Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 8


    కృష్ణారావు కుటుంబానికీ, ప్రకాశం వాళ్ళ కుటుంబానికి తాత ముత్తాతల కాలంనుంచీ బద్ధ విరోధమట. ఆ ఇంటిపై వాలిన కాకి, యీ ఇంటిపైన వాలేందుకు లేదు. ఇంతకూ అంత వైరభావం ఏ కారణంవల్ల వచ్చిందో అన్నయ్య తనతో చెప్పలేదు. 'నీవు చిన్నవాడివి. ఆలాంటి విషయాలు అర్థం చేసుకోగల జ్ఞానం నీకు లేదు. నా మాట గుర్తుంచుకో. ఎలాంటి పరిస్థితుల్లోనూ, నువ్వాగడప తొక్కకూడదు.' ఇదీ అన్నయ్య ఇచ్చిన సుగ్రీవాజ్ఞ. అందువల్లే తను ప్రొద్దున్నే ప్రకాశం వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు అన్నయ్యతో చెప్పలేకపోయాడు. ఆ కారణంగా దొంగతనం తనమీద పడింది. వదిన రేపిన అనుమానంతో, అన్నయ్యకు తను దొంగ అన్న గట్టినమ్మకం కలిగింది.

 

    అన్నింటికంటె అవమానకరం అయిన విషయం - తనంటే ఎంతో ప్రేమా, వాత్సల్యంగల ప్రసాదరావుగారుకూడా తనను దొంగగా భావించటం. హేమ కూడా అలా అనే నమ్మివుంటుందా? తను నిర్దోషినని రుజువు చేసుకోనిదే వాళ్ళ ముఖం చూడగలగటం అసంభవం.

 

    "చంద్రం!" అన్న చిన్న పిలుపు అతడి చెవులకు వీణాస్వరంలా వినిపించి, చంద్రం తల ప్రక్కకు త్రిప్పి చూశాడు. హేమ అతణ్ణి సమీపిస్తున్నది. ఒక చేతిలో తినుబండారాలతో నిండివున్న వెండిపళ్ళెం, మరో చేతిలో నీళ్ళు నింపిన మరచెంబు. ఆమెను చూస్తూనే చంద్రం ముఖం ఆనందంతో విప్పారింది.

 

    "హేమా! వచ్చావా? త్వరగా యీ కట్లు విప్పేయ్. ఒళ్ళంతా నొప్పులు. కాళ్ళు పీక్కుపోతున్నాయి," అన్నాడు చంద్రం హేమను తొందర చేస్తూ.

 

    హేమ అతడి మాటలు విననట్టే తొణక్కుండా అతడి ముందుకు వచ్చి, తాపీగా పళ్ళెం, మరచెంబు కింద పెట్టింది. తరువాత పళ్ళెంలో వున్న తినుబండరాల్లో ఒకటి తీసుకొని చంద్రం నోటికి అందించబోయింది.  

 

    "ఈ కట్లు శరీరాన్ని ఒరిపిడి చేస్తున్నై. చచ్చేంత బాధగా వుంది. ఇప్పుడా తిండి? ముందు నా కట్లు విప్పు" అన్నాడు చంద్రం ఆదుర్దాగా.

 

    హేమ పెదవులు బిగించి 'ఊహూఁ' అంటూ తలాడించి, "అదేంకుదరదు చంద్రం! నువ్వు నిజం చెప్పందే కట్లు విప్పను. ఆ డబ్బు ఎక్కడ దాచావో నాతోనైనా చెప్పు. నేనా సంగతి నాన్నగారితో చెప్పి నీ కట్లు విప్పేలా చేస్తాను. అంకుల్ నిన్ను మళ్లీ కొట్టకుండా చూసే బాధ్యత నాది" అన్నది.

 

    హేమ మాటలకు చంద్రం నిర్విణ్ణుడయిపోయాడు. హేమ కూడా తనను దొంగగా భావిస్తున్నదన్నమాట! అతడికి అంతా అయోమయంలా కనిపించింది. తన కాళ్ళకింద భూమి కుంగిపోతున్నట్టూ, తను కట్టివేయబడిన గుంజతోసహా పాతాళానికి కూలిపోతున్నట్టూ భయం వేసింది.

 

    హేమ ఏదో మాట్లాడుతున్నది. అవేమీ చంద్రానికి అర్థం కావటంలేదు. కాని, అతడి చెవుల్లో ఒకే గింగురు శబ్దం.... వేయి కంఠాలు మూక ఉమ్మడిగా "చంద్రం దొంగ!" అంటున్నాయి. ఆ కంఠస్వరాలలో హేమ గొంతు మరింత స్పష్టంగా వినబడుతున్నది. 'చంద్రం దొంగ! చంద్రం.....!'

 

    ఒక్క క్షణకాలం నిశ్శబ్దం. చంద్రం నీరసంగా ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. గొడ్లచావిడి మొండిగోడల వెనుక ఏదో అలికిడి అయ్యింది. ఆ వెంటనే మొండిగోడలమీద నీడలాంటి చిన్న ఆకారం! చంద్రం ఆశ్చర్యంగా అటుకేసి చూశాడు.  

 

    గోడమీదనుంచి కిందికి చూస్తూ ఒక పదేళ్ళపిల్ల అతడికి కనిపించింది. ఆమె బీదయింటి పిల్లలా అతుకులువేసి కుట్టిన పచ్చపువ్వుల ఎర్ర పరికిణీ, ఎర్రగళ్ళ తెల్లజాకెట్ వేసుకున్నది. ఆ అమ్మాయి కిందికి దూకేందుకు, దూరం ఉజ్జాయింపు వేసుకుంటున్నట్టు కిందికీ, పైకీ పరీక్షగా చూస్తున్నది.   

 

    చంద్రానికి అంత శారీరక, మానసిక బాధలోకూడా ఆ అమ్మాయి వాలకం చూడముచ్చట కలిగింది. అతడామె ముఖ కవళికలను పరీక్షగా చూడసాగాడు. గుండ్రని పెద్ద కళ్ళూ, చిన్న నొసలు, పోనుపోను కొంచెం వెడల్పయిన ముక్కు, నొక్కుల జుత్తు, కింది పెదవికంటే కొంచెం లావయిన పై పెదవి గల ఒంపులు తిరిగిన చిన్న నోరూ, చామనఛాయ శరీరం - చూడగానే ఆకర్షించే ప్రత్యేకత ఏదోవుంది ఆ బాలిక ముఖంలో.     

 

    చంద్రంతోపాటు హేమకూడా ఆ మొండిగోడమీది పిల్లకేసి ఆశ్చర్యంగా చూడసాగింది. అంతలో ఆ పిల్ల దబుక్కుమంటూ కిందికి దుమికి చంద్రం హేమలు వున్నచోటుకు రాసాగింది 'ఎంత బావుందీ అమ్మాయి!' అనుకున్నాడు చంద్రం, "గిజగిజ లాడుతూంటే, కట్లిప్పకుండా నువ్విక్కడ తమాషా చూస్తున్నావా?" అన్నదా అమ్మాయి, హేమ ముందుకువచ్చి ఒయ్యారంగా నిలబడి.

 

    హేమ చీదరిస్తున్నట్టు ఆ అమ్మాయికేసి చూసి, ఈ అలగాపిల్లకు జవాబిచ్చేదేమిటనుకుంటూ ముఖం పక్కకు తిప్పుకున్నది. ఆ పిల్ల సరాసరి చంద్రం దగ్గరకివెళ్ళి అతడి కట్లిప్పటానికి వంగింది. హేమ పళ్ళు కొరుకుతూ "జాగ్రత్త! ఏం చెయ్యబోతున్నావ్? కట్లిప్పావో, మా అత్తయ్యను కేకవేసి, నీ వీపు పగలగొట్టిస్తాను. చంద్రం తప్పు చేశాడు. పెద్దవాళ్ళు శిక్షిస్తున్నారు, మధ్య నువ్వెవరు కట్లిప్పటానికి?" అన్నది రోషంగా.   

 

    "అబ్బో! ఏవిఁటా తప్పు? తప్పులు చేయనోళ్ళెవరూ? చాల్లే - అడ్డంరాకు, తప్పుకో" అంటూ ఆ పిల్ల హేమ భుజం పట్టుకొని ఒక్కతోపు తోసింది. ఆ బాలిక కంటే వయసులో కొంచెం పెద్దదయినా, హేమ సుకుమారంగా పెరిగినది కావటంతో ముందుకు పడబోయిందల్లా, చప్పున చంద్రం కట్టివున్న గుంజను పట్టుకొని పడకుండా కాలు నిలదొక్కుకున్నది.

 

    ఆ అమ్మాయి చకచకా చంద్రం కట్లు విప్పసాగింది. ఒక అలగా పిల్ల తన వంటిమీద చెయ్యి చేసుకోవటమా? ఉక్రోషంలో హేమ "ఉండు, అత్తయ్యను పిలుచుకొస్తాను" అంటూ చావిట్లోనుంచి గబగబా బయటికి పరిగెత్తింది.   

 

    ఆ తేలుకొండీ జడపిల్ల చంద్రం కట్లు క్షణాలమీద విప్పేసింది. అంతవరకూ శరీరంలో సరిగా రక్తప్రసారం ఆడక, ఒక్కసారి తనను బంధించిన కట్లు ఊడిపోవటంతోనే తిరిగి ప్రసారం ప్రారంభం కావటంతో చంద్రానికి కళ్ళు బైర్లుకమ్మినై. కాళ్ళూ, చేతులూ చచ్చుపడిపోయినట్టయి నిలబడలేక గుంజదగ్గరే కూలబడ్డాడు. తనకింత సహాయంచేసిన ఆ బీదపిల్లమీద అతడికెంతో కృతజ్ఞతాభావం కలిగింది.

 

    "నీ పేరేమిటి?" అని అడిగాడు చంద్రం ఆ అమ్మాయిని.

 

    "గౌరి. మరి నీ పేరో?" అన్నదా పిల్ల రాగం తీస్తూ.

 

    "చంద్రం. అది సరేకాని, నువ్వు నాకట్లెందుకు ఊడదీశావ్? అందరిలాగే నీకూ నేను దొంగలా కనిపించలేదా?" అన్నాడు.

 

    "నువ్వు దొంగ వెందుకవుతావ్? ఆ మొండిగోడ పక్కగ వెడుతూంటే లోపల్నించి మాటలు వినిపించినై. ఎవరో చూద్దామని గోడ ఎక్కాను. నువ్వు! నీ ముఖం చూడగానే కష్టాల్లోవున్న మంచబ్బాయి అనుకున్నాను. గోడ దూకాను, కట్లిప్పాను, సరిపాయె!" అన్నది గౌరి అమాయకంగా కళ్ళుతిప్పుతూ.

 

    చంద్రం గౌరి మాటలూ, ఆ చెప్పిన తీరూ చూసి చకితుడై పోయాడు. ఎందుకనో అతడికాక్షణంలో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనిపించింది. చప్పున చేతులు చాచి, గౌరిని దగ్గరకు లాక్కుని నుదుటిమీద గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు. మొండిగోడ మీదికి ఎక్కి, అవతల వైపుకు దూకి, పరుగు లంకించుకొన్నాడు.

 

                                            5

 

    కృష్ణా టుబాకో ఫ్యాక్టరీ పట్టణానికి ఓ చివరలో వుంది. ఫ్యాక్టరీకి నాలుగైదు ఫర్లాంగుల దూరంలో వున్న మైదానం లాంటి పెద్ద ఖాళీ స్థలంలో నూరుకుపైగా గుడిసెలున్నాయి. ఆ గుడిసెల్లో నివసించేవారంతా కృష్ణా టుబాకో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే. కృష్ణారావు ఆ ఖాళీస్థలంలో గుడిసెలు వేయించి తన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు అద్దెకిచ్చాడు. ఆ గుడిసెలన్నీ రెండుమూడు తప్ప దాదాపు ఒకటిగానే వున్నాయి. ఆ రెండు మూడు మాత్రం కొంచెం ఎత్తుగా రెండు నిట్టాళ్ళతో వేసిన గుడిసెలు. వాటిల్లో ఒకదాంట్లో నాగేంద్రం వుంటాడు.

 

    నాగేంద్రం ఒడ్డూ పొడుగూ వుండే మోటుతరహా మనిషి. అతడంటే భయపడని ఫ్యాక్టరీ కార్మికుడుండడు. అతడిది మోటు శరీరం, కిరాతక స్వభావం. ఈ సంగతి కార్మికులందరికీ అనుభవమే. బహుశా అతడిలోని యీ లక్షణాలే కృష్ణారావుకు అతడంటే అభిమానం కలగటానికి కారణం అయివుండవచ్చు. హక్కులనీ, సమ్మెలనీ, కార్మికులెప్పుడైనా ఆందోళన ప్రారంభిస్తే యిలాంటి దుష్టుణ్ణి చక్కగా వినియోగించుకోవచ్చునని వ్యాపార మెలకువలూ, వ్యవహారజ్ఞానం బాగావున్న కృష్ణారావు అనుకున్నాడు.   

 

    ఫ్యాక్టరీలో పనిచేసే కూలీలమీద అజమాయిషీ అంతా నాగేంద్రానిదే. మేస్త్రీలూ, ఫోర్ మన్ లమీద కూడా వాడు అధికారం చెలాయిస్తాడు. ఫ్యాక్టరీలో కొత్తవాళ్ళ కెవరికైనా పని కావాలన్నా. వున్నవాళ్ళల్లో ఎవరినైనా తొలగించాలన్నా కృష్ణారావు ముందుగా నాగేంద్రాన్ని సంప్రదిస్తాడు. ఈ కారణంవల్ల కార్మికుల ఉద్యోగ కాలపరిమితి చాలావరకు నాగేంద్రం దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి వుంటుంది. అందువల్ల ఆ గుడిశెలలో నివసించే కూలీలంతా అతడి అడుగులకు మడుగులొత్తుతారు. ఆడ కూలీలమీద అందులోనూ కాస్త వయసులోవున్న వాళ్ళమీద అతడు చేయని అఘాయిత్యం వుండదు. లొంగకపోతే వుద్యోగం పోతుంది. తరువాత ఆకలి, దారిద్ర్యం - నిలిచేందుకు నీడైనా లేకపోవటం - ఇన్ని బాధల నెదుర్కొని నిలిచి పోరాడగల శక్తి వారికిలేదు.

 Previous Page Next Page