Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 9

    అతని అలక పోగొట్టే మంత్రం ఆమెకి తెలుసు.

    పడకటింట్లో ఆమె ఒక ప్రబంధనాయిక! 'గురు'వెక్కడ వాడాలో 'లఘు'వెక్కడ వాడాలో ఆమెకి కరతలామలకం. 'అంత్యప్రాసలు'ఆమె పాద మంజీరాలు. ఉచ్చ్వాస నిశ్వాసాల్లో 'యతులు' సజీవాలు. 'ఛందస్సు'తో చమత్కారాలు ఆమె చెంగుమాటున దాగిన కలవింకాలు.

    ఆమె ఊరువులు 'ఉత్పలమాలలు'; బాహువులు 'చంపక మాలలు'; సిగ్గుచాటు 'సీసాలు', వయసు 'తేటగీతాలూ! తెరచాటు తొలగిన 'ద్విపదలూ!' డెందానికి హత్తుకుపోయే కందమూ', మధ్యలో మత్తుగా 'మత్తేభమూ', రెచ్చగొట్టి చిత్తుచేసే 'శార్ధూలమూ' అన్నీ ఆమే అవుతుంది. ఎన్ని ఆటలు తెలుసో ఆ 'ఆటవెలదికి'!
   
                                           *    *    *

    విక్రమ్!!

    ......ఆడపిల్లల హాస్టల్ కి ఆ అబ్బాయి వచ్చాడు. ఆమ్మాయిల అల్లరికి అంతుండదు. అందులోనూ మొగవారికి ఆ హాస్టల్ లో ప్రవేశం దొరకదు.

    "ఎవరికోసమో!" వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటున్నట్లు అన్నారు. విక్రమ్ కి వినిపిస్తూనే వున్నాయి.

    అతను అసహనంగా చూశాడు వాళ్ళవైపు. అతని చూపుల వాడికి వాళ్ళు బెదిరినట్లున్నారు. తలలు వంచుకొని వెళ్ళిపోతున్నారు.

    వాళ్ళల్లో ఒక అమ్మాయిని విక్రమ్ చిటికె వేసి పిలిచాడు "మీ వార్డెన్ ఎక్కడ?"

    ఆ అమ్మాయి వార్డెన్ 'రూం' వైపు వేలు పెట్టి చూపిస్తూ "అక్కడ" అంది.

    అతను "థాంక్స్" అని అటూ నడిచాడు.

    అతన్ని చూడగానే కాస్త బెదిరి కళ్ళు తిప్పుకున్నా. మళ్ళీ తలలు తిప్పి అతన్ని చూడకుండా వుండలేకపోతున్నారు. అతనిలో వున్న ఆకర్షణ అలాంటిది!

    "మే ఐ కమ్ ఇన్" గంభీరంగా వినిపించిన మగకంఠం విని అదిరిపడి తలెత్తింది వార్డెన్.

    విక్రమ్ ని చూడగానే ఆమె భ్రుకుటి ముడుచుకుంది. మగపిల్లలపట్ల ఆమెకి సదభిప్రాయం లేదు. "ఏమిటి పని?" అంది కటువుగా.

    "నాకో అమ్మాయి ఎడ్రస్ కావాలి" చెప్పాడు లోపలికొస్తూ.

    "వాట్? అమ్మాయిల అడ్రసులు ఇలా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వడమే నా పని అనుకుంటున్నావా?" కీచుగా అరచింది ఆవిడ.

    విక్రమ్ ఆవిడ ఎదర కుర్చీలో కూర్చుంటూ "ప్రస్తుతం మీరు చెయ్యవలసిన పని అదే"...అన్నాడు.

    "నో!" ఆవిడ స్థిరంగా చెప్పింది.

    "ఆ అమ్మాయి పేరు వర్షిణి! ఇక్కడ మూడు సంవత్సరాల క్రితం వుండేది. కొంచెం త్వరగా చూసి చెప్పండి" తాపీగా అన్నాడు ఏమాత్రం ఆవిడ హావభావాలు పట్టించుకోకుండా.

    "కుదరదు, అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు?" ఆవేశపడుతూ అడిగిందావిడ.

    విక్రమ్ ముందుకి ఒంగి గొంతు తగ్గించి"....అడగగానే పని చేసి పెట్టడం నేర్చుకోండి. లేకపోతే మీకు వచ్చే సమస్యల్ని మీరు తట్టుకోలేరు" అన్నాడు సలహా చెప్తున్నట్టు.

    "బెదిరిస్తున్నావా? ఏం చేస్తావ్?" అడిగింది ఆవిడ లేచి నిలబడి ఫోన్ చేతిలోకి తీసుకోబోతూ.
    విక్రమ్ తాపీగా చెప్పాడు "మీకు హైదరాబాద్ లో పెళ్ళి అయి కాపురం చేసుకుంటున్న ఒక కూతురు, ఇక్కడ బి.వి.కె.లో ఇంటర్ చదువుతున్న ఒక కూతురూ వున్నారు కదూ?"

    "అ....యి....తే" ఆమె కొంచెం ఆశ్చర్యంగానూ, మరికొంత భయంగానూ చూస్తూ అడిగింది. ఆమె చెయ్యి టెలిఫోన్ నుంచి దూరంగా వచ్చింది.

    "పెళ్ళయిన అమ్మాయికి ఫర్లేదు! ఇంటర్ చదువుతున్న అమ్మాయి, అదే....మీ రాణి! ఆ అమ్మాయి ఫోటో 'కనిపించుట లేదు' అని పేపర్ కి, టి.వి.వాళ్ళకి ఇవ్వవలసి వస్తుంది" అన్నాడు.

    "ఏమిటి నీ ఉద్దేశం..?"

    "మాటలతో టైం వేస్టు చేయొద్దు! నేను అడిగింది చాలా చిన్నపని. అది చేసి పెట్టకుండా పెద్ద పెద్ద కష్టాలు కొనితెచ్చుకోకండి!" అన్నాడు విసుగ్గా.

    వార్డెన్ కొద్దిగా భయపడినట్లుగా కనిపించింది!

    "కానీ రూల్సు ప్రకారం మేమూ...! అనబోతూన్న ఆమె మాటలు కట్ చేస్తూ "మీ అమ్మాయి ఈవేళ ఆకుపచ్చ వోణీ వేసుకుని కాలేజీకి వెళ్ళింది కదూ..." ఆవిదవైపు చూసి గడ్డం నిమురుకున్నాడు విక్రమ్.

    ఆవిడ వెంటనే వెనక్కి తిరిగి చప్పున పై అరలో వున్న రెండు లావుపాటి రిజిష్టర్లు అందుకుంది.

    ఆవిడ ఒక్కొక్క పేరే చూస్తున్నంతసేపూ విక్రమ్ ఆత్రుతపట్టలేనట్టు అటూ ఇటూ పచార్లు చేస్తూనే వున్నాడు..."దొరికిందా?" అన్న ప్రశ్నను ఓ ఇరవైసార్లు అడిగుంటాడు.

    "లేదు! అసలు ఆ అమ్మాయి ఈ హాస్టల్లో వుండి వుండదు" చెప్పిందావిడ నీరసంగా.

    "ఇక్కడే వుండేది!" అతను గట్టిగా చెప్పాడు.

    "అయితే, మీరే చూసుకోండి" ఆవిడ చిరాగ్గా రిజిస్టర్లు అతని ముందుకి తోసింది.

    ఓ అర్ధగంట పాటు అతను ప్రతి పేరు పరీక్షగా చూసి పెట్టెయ్యబోతూ, ఓ పేరు చూసి టక్కున ఆగిపోయాడు. వెంటనే జేబులోంచి పెన్ తీసి ఆ అడ్రస్ నోట్ చేసుకోసాగాడు.

 Previous Page Next Page