దశావతారాలు
సి.ఆనందారామం
"నేను సంస్కారవంతుణ్ని తప్ప పెళ్ళిచేసుకోను_" అంది లక్ష్మి.
సావిత్రి ఎప్పటిలాగే నవ్వింది ఉదాసీనంగా... సావిత్రిని కలుసుకున్నప్పుడల్లా తప్పకుండా లక్ష్మి పై మాటలంటుంది_ ఆ మాటలు ఎప్పుడు విన్నా సావిత్రి ఉదాసీనంగా నవ్వేస్తుంది_ అలాంటిది అసంభవం అన్నట్లు...
జీవితంలో ఎవరైనా, ఏ విషయమైనా తమ పరిధిలో తమ అనుభవాన్నిబట్టి అన్వయించుకుంటారు.
సావిత్రికి వివాహంలో, వివాహపు విలువల్లో నమ్మకం నశించిపోయింది_మొగవాళ్ళలో సంస్కారం ఉంటుందంటే నవ్వే స్థితికి చేరుకుంది! పాపం; సావిత్రిని అనవలసిన అవసరం లేదు_ సావిత్రిలాంటి జీవితం అనుభవించిన ఎవరైనా అదే దశకు చేరుకుంటారు.
సావిత్రి చదువుకుంది, అందమైనది - అయినింట్లో పుట్టింది- తండ్రి పదివేలు కట్నమిచ్చి అందమైనవాణ్నీ చదువుకున్నవాణ్నీ, ఉద్యోగస్థుణ్నీ, వెతికి తెచ్చి పెళ్ళిచేసాడు__పెళ్ళిపీటల మీద వధూవరుల్ని చూసి అందరూ సావిత్రి చాలా అదృష్టవంతురాలన్నారు - సావిత్రి కూడా అలాగే అనుకుంది...
నిజ జీవితంలో ఏ మొదటిరాత్రీ సినిమాల్లో చూపించినట్లు ఉండదు - సావిత్రికి మాత్రం మొదటిరాత్రి ఏ సినిమా కథలోను కనిపించనంత అద్భుతంగా గడిచింది ... "నన్ను గురించి నేను చెప్పుకోకూడదు - కానీ, నేను గొప్ప సంస్కారభావాలు కలవాణ్నే__"
సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు కాశీపతి_
"నేను చాలా గొప్ప కవిత్వం వ్రాస్తాను. ఆ కవిత్వం చదివిన మా ఫ్రెండ్ మిస్. వీణ పరవశించిపోతూ "అబ్బ! ఎంత అద్భుతంగా వ్రాస్తారండీ! ఇలా కవిత్వం వ్రాయగలిగిన వాళ్ళెవరు ఆంధ్రదేశంలో?..." అంది..."
ఉలిక్కిపడింది సావిత్రి_
ఇతడు కవా! ఎన్నడూ ఏపత్రికనూ ఇతని కవిత్వంలో చూడలేదు... కవిగా ఇతనిపేరు వినలేదు...
"ఎందుకలా అయిపోయావ్? మిస్. వీణ నా కవిత్వం మెచ్చుకుందంటే ఈర్ష్యగా వుందికదూ!"
ఇతడు కవి అట? ఆ కవిత్వాన్ని ఎవరో మెచ్చుకున్నారట! అందుకు తను ఈర్ష్యపడుతోందట!
పకపక నవ్వేసింది సావిత్రి...
"ఏయ్! ఎందుకలా నవ్వుతావ్?"
సహజంగా సావిత్రి తెలివైనది. చురుకైనది. భర్త తనతో పరిహాసాలు చెయ్యచ్చుననుకుంది.
"మీ కవిత్వం ఎలాంటి అస్తినాస్తివి చికిత్సాహేతువైన విషయమో, మిస్. వీణ కూడ అలాంటిదే అయి ఉండాలి! మిగిలిన మీ మాటలు అలాంటివే అయి వుంటాయి! ఈ మాత్రం భాగ్యానికే నన్ను ఈర్ష్యపడమన్నారా."
ఈ మాటలు వింటూనే మండిపోయాడు కాశీపతి... "రాస్కెల్ ! రోగ్ ! డర్టీ క్రీచర్ ... అని వచ్చినంత వరకు ఇంగ్లీషు తిట్లు ఆ తరువాత "పెంటముండ, లంజముండ ..." ఇత్యాది తెలుగు తిట్లలోకి దూకాడు...
తాను సంస్కారినని చెప్పుకున్న ఆ ఆధునిక యువకుని నోట అనర్గళంగా కురుస్తోన్న ఆ వాక్ప్రవాహానికి విస్తుపోయింది సావిత్రి- బిత్తరపోయి చూసింది...
సావిత్రి తెలివైనదే గాని గడసైనది కాదు. చురుకైనదే కాని, గయ్యాళిది కాదు. చమత్కరిస్తూ పరిహాసాలు చెయ్యగలదేకాని, తిట్టిపోయటం చేతకాదు ...
మరీ, మొదటిరాత్రి తన భర్త తననిలా తిట్టిపోస్తున్నాడని అనుకోలేక, అదంతా కూడా పరిహాసంగా మార్చడానికి ప్రయత్నిస్తూ "ఏమిటీ? మీ కవిత్వం నాక్కూడా వినిపిస్తున్నారా? అయితే మిస్. వీణ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. ఇలాంటి కవిత్వం ఆంధ్రదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరూ వ్రాయలేరు..!" అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ...
వెంటనే సావిత్రి చెంపలు టపటప వాయించేసాడు కాశీపతి ...
సావిత్రికి సహనముంది. కానీ, ఆ సహనానికి ఒక హద్దుంది ...
చేత్తో కాశీపతిని దూరంగా నెడుతూ "జాగ్రత్త ! నా వంటిమీద చెయ్యి వెయ్యడానికి వీల్లేదు !" అంది ...
సావిత్రి తగ్గినంతవరకూ రెచ్చిపోయిన కాశీపతి సావిత్రి ఎదురు తిరగ్గానే కాస్త తగ్గాడు.
"ఏమిటే? వంటిమీద చెయ్యి వెయ్యడానికి వీల్లేదూ! అయితే సరే !" అంటూ కోపంగా ముసుగు పెట్టుకుని పడుకున్నాడు.
సావిత్రికి తలంతా దిమ్మెత్తిపోయినట్లు అనిపించింది... ఏం జరుగుతుందో, అందులో తన బాధ్యత ఎంతవరకో ఆలోచించినా అర్ధంకాలేదు. మొదటరాత్రి అని కవులు కథకులు ఎంతో గొప్పగా వర్ణించే రాత్రి ఇలా గడవటం సావిత్రికి కష్టంగానే ఉన్నా, నిష్కారణంగా తనను చెంప మీద కొట్టిన కాశీపతిని తానే బ్రతిమాలుకోవటానికి మాత్రం మనస్కరించలేదు.
వారం రోజులు గడిచాయి. కాశీపతి ధోరణిలో మార్పులేదు. సావిత్రికి భయంవేసింది. భర్తతో తెగతెంపులు చేసుకోవాలనీ, సంసారం వదులుకుపోవాలనీ సావిత్రికి లేదు. అంచేత తనే తగ్గింది. ఆ రోజు కాఫీ అందించి సిగ్గువదలి తనే బుగ్గమీద చిటిక వేసింది ...
"ఛ ! ఛ ! దూరంగా వుండు !" చీదరించుకున్నాడు కాశీపతి ...
సావిత్రి ప్రాణం చచ్చిపోయింది ...
"వంటిమీద చెయ్యి వెయ్యద్దన్నావు. ఏ మొఖం పెట్టుకుని నా దగ్గిరకు వస్తున్నావ్ ?" అన్నాడు మొఖం కాండ్రించుకుంటూ ...
"మీరు కవులు కదూ ! వంటి మీద చెయ్యి వెయ్యద్దు అని నేనన్నది ఏ అర్ధంలో ?..."
"నోర్ముయ్ ! వెక్కిరిస్తున్నావా? నా కవిత్వం నీ బోటి వంటలక్కలకి అర్ధం కాదులే !"
"వెక్కిరించటం లేదు. ఓకే మాటకి ఆయా సందర్భాలను బట్టి వేరు అర్దాలొస్తాయని అంటున్నాను_ ఒక అర్ధంలో నేను అన్న మాటలని వేరొక అర్ధంలొ అన్వయించి రాద్దాంతం చెయ్యద్దంటున్నాను..."
"నాది రాద్ధాంతమా ! ఫూల్ ! నీకే అన్నీ తెలుసుననుకోకు! అసలు నీకేమీ తెలియదు. ఒట్టి మొద్దువి. నిన్ను పెళ్ళి చేసుకోవటం నాది బుద్ధి తక్కువ... కాలేజీలో చదివే రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలు నన్ను ప్రేమించారో తెలుసా? సరోజ రోజుకొక ప్రేమలేఖ వ్రాసేది. ఆశాలత నన్ను తప్ప ఎవ్వరినీ పెళ్ళి చేసుకోనని బాహాటంగా ప్రకటించింది. రాగిణి కూడా ఏదో ఒక వంకతో మా రూంకే వచ్చేసేది ..."
అతని ధోరణి అప్పట్లో ఆపటం కష్టమని ఆ కాస్త పరిచయంలోనే అర్ధం చేసుకున్న సావిత్రి గంటన్నర వరకు అతడు చెప్పిన ప్రేమ కధలన్నీ విని, శాంతంగా "మీరే కాలేజిలొ చదివారూ?" అంది... ఇలాంటి ఆడపిల్లలుండే కాలేజి ఏమిటబ్బా ! అదే ఆశ్చర్యాన్ని లీలగా ధ్వనింప చేస్తూ ...
ఇంత సున్నితమైన వ్యంగ్యం అతనికర్ధం కాలేదు. తన ధోరణిలో తను గర్వంగా "సూర్యారావు కాలేజీలో చదివాను" అన్నాడు...
సావిత్రి ఈసారి నిజంగా ఆశ్చర్యపోతూ "సూర్యరావు కాలేజీయా" అంది ...
అప్పుడు గుర్తొచ్చింది కాశీపతికి. ఆ కాలేజి కో-యెడ్యుకేషన్ కాలేజి కాదనీ, ఆడపిల్లలు అసలు లేరనీ ...
"సూర్యారావు కాలేజి కాదు. సుకుమారీ కాలేజి. పొరపాటున అన్నాను" అన్నాడు...
సుకుమారీ కాలేజి అనేది ఉందో, లేదో, అనిపించింది సావిత్రికి ...
అల్లరిగా "నేను సుకుమారీ కాలేజీలోనే చదివాను. మీకు ప్రేమలేఖలు వ్రాసిన వాళ్ళలో నేనూ ఉన్నానా" అంది..