Read more!
Next Page 
రక్షరేకు పేజి 1

                                 

       
                                                       రక్షరేకు

                                                                         డా.సి. ఆనందరామం

                                 
    ఆ ఇంట్లో ప్రభాతగానం ప్రారంభమయింది. ప్రభాతగానమంటే, భజనగీతాలు కావు - ప్రార్థనా శ్లోకాలూ కావు- కోటయ్య అరుపులు.
    తెల్లవారి లేస్తూనే అంబలిలో ఉప్పు ఎక్కువయిందనో, తక్కువయిందనో, రొట్టి ఎక్కువ కాలిందనో, సరిగా కాలలేదనో, అన్నమ్మ మీద అరవటం ప్రారంభిస్తాడు కోటయ్య....
    అప్పుడప్పుడు అరుపులతోపాటు, అన్నమ్మ వీపుమీదదరువులు కూడా వేస్తుంటాడు. అవన్నీ కోటయ్య కళాకళలు, అన్నమ్మ అదృష్టం....
    ఆ రోజు దభీ దభీమని గుద్దులు కూడా వినిపిస్తోంటే, గుడిసెలో మట్టిగోడకి కరుచుకుపోయి బిక్కచచ్చి కూచుండిపోయారు పిల్లలు ముగ్గురూ....
    పెద్దవాడు జైహింద్ బాబు. కోటయ్యకి దేశభక్తి బాగా ముదిరి "జైహింద్ బాబు" అని కొడుక్కి పేరు పెట్టుకొన్నాడు. ఆపేరు పిలవటం చేతకాక "జయన్ బాబు" లోకి దింపాడు.
    అతని దేశభక్తి లాగానే కొడుక్కి పెట్టుకున్న పేరు కూడా అనేక అపభ్రంశ రూపాలనిపొందింది.
    ఆతరువాతది రత్నమ్మ..... సామాన్యమైన రూపురేఖలు. ఆఖరుపిల్ల సుందరీబాయి- సార్థక నామథేయురాలు.
    అరిచి. అరిచి అలిసిపోయి బయటకు పోయాడు కోటయ్య-
    రేగిన జుట్టు గోళ్ళతో వెనక్కు దువ్వుకుంటూ- కన్నీటి చారికలు కట్టిన ముఖాన్ని కొంగుతో తుడుచుకుంటూ పిల్లల దగ్గరకొచ్చింది అన్నమ్మ.
    పిల్లలు ముగ్గురూ భయంగా తల్లి ముఖంలోకి చూశారు. ఆ ముఖాల్లోకి చూస్తూ నవ్వింది అన్నమ్మ. అది చూసి పిల్లలూ నవ్వారు.
    "లెగండి రొట్టె తిందురుగాని - " అని ముగ్గుర్ని పిలిచింది అన్నమ్మ. పిల్లలు ముగ్గురూ లేచి మొహాలు కడిగిన తరువాత, వాళ్ళకు రొట్టె పెట్టింది, అంబలి ఇచ్చింది.
    "ఒరేయ్! జయన్! మొన్న పండక్కి కుట్టించిన నిక్కరు, చొక్కా వేసుకోరా! అమ్మగారు నిన్ను బళ్ళో ఏస్తానన్నారు" అంది.
    జైహింద్ బాబు హుషారుగా తయారయ్యాడు.
    గుడిసెముందు ఎత్తుగా ఇటుకరాళ్ళు పేర్చివాటిమీద బల్లపెట్టి చిన్నదుకాణం తయారుచేసింది అన్నమ్మ. ఆ బల్లమీద చిన్న చిన్న సీసాలలో వేరుసెనగ ఉండలు, మరమరాల ఉండలు, పిప్పరమెంట్లు మొదలయినవి పెట్టింది. ఒక జంగిట్లో చక్కిలాలు పెట్టింది.
    చిన్నకూతురు సుందరీబాయిని బల్లముందు కూచోబెట్టి "ఇదిగో! జాగరతగా అమ్ము! ఆడకీడకీ పోబోకు - ఆ ఉండలు మూడుపైసలకొకటి- ఈ ఉండలు పదిపైసలకొకటి...... చక్కలాలు చిన్నయి మూడుపైసలు- పెద్దయి ఆరుపైసలు- డబ్బులు లెక్కబెట్టి తీసుకో" అంది - బుద్ధిగా తల ఊపింది సుందరీబాయి.
    పెద్దకూతురు రత్నమ్మని "రాయే రత్తీ! యిద్దరం చూసుకుంటే పని తొరగా తెములుద్ది. నీకూ అలవాటవుద్ది" అని రత్నమ్మని తనతో బయలుదేరతీసింది.
    రత్నమ్మతోనూ జైహింద్ బాబుతోనూ కలిసి అన్నమ్మ నాలుగడుగులు వేసేసరికి చంద్ర చెయ్యి పుచ్చుకుని నాగమ్మకూడా కలిసింది.....
    "జయన్ బాబుని ఒళ్ళో యేస్తన్నారా? మా చెంద్రిని కూడా యేస్తున్నా" అంది నాగమ్మ.
    "యెయ్యి వదినా! యిద్దరూ జతగా ఉంటారు. మా అమ్మగారి పున్నెమా అని ఈణ్ని బళ్ళో యేస్తన్నాను. మనం జీతం గీతం కట్టక్కరలేదంట. యెదురు అల్లే మన కులాళ్ళకి స్కాలర్ సిప్ప, అదేదో యిస్తారంట! అయ్యన్నీ అమ్మగారు చూసుకుంటానన్నారు" అంది అన్నమ్మ.
     "మా అమ్మగారు కర్కోటకపుముండ! ఎంతసేపూ చాకిరీ చెయ్యమంటదేకాని, యెంగిలి చెయ్యి యిదపదు- అమ్మాయిని నేను బళ్ళో యేస్తన్నా! జీతం గీతం, అయ్యన్నీ మావోడు సూసుకుంటాడు లే!" గర్వంగా అంది నాగమ్మ-
    "అది చాలా పెద్దసిటీ! అంత పెద్ద సిటీలో సిటీ నడిబొడ్డునకాక కొంతదూరంగా వున్న లొకేలిటీలో మధ్య తరగతి గృహస్థుల యిళ్ళలో పనిచేస్తున్నారు అన్నమ్మ నాగమ్మ-
    ఆ లొకేలిటీకి కొంచెందూరంలో సువిశాలమైన మైదానం ఉంది- అది కంటోన్ మెంట్ వారికి చెందినది- అక్కడ యిళ్ళు కట్టుకోవటానికి అనుమతి లేకపోవటంవల్ల ఆ స్థలం అధికారులు ఆ స్థలాన్ని ఖాళీగా వదిలేశారు-
    కూలినాలి జనం చాలామంది అధికారులకు చెప్పి కొందరూ, చెప్పక కొందరూ, బ్రతిమాలుకుని కొందరూ పొగరుబోతులై కొందరూ..... ఇలా రకరకాలుగా ఎలాగో ఒకలాగ ఆ స్థలాన్ని ఆక్రమించుకుని గుడిసెలు వేసేసుకున్నారు-
    చూస్తూ వుండగా ఆప్రాంతం ఒక కూలివాడిగా తయారయిపోయింది. వాళ్ళకు తమరయిపోయింది. వాళ్ళకు తమ తరతరాల వారసత్వంగా చెప్పుకోవటానికి సంపదలూ లేవు- పేరు ప్రఖ్యాతులూ లేవు అంచేత తమకున్న మూఢవిశ్వాసాలనూ, మూర్ఖాచారాలనూ ప్రాణప్రదంగా పట్టుకు ప్రాకులాడుతుంటారు-
    అన్నమ్మ ఒక స్కూల్ టీచర్ యింటిలో పనిచేస్తోంది. అన్నమ్మ చాలా మంచిది. ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తుంది. నిజాయితీగా వుంటుంది. అంచేత ఆ టీచరమ్మకి అన్నమ్మ అంటే అభిమానం. జైహింద్ బాబును బళ్ళో చేర్పించమని టీచరమ్మే చెప్పింది. స్కాలర్ షిప్ వచ్చేలా చూస్తానని కూడా అంది.
    టీచరమ్మ భర్త ఆఫీస్ లో అప్పర్ డివిజన్ గుమాస్తా.వాళ్ళకి యిద్దరు పిల్లలు- ఆ పిల్లల్ని కూడా అభిమానంగా చూస్తుంది అన్నమ్మ. అంచేత పిల్లలకీ, గుమాస్తాగారికీ కూడా అన్నమ్మ అంటే అభిమానమే!
    అన్నమ్మ మొగుడు కోటయ్య తిన్ననైనవాడు కాదు- ఎన్నడూ ఒక ఉద్యోగంలో సరిగా వుండడు. బాగా తాగుతాడు. తాగిన మైకంలోనే కాక, కోపం వచ్చినప్పుడల్లా భార్యని కొడతాడు. అతనికి కోపం ఎప్పుడూ వస్తుంది. తండ్రిని కోపం లేకుండా ఎప్పుడూ చూడలేదు పిల్లలు-
    అన్నమ్మ మంచితనాన్ని బట్టి, కోటయ్య ప్రవర్తనను గురించి తెలుసుకున్న టీచరమ్మకి, అన్నమ్మమీద మరింత అనుభూతి.
    నాగమ్మ పరమగయ్యాళిది - దాన్ని రాజయ్య లేవదీసుకొచ్చాడు. మొదటి పెళ్ళాన్నీ, కొడుకునీ, తన వూళ్ళో వదిలేసి నాగమ్మతో సిటీ కొచ్చేశాడు.

Next Page