"మరి అంతా తెలిసే నువ్వు..." అన్నాను.
"నేనూ మీ ఇంట్లో పడుకుంటానే ఈరోజు నుండీ" అంది సుబ్బలక్ష్మి బెదురుగా.
ఇది నవనాగరిక సమాజంలో వయసు వచ్చిన ఆడపిల్లకున్న భద్రత!
ఇద్దరం ఒకర్ని ఒకరం పట్టుకుని కాసేపు ఏడ్చాము.
బయట ఏ ఉపద్రవం జరిగినా ఇంట్లో చెప్పకూడదు. చెప్తే అమ్మ గుండెల్లో నెప్పొస్తుంది. చెప్పుకోవడానికి చిన్నక్క కూడా లేదు! ఈ మధ్య అక్కలిద్దరూ తెగ జ్ఞాపకం వచ్చి బాధేస్తోంది.
నేవెళ్ళేసరికి నాన్న చిన్న పిల్లి పిల్లకి ప్లేట్లో పాలు పోస్తున్నాడు. నాకు ఆ దృశ్యం చాలా మనోహరంగా వుంది! ఎంత భూతదయ? అది భయానికో చలికో కళ్ళు ఆర్పి గడగడా వణుకుతోంది.
రాత్రి నేనూ భయానికి అలాగే వణికాను. దాన్ని దగ్గిరికి తీసి భయం పోగొట్టి, చేత్తో నిమిరి పాలు పోసి తగిస్తున్నాడు నాన్న! నాన్నలందరూ ఇంత దయగా ఉంటే ఎంత బావుంటుందీ? ఈ పిల్లిపిల్లలా ఏ ఆడపిల్లా భయపడక్కర్లేదుగా అనిపించింది.
"ముక్తా... నీకో బుల్లి ఫ్రెండ్ వచ్చింది చూడు!" అని నవ్వుతూ పిలిచాడు. నేను ఎందుకో వెళ్ళి నాన్న పక్కన దూరి కూర్చున్నాను. ఆయన వంటి నుండి వచ్చే ఆదరపూర్వకమైన పరిమళం మగజాతి అంటే భయాన్ని తగ్గించేదిగా అనిపిస్తోంది!
"తల్లి పోయిందట. పసిది, చూడు ఎలా దిక్కులు చూస్తుందో!" అంటున్నాడు.
ముగ్గురు ఆడపిల్లల్ని కనీ, సాకిన నాన్నకే తెలుసు ఆ భీతిసంగతి!
"నేను ఎన్నడూ ఎవరింటికీ నిన్నూ, అమ్మనీ వదిలిపెట్టి వెళ్ళను నాన్నా!" అన్నాను.
నాన్న నవ్వుతూ "వెళ్ళక తప్పుతుందా? అక్క వెళ్ళలేదూ! అప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతా నాన్నా అంటావు" అన్నాడు.
నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఇంతగా ప్రేమించే నాన్ననీ, అమ్మనీ వదిలి ముక్కూ మొహం తెలియనివాడితో వెళ్ళాలని రూల్ పెట్టిన కఠినాత్ములు ఎవరో!
అమ్మ తాతయ్యకు అన్నం పెడ్తోంది. "అమ్మా అన్నపూర్ణా...భిక్షాందేహి..." అంటాడు తాతయ్య. రోజూ ఇదే తంతు. పండు ముసలి. కూర్చోవటానికి విరిగిన పీట చెక్క తప్ప లేకపోయినా ఇదే ఆనందం! చారూ, గోంగూర పచ్చడిలో షడ్రుచుల భుక్తాయాసం!
పిల్లి పిల్లకు 'చీలీ' అని పేరు పెట్టాం. దానిగురించి రకరకాల కథలు అక్కలిద్దరికీ ఉత్తరాలనిండా వ్రాశాను.
చిన్నక్క బాగా చదువుకోమని ఉత్తరాలు వ్రాసింది.
పెద్దక్క ఉత్తరంనిండా అత్తారింటి సంగతులే. డబల్ కాట్ లు ఇవ్వలేదని జ్ఞాపకం చెయ్యమందట వాళ్ళత్తగారు.
ఎప్పుడైనా ఇనపమంచం మీదైనా పడుకున్న మొహమా అని నాకు అడగాలనిపించింది.
నాకు స్కూల్లో మంచి మార్కులొస్తున్నాయి. డేవిడ్ సార్ కి పక్షవాతం వచ్చిందిట. ఎవేంజిలీనా ఈ మాట చెప్పి, "ఆడపిల్లల్ని వీపు మీద రాసీ, టేబుల్ క్రింద నుంచి కాలు తొక్కి ప్రభువు చూడటం లేదనుకున్నాడులా ఉంది! బాగా అయింది" అంది.
నాకు సుబ్బలక్ష్మి తండ్రి కూడా గుర్తొచ్చాడు, కాస్త ముందు వెనకా అనుకున్నాను.
నాకు బాగా ఆశ్చర్యం వేసే విషయం ఏమిటంటే సుబ్బలక్ష్మి తండ్రిలాంటి పెద్దమనుషులు కనుబొమలు మధ్య కుంకుమబొట్టు పెట్టుకుని ఎప్పుడూ గుడులూ, గోపురాలూ, పూజలూ అంటూ తిరుగుతుంటారు! ఎందుకో అంత దైవభీతి!
అలా పెళ్ళయిందోలేదో ఇలా శ్రావణమాసం అంటూ పెద్దక్కని తీసుకొచ్చారు.
అమ్మకి బోలెడు హైరాన. అక్క కొత్త చుట్టంలా అసలు పనే ముట్టుకోకుండా 'ఈయన అలా అయితే తింటారు. ఇలా అయితే తినరు!' అంటూ బడాయి పోతోంది. పెళ్ళి అప్పులు తీరకుండానే అప్పుడే నోముల ఖర్చులు. ఆడపిల్ల పెళ్ళితో వదలదు. పెళ్ళితో మొదలు అనుకున్నాను. వరలక్ష్మి వ్రతానికి బావ వచ్చాడు. ఆయన ఎక్కడ కూర్చున్న రాజభోగాలు!
"ముక్తా...మంచినీళ్ళు"
"ముక్తా కాస్త విసురు" అనేవాడు.
ఆ అధికారానికి నాకు ఒళ్ళు మండిపోతోంది! ఓ రోజు సినిమా టికెట్లు పట్టుకుని వచ్చాడు.
"మూడెవరికండీ?" అంది పెద్దక్క.
"ఆముక్త కూడా వస్తుంది" అన్నాడు.
నాకు సరదావేసి వెంట వెళ్ళాను.
ఆటోలో మధ్యలో కూర్చోపెట్టాడు. నాకు అతని శరీరం తగుల్తుంటే జుగుప్సగా అనిపించింది. నా మీది నుండి భార్య భుజంమీద చెయ్యివేసి కూర్చున్నాడు. అక్కకి తన మురిపెమేతప్ప ఇంకో ధ్యాసేలేదు!
సినిమాహాల్లో అక్కపక్కన కూర్చున్నాను. సినిమా మొదలయ్యాకా మెడమీద ఏదో కదలిక. బల్లి కాదుగదా అనుకున్నాను. కాదు! బావ అక్కమీద నుండి చెయ్యివేసి నా మెడ క్రిందుగా చెయ్యి పోనిస్తున్నాడు!
"అక్కా..." అన్నాను.
"ఏవే?" అంది.
"ఎవరో చెయ్యి వేశారు" అన్నాను.
"ఎవడే పాపిష్టి వెధవా?" అంది.
"నీ మొగుడే" అని చెప్పలేకపోయాను.
దాని సంతోషం పాడుచెయ్యాలనిపించలేదు.