మోదుగుపూలు
_ డా|| దాశరధి రంగాచార్య
ఆసప్జాహీ వంశానికి ఆదిపురుషుడు ఆసప్జాహ్ బహద్దూర్. అతడు గొప్ప సేనాని. రాజనీతిజ్ఞుడు, అందువల్లనే ఔరంగజేబుకు అతి సన్నిహితుడైనాడు. అతడంటే చక్రవర్తికి ఎంతో నమ్మకం. ఆ నమ్మకంతోనే 1713లో ఆసప్జాహ్ ను దక్కనుకు సుబేదారుగా నియమించాడు. నిజాముల్ముల్క్ అనే బిరుదు ఇచ్చాడు. "నిజామ్" అంటే పారిపాలకుడు అని అర్థం. ఆ వంశంవారు నేటికి ఆ పేరుతోనే పిలువబడుతున్నారు.
ఔరంగజేబు అనంతరం మొగల్ సామ్రాజ్యం క్షీణదశకు వచ్చింది. అదను కనిపెట్టి సుబేదార్ ఆసప్జాహ్ స్వాతంత్ర్యం ప్రకటించాడు. కూలిపోతున్న మొగలు దర్బారు దాన్ని సహించలేకపోయింది. అయితే ఎదిరించే సాహసమూ లేకపోయింది. అప్పటికి 'ఖాందేశ్'ను ముబారక్ ఖాన్ అనే సుబేదార్ పాలిస్తున్నాడు. మొగలు దర్బారు అతనిని ప్రోత్సహించింది. ఆసప్జాహ్ మీద దండెత్తవలసిందని పురికొల్పింది. ముబారక్ ఖాన్ దక్కన్ మీద దండెత్తాడు. బిరార్ లోని 'షకర్ ఖేల్డా' అనే ప్రాంతంలో 1724లో యుద్ధం జరిగింది. యుద్ధంలో ముబారక్ ఖాన్ ఓడిపోయాడు. హతుడైనాడు.
షకర్ ఖేల్డా విజయం ఆసప్జాహ్ ను సర్వతంత్ర స్వతంత్రుణ్ణీ, సార్వభౌముణ్ణీ చేసింది. బిరార్ ను తన రాజ్యంలో కలుపుకున్నాడు ఆసప్జాహ్ వంశీయులు ఏడు తరాలవారు అవిచ్చిన్నంగా నైజాం రాజ్యాన్ని పాలించారు.
ఆ వంశంలో చివరివాడు మీర్ ఉస్మానలీఖాన్. అతనికున్న బిరుదులు బోలెడు. హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్, లెఫ్టినెంట్ జనరల్, సిపహ్ సాలర్, ఆసప్జాహ్ ముజప్పరుల్ ముల్క్ వాల్ ముమాలిక్, నిజాముల్ముల్క్ నిజముద్దౌలా, నవాబ్ మీర్ ఉస్మానలీ ఖాన్ బహద్దుర్, ఫతేహ్ జంగ్, జి.ఫై, ఎస్.ఐ, జి.బి.ఇ. సుల్తానుల్ ఉలూమ్. 1911 నుంచి 1948 వరకు నిరంకుశంగా రాజ్యం చేశాడు. అతడు పాలించినంత కాలమూ ప్రజలకు కనీసం సమావేశాలు జరుపుకొనే స్వేచ్చకూడా లేదు. కనీసపు హక్కులులేని కరకు తురక రాజ్యం అది.
నైజాం రాజ్యపు విస్తీర్ణం 82,000 చదరపు మైళ్ళు - ఇంగ్లండు, స్కాట్లెండ్ కలిపిన వైశాల్యాన్ని మించింది. నామమాత్రపు ప్రభువు నైజాం ప్రభుత్వం కూడా రాజ్యమంతటా ఉండేది కాదు. ఈ రాజ్యంలో ప్రభువు వారి స్వంత వ్యయానికి ఉండిన సర్ఫెఖాస్ వైశాల్యం 8,100 చదరపు మైళ్ళు. నిజాం బంధువులకు చెందిన పాయెగాల విస్తీర్ణం 3262 చదరపు మైళ్ళు. రాష్ట్ర వ్యాపితంగా ఉండిన 1167 జాగీర్ల వైశాల్యం 11000 చదరపు మైళ్ళు. ఈ 12362 చదరపు మైళ్ళలో ప్రభుత్వం మృగ్యం. నైజాం నవాబును తలదన్నినవారు జాగీర్దార్లు.
జాగీర్లలోని ప్రజలకు నిజాం ప్రభుత్వం క్రింద ఉండిన 'ఖాల్సా' ప్రాంతపు ప్రజలకుండిన నామమాత్రపు హక్కులుకూడా లేవు. కనీసం సెటిల్మెంటు ఎరుగరు ఆ ప్రజలు. పన్నులు మాత్రం 209 రకాలకు పైబడి చెల్లించాలి. జాగీర్దారు ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు, చచ్చినపుడు, పెండ్లి అయినపుడు, జాగీర్దారు కారు కొన్నప్పుడు, యాత్ర చేసినపుడు ప్రజలు పన్నులు చెల్లించుకోవాలి.
అందరు జాగీర్దార్లకు పోలీసు న్యాయ విచారణాధికారాలు ఉండేవికావు. అది ఉన్న జాగీర్దారు స్వతంత్ర ప్రభువు. అతనికి బాధ్యతలు లేవు. ఉండేది హైద్రాబాదులో. గడిపేది జల్సా జీవితం. అతడు చేయవలసిందల్లా నిజాం నవాబు యిచ్చే ప్రతి షాంపెన్ పెగ్గుకు లక్ష చెల్లించడం.
అలాంటి ఒక జాగీర్దారు జాగీరులో ఒక రైలు స్టేషను....
రెండో ప్రపంచ యుద్ధంవల్ల రైళ్ళు ఆలస్యంగా రావడం మామూలు అయిపోయింది. పని ఉన్నా లేకున్నా బండి సమయానికి స్టేషనుకు రావడం చాలామందికి అలవాటు. అలా వచ్చేవాళ్ళల్లో అనేక రకాల జనం ఉంటారు. ఒక్కొక్కరు తమరకపు జనంతోకూడి ప్లాట్ ఫారం మీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు.
బండి లేటు కావడంతో ప్లాట్ ఫారం మీద జనం ఎక్కువగా ఉన్నారు. బండి జెర్రిపోతులా వచ్చి ప్లాట్ ఫారం మీద ఆగింది. జనంలో హడావుడి ఎక్కువైంది. ఎక్కేవారు తక్కువే అయినా బండిని పరిశీలించడానికి వచ్చిన జనం ఇటు చివర నుండి అటు చివరిదాకా సర్వే చేస్తున్నారు.
ఒక వ్యక్తి బండి దిగాడు. అతడు పొడవరి, బలిష్టుడు. కళ్ళు చిన్నవి. ముక్కు కాస్త పెద్దది. వెంట్రుకలు దగ్గరికి కత్తిరించి ఉన్నాయి. ధోవతి ధరించి లాల్చి వేసుకున్నాడు. అందరి ధ్యానమూ అతని మీద కేంద్రీకృతం అయింది. అతని అందాన్ని చూచిగాని అతని దుస్తులు చూచిగాని జనం అతన్ని వింతగా చూడ్డంలేదు. అతని చేతిలో పేపరుండడం - అదీ ఇంగ్లీషు పేపరు కావడం వారందరి ఆశ్చర్యానికి కారణం. జనంలో గుసగుసలు బయలుదేరాయి. అసలు అక్కడ దిగే వాడు కాడని కొందరు, బండి కదిలితే ఎక్కి పోతాడని కొందరు, అయినా పేపరు చదువుకునేవాడు బండ్లో చదువుకోవచ్చునుగా అని కొందరూ అనుకున్నారు. అతడు ఊళ్ళోకి వస్తే బాగుండునని కొందరు యువకులు ఉత్సాహపడగా, రైలు కదిలితే ఎక్కి వెళ్ళిపోతే పీడా విరగడ అవుతుందనుకున్నారు కొందరు నడివయసువారు.
మొత్తంమీద అంతా రైలు కదలడాన్ని చూడాలని ఆతురత పడసాగారు. కాని సుఁయ్ మని ఆవిరి వదులుతూ ఇంజను కదలకుండా నిలుచుంది. డ్రైవరూ ఆయిల్ మన్ ఇంజన్ నుంచి దిగి సిగరెట్లు కాలుస్తూ నుంచున్నారు. కోల్ మన్ మండే అగ్గిలోకి బొగ్గు చిమ్ముతున్నాడు.
బండి కదిలేట్టులేదు, ఏదో క్రాసింగ్ ఉన్నట్లుంది.
జనంలో ఆ దిగిన వ్యక్తిని గురించిన ఉత్సుకత ఎక్కువ అవుతూంది. కాని ఎవరికీ అతని దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం చాలడంలేదు. మొత్తం మీద అందరూ నిర్ణయించుకొన్నదేమంటే బండి కదిలితే ఎక్కి పోతాడని. అందువల్ల ఉత్సాహవంతులకు నిరుత్సాహమూ, నిరుత్సాహవంతులకు ఉత్సాహమూ కలిగాయి.
ఈలోగా ఒక మిలటరీ స్పెషల్ రానే వచ్చింది. దూసుకొని పోనూపోయింది. ఆగలేదు. స్టేషన్ లో ఆగదు. అది యుద్ధానికి వెళుతూంది. దిగిన డ్రైవరు సిగరెట్టు పారేసి ఇంజన్ లోకి ఎక్కాడు. బండి విజిల్ ఇచ్చింది. సాగిపోయింది. జనం గేటువైపు సాగారు. అతడు - ఆ పేపరు మనిషి - సాగాడు. గేటు దగ్గర గుంపుగా కూడిన జనం తప్పుకున్నారు. అతనికి దారి ఇచ్చారు. స్టేషను మాష్టారు టిక్కెట్టు అడిగాడు. అతడు ఇచ్చాడు. ఇద్దరూ ఇంగ్లీషులో మాట్లాడుకున్నారు.
"పేపరు ఊళ్ళోకి తీసికెళ్తారా? ప్రమాదం నెత్తి నెందుకు తెచ్చుకుంటారు? ఇక్కడ పడేసి వెళ్ళండి."
"ఏం ఈ పత్రిక అనుమతింపబడిందే, దీనిమీద నిషేధంలేదే?"
"మీ మేలుకోరి చెబుతున్నాను. ఇది "ఖాల్సా" కాదు, జాగీరు. ఇక్కడ మీ ఖానూన్లు పనికిరావు."
"థాంక్స్. ఫరవాలేదులెండి" అని రెండడుగులు వేసినవాణ్ణి మళ్ళీ పిలిచాడు మాస్టరు.
"మిస్టర్! మీరు కొత్తవారివలె కనిపిస్తున్నారు. పేపరు పడేసి వెళ్ళండి. కావాలంటే ఖరీదు ఇస్తాను. ఇది జాగీరు. జాగీరు పరిస్థితులు మీకు తెలియనట్లున్నాయి."
జవాబుగా చిరునవ్వు నవ్వాడు. సాగిపోయాడతను.
"కొరివితో తలగోక్కుంటున్నాడు" అని స్టేషను మాస్టారు జనంవైపు చూచాడు.
"ఆంగ్రేజు బాగా మాట్లాడిండా?" అడిగాడొక పొట్టి మనిషి.
"బాగానే మాట్లాడిండు. కాని తాసిల్దారు తడాఖా తెల్వనట్లున్నది" అన్నాడు మాస్టరు.
అడిగినవాడు మారు మాట్లాడలేదు. పేపరు మనిషిని అనుసరించాడు.
కొంత దూరం వెళ్ళింతర్వాత కరోడ్గిరి జవాను ఆపాడు. పేపరు మనిషిని.
నైజాం రాజ్యంలోకి వచ్చే సరుకులమీద కస్టమ్స్ విధించే శాఖ కరోడ్గిరి. కరోడ్గిరీ నాకాలు - కస్టమ్స్ చౌకీలు - ప్రతిస్టేషను దగ్గర ఉండేవి. ప్రయాణీకులను పీడించి లంచాలు వసూలుచేయడానికి ఏర్పడిన శాఖ అది. దాని తాలూకు ఇండ్లు ఇప్పటికి ప్రతిస్టేషను దగ్గరా కనిపిస్తాయి.
"వః మారాజ్! ఎట్లనో పోతున్నవు? ఎర్కలే కరోడ్గిరి ఉన్నదని. నిలువు" అని అడ్డం నుంచున్నాడు జవాను.
"ఏమున్నది నా దగ్గర?" అడిగాడు అతడు.
"అగ్గో ఏమున్నదంటవు? సందు కుండె అక్బార్ ఉండె. కట్ట కుంటనే పోతవ్ కరోడ్గిరి?"
"హైదరాబాదు నుంచి కదా వస్తున్నది. కరోడ్గిరేంది. ఏమన్న - అంగ్రేజ్ ఇలాకా నుంచి వస్తున్ననా?"
"హైద్రబాద్ గీద్రాబాద్ జాన్ తానై. క్యా మాలుమ్? బొంబాయి కెల్లి వస్తున్నవేమో. సందుకు తెరువు. అక్బార్ కు కట్టొద్దు కరోడ్గిరి?"