కొత్తగా పెళ్ళయిన అల్లుడ్ని కూతుర్ని చూసి పూర్వవాసనలు ఏవో తట్టి పిలిచినట్లయి నాన్న అమ్మ దగ్గరగా జరిగి "సౌదా...ఏదీ పూర్వపు ఆ ముగ్దమనోహర సౌకుమార్య లావణ్య హాసరేఖా?" అనగానే అమ్మ ఫక్కుమని చాలా అందంగా, పరవశంగా నవ్వింది.
మా ఇంట్లో దీపావళి పండుగనాటి ప్రమిదలు కూడా అంతటి ప్రమాదాన్ని ఇవ్వలేదు.
"నక్షత్రాలస్తమిస్తున్నాయి. శూన్యం ప్రభాతం వైపుకి. త్వరపడు... నిరంతర శూన్యంలోకి మాయమౌతుంది.
ఆ వృధా వ్యయంలోంచి ఒక్క నిమిషం జీవిత స్రవంతిని రుచిచూసేందుకు మిగిలింది.
ఈ క్షణం త్వరపడు...
అన్నట్లుగా వున్నాయి నాన్న చూపులు. సారంగీ వాద్యంలా నవ్వులు చిందిస్తూ వంచిన వెన్నుతో అమ్మ ఆ నిశీధిలో పెరట్లో సందెదీపంలా మెరిసిపోయింది.
"ఇంకా పుట్టని రేపూ, పుట్టి చచ్చిన నిన్నా!
వాటిని తలుచుకు చిరాకు పడకు.
'ఇప్పుడే అదే ఈ క్షణమే మిగిలింది మనకు' నాన్న రుబాయీలు చెపుతున్నాడు. నేను కాళింది నవ్వుతున్నాం.
తాతగారు జపానికి భంగమై ఒక్కక్షణం కళ్ళు చిట్లించి నాన్న మొహంలో నవ్వుని చూసి తనే అక్కడ్నించి దూరంగా తొలగిపోయారు.
పాత తరం కొత్త తరాన్ని అర్థం చేసుకుని వైదొలగాలి. రేపు అమ్మా నాన్నా అయినా, ఎల్లుండి మేమైనా అంతే!
* * *
పెద్దక్క కాపురానికి వెళ్ళిపోయింది.
చిన్నక్క మెడికల్ కాలేజ్ హాస్టల్ కి వెళ్ళిపోయింది. నేను ప్రతి రోజూ స్కూల్ కి వెళ్ళొస్తున్నాను. బావి దగ్గరికి రాగానే శివ గుర్తొచ్చేవాడు. వెళ్ళాక ఓ ఉత్తరం వ్రాశాడు. కాలేజ్ చాలా బావుంది. దారి పొడుగునా అందమైన ఆడపిల్లలు కనిపిస్తారనీ సాయంత్రాలు ఆడపిల్లల కాలేజీల ముందు కెళ్ళి తన స్నేహితులంతా బీట్ కొడ్తారనీ తను అలా చెయ్యడంలేదనీ వ్రాశాడు. శివ బుద్ధి నాకు తెలుసు తప్పకుండా వెళ్తాడు. కానీ వెయ్యవలసినంత జెలసీ వెయ్యలేదు! మెచ్యూరిటీ వస్తోందేమో నాకు!
సుబ్బలక్ష్మి తల్లికి పెద్ద ఆపరేషన్ చెయ్యాలన్నారట. ఆ అమ్మాయి అమ్మ దగ్గరకొచ్చి ఒకటే ఏడుపు. ఇంట్లో వరసకు మేనత్త వుందట. కానీ ఆవిడకి చూపు సరిగ్గా ఆనదట. వంటదీ చెయ్యలేదుట.
ఆస్పత్రిలో సుబ్బులు తల్లిని కనిపెట్టుకుని వుంటుందిట. నన్ను తనకు ఇంట్లో తోడుకు పంపమంది.
అమ్మ సరేనంది. తనూ స్వయంగా వచ్చి వాళ్ళమ్మని చూసింది. ఆవిడికి ఏం భయంలేదనీ ఆముక్తని సుబ్బులుకి తోడుగా పంపుతాననీ మాటిచ్చింది.
నాకు చాలా సరదాగా అనిపించింది.
వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డర్ లో పాటలు వినవచ్చు, టీ.వీ.లో సినిమా చూడచ్చు. ఇవన్నీ మా ఇంట్లో లేవు!
నేను సుబ్బులూ కలిసి వంట చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవడం, పాటలు వినడం, అస్తమానం టీ.వీ. చూడటం జీవితం అంటే ఇదే అనిపించింది.
ఆ రోజు రాత్రి టీ.వీ.లో 'కవిత' సినిమా వస్తోంది. సుబ్బులు బఠానీలు నవుల్తూ సినిమా చూస్తోంది. నేను నోట్స్ రాసుకుంటూనే సినిమా చూస్తున్నాను. వాళ్ళ నాన్న వచ్చి మా ముందు సోఫా మీద కూర్చున్నాడు.
నేను ముందుకు వంగి బాటనీ రికార్డులో బొమ్మలు వేస్తున్నాను. ఎవరో నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నట్లుగా అనిపించి తలెత్తి చూశాను. సుబ్బులు తండ్రి ఆబగా నా జాకెట్టులోకి చూస్తున్నాడు.
నేను అదిరిపడి సర్దుకుని కూర్చున్నాను. సుబ్బులు హాయిగా సినిమా చూస్తోంది. నాకు ఆ తర్వాత అక్కడ ఉండటం ముళ్ళ మీద వున్నట్లుగా వుంది.
నేను పక్క గదిలోకి వెళుతుంటే పొరపాట్న వచ్చినట్లు ఢీకొట్టాడు. రాత్రి తొమ్మిదయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవాలనిపించినా ఎలా వెళ్ళాలో సుబ్బులుకి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే దాని పక్కన పడుకున్నాను.
కాస్త నిద్రపడుతుండగా నామీద ఏదో బరువుగా అనిపించింది. ఉలిక్కిపడి లేవబోతుంటే నానోరు తన చేత్తో ఠక్కున మూసేశాడు. చూస్తే సుబ్బులు తండ్రి... "శబ్దం చేయకు... కాస్సేపే... కదలకు" అంటున్నాడు.
నేను చీకట్లో పెనుగులాడాను.
సుబ్బులు మొద్దునిద్ర పోయింది.
ఆయన కాళ్ళతో నా కాళ్ళని నొక్కిపట్టి నా మీదకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. అంతబలం ఎలా వచ్చిందో కానీ గట్టిగా మోచేతిమీద కరిచేశాను.
"అమ్మ... రాక్షసీ..." అంటూ నెప్పికి వదిలి పెట్టేశాడు.
నేను ఒక్కసారి విదిలించుకుని లేచికూర్చుని "సుబ్బులూ! సుబ్బులూ..." అని దాన్ని లేపేశాను.
అది చటుక్కున నిద్రకళ్ళతోటే "ఏవైందే...దొంగాడొచ్చాడా?" అంటోంది.
నేను దాన్ని చుట్టుకుపోయి ఏడ్చేశాను.
"ప్రొద్దుటే "ఆ పిల్లని వాళ్ళింటికి పంపెయ్యి. రాత్రి ఏం కలకందో ఏమో దడుసుకుని ఒకటే అరుపులు" అన్నాడు.
నాకు నిజంగానే దడుపు జ్వరం వచ్చేసింది.
"పదవే" అంది సుబ్బలక్ష్మి.
"సుబ్బులూ, నేను కల కనలేదు" అన్నాను.
"మా నాన్న లుంగీ కప్పుకుని పరుగెడ్తుంటే నేను చూశాలే...సారీ ముక్తా..." అని సుబ్బలక్ష్మి ఏడ్చింది.