రద్యుమ్నమూ, పన్నెండో ఏట కళా పూర్ణోదయమూ వంటపట్టించుకుని, వయసుకి మించి (?) ఎదిగిపోయింది. పదమూడో యేట నుంచే వెచ్చటి ఆవిర్లూ, వేడి నిట్టూర్పులూ వస్తూ వున్నాయి. కానీ ఏ ప్రబంధ నాయకుడూ ఆమెని వెతుక్కుంటూ రాలేదు పాపం!

    "భ్రమరం-భ్రమరం" తండ్రి గొంతు గట్టిగా విన్పించింది..." "ఎవరో నీకోసం వేచియున్నారు."

    భ్రమరాంబ పైట మెడచుట్టూ కప్పుకుని, "వస్తున్నా" అంటూ లేచి వచ్చింది. అప్పటికే తండ్రి ఆ వచ్చినతనని "మీరు ఏ గ్రామ వాస్తవ్యులూ?" అని అడుగుతున్నాడు.

    ఈ "ఊరే" నిర్లక్ష్యంగా వుంది అతని కంఠం.

    భ్రమరాంబ అతన్ని చూడగానే "ఆ" అని అరచి "నువ్వూ....నువ్వూ" అంటూ అవాక్కయిపోయి నిలబడిపోయింది.

    "ఆ....నేనే" అతను స్థిరంగా చెప్పాడు.

    "ఇతన్ని నువ్వు ఎరుగుదువా?" తండ్రి అడిగాడు.

    "విక్రమ్ అని నా క్లాస్ మేట్ నాన్నా" అంది.

    "ఓహో. సహాధ్యాయా?" అన్నాడాయన.

    "భ్రమరాంబా, వర్ష ఎడ్రస్ నీకు తెలుసా?" విక్రమ్ ఆలస్యం పట్టలేనట్లు అడిగేశాడు.

    "విక్రమ్ అసలు నువ్వు బ్రతికే వున్నావా?"

    "భ్రమరాంబా నాకు త్వరగా వర్షిణి ఎడ్రస్ కావాలి" అతని గొంతులో తీక్షణత ఆమె గమనించి, "సరే" అంటూ లోపలికి వెళ్ళింది.

    భ్రమరాంబ తండ్రి ఆమె లోపలికి వెళ్ళగానే, విక్రమ్ ని ప్రశ్నలు వెయ్యడం ప్రారంభించాడు. "ఏ బడిలో చదివావూ? తెలుగు ఉపాధ్యాయుడు ఎవరు? రసిక జన మనోభిరామము ఎవరు వ్రాశారో తెలుసా?" వగైరా.

    విక్రమ్ నోట్లో సిగరెట్టు పెట్టుకొంటూ "కాసేపు మీరు నోర్మూసుకుంటారా?" సీరియస్ గా మొహమాటం లేకుండా అడిగాడు ఆయన్ని.

    "ఆ!" తెల్లబోయి చూశాడు ముసలాయన.

    భ్రమరాంబ బైటికి వచ్చి "ఎక్కడ పెట్టానో కనిపించలేదు విక్రమ్ నువ్వు ఓ పది నిముషాలు ఈ సందు చివర వున్న ఆంజనేయ స్వామీ గుడి దగ్గర వెయిట్ చెయ్యి, వెతికి తీసుకొస్తాను" అంది రహస్యం చెపుతున్నట్లు, గొంతు తగ్గించి.

    "త్వరగా రా!" చెప్పి విక్రమ్ వెళ్ళిపోయాడు.

    "ఏమిటే ఆ రహస్యాలు!" భ్రమరాంబ తండ్రి కోపంగా ఉరిమాడు.

    "చాలా పెద్ద చిక్కు వచ్చిపడింది నాన్నా!" అంది భ్రమరాంబ దిగులుగా.

    "ఏమిటది?"

    "ఉండు ఇప్పుడే వచ్చి చెబుతాను" ఓ కాగితం మీద ఎడ్రస్ రాస్తూ అన్నది.

    విక్రమ్ గుడి దగ్గర కాలు నిలువనట్లుగా తిరుగుతున్నాడు. ఆ పది నిమిషాల్లో భ్రమరాంబని లాగిపెట్టి తన్నాలని పదిసార్లకి పైగా అనిపించింది,

    ఆమెని దూరం నుంచి చూడగానే పరుగులాంటి నడకతో ఆమెని సమీపించి "తెచ్చావా?" అన్నాడు.
    "తెచ్చాను. కానీ, ముందు నీ సంగతి చెప్పు ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎట్లా వున్నావు?"

    "ముందు ఎడ్రస్ ఇస్తావా లేదా?" అతను చిరాగ్గా చూశాడు.

 Previous Page Next Page