Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 9

 

    కొద్ది గజాల దూరంలో ఉన్న అనంత జలరాశిని అందుకుని దాహశాంతి చేసుకునే శక్తి అయినా లేదామెకు.
    అలాగే తెలివితప్పి పడిపోయింది.
    సరస్సుతో అక్కడక్కడ చేపల వేటకై పుట్టీలతో తిరుగుతున్న పల్లెవారు ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూశారు. పుట్టేలు నడుపుకుంటూ ఆ చోటుని చేరేందుకు రవంత ఆలస్యమయింది. నీటిలో పడిన యువకుని శవం జాడయిన తెలియలేదు. కొండగుట్ట పై పడిపోయిన జ్యోతి శరీరాన్ని పుట్టీలోకి చేర్పించారు పల్లెవారు. ధారా ప్రవాహంగా కారిపోతున్న రక్తాన్ని నిలుపుచేసేందుకు వారికి చేతనయిన ప్రయత్నాలు చేస్తూ పుట్టీలను ఒద్దు పట్టించారు.
    రేవు నించి ఈ జరిగినదంతా చూస్తూ నిస్సహాయుడై నిలచివున్నాడు రమణ. అక్క శరీరం మీది గాయాలను చూడగానే విలవిలలదిపోవడం ప్రారంభించాడు.
    అమరావతికి లాంచి ప్రయాణం కోసం వచ్చిన బాటసారులు గాయాలతో, రక్తంతో భయానకంగా తయారయిన ఆ శరీరాన్ని చూడలేక అక్కడ నించి తప్పుకు పోయినారు.
    పల్లెవారే మరికొంత చొరవ చేసి జ్యోతిని గవర్నమెంట్ హాస్పిటల్ కు చేర్పించినారు. యమకూపం లాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యువు తో పోరాడుతున్న రోగుల మధ్య ఒక వారం గడిచింది. రవంత ఆరోగ్యం కుదుట పడిన తరువాత తునాతునకలైన లాంచి గురించీ, తన భవితవ్యం గురించి ఆలోచించసాగింది జ్యోతి.
    ఆ వార్డులో నర్స్ గా పనిచేస్తోంది రాజన్ మేరీ ! అప్పుడప్పుడూ పనిలేకపోయినా వచ్చి జ్యోతిని పలకరిస్తోంది. ఆమె కేరళకు చెందిన యువతి. శాపగ్రస్తురాలయిన అప్సరస భూలోకంలో పుట్టి రాజన్ మేరీ అని పేరు పెట్టుకున్నట్లు ఆవిడ నమ్మకం.
    డాక్టర్లు, కాంపౌండర్లు , వార్డు బాయ్ లు, చివరకు మృత్యువుతో పోరాడుతున్న మగ రోగులు కూడా తన వంక దొంగచూపులు చూస్తున్నరన్న అపోహలో ఆవిడ అస్తమానూ సతమతమైపోతూ వుంటుంది.
    కోలుకుని డిశ్చార్జి అయేందుకు సిద్దంగా వున్న ఆడవాళ్ళ దగ్గర కూర్చుని తన అందమంతా ఈ వృత్తి వల్ల ఎలా అడవి కాచిన వెన్నెలలా అయిపోతున్నది చెప్పు కొంటుంది. తనకు మంచి భవిష్యత్తు వున్నదని, ఎవరో ఒక మన్మధుడు ఏదో ఒక క్షణంలో ఏ మూల నుంచో ఊడి పడి నిన్ను ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటాను అని చెప్పేసి ఎగనేత్తుకు పోతాడనీ కొండంత ఆశతో చెప్పుకుంటుంది.
    వచ్చేపోయేవారూ, పలకరించేవారూ వున్న రోగులు ఆవిడ కొట్టేసుత్తి దెబ్బలు భరించలేక ముఖాలు త్రిప్పుకుంటారు. అలాంటి వాళ్ళంటే ఆవిడకు భలే కోపం.
    పలకరించే వారు ఎవరూ లేక జ్యోతి లా ఆవిడా మాటల్ని ఓర్పుతో వినేవారంటే మాత్రం రాజన్ మేరీకి వల్లమాలిన అభిమానం.
    ఓ సుమూహూర్తాన ఆవిడ జ్యోతి దగ్గరకు వచ్చి " నీకొక శుభవార్త చెప్పనా?" అని అడిగింది.
    జ్యోతి దిగులుగా , గుబులుగా నవ్వింది.
    "నాకు శుభవార్తలేమిటి?" అన్నది నిరాశగా!
    "నిన్ను రేపు డిశ్చార్జి చేయబోతున్నారు." అన్నది రాజన్ మేరీ!
    జ్యోతి దీర్ఘంగా నిట్టూర్చింది. "క్రొత్త సమస్యలు ఎదురవుతున్నాయన్నమాట" అంది అదోకలా చూస్తూ.
    వార్డు నిశ్శబ్దంగా వుంది. ఆ సమాధానం విన్న రాజన్ మేరీ బల్ల దగ్గరగా లాక్కుని కూర్చుంది.
    "నిన్ను చూచేందుకు ఎవరూ రాలేదు. నీ కెవరూ లేరా ? అన్నది జాలిగా.
    "భగవంతుడున్నాడు" అని బదులు చెప్పింది.
    "అంతేలే! దిక్కులేని వారికి దేముడే కదా దిక్కు ఎవరు లేరని బాధపడకూడదు మనం. నేను ఇంటర్ చదువుతుండగా అందాల పోటీలో ఫస్టున వచ్చాను. అప్పుడు ఎన్నెన్ని కలలు కన్నాను. నాకోసం ఎవరో రాజకుమారుడు ఎదురు చూస్తూ వుంటాడనీ, అతడు నాకోసం వెతుక్కుంటూ వస్తాడనీ అనుకున్నాను.
    కాని ఏమయింది . యమకూపం లాంటి ప్రభుత్వ ఆస్పత్రిలో దిక్కుమాలిన దాన్లా పడి వున్నాను. భవిష్యత్తు మీద ఆశ వుందనుకో!
    "పడవ ప్రమాదం ఎలా జరిగింది " అని అడిగింది రాజన్ మేరీ!
    జ్యోతి జరిగినదంతా చెప్పింది.
    డబ్బు సంచిలో దాచుకున్న రాగిరేకుల్ని ఆమెకు చూపేందుకు తీయాలని ప్రయత్నించిందామె. తామ్రపత్రాలతో పాటుగా ఓ విజిటింగ్ కార్డు కూడా బయట పడింది.
    దాన్ని అందుకని చూసింది రాజన్ మేరీ.
    "ఈ అడ్రస్ నీ దగ్గరకేలా వచ్చింది" అని అడిగింది.
    "యాక్సిడెంట్ జరిగే ముందు రోజున ఈవిడ నా లాంచిలో ఎక్కారు. ఎంతో ఆదరంతో మాట్లాడారు. విధ్యాదికురాలయిన ఆవిడకు గర్వమంటూ లేదు. ఎంతో సౌజన్య మూర్తి.
    వెళ్ళిపోతూ ఈ విజిటింగ్ కార్డ్ యిచ్చి "ఎప్పుడయినా రావాలనిపిస్తే నా దగ్గరకు రమ్మని చెప్పి వెళ్ళారు" అంటూఆ విజిటింగ్ కార్డు కధను వివరించింది జ్యోతి. ఆ మాటలు వింటున్న రాజన్ మేరీ నేత్రాలు ఆనందంతో తళుక్కు మన్నాయి. వెంటనే లేచి నిలబడింది.
    "ఇంతకాలం ఈ విషయాన్ని ఎందుకు దాచావు. మనసు ప్రేమించే వ్యక్తులు వుండటం నిజంగా ఎంత అదృష్టమనుకున్నావు. దీని మీద ఫోన్ నెంబరు కూడా వుంది. నేను ఆవిడను పిలుస్తాను" అంటూ జ్యోతి  సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది నర్స్ రాజన్ మేరీ!
    నిశ్చేష్టురాలాయి అలా చూస్తూ వుండిపోయింది జ్యోతి.
    ఆమె మనసు రవంత అయినా పనిచేయలేదు. బొమ్మలా అయిపోయి అలాగే పడి వుంది బెడ్ మీద.
    నలబై నిమిషాల తరువాత ముఖంలో విజయగర్వం తొంగి చూస్తూ వుండగా ప్రొఫెసర్ శ్రద్దాదేవిని వెంట బెట్టుకు వచ్చిందామే. చివాలున మంచం మీది నించి దిగి ఆమె పాదాలను తాకింది జ్యోతి.
    "పిచ్చిపిల్లా! నీకు యింత ప్రమాదమయితే నాకు తెలియకుండా ఎలా దాచావు" అంటూ ఎంతో పరిచయం వున్నదాన్లా అడిగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.   ఆమె కరుణాతరంగితమయిన పలకరింపుతో కరిగిపోయింది జ్యోతి. శ్రావణ మేఘాలకు శీతల పవనాలు తాకినట్లుగా అయింది. ఆమె నేత్రాలు జలజలా వర్షించినాయి.
    "అమ్మా! మీరు కరుణా సింధువులే కావచ్చు. దయామూర్తులే కావచ్చు. కాని నేను మీకేమవుతానని. కొద్ది గంటలు కలసి ప్రయాణం చేయటమే కదా మన మధ్య నున్న పరిచయం?" అన్నది విషాదపూర్ణమయిన కంటస్వరంతో.
    శ్రద్దాదేవి జ్యోతిని అక్కున చేర్చుకుని ఓదార్చింది.
    "జ్యోతీ! అత్మీయులయిన వారిని చూచినప్పుడే దుఃఖమనేది కట్టలు త్రెంచుకుని ఉరుకుతుంది. నన్ను చూడగానే ఎందుకు కన్నీరు పెట్టుకున్నావో నాకు తెలియదా!
    ఆత్మీయతా బంధాలనేవి రక్తబందాన్ని అనుసరించి మాత్రమే వుంటాయని అనుకోవటం భ్రమ. ప్రేమ అనేది హృదయధర్మం. అది ఎప్పుడయినా, ఏ యిరువరి మధ్య అయినా అంకురించినదంటే దాని కారణాల కోసం వెతుక్కోవటం వెర్రి పని.

 Previous Page Next Page