Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 10


    హృదయ ధర్మం కలిగిన యిరువురి మధ్య ఆత్మీయతా బంధం అంకురించటానికి కనిపించే కారణాలే వుండనక్కరాలేదు.
    ఏమయినా నాకు ఈ విషయాన్ని తెలియకుండా దాచి నువ్వు తప్పు చేశావు. ఇంక నిన్ను వొంటరిగా విడిచి వుంచేది లేదు. ఎదురు చెప్పాలని ప్రయత్నించినానంటే నిన్ను శిక్షిస్తాను.
    ఈ క్షణం నుంచి నీ సర్వ బాధ్యతలూ నేను తీసుకుంటున్నాను " నీమీద నీకున్న అధికారాలు ఈ రోజు నుంచీ పరిమితమయిపోతున్నాయి." అంటూ చెప్పింది శ్రద్దాదేవి.
    కరుణా సింధువులా మాట్లాడుతున్న ఆ దయామయి ఆదరణతో, ఆ ప్రేమ జలపాతంలో తడిసి ముద్ద అయిపొయింది జ్యోతి. అర్ధ్రతా పూర్ణమయిన ప్రొఫెసర్ శ్రద్దాదేవి గురి చూచి విసిరిన ప్రేమ పాశంలో ఆమె సంపూర్ణంగా బందీ అయిపొయింది.
    "అమ్మా! నీవంటి దేవతా మూర్తులు ఆదరణ వల్లనే కదా మావంటి అదృష్టహీనులు బ్రతుకుని కొనసాగించగలుగుతున్నారు. దయామయీ! ఈ క్షణం నించీ నా భాద్యతలే కాదు , నామీది అధికారాలే కాదు -- ఈ బ్రతుకులోని అర్దాలన్నింటినీ నీకు అంకిత మిచ్చు కుంటున్నాను. దిక్కు లేని వారికి దైవమె కదా దిక్కు.
    నా ఈ దిక్కు మాలిన స్థితిలో నన్నాధరించవచ్చిన నువ్వే నాకు దైవానివి. నిన్ను పూజించి నీకు సేవలు చేయటంలో పునీతురాలను అవుతాను. అర్ధవిహీనమాయిపోయిన బ్రతుకులో అర్ధాలను కల్పిస్తానని వచ్చిన నీ సేవలో నా ప్రాణాలనే పణంగా ఒడ్డుతాను." అని మనసులో సంభావించిందీ జ్యోతి. ఆ యిరువురి మధ్య మాటలు కరువయినాయి. కాని హృదయస్పందనలూ, మనోగాతాలు, పెనవేసుకుని గాడతరమున అనుభూతిగా చిగురించినాయి. అంతరికమయిన లోకాలతో ఒకరి మీద ఒకరికి ఆత్మీయతా బంధాలు పెనవేసుకున్నాయి.
    చేతనాపూర్వకమయిన ఆత్మ లోకంలో వారి బ్రతుకుదారులు ఒకే అర్ధాన్ని అనేషించటం అరంభించినాయి.
    తామ్రపత్రాలతో సహా మరునాడే ప్రొఫెసర్ శ్రద్దాదేవి యింటికి చేరిపోయింది జ్యోతి. తానూ చేరవలసిన గమ్యం చేరుకున్నట్లు మనసు ఆరాటాలను అధిగమించి ఊరడిల్లింది.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి జీవితం నియమబద్దమయినది. నా అనే వారందరికీ దూరమయిపోయిన జీవితం అమెది. వున్న సమయమంతా వ్రుత్తి మీద లగ్నం చేసి అన్ని వేళలా తనను తాను మరచేందుకు ప్రయత్నించేది.
    అడ బ్రతుకులోని అర్దాల గురించి అరాటపడటం ఆమె ఏనాడో మానుకుంది. స్వార్ధానికి దూరంగా, విద్యార్ధినీ విద్యార్ధులే లోకంగా జీవిస్తూ బ్రతుకులోని వెలితిని మర్చిపోయింది.
    జ్యోతి వచ్చాక యింటికి వెలిగొచ్చినట్లు అయింది. ఎవరూ లేని యిద్దరూ వారే ఒకరినొకరు అయిపోయారు. "నా" అనే స్వార్ధంతో నిమిత్తం లేనివారికి ఒకరికొకరు కావాలనిపించింది.
    శ్రద్దాదేవి యూనివర్శిటీ నుంచి వస్తూనే విద్యార్దునుల్ని కారులో ఎక్కించుకు రావటం తగ్గించింది. ఎప్పుడు యింటికి వెళ్తే మటుకు ఏముంది అన్న ఆలోచనను దూరంగా వుంచింది.
    తన పలకరింపులో ఒక ఒడార్పునీ, ఒక తృప్తినీ పొందగలిగిన మరో ప్రాణి తన కోసం అన్ని వేళలా ఎదురు చూస్తూ ఉంటుందన్న స్పృహ ఆమెను క్షణమయినా విడిచి పెట్టటలేదు.
    త్వరగా యింటికి వెళ్ళిపోవాలన్న ఆలోచనా ప్రారంభమయినది. ఉత్తర క్షణంలోనే బ్రతుకు లోని వెలితి ఏదో తీరినట్లయింది. ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    జ్యోతికి యిప్పుడు ఎటువంటి వ్యపకమూ లేదు. లాంచి నడపటం అనుక్షణం తండ్రి గురించి ఆలోచించటం, ఏదో ఒక పని కల్పించుకుని భవిత్యాన్ని గురించిన ఆలోచనలు మనసుని తాకకుండా అంతర్యాన్ని చిత్రహింసకు గురి చెయ్యకుండా తప్పుకోవటం లాంటివి యిప్పుడు లేనే లేవు.  
    ప్రొఫెసర్ శ్రద్ద్దాదేవి అలవాట్లనూ, కార్యక్రమాలనూ చక్కగా అర్ధం చేసుకుంది. ఆమెకు ఏ క్షణంలో ఏది అవుసరమో అన్ని సిద్దంగా వుంచటంలో నిమగ్నురాలయింది.
    కాని నిరాడంబరమయిన జీవితం గడుపుతున్న శ్రద్దాదేవి యింట్లో అమర్చవలసిన సౌకర్యాలు అతి స్వల్పం. అందునించి ఆ కార్యక్రమం కొద్ది నిముషాలే పడుతుంది.
    చేసిన పనినే మళ్ళీ మళ్ళీ తిరిగి చూచుకోవటం మరి కొద్ది నిమిషాలు పడుతుంది. మిగిలిన గంటలన్నీ వృధా పోవలసిందే!
    స్వశక్తి మీద, శ్రమ జీవనం మీద ఆధారపడి గడిపిన రోజుల్లో ఆమెకు కాలం చాలా త్వరగా గడిచిపోతున్నట్లు అనిపించేది. కాని ఇప్పుడు ప్రొఫెసర్ శ్రద్దాదేవి యింట లేని సమయంలో కాలం చాలా బరువు అవుతోంది.
    ఏదో ఒక పనిలో నిమగ్నం కావటానికి అలవాటు పడి వుండటం నించి ఈ ఒంటరితనం జ్యోతిని బాధిస్తోంది. రానురాను అది సహించరానిదిగా కూడా అవుతోంది.
    యాక్సిడెంట్ గురి అయాక ఆమె ఆలోచనల సరళి మరి పోయింది. ఒంటరితనంలో వున్నప్పుడు భయంకరమయిన పిశాచాల ఆలోచనలు ముట్టడించటం ప్రారంభించాయి.
    ఏవో అస్పష్ట రూపాలు మనో ఫటలం మీద ప్రత్యక్షమవుతున్నాయి. ఆ రూపాలేమిటో, అలా కన్పించే అర్దాలేమితో ఆమెకు తెలియక అవి భాధాకరమనిపిస్తున్నాయి.
    తన చుట్టూ ఏవో శక్తులు నడయాడుతున్నట్లు , తనను భయం పిశాచాలు అవహిస్తున్నట్లు భయపడసాగిందామె.
    అటువంటి సమయాల్లో ఆ భయం నించి తేరుకుని ఓదార్పు పొందటానికి తండ్రి గురించిన జ్ఞాపకాలను త్రవ్వుకుంటుంది. తండ్రి జ్ఞాపకం రాగానే సర్పాకృతులు చెక్కి ఉన్న తలుపుల వెనకనించి దూసుకువచ్చిన తామ్రపత్రాలు జ్ఞాపకం వస్తాయి.
    ఆ యువకుడు ఎవరు?
    లక్ష రూపాయలకయినా పాత లాంచిని కొనాలని ఎందుకు ప్రయత్నించాడు ? అమ్మను పొమ్మంటే ఎందుకు బెదిరించాడు? ఇంతకూ ఆ తామ్రపత్రాలలో అర్ధం కాని భాషలో వ్రాసి ఉన్నదేమిటి? ఇవన్నీ ఆలోచనల్లోకి వస్తాయి. ఒంటరితనంలో ఆ భయం నించి రవంత దూరమవుతోంది.
    కాని తామ్రపత్రాల సంగతి గుర్తుకు వచ్చినా , వాటిని తీసుకువచ్చి ముందుంచుకుని అర్ధం కాని ఆ భాష వంక చూస్తున్నా ఏదో తెలియని భయం ఒణికిస్తోంది.
    ఇప్పుడు ఆ పనిలోనే లీనమయి వుంది.
    చిలుం పట్టిన తామ్రపత్రాలను ఒడిలో వుంచుకుంది. గుండెను గుబులేత్తిస్తున్న భయాన్ని మర్చిపోయేందుకు అర్ధం కాని లిపిలో చెక్కి వున్న ఆ విచిత్రమయిన అక్షర క్రమాన్ని రెప్ప వేయక చూస్తోంది. ఆ అక్షరాలు అర్ధం కావు. కాని భయపెడతాయి.
    అక్షరాకృతులు చిత్రగతిలో సాగిపోతున్న చిన్న చిన్న సర్పాకృతుల్లా ఒళ్ళు జలదరించేలా చేస్తాయి.
    జ్యోతి వాటి వంక భయం భయంగా చూచి గట్టిగా కళ్ళు మూసుకుంది .
    కళ్ళు మూసుకుంటే మనో పటలం మీద ఏవో భయంకరాకృతులు ఉత్పన్నమయ్యాయి. భయంగా కళ్ళు విప్పిందామే.
    చిన్ని చిన్ని సర్పాకృతులలో సాగిపోతున్న భీకరమయిన అక్షరాకృతులు. కనులు తెరచినా మూసినా భయంకరమయిన దుస్థితి అది!!
    భగవంతుడా! భరించలేని వారికి ఏకాంతాన్ని మించిన శిక్ష ఏముంది? నేనేమయిపోతాను ? నా భయానికి ఈ అక్షరాలకు సంబంధం ఏమిటి? ఈ దయనీయమైన స్థితి నించి నాకు విముక్తి ఏమిటి? -- ఆక్రోశించే విధంగా అనుకుంది జ్యోతి.

 Previous Page Next Page