Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 10

                                 


                                       హంస తీర్పు
    

    కలహ మెంత పుట్టె కలహంసచే నంచు
    నగవు వచ్చె శాక్యనాయకులకు;
    'తగవు మాలినట్టి తగ' వంచు తలపోసి
    తగవు చెప్పెనిట్లు ధర్మమూర్తి.
    
    "బాణహతిచేత ప్రాణమ్ము బాసెనేని
    దేవదత్త కుమారునిదే ఖగమ్ము;
    ప్రాణదానమ్ము సలిపి కాపాడుకతన
    రాజపుత్త్రుని దయ్యె నీ రాజహంస.
    
    ధరణి సమస్తభంగుల ప్రధానము ప్రాణము ప్రాణికోటి; కే
    కరణి లభించునయ్య యధికారము ప్రాణులపైన ప్రాణ సం
    హరణ మొనర్చునట్టి కఠినాత్ములకున్? క్షతి గన్న పక్షికిన్
    శరణ మొసంగి రక్షణము సల్పిన క్షాత్రవతంసు లుండఁగన్.
    
    ఈయది శాస్త్రధర్మ మొక యింత సహించిన లోకధర్మ మిం
    తే యగు" నంచు నొక్కి వచియించి పదంపడి ధర్మమూర్తి ల
    జ్జాయుతు దేవదత్తు నొకసారి కనుంగొని మందహాసముం
    జేయుచు రాజహంసమును జేర్చి సభాంతర రత్నపీఠికన్-
    
    పలికెను దేవదత్త నరపాలకుమారులఁ జూచి "రం డిటన్
    నిలువుఁ డొకింత దూరమున, నిల్చి కరమ్ములు సాచి హంసమున్
    బిలువుఁడు వేరువేరుగను మీర; లదెవ్వరిదైన వ్రాలు వా
    రల కరసారసమ్ముల మరాళము; న్యాయము దేలు దానితోన్."
    
    అంతట ప్రాడ్వివాకవరు లాడిన మాటలు. దేవదత్తుఁ డ
    త్యంతము సంతసించి కలహంసము నుంచిన రత్నపీఠి క
    ల్లంతన నిల్చి పిల్చె "ఖగమా! యిటురా! యిటురా!" యటంచు వి
    భ్రాంతమనమ్ముతో కటుకరమ్ములతో చటులస్వరమ్ముతో.
    
    అతని రూపు గాంచి భయమందెనో! టక్కరిచూపు గాంచియే
    భీతిలెనో! కరానఁ గనిపించు ధనుస్సునకున్ మనస్సులోఁ
    గాతరభావముం గనెనొ గాని! నృశంసు స్పృశింపఁబోని సం
    గీతము భంగి, వెన్కకొదిగెన్ కలహంసము కుంచితాంసమై.
    
    అంత నగుచు సముత్కంఠ మగుచుఁ గనె స
    భా జనము రాజసుతుని సభాజనముగ;
    గౌతముండును ధర్మాధికారి ముదల
    నౌదల ధరించి పిలిచె రాయంచ నిట్లు-
    
    "చెల్లి రావె! మంచిమల్లి రావే! కల్ప
    వల్లి రావె! పాలవెల్లి రావె!
    చిక్కదనము లీను చక్కదనాల జా
    బిల్లి రావె; అంచతల్లి రావె!"
    
    అంచుఁ గేల్ సాచి పిలువా రాయంచ "రివ్వు"
    మంచు వ్రాలె సిద్దార్దు హస్తాంచలముల;
    'జయజయ' నినాదములు సభాసదులు పలుక!    
    శాక్యపతి కళ్ళ హర్షబాష్పమ్ము లొలుక!!
    
    ఆ కరుణార్ధ్రమూర్తి కలహంస నటుల్ మరికొన్నినాళ్ళు ప్రే
    మిక విలోకనమ్ముల ప్రియమ్ము నయ మ్మలరన్ స్వయమ్ముగా
    సాకి, భయమ్ము దీరిచి, ద్విజమ్ము వియద్గమనక్షమత్వముం
    గైకొనుటల్ గనుంగొని యొకానొక చల్లని సంజవేళలో-
    
    "నా యనుజన్ముఁ డొక్కరుఁ డొనర్చిన దుశ్కృతిచేత నేలపా
    లాయె భవద్విహాయస విహార మహోత్సవ మల్లనాఁడు; నీ
    యాయువు గట్టి దింతకును హంసమ! గాయము మానె, నింకపై
    హాయిగ పోయి యాడుకొనుమా! కనుమా నిజబంధుమిత్రులన్."
    
    అంచు వదలె కుమారుఁ డాయంచ, నదియు
    పై కెగిరె నవ్య మధుర కల్పన విధాన;
    నల్లనల్లని గగనాంగణమ్మునందు
    తెల్లతెల్లని సొగసులు వెల్లివిరిసె.
    
    రివ్వున పోయి పోయి తెలిరెక్కల చక్కని రాజహంస ధౌ
    దవ్వులఁ జూడనొప్పె జలదమ్ములరాణి వినీలవేణిలో
    పువ్వువిధాన; మిన్నుపువుబోణి నిగారపు కావిమోవిపై
    నవ్వువలెన్; కనంబడి కనంబడనట్టి కళాస్వరూపమై.
    
    ఆ గగనాంగణాన కలహంసము గాలిపటమ్ము మాడ్కి పై
    కేగుకొలంది గౌతము తదేకనిరీక్షణ సూత్రరూపమై
    సాగు; శకుంత మాంతరిక సౌహృదబంధ మదేదో వెన్కకున్
    లాగుచునున్నలాగు మరలన్ మరలన్ తలద్రిప్పి కన్గొనున్.
    
    ఆ యువరాజహంసము దయామృతవృష్టి చెలంగు దృష్టితో
    నా యువ రాజహంసమును నట్టె కానున్ గరుణార్ధ్రమూర్తియై;
    ఆ యువ రాజహంసమును ఆత్మ కృతజ్ఞత పొంగులెత్తఁగా
    నా యువరాజహంసమును నట్టె కనున్ గగనాగ్రవర్తియై.
    
    చూచిన చూపువెంటఁ దలచూపెను విశ్వ రహస్య భావ సం
    సూచన లేవియో; నృపతిసూతి మదిం గదలించెఁ గ్రొత్త యా
    లోచన లెన్నియో! తలపు లోతులలోఁ బడి యూగి యూగి యె
    ట్లో చనె నాఁటి రాత్రియు నొకొక్క క్షణం బొక కల్పకల్పమై. 
          

                                         

    అది ప్రమదావనంబు; తదుపాంతమునం బ్రవహించు రోహిణీ
    నది; నదిమీద మందపవనమ్ములు; మంద మరుత్పరంపరన్
    గదలు తరుల్; చలత్తరు శిఖామకుటంబు లలంకరించు న
    భ్యుదయ సరోజబాంధవ కవోష్ణ మనోజ్ఞ మయూఖమాలికల్.
    
    ఆ సుమనోవికాసమయమౌ సమయమ్మున నిత్యనూతనో
    ల్లాస విలాస మవ్వనతలంబున ప్రాంశుపయోదనీలమై
    వ్యాసమహర్షి వోలె చెలువారెడు నేరెడుచెట్టు క్రింద ప
    ద్మాసన మున్నవా రెవరయా ప్రభు లర్దనిమీలితేక్షణుల్?
    
    అర్ధనిమీలితమ్ములగు నా కనుదమ్ముల దాగుకొన్న ర
    మ్యార్ధ మదేమొ! ఫాలఫలకాలక పంక్తి పరిస్ఫురించు భా
    వార్ధ మదేమొ! స్వాంతర నిరంతర సంత్వరమాణమౌ విశే
    షార్ద మదేమొ! స్వామి పురుషార్ధములో పరమార్ధ మేమియో!

 Previous Page Next Page