ఈ టెలిఫోన్ రోమియోల బెడద రోజురోజుకూ పెరిగి పోతుందట. టెలిఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడి స్త్రీలను కించపరిచే మనస్తత్వం ఎంత వికృతమైందో ఆలోచించండి. కొందరు కొద్ది రోజులు తమాషా చేసి మానేస్తారు. మరి కొందరు అజ్ఞాత లైలాల ప్రాణం తోడేస్తారు. ఒక పట్టాన వదలరు. ఈనాడు వస్తున్న సినిమాల ప్రభావం యువతరం మీద ఎక్కువగా ఉంటున్నది.
ఆ మధ్య నేను ఒక కథ చదివాను. 'రాంగ్ నంబర్' దాని పేరు. రాంగ్ నంబర్ లో అనుకోకుండా లైలా పలికింది. ఇంకేం మజ్నూ పాటపాడాడు. ఈ అమ్మాయి ముందు భయపడి రిసీవర్ పెట్టేసింది. అలా రెండు రోజులు జరిగాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు. ప్రేమ సంభాషణలు ప్రారంభం అయ్యాయి.
టెలిఫోన్ లోనే ప్రేమించుకున్నారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. బాధ్యతగల రచయితలు ఇటువంటి కథలు రాసి యువతరాన్ని ఉత్తేజపరచి, పెడ మార్గాలు పట్టించకూడదు.
"టెలిఫోన్ ఎందుకు తీసెయ్యాలి? అబ్జర్వేషన్ ఫోన్ పెట్టించి ఆ గాడిదల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సింది" అన్నాను నేను.
"లాభం లేదు అంటీ" అన్నది అక్కడే ఉన్న లావణ్య.
"ఎందుకనీ?"
"నా క్లాసుమేటు అనితకు కూడా ఇలాంటి కాల్సే వస్తున్నాయట. వాళ్ళ నాన్నగారు ఫోన్ ను అబ్జర్వేషన్ లో పెట్టించారు. పదిహేను రోజులు ఉంచి అబ్జర్వేన్ ఫోన్ ఎత్తేశారు. డిపార్టుమెంటువారు. ఏమైనా ఆచూకి చిక్కిందా అంటే అది రహస్యంగా ఉంచాలి. మీకు చెప్పకూడదు అంటారట.
వివరాలు మాకు అక్కరలేదు కాని మీకయినా ఎవరు చేస్తున్నారో ఎక్కడ నుంచి చేస్తున్నారో తెలిసిందా అంటే" అది ఇంకా తెలియలేదండి. ముషీరాబాద్ ఎక్స్చేంజీ ఏరియా నుంచి వస్తున్నాయి అని మాత్రం తెలిసింది" అంటారట పదిహేనురోజుల అబ్జర్వేషన్ తరువాత అందుకే విసుగెత్తి అనిత నాన్నగారు చివరకు అబ్జర్వేషన్ ఫోన్ తీయించేశారు." అన్నది లావణ్య.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డైరెక్టుగా మాట్లాడే ఈ రోజుల్లో, హైదరాబాద్ నగరంలోని రోమియోలను పట్టుకోలేరా? పదిహేనురోజులు అబ్జర్వు చేశాక కూడా ఆ కాల్స్ ఏ ఫోన్ నుంచి వస్తున్నాయో తెలియడం లేదంటే మనం నమ్మలేం. ఒకరిద్దరిని పట్టుకొని కోర్టులో హాజరు పరిస్తే కనీసం ఇలాంటి రోమియోలకు భయం ఏర్పడుతుంది.
ఏది ఏమైనా ఈ రోమియోల బెడద ఎక్కువైంది. దీన్ని బట్టి మన జాతి నాగరికత, ఎలాంటి వెర్రితలలు వేస్తుందో ఆలోచించండి. ముఖం కనిపించడం లేదు కదా. మనల్ని గుర్తుపట్టలేదు కదా అనే ధైర్యంతో ఒక స్త్రీని జుగుప్సాకరమైన మాటలతో కించపరుస్తూ ఆనందించే మనస్తత్వం ఎంత భయంకరమైనదో ఆలోచించండి. కొందరు పేరులేని ఉత్తరాలు రాస్తారు. అవి ఆ ఆఫీసులో పనిచేసేవాడే ఎవడో రాస్తాడని అందరికీ తెలుసు.
చదువుకుని, ఉద్యోగాలు చేసే ఆడపిల్లలను గురించి ఉన్నవి లేనివి కల్పించి, జుగుప్సను కల్పించే భాషలో ఉంటాయి ఆ ఉత్తరాలు. అందులో వాళ్ళకు ఆనందం లభిస్తుంది. కుష్టురోగిని మనం గుర్తించలేం. గుర్తించినా పట్టించుకోము. అటువంటి ఉత్తరాలను అందుకున్న ఉద్యోగినులు మానసికంగా నరకం అనుభవిస్తారు. తమలో తాము కుంగిపోతారు. వాళ్ళలో పిరికితనం బయలుదేరుతుంది.
ఎక్కడుందీ లోపం? బజారున వెళ్ళే ఆడపిల్లలను చూసి పక్కవాడితో వల్గర్ జోక్ వేసి ఆనందించని పురుషులు ఎంతమంది ఉంటారు? తనకు జన్మనిచ్చేది స్త్రీ. మల మూత్రాలను ఎత్తివేసి స్తన్యం ఇచ్చి పెంచి పెద్ద చేసేది స్త్రీ. తన భార్య, తన చెల్లెలు, తన తల్లి స్త్రీ. వాళ్ళను గురించి ఎవరయినా అసభ్యంగా మాట్లాడితే పురుషుడు భరించగలడా?
అలక అతివ
ఈ మధ్య నా స్నేహితురాలు కమల ఇంటికి వెళ్ళాను. కమల కూతురు ముద్దుగా. అందంగా వుంటుంది. వెళ్తూనే నా కళ్ళు మాధవి కోసం వెతికాయి. "మాధవి ఎక్కడా?" అని అడిగాను.
కమల నవ్వుతూ బెడ్ రూంలోకి వెళ్ళమని సైగ చేసింది. లోపలకు వెళ్ళాను. మాధవి కన్పించలేదు. వెనకే వచ్చిన కమల ఒక మూల కూర్చుని ఉన్న మాధవిని చూపించింది.
మాధవి కాళ్ళు బార చాపుకొని, ముంగురులు ముఖం మీదకు పడుతూ వుంటే, ఎర్రటి పెదవుల్ని సున్నాచుట్టి బుగ్గలు ఉబ్బించి కూర్చుని ఉన్నది. అర్థం అయిపోయింది ఎందుకో అలిగిందని! పిల్లలు అలిగినప్పుడు మహా ముద్దు వస్తారు. వయసు మళ్ళిన వాళ్లు అలిగితే మహా చిరాకు వేస్తుంది.
అలక అనగానే ఆడవాళ్ళే అందరికి గుర్తుకొస్తారు. కాని అందరు ఆడవాళ్ళకు అలగడంరాదు. అలగడం కూడా ఒక కళే!
అలక ముదిరితే హఠం లేక మొండితనం అవుతుందని చాలామందికి తెలియదు. అలకకూ, మొండితనానికీ, పట్టుదలకూ ఉన్న తేడా తెలుసుకోలేనప్పుడు జీవితంలో, ముఖ్యంగా దాంపత్యజీవితంలో ఎన్నో అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఈ మధ్య ఒక జర్నలిస్టు ఒక కథ చెప్పి కడుపుబ్బేలా నవ్వించాడు. హనుమంతరావుని అతనికి ఒక దూరపు బంధువు ఉండేవాడట. అతని భార్య కలిగిన వారి ఇంటి ఆడపడుచు. ఆమెకు కోపం ముక్కు మీదే ఉండేది. చీటికీమాటికీ అలిగేది. వానలో తడిసిన నులక మంచంలా బిగదూసుకుపోయి అన్నం తినకుండా పడుకునేది. హనుమంతరావుకు భార్య చీటికీ మాటికీ అలగడం చిరాకు కలిగించేది.
అతనికి పట్టుదల ఎక్కువ అతను కూడా బిగదీసుకు పోయేవాడే కాని, భార్య అలక తీర్చడానికి ప్రయత్నం చేసేవాడు కాదు. అలక తీర్చేవారు ఉన్నప్పుడే ఆ అలకకు ఒక అందం, చందం. తన అలకను లక్ష్యపెట్టేవారూ, తీర్చేవారూ లేనప్పుడు అలగడం అంత తెలివి తక్కువ పని మరొకటి ఉండదు.
కన్నీరు తుడిచే వాళ్ళ ముందు ఏడ్చినప్పుడే ఆ ఏడుపుకు ఉపశమనం, ఆ కన్నీటికి విలువా ఉంటాయి. హనుమంతరావు తల్లి బ్రతికి ఉన్నంతకాలం ఎలాగో ఒకలాగా కొడుకునీ, కోడల్నీ సంభాళించుకుంటూ వచ్చింది. ఆమె పోయాక, మాటా మాటా పెరిగి కూతుర్ని చంకన వేసుకుని, ఒకరోజు హనుమంతరావు పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటి వాళ్లు శ్రీమంతులు. ఆమె ఒకర్తే కూతురు.
"ఎంతకాలం నేను లేకుండా ఉండగలడో చూస్తానుగా?" అనుకుంది భార్య. "ఎంతకాలం అలిగి పుట్టింట్లో కూర్చుంటుందో నేనూ చూస్తానుగా" అనుకున్నాడు భర్త.
నెలలు గడిచాయి నెలలు సంవత్సరాలుగా మారాయి. కాలం గడిచిన కొద్దీ ఇద్దరిలోనూ పట్టుదల పెరగసాగింది. ఆమె తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కూతురు తమ కళ్ళముందు ఉన్నది అంతేచాలు అని భావించారు వాళ్లు. ఐదేళ్ళ కూతురికి పద్దెనిమిదేళ్ళు వచ్చినాయి ఆ పిల్లతండ్రిని అసహ్యించుకోసాగింది.
భార్యాభర్తలిద్దరూ పదమూడేళ్ళ తర్వాత అనుకోకుండా ఒక పెళ్ళిలో కలుసుకున్నారు. ఒకర్ని చూసి ఒకరు తెల్లబోయారు. యౌవనంలో విడిపోయిన వాళ్ళిద్దరూ ఇప్పుడు నడి వయస్సులో ఉన్నారు. ఇద్దరి శరీరాలలోనూ ఎంతో మార్పు వచ్చింది. ఇద్దరికీ మాట్లాడాలనిపించింది. కాని ఎవరు ముందు మాట్లాడాలి? ఎలా? మళ్ళీ అవే ప్రశ్నలు.
అందరూ భోజనాలకు కూర్చున్నారు. భర్త ఒక పంక్తిలో కూర్చుని ఉండటం చూసింది. వంకాయ కూరగిన్నె తీసుకుని వడ్డనకు బయలుదేరింది. హనుమంతరావుకు వంకాయ కూర అంటే మహా ఇష్టం. ఒక గరిట వేసింది. మరో గరిట వేసింది. మళ్ళీ వెయ్యబోయింది. చేయి అడ్డం పెట్టి "ఊ" అన్నాడు. భర్త తనతో మాట్లాడాడు అని పొంగిపోయింది. నెయ్యి తెచ్చి వడ్డించసాగింది. అతను చెయ్యి అడ్డం పెట్టినా నెయ్యి వంచుతూనే ఉన్నది. "చాలు! చాలు!" అన్నాడు గాభరాగా. "ఇంకొంచెం వడ్డించుకోండి" అన్నది ఆమె.
ఇంకేం - మాటలు కలిశాయి. తెల్లవారే సరికి పెళ్ళి ఇంటి నుండి ఇద్దరూ చెప్పా పెట్టకుండా లేచిపోయారు.
ముందు పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను. అంతలోనే వాళ్ళను తల్చుకుని జాలిపడ్డాను. మాటపట్టింపుకోసం వాళ్ళు తమ జీవితంలోని అమూల్యమైన కాలాన్ని అశాంతికి గురి చేసుకున్నారు. అలక ముదిరితే ఇటువంటి అనర్థాలే కలుగుతాయి.
అలక ప్రేమలో, స్నేహంలో మాధుర్యాన్నీ, కొత్తదనాన్ని కలిగిస్తుంది. దీనివల్ల తాత్కాలిక ఆవేదన కలిగేమాట నిజమే! ఆ ఆవేదనలోనే తమాషా అనుభూతి కలుగుతుంది. అవిరామ ప్రయాణంలో విసుగు చెంది, అలిసిపోయిన బాటసారి - ఏ చెట్టు నీడనో విశ్రాంతి తీసుకుంటాడు. అలాగే దాంపత్య జీవితంలో కూడా అలక ఒక విశ్రాంతి గృహం. వైవిధ్యం లేని దాంపత్య జీవితం గానుగ ఎద్దు జీవితంలా ఉంటుంది.
అందులో ఒకవైపు అశాంతీ, ఆవేదనా ఉంటాయి. రెండోవైపు అభిమానంతో కూడిన తియ్యటి ఆశలు ఉంటాయి. ప్రేమా, అధికారం రెండూ ఉన్నచోటనే అలక ఉంటుంది. అలకలు అనేక రకాలు.
కొందరు మాట్లాడటం మానేస్తారు. కొందరు ఎవరి మీద అలుగుతారో వారివైపు కన్నెత్తి కూడా చూడరు. అంతకుముందు కానుకగా ఇవ్వబడిన వస్తువులను తిరిగి ఇచ్చేసి తాము అలక వహించినట్టు తెలియపరుస్తారు.
నగలు తీసేసి పాత చీరలు ధరించి, వస్తువులను చిందరవందరగా విరజిమ్మి, మంచం ఎక్కి బిగదీసుకుని పడుకోవడం ప్రబంధాల్లోనే చదువుతాం.