Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 11


    ఆ నవనీతకోమల హృదంతర మెంత వ్యథాగ్ని సోకి లో
    లోన ద్రవించునో! తలపులో తొలిరూపులు దిద్దుకొన్న యే
    జ్ఞానలతల్ చిగుర్చునో విశాల లలాటముపై! స్ఫురించునో
    యే నవమానవత్వము ధరించిన తీయని ధ్యానముద్రలో!

    ఏ మధురానుభూతి వికసించినదో! హృదయైకగమ్య మే
    ప్రేమ సుధార్ధ్రగీతి వినిపించినదో! మన మాననీయ మా
    యా మహిళామతల్లి సుతులా? మన శాక్య మహా మహీతల
    స్వామి తనూజులా? మన ప్రజావతి గౌతమి నోముపంటలా?
    
    చిత్తము విశ్వమంగళ విశేష విధాన పథానుశీలనా
    యత్తముగా - వియత్పథవిహార విమాన సముచ్చయం బక
    స్మాత్తుగ నాగిపోవుటలు శాక్యవతంసుఁ డెరుంగడయ్యె, లో
    కోత్తర భావనాంబర ముహుర్ముహు రచ్చలితాత్మహంసుఁడై.
    
    ఆగిన విమానచయముల
    లో గల వేలుపులు సాశ్రులోచనములతో
    సాగిలి మ్రొక్కిరి భక్త్యను
    రాగము లుప్పొంగ శాక్యరాట్తనయునకున్.
    
    చిత్ర మదియేమొ! నేరేడు చెట్టు నీడ
    కదలదు రవంత సూర్యుని గమనమునకు;
    రాకుమారునిపై ఎండ సోకకుండ
    గుమ్మటమ్మయి పచ్చలగొడుగు పట్టె.
    
    అల హలకర్షణోత్సవమునం దనుయాయుల గూడి పైడి నా
    గలి గొని భూమి దున్ను మహికాంతుఁడు ప్రాంతమునం బ్రశాంత ని
    శ్చల నిభృతాంతరంగుఁడగు శాక్యకుమారుని మస్తకమ్ముపై
    వెలుగులు గాంచె నాత్మ భయ విస్మయ సంభ్రమముల్ పెనంగొనన్.
    
    రెండవ బాలభాస్కరుని రీతి వెలుంగుచు చెట్టుక్రిందఁ గూ
    ర్చుండి సమాధిమగ్నుఁడయి యున్న కుమారు ప్రమోదబాష్పముల్
    నిండిన కన్నులం గనుగొనెన్ మనుజేంద్రుఁడు; దూరమందు ని
    ల్చుండి నమస్కరించె, తనయుం గొనిపోయె పురంబులోనికిన్.
    
    హరుని వెనువెంట జను శక్తిధరుని కరణి
    పంక్తిరథు వెంట జను రామభద్రు పగిది
    తండ్రివెంబడి రాజసౌధమున కరిగె
    ధర్మతేజస్వి బాల గౌతమ తపస్వి.
    
                                   సమాలోచనము
    
    చిన్నతనంబు నుండియు విచిత్ర విరాగ పథప్రవృత్తమున్
    గన్నకుమారు చిత్తమును గన్గొని, రాజ్యరమానివృత్తమౌ
    నన్న భయమ్మునన్ నరవరాగ్రణి తా నొకనాఁడు బుద్ధిసం
    పన్నుల మంత్రులం బిలిచి పల్కె రహస్య సభాంతరమ్మునన్.

    "ఈతఁడు రాజరాజ పరమేశ్వరుఁడై విలసిల్లి విశ్వవి
    ఖ్యాత యశోవిశాలుఁడగు - కానియెడన్ సహజానుభూతి సం
    జాత కృపాప్రపూర్ణమతి సంయమిచంద్రముఁడై ప్రశాంతి సం
    గీతికలన్ వెలార్చి పలికించును మానవహృద్విపంచికల్."
    
    అంచు ద్విధా వచించిరి గదా ముణు శ్రీఘను జన్మపత్రికన్
    గాంచిన పండితోత్తము - లఖండ దయాఫ్లుతముల్ కుమారు నే
    త్రాంచలముల్ గనుంగొన యథార్ధము రెండవ యర్ధమంచు శం
    కించెడు మానసంబు, పరికింపుఁడు భావిగతిప్రతిక్రియల్.
    
    జీవజగత్తుపై కృప విశేషముగా గననయ్యెడిన్ జిరం
    జీవికి; భోగభాగ్యా సరసీకృత జీవనభంగిపై పృథ
    గ్భావము గోచరించెడి; నపాయము దీరు నుపాయ మొండు సం
    భావన సేసి నా వ్యధలు బాపుఁ డుదంచితశేముషీనిధుల్!"
    
    అను శాక్యేంద్రుని జూచి పల్కెను ప్రధానామాత్యుఁ "డీ మాటలో
    ననుమానం బిసుమంత లేదు; మన సిద్దార్ధుండు సంప్రాప్తయౌ
    వనుఁడే యయ్యును యౌవరాజ్యపదవీ వాల్లభ్య వాంఛానివ
    ర్తనమౌ వర్తన మూనె దాని కిట కర్తవ్యమ్ము నూహించితిన్.
    
    పలుకక మూగవారిన విపంచిని కౌఁగిట బుజ్జగించి తీ
    గెలు కులికించి పాట పలికించి రస మ్మొలికించు నేర్పు కో
    మలులకె చెల్లు - రాసుతుని మాంద్యము మాన్పెడు మందు సుందరీ
    లలిత కటాక్షవీక్షణ విలాసము దక్క మరొక్క డున్నదే?
    
    యోగ్యతమ మ్ముపాయ మిది యొక్కటియే మన రాకుమారు వై
    రాగ్య భరమ్ము మాన్ప; ననురాగ సుధామధుర స్వరూప సౌ
    భాగ్యవతీ లలామ మృదుపాణి పరిగ్రహణంబు సత్వరా
    రోగ్యము నిచ్చు; మానస సరోజము విచ్చు రసప్రసన్నమై.
    
    దీనికి పిల్చినట్లు చనుదెంచుచున్నది రేపు మాఘమా
    సాన వసంత పంచమియు; శాక్యుల పర్వము; నాఁడు మన్మథో
    ద్యాన మహోత్సవమ్మును యథావిథిగా ప్రకటించి, పంపుఁ డా
    హవాన మశేషరాజ్యముల యందలి కెందలిరాకుబోండ్లకున్.
    
    వచ్చిన రాచకన్నెలకు వజ్రపుదండలు రత్నహారముల్
    పచ్చల మేఖలల్ ధరణిపాలతనూజుఁ డుపాయనమ్ముగా
    నిచ్చును గాక యొక్కొక్కరికే; యిటు  లిచ్చెడివేళ కంటికిన్
    నచ్చిన వాలుఁగంటి పయినన్ హృదయమ్ము లగించుగావుతన్."
    
    అంచు వచించు వృద్ధసచివాగ్రణి యూహకు మెచ్చె రాజు; హ
    ర్షించిరి మంత్రు లెల్ల; చెలరేగె వసంత మహోత్సవప్రభల్;
    ప్రాంచిత మయ్యె శాక్యనగరమ్ము సమాగత రాజకన్య కా
    చంచలలోచనాంచల నిశాతనిరీక్షణ మాలికావళిన్.
    
    పచ్చనిచీరతో పసుపుపచ్చని పువ్వుల పట్టురైకతో
    ముచ్చటలొల్కు తళ్కు పలు మొగ్గలతో చిగురాకుమోవితో
    హెచ్చిన భక్తి సుందరవనేందిర ముందర స్వాగత మ్మిడన్
    వచ్చె వసంతపంచమి నవత్వము సృష్టికి పుష్టి గూర్పగన్.
    
    అల్లన సాగి మంజులసుమాంజలులన్ పయిజల్లి మల్లికా
    వల్లిక కౌఁగిలించె తరువల్లభు నుల్లము పల్లవించు; ను
    త్ఫుల్లలతాంతపాత్రమున పొంగెడు వెచ్చని తియ్యతేనె కో
    కొల్లగ గ్రోలె తుమ్మెదలు కుత్తుకబంటిగ జంటజంటలై.
    
    ఏ చిరవాంఛలో చివురు లెత్తినటుల్ సుకృతమ్ము లెన్నియో
    పూచినయట్లు పూర్వతపముల్ ఫలియించినయట్లు మిక్కిలిన్
    వాచవులౌ వసంత వనవాటికలన్ పికముల్ ద్విరేఫముల్
    రాచిలుకల్ చెలంగె మధురధ్వను లల్లెడ నుల్లసిల్లఁగన్.
    
                                   వసంతోత్సవము
    
    అమ్మధుమాసవేళ సచరాచరధాత్రి ధరించె క్రొత్త రూ
    పమ్ము; లతానికుంజతరుపంక్తులు చిమ్మినగ్రోవులన్ వసం
    తమ్ముల నాడె; క్రమ్ముకొనె నల్గడలన్ మదనోత్సవప్రహ
    ర్షమ్ము; వెలింగె శాక్యనగరమ్మున సర్వము నేత్రపర్వమై.
    
    నగుమొగమందు శాంతి నటనం బొనరింప నరేంద్రసూతి క్రొం
    జిగిబిగి జవ్వనంపు నునుజెక్కులపై మణికుండలద్యుతుల్
    నిగనిగలీన మేల్పసిడి నిగ్గుల మండపమందునన్ ధగ
    ద్దగిత  చిరత్నఖచిత మ్ముచితాసన మెక్కి యుండగన్.
    
    అచ్చర ముద్దియల్ ప్రియజయంతకుమారుని దర్శనార్ధమై
    వచ్చిన భంగి రాకొమరు వద్దకు కాంతలు కాన్కలందుకో
    వచ్చి రసూన రూప గుణ వైభవకాంతి కళాతరంగముల్
    కుచ్చెలచెంగులై కమల కోమలపాదము లాశ్రయింపఁగన్.
    
    మానవతీలలామ, లసమాన తనూల్లసమాన మోహన
    శ్రీ నయనాభిరామలు, పరిస్ఫుటయౌవనభాగ్యసీమ, లు
    ద్యానములో సుమాస్త్రనిశితాస్త్రపరంపరవోలె శాక్యరా
    ట్సూణుని డాసి రందములు చూపార డెందము లాహరింపఁగన్.
    
    రవికిరణాలలో వెలయు రంగు లటుల్, ఘనశిల్పి శిల్పవై
    భవమున వ్యక్తమౌ మధురభంగిమ లట్టు, లుదాత్త గాయక
    ప్రవరుని గొంతులో విరియు రాగిణు లట్లు, సమర్ధమౌ మహా
    కవి హృదయమ్ములో కదలు కల్పన లట్లు చెలంగి రంగనల్.

    కటితట కాంచి, కమ్ర కరకంకణముల్, పద నూపురమ్ము ల
    స్ఫుటముగ మ్రోగ - రాగరసపూరము చెక్కుల నొల్క - వాల్జడల్
    నటన మొనర్ప - భావుకజన మ్మెలమిం దలలూచి మెచ్చ - తా
    మటు లరుదెంచి రింతులు మహత్తర నాట్యకళాస్రవంతులై.
    
    ఆ కందమ్ముల  యంద, మా బొమలతీ, రా మోము లావణ్య, మా
    శ్రీకారంబుల వీనుదోయి చెలు, వా చెక్కిళ్ళ చక్కందనం,
    బా కెమ్మోవి విలాస మొక్కటయి దివ్యస్త్రీ సరాగమ్ములన్
    రా కొట్టం జని రా కుమారు కడకున్ రాకేందుబింబాననల్.
    
    ఒక్కొక లోలలోచన మహోజ్జ్వల భూషణభూషితాంగి మె
    ట్లెక్కి సమక్షమందు మొగ మించుక వంచి జొహారు సేయఁగా
    ప్రక్కలనున్న కుందనపు పళ్ళెములందలి రత్నహారముల్
    చక్కని సామి కౌతుక మెసంగ నొసంగు కనుల్ జిగేల్మనన్.

 Previous Page Next Page