Read more!
 Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 2


                                               అతడే ఆమె సైన్యం

    ఆస్పత్రి మందుల వాసన తెలుస్తూంది.

    "అదృష్టం బావుంది. తలలో ఎముకలేవీ విరగలేదు."


    అతడు కళ్ళు విప్పాడు. దూరంగా ఒక డాక్టర్ స్కల్ ఎక్స్ రే పరీక్షిస్తున్నాడు. ఇంకో ఇద్దరు పక్కన నిలబడి వున్నారు. అతడు కళ్ళు తెరవడం నర్స్ గమనించింది. అందరూ దగ్గరగా వచ్చారు. డాక్టర్ మరొకసారి పరీక్షించి మళ్ళీ అదే చెప్పాడు. "అదృష్టం బావుంది".

    అతడు పక్కమీద లేచి కూర్చున్నాడు. తలకి బ్యాండేజ్ తెలుస్తోంది.

    "మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు. బలమైన దెబ్బవల్ల స్పృహ తప్పిందంతే. ఒక పదిరోజులపాటు వచ్చి బ్యాండేజ్ కట్టించుకోండి."

    "థాంక్స్ డాక్టర్!"

    "బయట మీ భార్య వెయిట్ చేస్తోంది."

    అతడు మొహం చిట్లించి "నాకు భార్యేమిటి? నాకింకా పెళ్ళికాలేదు' అన్నాడు.

    అందరూ మొహం చూసుకున్నారు.

    "నా పేరు చైతన్య"

    అంతా నిశ్శబ్దం.
  
    "మీరంతా అలా ఎందుకున్నారు? నా గురించి ఎవరూ రాలేదేమిటి?" చుట్టూ చూస్తూ అడిగాడు.

    "మీ గురించి ఎవరొస్తారని మీరనుకుంటున్నారు?"

    "ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్ లు, నన్ను మీరెవరూ గుర్తు పట్టలేదా? నేనూ చైతన్యని."

    "అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో టాప్ స్టార్స్ లో ఒకరయిన చైతన్య మీరని మీ ఉద్దేశ్యమా?"

    "ఉద్దేశ్యమేమిటి నాన్సెన్స్- నేనే చైతన్యని."

    ఒక నర్స్ నవ్వాపుకోలేక మొహం పక్కకి తిప్పుకుంది. కానీ అనుభవజ్ఞుడయిన డాక్టర్ ముఖంలో విషాదం తొంగిచూసింది. సానునయంగా అన్నాడు- "చూడు బాబూ, నీ పేరు సుబ్బారావు. బయట నీ భార్యా, కూతురూ వున్నారు. నీ బ్రెయిన్ సెల్స్ పూర్తిగా చచ్చిపోకముందే ఆక్టివేట్ చేయడానికి ప్రయత్నించు."

    అతడు మంచం మీదనుంచి చటుక్కున దిగాడు. "నాకు కాదు. మీకు మతిపోయింది. దాదాపు ప్రతిరోజూ నా ఫోటో పేపర్లో పడుతూనే వుంటుంది. మీరు నన్ను గుర్తుపట్ట లేకపోవటం ఏమిటి- ఫోన్ ఇవ్వండి."

    "దేనికి?"

    "మా ఇంటికి ఫోన్ చేస్తాను. లేకపోతే అన్నపూర్ణాకో, రామానాయుడి స్టూడియోకో చేసి నా డైరెక్టర్ ని రమ్మంటాను."

    "మీ ఇంటి నెంబరెంత?"

    "9344392"

    "అది సెక్రటేరియట్ నెంబరు."

    డాక్టర్ తాపీగా అన్నాడు.

    "నో" అరిచాడు.

    డాక్టరు అతడి అరుపు పట్టించుకోకుండా స్టాఫ్ వైపు తిరిగి "టు స్కాన్ ది బ్రెయిన్, అరేంజ్ టు సెండ్ హిమ్ టు మెంటల్ హాస్పిటల్" అన్నాడు.

    "నాన్సెన్స్" ఈసారి మరింత గట్టిగా అరిచాడు అతను. "ఆ నెంబర్ నాదే. నన్నొక్కసారి ఫోన్ చేసుకో....." అతడి మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. పాప నెత్తుకుని అతడి భార్య లోపలికి ప్రవేశించింది. జరుగుతున్నదేమిటో ఆమెకు తెలిసినట్టులేదు. భర్త మామూలుగా వుండటం చూసి సంతోషంగా దగ్గరికి వచ్చింది.

    "చూడు సుబ్బారావ్! నువ్వు సెక్రటేరియట్ లో గుమాస్తావి. ఈమె నీ భార్య."

    "కాదు! నేను చైతన్యని. ఏ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ."

    "ఏమండీ- ఏమైందండీ మీకు?" అంటూ ఆమె మరింత దగ్గరగా వచ్చింది. ఈ లోపులో నర్సు అతడికి ఇంజెక్షన్ ఇచ్చింది.

    అతడి కళ్ళు మూతలు పడసాగాయి.

    "9344392 సెక్రటేరియట్ నెంబరు కాద్సార్. అది హీరో చైతన్యగారి నెంబరే" నర్సు అంటోంది.

    "నీకెలా తెలుసు?"

    "నేను ఆయన ఫాన్ ని సార్."

    స్పృహ తప్పుతూ వుండగా అతడికి వినిపించిన చివరి మాటలు అవి.

    తిరిగి అతడికి స్పృహ వచ్చేసరికి ఒక విశాలమైన గదిలో వున్నాడు. దూరంగా నిలబడి పనిచేసుకుంటున్న నర్సు అతడికి మెలకువ రావడం చూసి దగ్గర కొచ్చింది.

    "నేనెక్కడ వున్నాను?"

    "మెంటల్ హాస్పిటల్ లో."

    అతడా గదిని పరిశీలనగా చూశాడు.

    "మీరు తెలుగమ్మాయేనా సిస్టర్?"

    "అవును."

    "సినిమాలు చూస్తారా?"

    "చూస్తాను."

    "నా సినిమాలు ఏమైనా చూశారా?"

    ఆమె ఏదో చెప్పబోతూ వుంటే బయట అలికిడి వినిపించింది. నలుగురు డాక్టర్లు లోపలికి వచ్చారు.

    "హౌ ఆర్యూ మిస్టర్ సుబ్బారావ్?" అందర్లోకి పెద్ద వయసున్న వ్యక్తిలా కనబడుతున్న డాక్టర్ అడిగాడు.

    "మీరెవరు?" తిరుగు ప్రశ్న వేశాడు అతను.

    "నేనీ హాస్పిటల్ సూపర్నెండెంట్ ని."

    "చూడండి. క్రింద హాస్పిటల్ వాళ్ళు చెప్పింది నమ్మానవసరంలేదు మీరు. నేను నిజంగా సుబ్బారావుని కాదు. నా పేరు చైతన్య. గర్వంగా చెప్పుకుంటున్నాననుకోకపోతే నన్ను గుర్తు పట్టని వాళ్ళు ఆంధ్రదేశంలో దాదాపు లేరు. బ్రేక్ డాన్స్, డూప్ లేకుండా నేను చేసే ఫైట్స్, యువతలో నా క్రేజ్ పెంచాయి. వాళ్ళలో ఒక్కసారి ఎవర్నన్నా పిలిపించండి. లేదా మీలో ఎవరన్నా సరే... ఒక్కరూ నన్ను గుర్తుపట్టటం లేదంటే నేను నమ్మను. పోనీ మా ఇంటి అడ్రసు చెపుతాను. మా తల్లిని ఇక్కడకు పిలిపించండి. ఆవిడ కూడా నన్ను గుర్తుపట్టకపోతే మీరు చెప్పినదంతా నమ్ముతాను. నాకు పిచ్చెక్కిందని ఒప్పుకుంటాను."

    "తప్పకుండా అలాగే చేద్దాం. కానీ దానికి ముందు ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి. విజయనగరంలో ఒక పదహారేళ్ళ కుర్రవాడికి జ్వరం వచ్చింది. జ్వరంలో నేను చైతన్య ఫాన్ ని, ఆయన్ని చూడాలి అని అంటున్నాడు. వాళ్ళ డాక్టర్ వచ్చి మీతో ఆ విషయం చెప్పాడు. చెప్పండి. మీరు వెళతారా?"

    "విజయనగరం- అంతదూరం- షూటింగ్ లు వదులుకుని...." అతడు సందిగ్ధంగా అన్నాడు.

    "అందులోనూ మామూలు జ్వరానికి" డాక్టర్ అందించాడు.

    "అవును. మామూలు జ్వరానికి...." అతడు నవ్వేడు. "పైగా ఇలా అందరిళ్ళకీ వెళ్ళడం మొదలు పెడితే నా టైమంతా ఊళ్ళు తిరగటానికే సరిపోతుంది."

    "మరటువంటప్పుడు పిచ్చాసుపత్రిలో ఎవరో సుబ్బారావు, నేనే చైతన్యని అని అంటే ఆ డాక్టర్ వెళ్ళి చైతన్య తల్లిగారిని రమ్మని పిలిస్తే బావుంటుందా?"

    అతడి మొహం వివర్ణమైంది. అతికష్టంమీద తమాయించుకుని "నాకోసారి ఫోను చేసుకునే ఛాన్స్ ఇస్తే మీకేం నష్టం?" అన్నాడు.

    "మీ ఇంట్లో ఎవరెవరుంటారు?"

    "నేను, మా అమ్మా, మిగతా పనివాళ్ళు, నా సెక్రటరీ.."

    "సరే ఫోను చేయండి."

    9344392

    ట్రింగ్...ట్రింగ్....

    అవతల్నుంచి రిసీవర్ ఎత్తిన చప్పుడు.

    "హల్లో."

    "ఎవరు మాట్లాడేది?"

    అట్నుంచి విసుగ్గా "మీకెవరు కావాలి?" అని వినిపించింది.

    "అమ్మగారిని పిలువు."

    "ఏ అమ్మగారు?"

 Previous Page Next Page