Previous Page Next Page 
ఆలింగనం పేజి 9


    ఈ మధ్య స్కూల్ పుస్తకాలకన్నా సాహిత్యం మీద ఆసక్తి ఎక్కువైంది. లైబ్రరీలో కూర్చుని 'రుబాయిలు' వరుసలు కట్టి పాడుకోవడం మధురంగా ఉంటోంది. ప్రపంచంలో ఇన్ని ఆనందాలనీ, అందాలనీ పెట్టుకుని పెద్దవాళ్ళు ఇంత చింతపోతూ, సతమతమైపోతూ ఉంటారెందుకో నాకు అర్థం కాదు!

 

    తెల్లవారాక శివ ఆటోలో సూట్ కేస్ తో వాళ్ళమ్మా నాన్నలతో వెళ్తూ చెయ్యి ఊపాడు. నేనూ చెయ్యి ఊపాను. లిల్లీ లూనా మీద బామ్మగారిని తీసుకెళ్ళింది.

 

    నా మనసంతా ఏదో వెలితి! కానీ ఏం చెయ్యలేను. చాలాసార్లు అంతే. నేను కూడా స్టేషన్ కి వెళ్ళచ్చుగా, లిల్లీ అంత నిర్భయంగా!

 

    అయినా చెయ్యలేను. నన్ను అలా పరికిగా పెంచిన అమ్మా నాన్నల మీద కోపం వచ్చింది.

 

    పెద్దక్కని చూస్తే జాలి! ఇంత మధురమైన ప్రేమని అనుభవించి మళ్ళీ నిస్సారమైన జీవితాన్ని పొందుతోందే అని! చిన్నక్క మాత్రం స్వర్గం చేతికి దొరికినంత సంతోషంగా దాని లోకంలో అది వుంది!

 

    పెద్దక్క పెళ్ళి అనుకున్నదానికన్నా ఎక్కువ ఖర్చుచేసేశారు. పెళ్ళి పొడుగుతా వాళ్ళ అత్తగారూ, ఆడబిడ్డలు ఏదో కొరత చూపించి కాబూలీవాళ్ళల్లా అమ్మానాన్నలనించి ఏదో లాగుతూనే ఉన్నారు. కన్నవాళ్ళకి ఆడపిల్లల్ని వదిలించుకోవడం ఎంత కష్టమో ఈ పెళ్ళిళ్ళల్లో చూడచ్చు!

 

    పెద్దక్కకి తెల్లచీరకట్టి పూలజడతో అలంకరిస్తుంటే నాకు సంక్రాంతి ఊరేగింపుకి తీసుకొచ్చే గంగిరెద్దు గుర్తొచ్చింది. ఇప్పట్నుండీ ఇదీ అలాగే 'అయ్యవారికి...దండం...పెట్టు!' అంటే తలూపాల్సిందేకదా!

 

    పాలగ్లాసు చేతికిచ్చి మా మూడుగదుల కొంపలో ఉన్న మధ్య గదిలోకి పంపించారు. నన్నూ, చిన్నక్కనీ నాన్నగారు రెండో ఆట సినిమాకి తీసుకెళ్ళారు. 'రాధా కళ్యాణం' సినిమా. సినిమా చూస్తున్నానేగానీ నా మనస్సు మాత్రం ఒకర్ని ప్రేమించి ఇంకొకర్ని చేసుకున్న అక్క మీదే ఉంది!

 

    ఒక్క ఒకర్ని ప్రేమించింది ఇతడు చెయ్యేస్తే ఊరుకోదు. దెబ్బతిన్న హృదయానికి మందు పూసుకున్నట్లుగా ఇతను కౌగిలించుకుంటే భరించలేదు! ఎంతటి నరకం అనుకొన్నాను. సినిమాలో కూడా అదే కథ!

 

    ఇంటికొచ్చేప్పటికి అందరూ గాఢనిద్రలో ఉన్నారు. అమ్మ పక్కన నేనూ, చిన్నక్కా పడుకొన్నాము.

 

    తెల్లవారుఝామున పెద్దక్క ఇవతలకి వచ్చింది. నేను కుతూహలంగా ఆమెని చూశాను.

 

    అక్క సిగ్గుగా అమ్మ అడిగినదానికి జవాబుచెప్తోంది. దాని ముఖంలో ఏడ్చిన దాఖలాలే లేవు!

 

    "ముక్తా...పో...పోయి ముఖం కడుక్కో" అని నన్ను గదమాయించింది అమ్మ.

 

    అక్క ముఖంలో సంతోషం చూసి నాకు ఆశ్చర్యమేసింది. వాళ్ళ ఆయనకీ తుండు ఇవ్వడానికీ నీళ్ళు అందించడానికీ సంతోషంగా వెళ్ళింది! నిన్న నేను చూసిన సినిమాలో హీరోయిన్ పడ్డంత ఇరవైరెండు రీళ్ళ మనోవ్యధ దివిటీ పెట్టి వెతికినా కనపడ్లేదు!

 

    పిల్లలకి కొత్తబట్టలు కొనడానికి తీసుకెళ్ళినప్పుడు అందమైనవీ అతి ఖరీదైనవీ ఎంచేసుకుంటారు. తర్వాత తల్లిదండ్రులు అవి మనకోసం కాదు. ఇంకోటి చూడండి...అంటూ చౌకరకంవి చూపించితే వాటిలోంచి ఇష్టం లేకపోయినా ఒకటి ఏరుకుంటారు. కానీ ఇంటికి వచ్చాకా అవే చాలా ఇష్టం అయిపోతాయి. కొత్తబట్టలు కదా! ఇదీ అంతే. భారతదేశంలో ఆడపిల్ల భర్తని ఈ పద్ధతిలోనే ఎంచుకోవాలి. చౌక...చౌక!

 

    "ఏవిటలా దిక్కులు చూస్తున్నావు. మీ బావగారు పిలుస్తున్నారు" అంది పెద్దక్క.

 

    నాకింకా ఈ కొత్త పిలుపు అలవాటు కాలేదు. ఇబ్బందిగా అతని దగ్గరికి వెళ్ళాను.

 

    "ఏం చదువుతున్నావు?" అడిగాడు చెప్పాను.

 

    "సరయూ మీ చెల్లెలు నీకంటే బావుంది!" అదోలా చూస్తూ అన్నాడు అతను.

 

    "చాల్లెండీ!" అక్క మూతి తిప్పింది.

 

    నాకు ఆ పరిహాసం నచ్చలేదు. భార్యముందు మరదల్ని మెచ్చుకుంటాడేం? అనుకున్నాను.

 

    మధ్యాహ్నం అందరం కేరమ్స్ ఆడ్తున్నాం.

 

    పిచ్చాపాటీ మాట్లాడ్తూ "సరయూ నీకు బాగా ఇష్టమైన నటుడెవరూ?" అడిగాడు బావ.

 

    "కమల్ హాసన్" ఠక్కున చెప్పింది అక్క.

 

    "చాలా ఇష్టమా?" స్ట్రెయికర్ గుండ్రంగా తిప్పుతూ అడిగాడు. ఈయన మాత్రం మరదలి అందం భార్య ముందే పొగడచ్చు! "ఔను, పడి చచ్చిపోయేదాన్ని" ఆలోచించకుండా అనేసింది అక్క.

 

    కాయిన్ ని అతను గట్టిగా కొట్టాడు. మైనస్ పడింది. హఠాత్తుగా లేచి గదిలోకి వెళ్ళిపోయాడు.

 

    చిన్నక్క ముక్కుపైకి జారిన కళ్ళజోడు పైకి తీసుకుంటూ పెద్దక్కవైపు కోపంగా చూసింది.

 

    పెద్దక్క కూడా లేచి ఆయన వెనకాలే వెళ్ళింది. నాకు నవ్వొచ్చింది. కమల్ హాసన్ అభిమాన నటుడంటే ఈయనగారి మనసంతా పాడైపోయిందే... తన భార్య పెళ్ళికి ముందే ఇంకోడికి మనసిచ్చి ముద్దు కూడా పెట్టిందని తెలిస్తేనో... ఆ మొహంలో రంగులు కూడా తమాషాగా చూడాలనిపించింది. ఎందరో భర్తలు భార్యల నటనవల్ల మనశ్శాంతిగా బ్రతకగలుగుతున్నారు అనిపించింది. నటన బ్రతుక్కి చాలా ముఖ్యం.

 

    అక్క ఏం చెప్పిందో కానీ ఆయన శాంతించాడు. తర్వాత ఇద్దరూ కలిసి సినిమాకెళ్ళారు.

 

    మరో జంట పరస్పరం మోసపుచ్చుకుంటూ, నాటకాలాడుకుంటూ కాపురం చెయ్యడం మొదలయింది అనడానికి సూచనన్నమాట!

 

    అమ్మా, నాన్నా ఖర్చులు వేసుకుంటున్నారు. వేలిముడి జారిపోయి సిగపాయలు అమ్మ వీపుమీద పరుచుకున్నాయి. వాటి మధ్యలో యుద్ధ ఖైదీలా చిక్కిన ఓ మల్లెమొగ్గల దండ... వారి శృంగారం కుటుంబ భారం మోసి మోసి ఒంగిపోయిన నడుములోంచీ వేలి కొసలలోంచీ జారిపోయినట్లుగా వుంది.

 Previous Page Next Page