Read more!
Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 1

                                 


                               కన్నీటికి వెలువెంత? (కథలు)

                                                                                                 డి. కామేశ్వరి

                                         

 

    ఉదయం పన్నెండున్నర సమయం.
    సరోజినీదేవి మెటర్నిటీ హోమ్ లో డాక్టరు సరోజినీదేవి, ఎమ్.బి.బి.ఎస్.M.D గైనికాలజీ స్పెషలిస్ట్ - ఉదయంనించి  పేషంట్లతో ఉక్కిరిబిక్కిరి అయి కాస్త ఊపిరి పీల్చుకొనే సమయం! ఆవిడ నర్సు చాలా బిజీగా ఆ పూట లెక్కలు, వసూళ్ళు సరిచూసుకుంటూ తలక్రిందులయ్యే సమయం.
    అలాంటి సమయంలో డాక్టరు సరోజినీదేవి తీరికని, నర్సు బిజీనీ చెదరగొడ్తూ ఆమెగారి కారు డ్రైవరు ఆవిడని విసిగిస్తున్నాడు పావుగంట నించి. పదిహేను నిమిషాలనించి డ్రైవరు రంగయ్య చెప్పిందే చెపుతూ, అడిగిందే అడుగుతూ ప్రార్థించిందే ప్రార్థిస్తూ, ఆవిడ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. అయితే సరోజినీదేవి డాక్టరు! అందులో ప్రైవేటు ప్రాక్టీసు కావడంవల్ల అనేక సమయాల్లో ఆవిడ చిరాకుని, కోపాన్ని పైకి కనిపించకుండా వుంచగలగడంలో చాలా ప్రాక్టీసు వుంది కనక మొహానికి నవ్వు పులుముకొనే మృదువుగానే రంగయ్య అభ్యర్థనని తిరస్కరిస్తూంది.
    ఇక్కడ నాకెలా వీలవుతుంది చెప్పు రంగయ్యా? నీవే చూస్తుంటావు పెద్దపెద్ద వాళ్ళందరూ వస్తూంటారు. ఎప్పుడూ ఒక రూము అన్నా ఖాళీగా వుండగా చూశావా? అంటూంది ఆవిడ ఆ అభ్యంతరంతో నయినా వదిలించుకోవాలని.
    "అమ్మమ్మ. అలా అనకండమ్మగారూ. దానికి రూములవీ ఎందుకమ్మా ఏ వరండాలో పక్కేసినా పడుంటుంది. మీ చెయ్యి సల్లటిసెయ్యి, ఏదో మీ దయవల్ల ఈసారన్నా బిడ్డ దక్కుతాడని ఆశ! అంతకంటే ఏం లేదమ్మగారూ!" రంగయ్య జిడ్డులా పట్టుకుని అప్పటికి అరడజనుసార్లు వల్లించిన మాటే మరోసారి అన్నాడు.
    "ఏమిటో నీ పిచ్చి, నీకెందుకు భయం. పెద్దాసుపత్రిలో చేర్పించు. నేను అక్కడి డాక్టర్లతో జాగ్రత్తగా చూడమని ఫోనుచేసి చెపుతా. చూడు ఇక్కడికందరూ పెద్దపెద్దవాళ్ళు వస్తుంటారు.... ఇక్కడయితే చాలా ఖర్చవుతుంది మరి... నీ పెళ్ళాన్ని ఎక్కడుంచడానికి అవుతుంది చెప్పు..."
    రంగయ్య దీనంగా చూశాడు. "మీదయ. మీరలా అనేస్తే నేనేం చెప్పగలను... మూడుసార్లు ముగ్గురు బిడ్డలు_ పుట్టకుండానే ఇద్దరు పుట్టి ఒకడు పోయారు. ఈసారన్నా బిడ్డ దక్కకపోతే దానికి పిచ్చెక్కిపోతుందమ్మగారూ...."
    "అబ్బబ్బ. నీగోల నీదేకాని నా మాట వినిపించుకోవుగదా. నీ పెళ్ళానికేం ఫరవాలేదు. నిన్న చూశాగా. అంతాసవ్యంగానే వుంది. మరో ఇరవై రోజుల్లో కాన్పు రావచ్చు. నెప్పులు రాగానే ఆస్పత్రికి తీసికెళ్ళు. నేను వెంటనే ఫోను చేస్తా వాళ్ళకి. అక్కడ బాగానే చూస్తారు. బిడ్డ చనిపోతే దానికి వాళ్ళేం చేయగలరు చెప్పు. అనవసరంగా నీ భయంగాని.... ఇక్కడుంటే నేనుమాత్రం బిడ్డని బ్రతికించగలనా?...."
    రంగయ్య ఇంకేం చెప్పనన్నట్లు దిగులుగా చూశాడు. నిరుత్సాహంగా.... "ఏదో మీకాడ పనిచేసే ఓడినికదా అని. మీరు దయుంచుతారని అడిగానమ్మగారూ లేకపోతే మాలాంటివాళ్ళకి ఈ నర్సింగు హోము దరిదాపులకి వచ్చే అర్హతలేదని నాకు తెలియదా! ఏదో మీరయితే నాకు భరోసా. ధైర్యం అన్జెప్పి అడిగా నమ్మగారూ.... ....సరే మా రాతెట్లా వుంటే అట్లాగే అవుతుందిలెండి" అన్నాడు బాధగా.
    అదే సమయంలో నిగనిగలాడ్తున్న ఓ పెద్ద నల్లనికారు వచ్చి మెటర్నిటీ హోము పోర్టికోలో ఆగింది. ఆ కారుని దానిలోంచి దిగుతున్న ఖరీదయిన మనుష్యులని చూడగానే "ఆ....ఆ....సరేసరే తర్వాత చూద్దాంలే.... ఇంకా టైముందిగా ఆ వేళకి ఖాళీ వుంటే డెలివరీ ఇక్కడే చేయిస్తాలే.... ఇంక వెళ్ళు ఎవరో వచ్చారు" అంటూ హడావుడి పడింది సరోజినీదేవి.
    ఆ కాస్త మాటకే రంగయ్య మొహం కళకళలాడింది. "దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడమ్మగారూ...." అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
    సూటు బూటుతో వున్న ఏభై దాటిన ఆయన, ఆయన వెనకాల పట్టుచీరెలో నలభై దాటిన స్త్రీ, ఆవిడ ప్రక్కన నెలలునిండి అతి సుకుమారంగా కన్పిస్తున్న ఓ యువతిని గదిలోంచే చూసింది సరోజినీదేవి. వచ్చినవాళ్ళ అంతస్థుల్ని__ వాళ్ళ కార్లనీ, ఖరీదయిన బట్టల్ని చూసి నిర్ణయించడం సరోజినీదేవికి అలవాటయిన పని__ గుమ్మంలో వాళ్లని చూస్తూనే రోగం తెల్సుకోకుండానే వాళ్ళ బిల్లుల్ని మనసులో నిర్ణయించుకోడం సరోజినీదేవి హాబీ! ఇప్పుడు ఖరీదయిన ఇంపాలాకారు రెపరెపలాడే సిల్కుచీరాలు చూస్తూనే ఎన్నో పచ్చనోట్లు ఆమె మనసులో కదలాడాయి.
    మామూలు అలవాటు ప్రకారం ముందుగదిలో నర్సు వచ్చిన పేషెంట్లని రిసీవ్ చేసుకొని ఎందుకొచ్చారో, పేరేమిటో, వూరేమిటో వివరాలు అడిగి, ముందుగా అప్పాయింట్ మెంటు అది ఉందోలేదో మొదలయిన లాంఛనాలన్నీ పూర్తిచేసిగాని డాక్టరు దగ్గిరకి తీసికెళ్ళదు. అలా తీసికెళ్లిన పేషెంట్లని డాక్టరు అతి బిజీగా ఏదోరాస్తూ మధ్యలో వచ్చిన వారికేసి చూడకుండానే చేయి వూపుతుంది కూర్చోమని. ఆ తరువాత ఆ రాసే బ్రహ్మరాత ఆపి తలెత్తి అతి మనోహరంగా ఓ నవ్వునవ్వి పేషెంట్లని సమ్మోహితులని చేస్తుంది. ఆ తర్వాత అసలు కార్యక్రమానికి నాందీగా, "వాట్ కెనయ్ డూ ఫర్ యు" అంటూ అతి వినయంగా,అ అతి శ్రద్ధచూపుతూ వారికోసమే తనక్కడ ఎదురుచూస్తూ కూర్చున్నట్లు అడుగుతుంది.
    ఆ రోజూ అదే తంతు జరిగింది. ఆ వచ్చిన పెద్దమనిషి గొంతు సవరించుకొన్నాడు.... "ఈ అమ్మాయ్, మా అమ్మాయి.... తొమ్మిదో నెల వచ్చింది.... ఓసారి చూపించి రూము కాస్త ముందుగా బుక్ చేసుకుందాం అని...."
    "మంచిపని చేశారు. మా నర్సింగ్ హోంలో కనీసం పదిహేను రోజుల ముందన్నా రూము రిజర్వ్ చేసుకోకపోతే ఖాళీ వుండదు...." అంది సందు దొరగ్గానే తనెంత బిజీ డాక్టరో వివరిస్తూ.
    "ఆ....ఆ.... అలా అనే మేమూ విన్నాం. అందుకేవచ్చాం. మీరోసారి అమ్మాయిని చూసి ఏ తేదీల్లో పురుడు రావచ్చో చెబితే రూము రిజర్వ్ చేసుకుంటాం...." అన్నాడాయన.
    "ఆ.... అలాగే నీ పేరేమిటమ్మా...." ఆ అమ్మాయి వంక తిరిగి నవ్వుతూ ప్రశ్నించింది సరోజిని. ఆ అమ్మాయి వచ్చిందగ్గరనుంచి చాలా అనీజీగా కూర్చుంది. పాలిపోయినట్లున్న మొహంలో ఏదో బెదురు ఆదుర్దా కాక ఇంకా ఏవేవో భావాలు ఆమె మొహంలో మెదలడం డాక్టరు దృష్టిని దాటిపోలేదు. తప్పుపని చేసిన పసిపిల్ల తల్లి దృష్టినుంచి తప్పించుకొన్నట్లుగా ఆమె చూపులు బెదురుతూ ఇటూ అటూ చూస్తున్నాయి. డాక్టరు ప్రశ్నకి ఆ అమ్మాయి బదులు తల్లి జవాబిచ్చింది. అమ్మాయి పేరు "మాధవి" అంది.
    "అమ్మాయికి మొదటి కాన్పేనా! అల్లుడుగారేంచేస్తున్నారు?"
    ఆయన, ఆవిడ చప్పున మొహాలు చూసుకున్నారు. జవాబు చెప్పడానికి గుటకలు మింగారిద్దరూ. అలాంటి ప్రశ్నలు అడగడం అలవాటుతప్ప వాళ్ళ జవాబులు వినే ఓపిక, ఇంటరెస్ట్ లేని సరోజినీదేవి వాళ్ళు జవాబు ఈయడానికి గుటకలు మింగడం చూడలేదు.
    "ఆ.... మొదటి కాన్పే." అన్నాడాయన కాస్సేపటికి. అప్పటికే కుర్చీలోంచి లేచి "నర్స్ అమ్మాయిని గదిలోకి తీసికెళ్ళు" అంది డాక్టరు.
    అమ్మాయిని పరీక్షించడం అయ్యాక.... "అమ్మాయి చాలా బలహీనంగా వుంది. మందులు టానిక్కులు అవి ఏం ఇప్పించడం లేదా?" అంది అలవాటయిన ఆదుర్దాని గొంతులో చొప్పించి. డాక్టరుకి అలా అనడం అలవాటు. మామూలు అని తెలియని తల్లిదండ్రులు ఆందోళనగా మొహాలు చూసుకున్నారు.

Next Page