Read more!
Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 1

                                 


                                              అతడే ఆమె సైన్యం

                                                         _ యండమూరి వీరేంద్రనాథ్

 

    అతడే ఆమె సైన్యం - (1 to 26)

    నిప్పుకోళ్ళు - (27 to 39)

    అతడే ఆమె సైన్యం తరువాయి భాగం (40 to 49) 
  

 




    ఎపిలోగ్ :

    సాయంత్రం అయిదయింది. ఆ వీధి అంత రష్ గా లేదు. అలా అని పూర్తి నిర్మానుష్యంగానూ లేదు. అంజిగాడి పాన్ షాప్ దగ్గర మాత్రం ముగ్గురు నిలబడి అరటిపళ్ళు తింటున్నారు.

    అంజిగాడి మొహంలో బాధలేదు. అలా అని మనసులో బాధ లేదని కాదు. ఆ ముగ్గుర్నించి పైసా రాదని తెలుసు. ఏడవలేక నవ్వుతున్నాడు.

    "ఒక సిగరెట ప్యాకెట్ ఇవ్వు. అలాగే మూడు పాన్ లు కట్టు" అన్నాడు ఆ ముగ్గురిలో కాస్త అప్రెంటిసులా వున్నవాడు. వాడు పిక్ ప్యాకెట్ స్టేజికి పైనా, మర్డర్ల స్టేజికి క్రిందా వున్నాడు. ఇంకో పది సంవత్సరాలు పోతేగాని రాజకీయాల్లో పైకి వస్తాడో లేదో చెప్పలేం.

    "హ్హి! తప్పకుండా! ఇంకేమయినా తీసుకుంటారా" అన్నాడు అంజిగాడు అదే విషాద భరితమైన నవ్వుతో. ఎంత తొందరగా వీళ్ళిక్కడ్నుంచి వెళ్ళిపోతారా అన్న ఫీలింగు వాడిలో కనపడుతోంది.

    "ఏం బాస్- ఇంకా ఏమైనా..." అనబోతున్న చిన్న రౌడీ మాట మధ్యలో ఆగిపోయింది. ముగ్గురిలోకి పెద్దవాడిగా కనిపిస్తూన్న దాదా చూపు నిలిచిన చోటుకి అతను తన దృష్టి సారించాడు.

    పాతికేళ్ళ యువతి ఒక పాపని ఎత్తుకుని కొట్టువైపు వస్తోంది.

    అక్కడ అకస్మాత్తుగా చాలా ఇబ్బందికరమయిన నిశ్శబ్దం చోటు చేసుకుంది. అంజిగాడి చెయ్యి పాన్ లనీ సిగరెట్ ప్యాకెట్ ని తొందరగా అందించింది. అక్కడనుంచి వాళ్ళని పంపెయ్యాలన్న కంగారు ఆ తొందరలో కనబడుతూంది. అయితే ఆ ముగ్గురూ దాన్ని పట్టించుకోలేదు. ఎక్స్ రే కళ్ళతో ఆమెని చూస్తూ నిలబడ్డారు.

    ఆమె వచ్చి రెండు అరటి పళ్ళివ్వు' అంది. అంజిగాడి డబ్బులు తీసుకొని ఆమెకు పళ్ళు అందించాడు. అయితే పళ్ళకన్నా ముందు ఆమె చేతికి ఒక ప్యాకెట్ తగిలింది.

    "రెండు అరటిపళ్ళు కొంటే ఇది ఒకటి ఉచితం మేడమ్" అన్నాడు ముగ్గురిలో మధ్యస్తంగా వున్న రౌడీ.

    ఆమె మొహం సిగ్గుతో వాడిపోయింది.

    అరటిపండు పక్కనే నిరోధ్ ప్యాకెట్ సింబాలిక్ గా, మానవత్వం పక్కన పశుత్వంలా వుంది.

    "హ్హిహ్హి...పోనియ్యరాదన్న" అన్నాడు కొట్టువాడు.

    "నేనేమన్న పొమ్మను" అని ఆమె కదలబోతుంటే... "పాప మంచిగున్నది బుగ్గలు బాగున్నయ్ లే" అంటూ ఆమె ఎత్తుకున్న పాప చెంపలు నిమిరాడు.

    వాడి మోచెయ్యి ఆ యువతి వక్షాలకి సుతారంగా తగిలింది. ఆమె అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది.

    సరిగ్గా అదే సమయానికి సైకిల్ మీద వస్తున్న ఒక వ్యక్తి ఈ దృశ్యం చూసి, దిగి దగ్గరకొచ్చాడు. అతడిని చూసి ఆ యువతి తేరుకుంది.

    "ఏమిటి గొడవ?" అన్నాడు. అతడామె భర్తలా వున్నాడు.

    "ఏమీలేదు. అత్తయ్యగారు అరటిపళ్ళు కావాలంటే వచ్చా. రండి వెళదాం" అంది. వాళ్లిద్దరూ వెళ్ళబోతూంటే వెనుకనుంచి ఒకడు "...రెండరిటిపళ్ళు కొంటే ఒక నిరోధ్ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తమంటే తీస్కోటంలే నీ పెళ్ళం" అన్నాడు వెకిలిగా నవ్వుతూ.

    ఆ వ్యక్తి ఆగాడు.

    "రండి వెళదాం" అందామె భయంగా.

    "ఏం బె అట్ల చూస్తున్నవ్? ఏంది నీ పేరు?"

    "సుబ్బారావు"

    "ఏడ పన్జేస్తున్నవ్?"

    "సెక్రటేరియట్ లో"

    "ఏం పని?"

    "గుమస్త-"

    "సుబ్బారావు పేరెట్టుకున్నావ్. గుమస్తగా చేస్తున్నవ్. గంత పౌరుషము పనికి రాదు బేటా. పో. నీ పెండ్లాన్ని దీస్కపో."

    సుబ్బారావు మొహం ఎర్రబడింది. అయినా ఏం చెయ్యలేని నిస్సహాయతతో సైకిల్ మీద చెయ్యి వేశాడు. కాలరు దగ్గర కాస్త చిరిగినా షర్టూ లూజు ఫాంటు అతడిని చూసి నవ్వుతున్నట్టున్నాయి.

    "బుగ్గలైతే నున్నగున్నయ్ బై" వెళ్ళబోతూన్న సుబ్బారావు ఆగటం చూసి వాడు నవ్వేడు. "...నీ పెండ్లంవి కావు నీ కూతురివి. పండ్లానివి నేను నిమర్లే."

    అవతలివాడు ఏమీ చెయ్యలేడని తెలిసి ఆడుకుంటున్నట్టు వుంది వాళ్ళకి.

    "మర్యాదస్తులతో ఇలా మాట్లాడ్డానికి సిగ్గులేదూ" అన్నాడు.

    "ఏం? మేం మర్యాదస్తుల్లా కనబడటంలే" అన్నాడు.

    అతడు తనలో తనే "తెలుస్తూనే వుంది" అని గొణుక్కుంటూ వెనుదిరిగాడు. వెనుకనుంచి భుజంమీద చెయ్యి పడింది.

    "ఏమంటున్నవ్?"

    "ఏమీలేదు."

    రౌడీ అతడి గడ్డం పట్టుకుని చెంపలు రెండు వేళ్ళతో గట్టిగా నొక్కుతూ "ఏమన్నావ్ బే ఇప్పుడు" అన్నాడు.

    అంజిగాడు కొట్టులోంచే "వదిలెయ్యరాదన్న పాపం" అన్నాడు. సుబ్బారావు భార్యకంగారుగా దగ్గర కొచ్చింది. అప్రెంటిస్ రౌడీ తన గొప్పతనం సీనియర్ల దగ్గర నిరూపించుకోవటానికి అన్నట్టు ఆమె మెడమీద చెయ్యివేసి "ఇక్కడా నున్నగానే వుంది బాస్" అన్నాడు.

    అప్పుడు కొట్టాడు సుబ్బారావు అతణ్ణి. లోపల్నుంచి తన్నుకొచ్చిన ఉక్రోషం అతడితో ఆ పని చేయించింది. అక్కడున్న అయిదుగురూ ఆశ్చర్యపోయారు. ఆ చర్యకి. చెళ్ళుమన్న శబ్దం తప్ప ఆ తరువాత ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.

    సుబ్బారావుని పట్టుకున్న రౌడీ బలంగా అతడిని వెనక్కి తోశాడు. కొట్టు క్రిందనుంచి పారుతున్న మురిక్కాలవలో పడ్డాడు సుబ్బారావు. నల్లటి మురికి వర్షం నీరులా సుబ్బారావు మొహం మీదికి చిమ్మింది. అతడి భార్య కెవ్వున కేక వేసింది. పాప ఏడవటం ప్రారంభించింది. రెండో రౌడీ కాలు అతడి మొహం మీదకు లేచింది. సుబ్బారావు ఆ కాలుని వెనక్కి తోశాడు. అది వూహించని రౌడీ బ్యాలెన్స్ తప్పి తూలటంతో కిళ్ళీకొట్టు తలుపుకి వున్న ఇనుప కొక్కెం కణతకి గుచ్చుకుంది. అతడు ఆర్తనాదం చేస్తూ కూలాడు.

    అనూహ్యమైన ఈ సంఘటన తాలూకు షాక్ నుండి వెంటనే తేరుకున్నాడు పెద్ద రౌడీ. రెండు చేతులతో అతడిని లేపాడు. మెరుపుకన్నా వేగంగా జేబులోంచి కత్తి తీశాడు. తన ప్రాణాలు పోవటం ఖాయమని సుబ్బారావుకి తెలిసిపోయింది. భార్యవైపు చూశాడు. ఆమె ఏడుస్తోంది. తనని పట్టుకున్న రౌడీవైపు సుబ్బారావు చూశాడు.

    ఆ వేగం ఎక్కణ్ణుంచి వచ్చిందో తెలీదు. చూపుడు వేలు, మధ్యవేలు చాకులా చేసి, ప్రత్యర్థి కత్తికంటే వేగంగా అతడి మొహంవైపు పోనిచ్చాడు. కత్తి తన చేతిని తాకేలోపులో అతడి వ్రేళ్ళు ప్రత్యర్థి కళ్ళని పొడిచేశాయి.

    రెప్పపాటు కాలంలో జరిగిపోయిన ఈ రెండు సంఘటనలకీ జూనియర్ రౌడీ మొదట్లో విచలితుడయినా వెంటనే తేరుకొని అతడి వ్రేళ్ళు ప్రత్యర్థి కళ్ళని పొడిచేశాయి.

    రెప్పపాటు కాలంలో జరిగిపోయిన ఈ రెండు సంఘటనలకీ జూనియర్ రౌడీ మొదట్లో విచులితుడయినా వెంటనే తేరుకొని అతడి మీదకు దూకాడు. అది అతడి పరువుకి సంబంధించిన సమస్య. సుబ్బారావుకి ప్రాణానికి సంబంధించిన సమస్య.

    ఇద్దరూ ఆ బురదలో పందుల్లా కొట్టుకుంటున్నారు. వాటికన్నా మేమేమీ తక్కువ హీనంకాదు అన్నట్టు చుట్టూ జనం కేవలం ప్రేక్షకుల్లా నిలబడ్డారు. 'సమాజంలో ఎవరికీ భద్రతలేదు. ఒకరెవరైనా ఆ హక్కుకోసం పోరాడినా, మిగతా వాళ్ళెవరూ సాయం చెయ్యరు' అన్నది అక్కడ నిరూపణ అవుతుంది.

    పరువు భయంకన్నా ప్రాణభయమే గెలిచింది. సుబ్బారావు ఆ కుర్రరౌడీని కూడా అధిగమించి నిలబడ్డాడు. బురదలో అచ్చొత్తిన బొమ్మలా వున్నాడు అతడు. భార్యవైపు చూసి నవ్వాడు. ఆ ఆనందంలో వెనుకనుంచి వస్తున్న ప్రమాదం గురించి తెలుసుకోలేదు. ఇనుప వూచమీద పడిన మొదటి రౌడీ లేవటం, కొట్టు ముందు వరుసలో వున్న సోడా బాటిల్ తీసుకుని సుబ్బారావు తలమీద మోదటం క్షణాల్లో జరిగిపోయాయి.

    చుట్టూ వున్నవాళ్ళు హాహాకారాలు చేశారు.

    రెండు చేతుల్తో తల పట్టుకుని కూలిపోయాడు సుబ్బారావు. తలనుంచి రక్తం ధారగా కారుతూండగా అతడికి స్పృహ తప్పింది.

    పది నిముషాల తరువాత అక్కడికి అంబులెన్స్ వచ్చింది.

    అసలు కథ అప్పుడు ఆరంభమయింది.

                                              * * *

Next Page