అంబరవీథియందుఁ గననయ్యెను బారులు బారులై విహా
రం బొనరించు మంజుల మరాళ గణమ్ము; మహా కవీంద్రు భా
వాంబరవీథి విశ్రుత విహార మొనర్చు రసార్ద్ర భావనా
లంబిత శారదా చరణలాస్య విలాసము లుల్లసిల్లఁగన్.
క్రొందలిరాకు సౌరు గయికొన్న విశాల నభోంగణమ్ములో
నందము లొల్కవోయు కలహంసములన్ గనినంత శాక్యరా
ణ్ణందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగె నా
నందము; నిర్నిమేషనయనమ్ములు తన్మయతా నిమగ్నముల్.
రసతరంగిత సుకవి మానసపథాన
కదలు కమనీయ కావ్యసంపద విధాన;
నీలిమబ్బుల, వెలిదమ్మి పూలమాల
తోరణ మనంగ నంచలబారు తోఁచె.
గగనమున నేగు కలహంస గణముఁ గాంచి
జాగరితమయ్యెనేమొ హింసాప్రవృత్తి;
నారి సారించి వాఁడి బాణమ్ము నొకటి
దేవదత్తుండు వింట సంధించినాఁడు.
ఆకసమునందు రెక్క లల్లార్చుకొనుచు
దండులో దూరి పోవుచునుండెగాని-
మృత్యుదేవత గురి తనమీఁద పడుట
యెరుఁగలేదయ్యె నా యమాయికపు హంస.
రివ్వునం బోయి యొక హంస రెక్క క్రింద
గ్రుచ్చుకొనియె ధనుర్వినిర్ముక్త శరము;
కుసుమ సుకుమార సునాజమానసమునందు
మ్రుక్కడి కఠోరకర్కశ వాక్కు వోలె.
క్రూర కఠోర బాణమునకున్ బలియై కలహంసరాజు క్రేం
కారము సేయుచున్ బడె నఖండదయానిధి పాదసన్నిధిన్;
ఘోర మునీంద్ర శాపమునకున్ గురియై గగనాంతరాళ సం
చారము దక్కి వారినిధి జారు శశాంకుని జ్ఞప్తి కెత్తుచున్.
"గిరగిర" దిరుగుచు నరచుచు
ధరణీస్థలిఁ గూలి, సోలి తడబడు హంసన్
కరుణామూర్తి కనుంగొని
బిరబిరఁ జని యెత్తి చేర్చె ప్రేమాంకమునన్.
క్రొత్త యనంటి మొవ్వవలె కోమలమౌ కలహంస డొక్కలో
నెత్తురు ధారకున్ గనుల నింపుచు వెచ్చని బాష్పధార, లో
కోత్తరమూర్తి యెట్టు లెటులో శరమున్ వెడలించి గాయమున్
మెత్తని వ్రేళ్ళతోడ మెలమెల్లగ నొత్తుచు, బాధ మాన్పుచున్-
రెక్కలు దువ్వి, వీపు సవరించి, పదమ్ముల కుంటు దీర్చి, లేఁ
జెక్కిలి చక్కదిద్ది, సరిచేసి తనూలత, ప్రేమపూర్ణముల్
వాక్కులు పల్కుచున్, దిగులు వాపుచు, ముద్దుల బుజ్జగించుచున్
మక్కువ మీర గౌతమకుమారుఁడు లాలనసేసె హంసమున్.
వివాదము
విల్లు నెక్కుడించి వీరత్వమున మించి
దేవదత్తుఁ డేగుదెంచి పలికె
హంస నెత్తుకొనెడి యనురాగమూర్తితో
రోషపూర్ణ పరుషభాషణముల.
"రాజకుమార! ఈ విహగరాజము నాయది, అస్మదీయ బా
హా జయలక్ష్మికిన్ సముపహారము; నాకు లభించుగాక నీ
రోజు మనోజ్ఞ మానస సరోవర హైమ మృణాలవల్లరీ
భోజన రాజభోగ పరిపుష్ట మరాళ శరీరమాంసముల్."
అంచు దురాగ్రహంబు నయనాంతములన్ నటియించుచుండ రా
యంచకుఁ జేయిసాచిన వయస్యుని తొందర గాంచి మోమునం
దించుక మందహాస మొలికించుచు,. నంగుళులన్ మరాళ ప
క్షాంచలముల్ స్పృశించుచు దయామయమూర్తి వచించె నీక్రియన్.
"ఎక్కడనో జనించి, పరమేశ్వరుఁ డిచ్చిన గాలిపీల్చి, వే
రొక్కరి జోలి కేగక, యెదో భుజియించి, సరోవరాలలో
గ్రుక్కెడు నీళ్ళు గ్రోలి, విను త్రోవల నేగెడు రాజహంసపై
రక్కసి బుద్ధి సెల్లునె? మరాళ మరాళ శరాగ్ను లోర్చునే?
గిలగిలమందువే యొరులు గిచ్చిన; కాలికి ముళ్ళు గ్రుచ్చినన్
విలవిల కొట్టుకొందువటె; నీవలె జీవులు కావె! హింసకున్
ఫలితము బాధయేగద! ప్రపంచములోని సమస్త జీవులం
దలరెడు ప్రాణ మొక్కటేగదా! తగునయ్య వృథా వ్యధా క్రుధల్!!
రాచకొలమ్మువారలకు రక్షణ సేయుట చెల్లుఁగాని, నా
రాచము లూని ప్రాణినికరమ్ముల స్వేచ్చ హరింపఁజెల్లునే!
ఈ చతురబ్దివేల్లిత మహీవలయమ్ము లయమ్ము గాదె హిం
సాచరణమ్మునన్, తగునె 'క్షాత్ర'పదమ్మును వమ్ము సేయుటల్.
నీ శరాగ్రముతోడనే నీ కరాగ్ర
మేది యేది యొకింత భేదించుకొనుము;
పాప! మీ దిక్కుమాలిన పక్షి, నోరు
లేని దెటు తెల్పు తన గుండెలోని బాధ!
హింసలు గావించుటకై
హంసలపై మనసుపోయెనా! శాక్యకులో
త్తంసులకు; సముచితములె ప్ర
శంసాపాత్రములె సాధుసంహారమ్ముల్!
మానవత్వమ్మునే కాళ్ళ మట్టగించి
దానవత్వమ్మునే తలఁ దాల్చినావు!
స్వస్తి చెప్పితివేమి సౌజన్యమునకు!
స్వాగత మొసంగితేమి దౌర్జన్యమునకు!!"
అని యనురాగజ్యోతులు
కనుల వెలుంగన్ వచించు కారుణ్యనిధిన్
గనుగొని కన్నుల గరకుం
దన మొలుకం బలికె దేవదత్తుం డలుకన్.
"ఆకసమునందు గుంపులో నరుగుచుండ
వాఁడి శర మేసి కూల్చినవాఁడ నేను;
కొట్టిన విహంగమును దాచుకొందువేమి?
పక్షి నిమ్మయ్య; శాక్యభూపాలపుత్త్ర!"
అనెడు నతని గ్రుడ్లు గని హంస గడగడ
వడకి యంకపాళి ముడుచుకొనెను!
పులుఁగు దిగులు వాపి పలికె దయామయ
చిత్తుఁ డిట్లు దేవదత్తుఁ గాంచి.
"పాలుగారెడు రాయంచ ప్రక్కలోన
క్రూర నారాచ మేరీతి గ్రుచ్చినావు?
నిండు జాబిల్లి మెత్తని గుండెలోన
కుటిల విషదంష్ట్ర రాహువు గ్రుచ్చినట్లు.
అలుగు వింటఁ దొడిగి యాకాశమున నేగు
పులుఁగు నేలఁ గూల్పఁగలిగినావు;
మనసులోన నెగురు మదమత్సరమ్ములఁ
గొట్ట చాప మెక్కుపెట్టలేవు!"
'నాది నాది నాది' నా దేవదత్తుండు
'కాదు నాది' యనియె గౌతముండు;
వాదులాడి యాడి వారిద్దరును గూడి
యేదికూడ నిర్ణయింపలేక-
చనిరి దేవదత్త శౌద్దోదనులు, మహా
రాజసభకు విహగురాజుతోడ;
పోయి యచట నున్న న్యాయాధికారితో
నంచ తగవు విన్నవించుకొనిరి.