నాగేంద్రం వుండే గుడిశెలలో ఆదెమ్మ అనే ఒక నడికారు దాటిన స్త్రీ వుంటోంది. తెలియనివాళ్ళు కొందరు ఆమె నాగేంద్రం తల్లి అనుకుంటారు. కాని నిజానికి వారిద్దరిమధ్యా ఎలాంటి బంధుత్వమూ లేదు. పిల్లా జెల్లాలేని ఆదెమ్మ, ఏ దిక్కూలేక రోడ్లవెంట తిరిగే నాగేంద్రాన్ని చిన్నతనంలోనే దగ్గిరకుతీసి పెంచి పెద్దవాణ్ణి చేసింది. ఆదెమ్మ సంరక్షణకిందికి వచ్చేనాటికే నాగేంద్రం పదీ పన్నెండేళ్ళవాడు. ఒకనాడు రోడ్డంట వెళుతూన్న ఆదెమ్మకు మురుగు కాలవ పక్క చప్టామీద వణుకుతూ పడివున్న పన్నెండేళ్ళ నాగేంద్రం కనిపించాడు. ఆ దిక్కులేని పక్షిమీద ఆదెమ్మకు జాలికలిగి ఇంటికి తీసుకువచ్చి, మందులూ మాకులూ యిచ్చి ఆరోగ్యవంతుడ్ని చేసింది.
ఆ నాటినుంచీ నాగేంద్రం ఆదెమ్మ యింట్లోనే వుండిపోయాడు. బిడ్డా పాపాలేని తనకు, వృద్ధాప్యంలో కాలూచేయీ పడితేనే సహాయంగా వుంటాడని ఆదెమ్మ ఆశపెట్టుకుంది. కూటికోసం అక్కడా యిక్కడా వెతుక్కోకుండా, యిక్కడ హాయిగా జరిగిపోతున్నది గనుక, ఈ ఇల్లు వదలకూడదనుకున్నాడు నాగేంద్రం. ఈ విధంగా తెలిసో తెలియకో ఎవరి స్వార్థం వాళ్ళు చూచుకున్నారు. ఆ కారణంవల్ల వారిమధ్య ప్రేమా - వాత్సల్యాల్లాంటివి ఏమీలేవు.
ఆదెమ్మ ఎంతో కాలంగా ఎలాంటి చిక్కులు లేకుండా సుఖంగా సాఫీగా బతుకుతూ వస్తున్నది. డబ్బెక్కణ్ణించి వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. "నాకు బొంబాయిలో బాగా డబ్బున్న బంధువున్నాడు" అంటుంది ఆదెమ్మ. అది అన్ని ప్రశ్నలకూ, అనుమానాలకూ తిరుగులేని జవాబు. ఆ బంధువు ఒకానొక అవినీతి వ్యాపారంలో అందెవేసిన చేయి. అతడికి అన్ని ముఖ్య పట్టణాల్లో ఏజంట్లున్నారు. వాళ్ళపని అక్కడ దొరికిన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మటం. ఆదెమ్మ చేసేపనికూడా అదే. వాళ్ళు ముఖ్యంగా సినిమా హాళ్ళవద్దా రైల్వేస్టేషన్లలోనూ కాపలా వేసేవాళ్ళు. అక్కడ ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని కొంచెం ఆదమరచి వున్నారో, ఆ అదనులో వాళ్ళను చేజిక్కించుకుని పారిపోయి, క్రమంగా వాళ్ళను బొంబాయిలోని ఆదెమ్మ బంధువుకు చేర్చేవారు.
ఆదెమ్మ యిల్లుచేరిన కొద్ది రోజుల్లోనే నాగేంద్రం అంతవరకూ తాను కాలం ఎలా గడుపుకు వస్తున్నదీ ఆమెకు చెప్పాడు. పెద్ద శిక్షణ అవసరం లేకుండానే వాడు తనకు సహాయకారి కాగలడని ఆదెమ్మ గ్రహించింది. ఆనాటినుండి ఆమె నాగేంద్రాన్ని తన దుర్మార్గ వృత్తిలో బాగా ఉపయోగించుకున్నది.
ఆదెమ్మ కిప్పుడు దాదాపు యాభై అయిదు సంవత్సరాల వయసు. నాగేంద్రం ముప్ఫయ్యోపడిలో పడ్డాడు. వాడు ఆమె యిల్లు చేరిననాటినుంచి యీనాటివరకూ వాళ్ళు చేసిన దారుణకార్యాలు వాళ్ళకే ఎరుక.
గౌరి ఆదెమ్మవల్ల పదేళ్ళక్రితం దొంగిలించబడిన పరాయి బిడ్డ. పదేళ్ళక్రిందట ఒకనాడు....
ఆదెమ్మ చక్కగా ముస్తాబు చేసుకుని గౌరవకుటుంబ స్త్రీలా తెనాలి రైల్వేస్టేషన్ లో ఒక బెంచిమీద కూర్చుని, వచ్చే పోయే ప్రయాణికుల్ని పరీక్షగా చూస్తున్నది. ఇంతలో ఒకామె ఒక చిన్నబిడ్డను ఎత్తుకుని ఆదెమ్మ దగ్గరకు వచ్చి బెంచీమీద ఆమె పక్కగా కూర్చున్నది. ఆదెమ్మ ఆ స్త్రీని పరిశీలనగా చూసింది.
ఆమె ముఖలక్షణాలూ, పిల్లను సముదాయించే తీరూ చూస్తే, కొంచెం పెద్ద కుటుంబ స్త్రీలా కనిపించింది. కాని, ఆమె ధరించిన దుస్తులు బాగా మాసిపోయి వున్నాయి. జుట్టు చిందరవందరగా రేగి వున్నది. చేతిలో ఒక చిన్న మూట వున్నది. ముఖం చాలా విచారగ్రస్తంగా వున్నది.
ఆ స్త్రీ తన బిడ్డను కాసేపు జోకొట్టి, కళ్ళు మూయగానే బెంచీ మీద మెల్లిగా పడుకోబెట్టి, ఆదెమ్మతో "అమ్మా కాస్త సహాయం చేయగలవా? నిన్నటినుంచీ తిండిలేక ప్రాణం శోషకు వస్తున్నది. ఈ బిడ్డను కొంచెం చూస్తూవుండండి. ఆ కనబడే దుకాణంలో టీ తాగివస్తాను" అన్నది.
అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న ఆదెమ్మ ముఖంలో ఎంతో జాలి కనబరుస్తూ, "అలాగా పాపం! వెళ్ళి టీ తాగిరండి! బిడ్డకేం, నేను చూస్తూ వుంటాను" అన్నది.
ఆ స్త్రీ టీ స్టాల్ వైపుకు వెళ్ళింది. అక్కడ జనం తొక్కిసలాట జాస్తిగా వుండటంతో ఆమెకు వెంటనే టీ దొరకలేదు. ఆమె జనం వత్తిడిని తప్పుకుంటూ స్టాల్ దగ్గిరకు పోయి, టీ కోసం డబ్బులిచ్చి బెంచీమీద నిద్రపోతున్న తన బిడ్డకేసి మళ్ళీ మళ్ళీ చూడసాగింది.
ఇంతవరకూ స్టేషన్ లో వున్న రైలుబండి కూతవేసింది. అదే సమయంలో ఎక్కణ్ణుంచో నాగేంద్రం తుఫానులా వచ్చి, ఆదెమ్మ పక్కన నిద్రపోతున్న బిడ్డను లేవనెత్తి భుజాన వేసుకుని, ఒక్క అంగలోపోయి రైలెక్కాడు. ఆదెమ్మకూడా అతడి వెనకనే పోయి రైలెక్కింది.
టీ స్టాల్ దగ్గిర జనంలో నిలబడి టీ తాగుతున్న బిడ్డతల్లి, ఈ ఘోరం చూసి నిలువెల్లా కంపించిపోయి, మాటా పలుకూ లేకుండా మూర్ఛపడిపోయింది.
ఆదెమ్మా, నాగేంద్రం సరిగా రెండేళ్ళయినా నిండని ఆ బిడ్డను తమ ఇంటికి చేర్చారు. క్రమంగా ఆ పాపను అంచెలమీద బొంబాయి చేర్చాలి. అది అంత త్వరలో సాధ్యం కాలేదు. ఈ లోపల బిడ్డ అంద చందాలూ, వచ్చీరాని మాటలూ ఆదెమ్మలో మాతృవాత్సల్యాన్ని రగుల్కొప్పినై. ఆ బిడ్డను తానె పెంచుకుంటానన్నది ఆదెమ్మ. అమ్మితే చాలా డబ్బు వస్తుందని నాగేంద్రం మొదట్లో ఒప్పుకోకపోయినా, చివరకు తలూపి వూరుకున్నాడు. ఆదెమ్మ ఆ బిడ్డను ముద్దుగా 'గౌరి' అని పిలవసాగింది.
గౌరి పెరిగి పెద్దదవుతున్నకొద్దీ ఆమె అందం నాగేంద్రాన్ని ఆకర్షించసాగింది. తమ యిద్దరి మధ్యా వయస్సులో వున్న పెద్ద తేడా ఆ దుష్టుడి బుద్ధికి తోచలేదు. పెళ్ళీడురాగానే, తానే గౌరిని పెళ్ళాడాలని వాడు నిశ్చయించుకున్నాడు. ఆ మాట ఆదెమ్మకు చెపితే, ఆమె మౌనంగా ఎటూ తేల్చకుండా తలాడించి వూరుకున్నది. నాగేంద్రం నిరుత్సాహపడలేదు. తనమాట కాదన్నరోజున ఆదెమ్మను తాను పోలీసులకు ఒప్పచెప్పగల ననుకున్నాడు వాడు. తన శక్తి ఎలాంటిదో తెలిసిన ఆదెమ్మ తన కోర్కెకు ఆటంకాలు కల్పించలేదని నమ్మాడు.
వయసు పెరిగినకొద్దీ ఆదెమ్మ ప్రవర్తనలో చాలా మార్పులు రాసాగాయి. ఆమె యిప్పుడు తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తమేదైనా చేసుకోవాలన్న ఆలోచనలో పడింది. అందుకు మరేంలేదు; గౌరిని దుష్టుల చేతుల్లో పడకుండా కాపాడి, మంచిగా బతికే ఏ యువకుడికైనా యిచ్చి వివాహం చేయాలనుకొన్నది.
గౌరికి ఆదెమ్మ మనసులో జరుగుతున్న సంఘర్షణగాని, నాగేంద్రం ఎత్తుగడలుగానీ ఏమీ తెలియవు. గౌరి ఆదెమ్మను అమ్మమ్మ అనీ, నాగేంద్రాన్ని మామ అనీ అనుకుంటున్నది. వాళ్ళిద్దరూ ఆమెకు అలా అనే చెప్పారు. గౌరికి ఆదెమ్మ అంటే యిష్టం. కాని, నాగేంద్రం అంటే ఎందుకనో అసహ్యపడుతూండేది. ఎవరి ప్రవర్తన ఎలాంటిదో తరచి చూడగల వయసుగాని, జ్ఞానంగానీ లేకపోయినా, ఆ పసి హృదయంలో నాగేంద్రం మొరటువాడనీ, దుష్టుడనీ నమ్మకం కుదిరిపోయింది.
చిన్నచిన్న విషయాలలోకూడా గౌరి, నాగేంద్రాన్ని ఎదిరించి, అతడి చేత దెబ్బలు తినేది. ఆదెమ్మ యింట లేనప్పుడు నాగేంద్రం ఆమెను ఏదో నెపం పెట్టి దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించేవాడు. ఆ సమయాలలో గౌరికి అతడంటే మరింతగా అసహ్యం కలిగేది.
చంద్రాన్ని గొడ్లసావిటిలోంచి కట్లువిప్పి విడిపించిన తరువాత గౌరి యిల్లు చేరింది. నాగేంద్రంమామ ముద్దుపెట్టుకో ప్రయత్నిస్తే, తన కెంతో ఏహ్యభావం కలుగుతుంది. చంద్రం తనను ముద్దుపెట్టుకున్నాడు. అసహ్యం అనిపించలా. పైగా ఆ ముద్దుతో అతడంటే ఎన్నో అర్థంకాని ఊహలు తనలో రేకెత్తుతున్నాయి. చంద్రం మంచివాడు. చాలా చాలా మంచివాడు. అయితే అతణ్ణి గుంజకెందుకు కట్టేశారు? ఎక్కడికి పారిపోయాడు? ఆకలయితే అన్నం ఎవరు పెడతారు? తను కట్లు విప్పవలసిందికాదు.... విప్పబట్టే పారిపోయాడు. ఒకవేళ యింటికి తిరిగి రాడేమో!......
అలాంటి ఆలోచనలలో తలమునకలైవున్న గౌరికి, వంటింట్లో ఏదో అలికిడైనట్టు తోచి, అటుకేసి మెల్లిగా నడిచింది. ఆదెమ్మా, నాగేంద్రం పొయ్యిప్రక్కన చిన్న గుంట తవ్వి, దానిపక్కన కూర్చుని మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. ఆదెమ్మ కొన్ని రూపాయల నోట్లు ముంతలోపెట్టి మూకుడు కప్పింది. నాగేంద్రం దానికి తాడు బిగించి, గుంటలో పెట్టాడు.
"జాగర్తరోయ్, నాగూ! ముంతలో మట్టిపడకుండా, గుంటపూడ్చు కాసినా కూసినా వెయ్యిరూపాయలు!" అన్నది ఆదెమ్మ.
నాగేంద్రం విసుగ్గా తలాడిస్తూ, "నీ కేమన్నా మతిపోయిందా? మూకుడుతో మూసిన ముంతలో మట్టెలా పడుతుంది?" అంటూ గుంటతవ్వగా వచ్చిన మట్టితో, తిరిగి గుంటను పూడ్చాడు.
ఆదెమ్మ పక్కనే ముద్దచేసివున్న పేడ పెట్టి ఆ స్థలమంతా శుభ్రంగా అలుకుతూ, "నాకింకా భయంగానే వుందిరా! ఆ కృష్ణారావుగారు నీమీదేం అనుమాన పడరుగందా?" అన్నది.