ఇక విదేశం వెళ్ళే వాళ్ళ ఇబ్బందుల్ని గురించి చెప్పనక్కరలేదు. ఒకరు ట్రాన్ సిస్టర్ తెమ్మంటే మరొకరు కెమెరా తెచ్చిపెట్టమని అడుగుతారు. కొందరు గడియారాలు అడుగుతారు. వివేశాలకు వెళ్ళేవారికి ఆదేశపు కరెన్సీ అతి కష్టం మీద లభిస్తుంది అంతదూరం వెళ్తున్న వారికి తమకూ తమ కుటుంబంలోని వాళ్ళకూ ఎన్నో తేవాలని ఉంటుంది. చివరకు వాళ్ళు ఎవరికీ ఏమి తెచ్చే స్థితిలో ఉండరు. వాళ్ళను స్వార్థపరులుగా చిత్రిస్తారు. కొందరు మనసు కష్టపెట్టుకుంటారు.
ఇలాంటి పురమాయింపులు చేసేముందు రెండుసార్లు బాగా ఆలోచించుకోవాలి. అదే స్థితిలో తను ఉంటే ఎంత ఇబ్బంది కలుగుతుంది ఆలోచించుకోవాలి.
"అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు" అని మన పెద్దలు అన్నారు. అందువల్ల ముందుగానే తమకు బజారుకు వెళ్ళే తీరిక ఉండదనో తమకు సెలక్షన్ తెలియదనో చెప్పెయ్యడం మంచిది.
భద్రత లేని జీవితాలు ఆ మధ్య ఏలూరులో ఒక లాడ్జి మీద దాడి చేశారనీ, కొందరు స్త్రీలను ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ క్రింద అరెస్ట్ చేశారనీ పేపర్లలో వార్త.
మాజీ ముఖ్యమంత్రిగారి జిల్లాలో ఒక హరిజన బాలికను మానభంగం చేసి, చంపిపారేశారని మరో వార్త. ఇంతవరకు ఆ దుర్మార్గులు దొరికినట్టుగానీ, వాళ్ళను బంధించినట్టుగానీ తెలియడం లేదు. ఆమె తల్లిదండ్రులకు వెయ్యో రెండు వేలో పరిహారం చెల్లించడం జరిగింది. ఒక స్త్రీ మానం కమ్ ప్రాణం ఖరీదు రెండువేలు.
లాడ్జిలో అరెస్టు అయిన స్త్రీలను కోర్టులో హాజరుపరచారు. మేజిస్ట్రేట్ తలకొక ఏభై రూపాయల జరిమానా వేసి వాళ్ళను వదిలేశారు. చట్టరీత్యా ఆయన చేయగలిగింది అదే!
ఆ తరువాత? మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కోర్టువారికి గానీ, పోలీసువారికి గానీ తెలియదా. అందరికీ తెలుసు అందుకే చాలామంది అభిప్రాయం ఇలాంటి స్త్రీలు ఇష్టపూర్వకంగానే ఈ జీవితాన్ని ఎన్నుకున్నారనీ, కేవలం పొట్టకోసం కాదనీను. ఇదొక మోజుగా మారిందని మరికొందరి వాదన. మరో జీవితాధారం చూపించినా మళ్ళీ వాళ్లు ఆ గృహాలకే చేరుకుంటున్నారు. దీనికి కారణం దారిద్య్రం కాదంటున్నారు.
పై కథనంలో సత్యం ఉన్నట్లయితే పూర్తిగా మానవజాతే పతనం అయినట్లు భావించాలి. అందులో సత్యం లేనట్టయితే, ఇలాంటి వాదనలు చేసే వ్యక్తి తనలోని మానవత్వాన్ని ఇంతకంటే అవమానించుకోవడం మరొకటి ఉండదు.
నూరు మందిలో ఏ పదిమందికో తాము చేస్తున్న పని మంచిదికాదని తెలియకపోవచ్చును. అంతకంటే నికృష్ట జీవితం మరొకటి కూడా ఉండదని కూడా అనుకోకపోవచ్చును. సమాజంలో తనకు ఒక స్థానం ఉండాలనీ పదిమంది మధ్యలో తలెత్తుకు తిరగాలనీ ఏ స్త్రీకి ఉండదు: కేవలం పొట్ట కోసమే! చావలేక బ్రతకడం కోసమే వీరు ఇలాంటి పని చేస్తున్నారనేది స్పష్టం. ఫాషన్ కోసం చేసే స్త్రీలు - బ్రాతల్ హౌసెస్ లో ఉండరు. ఉండవలసిన అవసరం లేదు. అంగడిలో నిలబడి గ్రాహకుల కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. వాళ్ళను పోలీసులు అరెస్టు చెయ్యరు. పదిమంది ముందు కోర్టులో తలవంచుకుని నిలబడరు. భర్తల చాటుగా ప్రియుల్ని ఎయిర్ కండిషన్ గదుల్లోకి పిలిపించుకోగలరు.
ఆసామి పొలం వెళ్ళాక పాలేర్లను పడక గదుల్లోకి ఆహ్వానించుకోగలరు. వారిని గురించి తెలిసినవాడు గుసగుసలాడుకుంటారు. అంతే, సభ్య సమాజంలో పతివ్రతల్లా వారు చలామణీ అవుతూనే ఉంటారు. పైగా నీతులు మాట్లాడడానికి కూడా వెనుదీయరు.
వేశ్యావృత్తిని గురించి మాట్లాడేప్పుడు, మాట్లాడవలసింది పైన ఉటంకించిన వాళ్ళను గురించి కాదు. కోర్టు జరిమానా విధించి వదిలేస్తుంది. అలాంటి వారిని సమాజం గౌరవిస్తుందా? ఒక ఆడపిల్ల ఎవరి మోసం వల్లో రాబందుల చేతుల్లో చిక్కి ఈ వృత్తిలో ప్రవేశింపబడింది అనుకోండి. జరిమానా చెల్లించి కోర్టు బయట వస్తున్న ఆమెకు ఎదురువెళ్ళి "రాధా! తప్పు నీది కాదు. నిన్ను ఇలా దిగజార్చిన వాళ్ళది. అందుకే నిన్ను నేను వివాహం చేసుకుంటాను" అంటూ విశాల హృదయాలు (సినిమాలలో తప్ప) ముందుకు వస్తున్నారా? ప్రభుత్వం వాళ్ళకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నది.
కోర్టు నుంచి బయటికి పంపిస్తూ "ఈ గౌరవనీయమైన పని చేసుకొని బ్రతుకు" అని మరో మార్గం చూపిస్తున్నదా? వాడి కోసం కొన్ని హోములు ఉంటున్న మాట నిజమే. కాని వాళ్ళు అక్కడ ఎక్కువ రోజులు ఉండరు. వీలు చూసుకొని పారిపోతారు, ఎందుకు? అవి జైళ్ళలా ఉంటాయి. అందులో వారికి స్వేచ్చ ఉండదు.
ఏ ప్రాణికి స్వెచ్చగా బ్రతకాలని ఉండదు? ఈ హోముల్లో జీవితంకంటె వారికి పాత జీవితంలోనే ఎక్కువ స్వేచ్చ కనిపిస్తున్నదన్నమాట. పైగా అలాంటి హోముల్లో ఉన్నవాళ్ళంటే అందరికీ చులకనే. అక్కడి ఉద్యోగులు వారిని హీనంగా చూస్తారు. అందరూ అలా చూడకపోయినా వారికంటే తాము పవిత్రులం అనే భావం కలిగేలా ప్రవర్తిస్తారు. కాంప్లెక్సుతో అపరాధభావంతో కుంచించుకుపోతూ అక్కడ వాళ్ళు ఉండలేరు.
కనీసం వేశ్యాగృహాల్లో ఉన్నప్పుడు వారికి ఈ కాంప్లెక్సు ఉండదు. అందరూ ఒకే వృత్తికి సంబంధించినవారు కనుక ఒకరి ముందొకరు చిన్నతనంగా ఫీలవరు. వారు హోముల్నుంచి పారిపోవడానికి ఇదికూడా ఒక కారణమే.
నారీ అపహరణలను గురించి పేపర్లో చదువుతూ ఉంటాం. స్త్రీ జీవితంలో ఇంతకంటే దయనీయమైన కథ మరొకటి ఉండదు. ఇలా అపహరించబడిన వాళ్ళను ఎక్కడికి చేరుస్తున్నారు? మరికొందరు ఆడపిల్లలు తమకు అందుబాటులో లేని ఆకర్షణల్ని చూపించడం వల్ల ఇళ్ళనుంచి పారిపోతున్నారు. ఎన్నో ఆశలు చూపిస్తారు. ప్రేమిస్తున్నామనీ, పెళ్ళిచేసుకుంటామనీ చెప్తారు. మోజు తీరాక నడిబజార్లో వదిలేస్తారు.
అలా లేచి వచ్చిన కుర్రవాడు తిరిగి ఇంటికి వెళతాడు, ఆడపిల్ల వెళ్ళలేదు. భద్రతలేని ఆ యువతి ఏ దాదా చేతిలోనో పడుతుంది, లాడ్జికి చేరుతుంది. ఎవడో ఒక ఆడపిల్లను రేప్ చేస్తాడు. ఆ విషయం అందరికీ తెలుస్తుంది. ఆ పిల్ల మళ్ళీ తలెత్తుకొని ఆ వాతావరణంలో బతకలేదు. వివాహం కాదు తల్లిదండ్రుల ముఖం చూడలేదు. పారిపోతుంది. చివరికి లాడ్జికి చేరుతుంది.
బజార్లో చేపలు అమ్మే అందమైన ఆడపిల్లను ఏ ప్రొడ్యూసరో చూసి, సినిమాలో బుక్ చేసి పెద్దస్టారును చేసినట్టు సినిమా చూస్తుంది ఒక పూలు ఆమ్మే కన్య. ఇంకేం? కళ్ళనిండా ఎన్నో కలలు నింపుకొని, అంతవరకూ తనను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న కుర్రవాడితో కలిసి హైదరాబాదు బండి ఎక్కుతుంది. ఆ పిల్ల చివరికి చేరుకొనే స్థలం ఏదో వేరే చెప్పవలసిన అవసరం లేదు.
ఈ వృత్తి పూర్తిగా ఆర్ధిక సంబంధమైనదే. స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుంటున్నది. వేశ్యా గృహాలను నడిపించే దాదాకు కావల్సింది ఏమిటి? డబ్బు: ఈ వృత్తి మీద ఒక్క ఆడపిల్లే బతకడం లేదు. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు (దాదాలు, రిక్షావాలాలు, లాడ్జీలు నడిపేవాళ్ళు) ఎందరో ఆమె శరీరంతో ఆమె సంపాదించుకొన్న డబ్బులు వాటాలు పంచుకుంటారు. కొంతవాటా పోలీసు కాన్ స్టేబుల్స్ కు కూడా ఉంటుందట.
అయినా కొందరు ఇది ఆర్ధిక సమస్య కాదు అంటున్నారు. సరైన సాంఘిక అవగాహన లేక అనే మాటలు ఇవి. ఇది వృత్తి! ఏ వృత్తి అయిన ఎందుకు చేస్తారు? చట్టాలు చేసి ప్రయోజనం లేదు. దీనికి మూలకారణం అయిన ఈ ఆర్ధిక వ్యవస్థను మార్చాలి.
ఈ చట్టం క్రింద స్త్రీని మాత్రము శిక్షిస్తున్నారు. ఇది పురుష ప్రపంచం అనడానికి ఇంతకంటే బలమైన నిదర్శనం ఏమి కావాలి? స్త్రీ అంగడిలో పెట్టి తన శరీరాన్ని అమ్ముతున్నదట. అందువల్లనే పురుషులు కొంటున్నారట. పురుషుల్ని ఆకర్షిస్తున్న స్త్రీలు మాత్రమే శిక్షార్హులట. అలాగే అనుకుందాం.
కాని మద్యనిషేధచట్టం కింద మద్యం అమ్మేవాడిని మాత్రమే ఎందుకు శిక్షించడం లేదు? మద్యం పుచ్చుకున్నవాడిని కూడా ఎందుకు శిక్షిస్తున్నారు? అంటే మనదేశంలో మద్యానికి ఉన్న విలువ కూడా స్త్రీ శరీరానికి లేదనేనా? ఈ వృత్తిని నిర్మూలించాలంటే స్త్రీ పురుషులిద్దర్నీ శిక్షించాలి. స్త్రీలను అపహిసించేవాడినీ, బలాత్కారం చేసి ఆమె శీలాన్ని దోచుకొనేవాడినీ, లాడ్జీలలో స్త్రీ మాంసాన్ని ఉప్పూ, చింతపండులా అమ్మి డబ్బు సంపాదించేవాణ్ణి హంతకుని కంటే హీనంగా చూడాలి కఠినంగా శిక్షించాలి.
ముఖ్యంగా స్త్రీ ఆర్ధిక స్తోమతను పెంచాలి. ఆర్ధిక ఇబ్బందుల్లో లేని స్త్రీ తన శరీరాన్ని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఫాషను కోసం, మోజు కోసం చేసేవాళ్ళ విషయం వేరు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వేశ్యావృత్తిని గురించి చర్చిస్తున్నప్పుడు వారిని గురించి చర్చించవలసిన అవసరం లేదు.
పుస్తకాలలో ఉత్తరాలు వగైరా....
చాలామందికి పుస్తకాలలో రూపాయి నోట్లూ ఫోటోలు ఉత్తరాలు పెట్టే అలవాటు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఈ అలవాటు అనర్థాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు జీవితమే తారుమారు అవుతుంది. ఇది చాలా చిన్ని విషయంగా మనం భావిస్తాం: యిలాంటి విషయాలను ఆలోచించం!
మీనాక్షి కూతురికి యిలాంటి అలవాటే ఉన్నది. ఆ అమ్మాయి పేరు గీత. ఎలాంటి కాగితం అయినా సరే పుస్తకంలో పెట్టేస్తుంది. ఒకసారి ఆమె క్లాసుమేట్ సవిత ఉత్తరాన్ని తన నోట్స్ రాసుకున్న బుక్ లో పెట్టుకుంది. సవిత ఎవర్నో ప్రేమిస్తున్నది.
ప్రేమపత్రం రాసి గీతను చదవమని యిచ్చింది. గీత రాత్రికి యింటిదగ్గర చదివి తెల్లవారి తెచ్చి ఇస్తానన్నది. అదే క్లాసులో చదివే సరోజ గీతకు స్నేహితురాలేకాక బంధువు కూడా. సరోజ అన్నకు గీతను ఇచ్చి వివాహం చెయ్యడానికి నిశ్చయం కూడా అయింది. రమేశ్ అంటే గీతకు ఎంతో యిష్టం. ఆ తెల్లవారి నుంచే సవిత కాలేజీకి రావడం మానేసింది. వాళ్ళ నాన్న అనుకోకుండా గుండె ఆగి చనిపోయాడు. గీత తన పుస్తకంలో పెట్టిన ఉత్తరం గురించి మర్చిపోయింది.