అది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఒక కర్తవ్యంగా స్వీకరించింది . ధనాపేక్షతో కర్తవ్యం నించి దూరం కదలుచుకోలేదామే.
అయినా ఈ నవాగతుడెవరు?
పెద్ద మొత్తంలో డబ్బిచ్చి పాత పడవను కొనాలనే ఆలోచన ఈతని కెందుకు వచ్చిందో! ఆ రహస్యమేమిటో తెలుసుకోవాలను కుందామే.
"లక్ష ఇచ్చినా ఈ పడవ ఇవ్వనంటే మీరేమిచేస్తారు?" అని అడిగింది తన మాటలలో అవును, కాదు అన్న భావాలు వ్యక్తం కాకుండా జాగ్రత్తపడుతూ! ఆమె ధనాపేక్షకు లొంగి లాంచి యిచ్చేస్తానని ఒప్పుకుంటుందన్న ఆశతో ఎదురు చూసిన నవాగతుడు నిరుత్సాహపడిపోయినాడు. రవంత సేపు అయోమయంగా చూశాడు.
"ఇటువంటి అసందిగ్ధమయిన ప్రశ్నలు వేయకు. దయచేసి నీవు ఎంత తీసుకోవాలని ఆశిస్తున్నావో చెప్పెయ్యి" అన్నాడు చాలా సిన్సియర్ గా! అతడు ఎంతకయినా ఈ లాంచిని కొనివేసేలా వున్నాడు. ప్రక్క దారి నించి మాట్లాడడం కట్టిపెట్టి సూటిగా సిన్సియర్ గా అడుగుతున్నాడు.
మనసులోని సందేహం తీరనేలేదు. హటాత్తుగా ఆమె కళ్ళు సర్పాక్రుతులు చెక్కిన తలుపుల మీద వాలినాయి.
మనసులో యేవో ఆలోచనలు తళుక్కున మెరిశాయి. ఇంక ఈ విషయాన్ని పొడిగించటం చాలా అనవసరం అన్న నిర్ణయానికి వెంటనే వచ్చేసిందామే. అతడు ఎంత సిన్సియర్ గా అడిగాడో తాను కూడా అంత సిన్సియర్ గానే చెప్పసాగింది.
"మిత్రుడా! నీవెవరో నాకు తెలియదు. నా గురించి నీకు తెలియదు. తెలియకనే అలా అడుగుతున్నావు. నీవు ఎన్ని లక్షలిచ్చినా నేను ఈ లాంచిని నీకు అమ్మేది లేదు. ఎందుకంటె ఎన్ని లక్షల రూపాయలు అయినా నా తండ్రి నాకిచ్చిన కర్తవ్యం కన్నా అధికమయినవి కావు. నీకు ముందుగా చెప్పిన ప్రకారం అరగంట సమయం అయిపొయింది. ఇప్పటికే నిన్ను ఒడ్డుకు చేర్చి ఉండవలసింది . మాటల మధ్య ఆలస్యం జరిగిపోయింది. ఇంక పడవను వెనుకకు తిప్పేస్తాను. ఒడ్డు చేర్చుతాను. దిగి నీ దారిన నీవు వెళ్ళిపో! అంతకు మించి మరేమీ మాట్లాడకు" అని ఖచ్చితంగా చెప్పేసింది జ్యోతి.
ఆ మాటలు ఆమె హృదయపూర్తిగా చెప్పిందని గ్రహించాడు నవాగతుడు. ఆ మాటలకు ఇంక తిరుగుండబోదని కూడా గ్రహించాడు. అప్పటికే లాంచి తిరుగు ప్రయాణమయింది. సమయం మించిపోతోందని గ్రహించాడు . క్షణమయినా ఆలస్యం చేయకుండా ఆమె మీదకు లంఘించాడు.
3
అనూహ్యమైన ఆ దాడికి చేతిలోని స్టీరింగ్ అదుపు తప్పిపోయింది. లాంచి అటు ఇటు అవుతోంది. కూర్చున్న బల్ల మీద నుంచి తూలీ పడిపోయింది జ్యోతి.
ఆమె నేత్రాలు పూచిన మందారాలులా అరుణారుణం అయినాయి. సుందరమయిన నయనాలు సువిశాలం కూడా అయినాయి. నేలతాకినబంతిలా దిగ్గున లేచిందామే. మెరుపులా కదిలింది.
మరుక్షణంలో అతడు ఉక్కిరిబిక్కిరి అయినాడు. విసురుకు వెనుకకు తూలి ప్రయాణికులు కూర్చునే బల్లపై పడిపోయాడు. అతని పురుషాధిక్యత బుసలు కొట్టింది. నేత్రాలు రోష కషాయితం అయినాయి. పెదవి వొనకడం ప్రారంభించింది.
ఒక ఆడపిల్ల చేతిలో ఓడి తాను ఇలా అయిపోవడం అవమాన భారం అయింది . అనూహ్యమయిన ప్రాప్తమయిన ఈరీతిలో ఎదుర్కోలు అతడు విభ్రాంతుడు అయినాడు.
జ్యోతి అంతటితో ఊరుకోలేదు. ప్రయాణికులు కూర్చునే బల్లపై తూలి పడిపోయిన అతని వైపు మెరుపులా కదిలిపోయింది. అతని ఎదురు గుండెలపై కాలానించి బలంగా నొక్కసాగింది.
నవాగతుడు ఉక్కిరిబిక్కిరి అయినాడు.
"నీవు ఎవరు పంపగా వచ్చావు. అంత మొత్తం చెల్లించి ఈ పడవను కొనాలి అనుకోవటంలో నీ ఉద్దేశ్యమేమిటి?" అని అడిగిందామె.
అతడు మరింత పట్టుదలగా చూశాడు. స్వరం చాలా బలహీన మయిపోయింది. అయినా మాట పెళుసు తగ్గలేదు.
"ఇవన్నీ తెలుసుకుని ఈ అఖరు క్షణాలలో నీవు చేయగలిగిందేమిటి? అటు చూడు ఏమవుతుందో" అన్నాడు. జ్యోతి అతని వక్షం పై అదిమి ఉంచిన శక్తిని రవంతయినా పట్టు సడల నీయక తల త్రిప్పి చూసింది.
నిజంగానే అవి ఆఖరు క్షణాలు అనిపించినాయి. బ్యారేజ్ వెనుక రిజర్వాయర్ లో ఎత్తుగా నిలిచి వున్న కొండ గుట్ట వైపుగా నడుస్తోంది లాంచి. కొండ గుట్ట మీది రాళ్ళు లాంచిని బ్రద్దలు కొట్టేందుకు సిద్దంగా ఉన్న రాక్షసుల్లా కన్పించాయి.
వెంటనే అతని గుండెల మీది నుంచి కాలుని తొలగించి స్టీరింగ్ వైపుగా పరుగుతీసింది జ్యోతి. జరగవలసిన అలస్యమంతా జరిగిపోయింది. జరుగని ఘట్టమేదో జరగబోతోంది. జ్యోతి తన శారీరక మానసిక శక్తులన్నింటిని కేంద్రీకరించి లాంచిని ప్రక్కకు మరలించేందుకు ప్రయత్నించసాగింది. ఉన్న కొద్ది సమయాన్ని ఎంతో చాకచక్యంగా వినియోగించుకొని లాంచిని రవంత ప్రక్కకు మళ్ళించి ప్రమాదం నుంచి దూరమయ్యేందుకు శ్రమిస్తోంది.
చేస్తున్న పనిలో మనసు లగ్నం చేసింది. కొద్ది క్షణాలకు పూర్వం జరిగినదేమిటో ఆమె పూర్తిగా మరచిపోయింది. కాని ఆమె పనిలో లీనమవటం గమనించిన అతడు అదే మంచి అదనుగా భావించాడు. గుండెల పైన కాలుంచి పురుషాధిక్యతను సవాలు చేసిన ఆమెకు సరి అయిన గుణ పాఠం చెప్పేందుకు తగిన అదను లభించింది అనుకున్నాడు.
బెల్టులో తోలుసంచిలో దాచిన డాగర్ ని సర్రున లాగి, ఆమె వైపు గురిచూసి కొట్టాడు.
ఇరువురి ప్రాణాలను, తన సర్వస్వం అయిన లాంచిని రక్షించుకోవాలన్న తాపత్రయంలో పడిపోయిన జ్యోతి పరాకున ఉండిపోయింది. ప్రత్యర్ధి ఇలా దాడిచేస్తే ఎలా ఎదుర్కోవాలో ఆలోచించలేని స్థితిలో ఉన్నదామే.
డాగర్ వెళ్ళి వెన్నులో బలంగా దిగిపోయింది. కెవ్వున అరచి వెనుకకు విరుచుకు పడిపోయిందామే. లాంచి తనకు నచ్చిన దిక్కున దూసుకుపోయింది.
మరు క్షణంలో రాక్షసిలా, మృత్యువుకు మరో రూపంలా కొండ గట్టుకూ, నీటికీ మధ్య నిలబడి వున్న రాయిని తాకింది. ఆ వెనుక భయంకరమైన శబ్దమయింది.
లాంచి తునాతునకలైపోయింది.
దానిలోని ఓ పురుషాకృతి విసురుగా వియత్తలానికి లేచి దూరంగా వెళ్ళి పడింది.
సర్పాకృతులు చెక్కి వున్న తలుపులు భళ్ళున బ్రద్దలయి రెండుగా చీలిపోయినాయి. ఆ లోపల నిక్షిప్తమయిన తామ్రపత్రాలు విసురుగా వచ్చి జ్యోతి దగ్గరగా పడినాయి. వాటిని అందుకునేందుకు చేయి జాపిందామే. తాతగారి నించి వారసత్వంగా మిగిలి వున్న అపురూపమయిన నిధి అందుకున్నది జ్యోతి.
మరుక్షణంలోనే ఎవరో విసిరినట్లుగా గాలిలోకి లేచింది. కొండ గుట్ట మీద ఒక వేదికలా కనిపించే రాయి పైకి పడిపోయింది. వెన్ను న దిగిన కైజరును పట్టి లాగింది జ్యోతి. చివ్వున రక్తం చిమ్మసాగింది.
శరీరం శక్తి హీనమయింది. రవంత సేపు అయ్యాక ప్రపంచమంతా అంధకారబంధురమైంది. కనురెప్పలు బరువెక్కినాయి. నాలుక పిడచ కట్టుకుపోయింది.