తెలివైన వారు అలకను ఆయుధంగా అవసరం అయినప్పుడు ఉపయోగిస్తారు.
అలకలో విరోధ భావం ఉన్నా, అహంకారం ఉండదు. అహంకారంతో కూడిన అలక మొండి పట్టుదలగా మారుతుంది. రెండు హృదయాల మధ్య ఉండే బంధం చాలా సున్నితంగా ఉంటుంది. ఆ బంధాన్ని తెలివైన వాళ్లు తెగేంతవరకూ లాగరు. అలిగిన వాళ్లు సరసం విరసంగా మారకుండా చూసుకోవాలి.
జీవితాన్ని, ప్రేమానూ రసవత్తరం చెయ్యడానికి అలక అవసరం. మరీ వ్యక్తిత్వం లేని స్త్రీని పురుషుడు ప్రేమించలేడు. ఒకవైపు భార్య అణిగిమణిగి పడి ఉండాలనే కోరుకుంటాడు. కాని, మరోవైపు ఆమెలో వైవిధ్యం కొరవైనప్పుడు విసుగు చెంది, ఆ వైవిధ్యాన్ని ఇంటి బయట వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు.
ఒకనాడు ఏడ్చీ, ఏడిపించి, మరునాడు నవ్వి, నవ్వించి, మరోనాడు ప్రేమించి, కవ్వించి, ఇంకోనాడు కోపగించగల భార్య భర్తను తనచుట్టూ తిప్పుకోగలదు.
శ్రీ కృష్ణుడు పదహారువేల గోపికల్లో, ఏడుగురు భార్యల్లో, రాధ వంటి ప్రేమ పూజారిలో చూడని ఏ ఆకర్షణ చూశాడో సత్యభామలో? అందమా? చాలా మందికి సత్యభామ అపురూప సౌందర్యవతి కావడంవల్లనే కృష్ణుడు ఆమె అనురాగంకోసం అంతగా పాకులాడేవాడు అంటారు కాని, అసలు కారణం అది కాదేమో? సత్యభామ అలకనేర్చిన అతివ. అదే ఆమెలోని ప్రధానమైన ఆకర్షణ.
అనేకమంది ప్రియురాండ్ర హృదయం నుంచి ప్రవహిస్తున్న ప్రేమవాహినిలో పడి ఉక్కిరిబిక్కిరి అయే కృష్ణునకు సత్యభామ అలక విశ్రాంతిని ఇచ్చేది అందరూ ప్రేమించేవారే, ఆరాధించేవారే. పాదపూజలు చేసేవారే. వారెవరూ కృష్ణుడు తన ప్రేమను ప్రకటించాలనికోరుకోలేదు.
అందులో ఏ ఒక్కరూ అతని మీద అధికారం ఉన్నట్టూ భావించలేదు. సత్యభామలో వైవిధ్యం ఉన్నది. భర్తను విపరీతంగా ప్రేమించింది. భర్తకూడా తనను అంతగా, మిగతా వాళ్ళకంటే మిన్నగా ప్రేమించాలని అభిలాషించింది. ఆమెలో ఈర్ష్య ఉన్నది. ఈ విషయంలో యిది స్త్రీ సహజమయిన గుణం.
రుక్మిణి పూజలో, రాధ ఆత్మ సమర్పణలో లభించని ఆనందం శ్రీకృష్ణునికి సత్యపదతాడనంలో లభించింది. అలక నేర్చిన సత్యభర్తను తన బానిసగా చేసుకున్నది. కనీసం అతను అలా నటించేలా చెయ్యగలిగింది.
అలాగే అలక నేర్చిన కైకేయికి దశరథుడు బానిస అయ్యాడు. అలకకు మనదేశంలో ఆదికాలం నుంచీ ప్రాముఖ్యం ఉన్నది. అలక గృహాలు కూడా ఉండేవని మనకు పురాణాల ద్వారా తెలుస్తూనే ఉన్నది.
మగవాళ్ళు కూడా అడపాదడపా అలుగుతూనే ఉంటారు. చీటికీమాటికీ అలిగే మగవాళ్ళంటే అసహ్యం వేస్తుంది. తెలివయిన మగవాళ్ళు అలిగినట్టు నటించి భార్యల్ని లొంగదీసుకోగలరు.
దూరంగా ఉన్నంత కాలం ప్రేమ కానీ, స్నేహం కానీ సురక్షితంగానే ఉంటాయి. దగ్గరగా వచ్చినప్పుడే పరస్పరాకర్షణ తగ్గి చిరాకు ప్రారంభం అవుతుంది. టాల్ స్టాయ్ రచించిన 'అనాకేరినినా' నవలలోని 'అన్నా'కు అలగడం తెలియదు. అందువల్లనే ఆమె జీవితంలో అంత అశాంతికి గురి కావలసి వచ్చింది.
కొందరికి జీవితంలో అలిగేవకాశమే రాదు అలక తీర్చేవారు ఉండరు కనుక, కొందరికి అలగడం తెలియదు. ఈ రెండు తెగలకు చెందినవారు జీవితంలో విలువయిన ఒక అనుభూతికి దూరం అవుతున్నారనే చెప్పాలి.
మైత్రిని, దాంపత్య జీవితాన్నీ, ప్రేమనూ దృఢంగా, పదిలంగా కాపాడుకోవాలంటే సరసంగా అలగడం నేర్చుకోవాలి.
ఇతరులకు ఇబ్బంది కలిగించే కోరికలు "లీలా! నీ చీర ఎంత బాగుందోయ్? ఎంత ఖరీదు?" అడిగింది విమల.
"డెబ్బయ్!"
"నిజంగా? ఎక్కడ కొన్నావ్?" చీర మీద నుంచి కళ్ళు తిప్పుకోకుండానే అడిగింది.
"నేను కొనలేదు. మా మామయ్య కూతురు కలకత్తాలో ఉంటున్నది. ఆమె తెచ్చింది."
"అలా చెప్పు! ఇక్కడైతే ఇది వందరూపాయలకు తక్కువ రాదు. నాక్కూడా ఒకటి తెప్పించి పెట్టవూ?"
"అలాగే!"
"అచ్చం ఇదే కావాలి! మీ మావయ్య కూతురికి రాయి లేకపోతే నీచీరె తీసుకుంటాను" అన్నది విమల.
లీల ఆముదం తాగిన ముఖం పెట్టింది. ఏడవలేక పేలవంగా నవ్వింది. లీల కన్పించినప్పుడల్లా విమల ఆ చీర గురించి అడుగుతూనే ఉన్నది. ఇలాంటి సంభాషణ ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. మరీ మొహమాటపడే వ్యక్తి అయితే తన చీరే ఇచ్చేస్తుంది.
నేను మద్రాసు వెల్తున్నాను. మీనాక్షి మా ఆఫీసులో పనిచేస్తున్నది. అరవపిల్ల "అక్కడ మంచి స్టీలు సామాను దొరుకుతుంది -- ఇక్కడి కంటే చౌక కూడా. ఐదు గిన్నెల కారియర్ ఒకటి తెచ్చి పెట్టు!" అన్నది.
ఐదు గిన్నెల స్టీలు కారియర్ (ఆమె చెప్పిన సైజులో) తేవాలంటే కనీసం రెండు వందలైనా ఉంటుంది. డబ్బు తర్వాత ఇస్తాలే. జీతం రాగానే ఇచ్చేస్తాను" అన్నది నా ఆలోచనల్ని పసికట్టినట్లు. నా దగ్గర అంత డబ్బులేదని చెప్పాలనిపించింది. కాని ఆమె నమ్మదు. పర్సులోంచి 50రూపాయలు తీసి చేతిలో పెట్టి మిగతాది తర్వాత ఇస్తాను అన్నది.
ఏదో కాన్ఫరెన్సుకు వెళ్ళిన నాకు బజారుకు వెళ్ళే తీరిక చిక్కలేదు. వచ్చే రోజు ఒక గంట ముందు బయలుదేరి బజారుకు వెళ్ళాను. నా దగ్గిర రైలు టికెట్ కొనగా రెండు వందలు మాత్రమే ఉన్నది.
నేను కొన్ని చిన్న చిన్న వస్తువులు కొనాలని ఆ డబ్బు తెచ్చుకున్నాను. కారియర్ కొన్నాక నా దగ్గర డబ్బు మిగల్లేదు. ఎంతో చిరాకు వేసింది. కారియర్ చూసి మీనాక్షి సంతోషించింది. హైదరాబాద్ లో కంటే కనీసం పదిహేను రూపాయలు తక్కువగా దొరికినందుకు సంతోషించింది. స్టీల్ సామాను షాపుకి ఆటోలో వెళ్ళడానికి నాకు పదిరూపాయలు ఖర్చయింది. పైగా బోలెడంత మెంటల్ టెన్ షన్.
ఆ మధ్యలో స్నేహితురాళ్ళ మధ్య ఈ చర్చ వచ్చింది. కమల అన్నది -- ఇతర్ల కోసం సామాను కొనుక్కురావడం అంతబుద్ధి తక్కువపని మరొకటి లేదు.
ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళాను. ఒకామె ఆగ్రా మిఠాయి, దాల్ మోటీ తెచ్చి పెట్టమన్నది. మరో ఆమె చెప్పులు తెచ్చి పెట్టమన్నది. ఇంకో ఆమె లెదర్ సూట్ కేస్ లు అక్కడ చౌకగా దొరుకుతాయి. ఇరవై రెండు అంగుళాల కొలతగల పెట్టె తెచ్చిపెట్టమన్నది. ఒక్కరూ డబ్బు ఇవ్వలేదు. ఇలా తలొక పురమాయింపు చేశారు. ఉన్న రెండు రోజులూ షాపింగ్ లోనే గడిచిపోయింది. లెదర్ సూట్ కేసు డబ్బు అయితే వచ్చాక ఇచ్చింది సరోజ.
"చౌక చౌకగా ఉంటాయన్నారే," అని ఒక మాట విసిరింది. నా మనసుకు ముల్లు గుచ్చుకున్నట్లు అయింది. అందులో నేను కొంత కమీషన్ కొట్టానన్నట్లు మాట్లాడింది. డైరెక్టుగా అనదు కాబట్టి నేను సంజాయిషీ ఇచ్చుకోలేను. చెప్పులు తెచ్చాను. చెప్పులు అడిగిన ఆవిడ కాళ్ళకు అవి సరిపోలేదు.
"నాకు అవి చాలలేదు. ఏం చేసుకోనండీ!" అన్నది. "నువ్విచ్చిన ఆది ఇదేగా" అన్నాను. "లేదండీ నేను సరైన ఆదే ఇచ్చాను. సరే ఏం చేస్తారు. చెప్పిన నేరానికి తీసుకుంటాను" అన్నది. నా మనసు చివుక్కుమన్నది. "నేను ఉంచుకుంటాలే, ఇవి నువ్వేం చేసుకుంటావు" అన్నాను. అవి నాకు పెద్దవైనాయి. చివరికి ఆ చెప్పులు నా నెత్తి మీదే పడ్డాయి. ఇక దాల్ మోటీకీ, మిఠాయికీ డబ్బులేం తీసుకుంటాను ; ఆ సామానంతా తేవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను."
కమల మాటలకు మేమంతా ఘొల్లుననవ్వాం. "మీకు నవ్వుగానే ఉంటుంది. నాకెంత బాధ కలిగిందో మీకేం తెలుసు? ఇవన్నీ కొనడానికి ఎంత టైం పట్టింది. రానూ పోనూ ఆటో ఛార్జీలు. పైగా మనకు నచ్చిన వస్తువైతే వెంటనే తీసుకుంటాం. వాళ్ళకోసం కొన్నప్పుడు వాళ్ళకు ఏదో నచ్చుతుందో తెలియదు. కొంటాం కాని వాళ్ళకు ఆ వస్తువు అందించేంత వరకూ మెంటల్ టెన్ షన్." అన్నది కమల.
సుజాత అందుకుని చెప్పసాగింది. "నిజమే. ఒకసారి నేను ఖోటా వెళ్ళాను. మా యింటి వోనరు గారి భార్య ఖోటా చీర తెచ్చి పెట్టమన్నది. నాకు నచ్చిన కలర్ ఏదయినా సరే అన్నది. దూరభారం బోలెడంత ఖర్చు అవుతుంది. డబ్బు అడిగితే వచ్చేనెల అద్దెలో మినహాయించుకోమన్నది చీర తెచ్చాను తీరా చూసి మూతి విరిచింది." అయ్యో ఈ రంగు తెచ్చావా? ఈ రంగు నా దగ్గర ఉందండి: ఒకే రంగులో రెండు చీరెలు ఏం చేసుకుంటాను!" అన్నది. చివరకు ఆ చీర నేనే ఉంచేసుకోవాల్సివచ్చింది."
"పెద్దగా బాధపడాల్సిందేముందిలే, నీ చీర నీకే ఉన్నది." అంటూ నవ్వింది కమల.
"నా అనుభవం వినండి. ఒకసారి నేను బొంబాయి వెళ్ళాను. నా స్నేహితురాలు లక్ష్మి మూడువందలు ఇచ్చి బాంబే ప్రింటింగు చీరెలు తెచ్చిపెట్టమన్నది. ఎవరో నా పర్సు కొట్టేశారు. ప్రక్కనే పెట్టుకొని నిద్రపోయాను.
నా డబ్బుతో పాటు ఆమె ఇచ్చిన మూడువందలు పోయింది. బాంబేలో ఉన్న బంధువుల దగ్గర తిరుగు ప్రయాణాలకీ, అక్కడి ఖర్చులకి డబ్బు తీసుకున్నాను. తిరిగి వచ్చాక జరిగింది చెప్పి మూడు వందలు తిరిగి ఇచ్చేశాను. రెండు మూడు నెలలు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డానో నాకే తెలుసు." అని నిట్టూర్పు విడిచింది సుశీల.