Previous Page Next Page 
డా || వాసిరెడ్డి సీతాదేవి రచనలు - 4 పేజి 10


    "భయం ఏమీలేదు. తమ్ముడు చంద్రం దొంగిలించాడని ఆయనకు నమ్మకం కుదిరిపోయింది. పోలీసులకు రిపోర్టుకూడా యివ్వడు -" అంటూ లేచి నిలబడ్డాడు నాగేంద్రం. ఆదెమ్మకూడా అలుకుడుపని పూర్తిచేసి నిలబడింది. ఇద్దరూ వాకిటికేసి నడవబోతూ ఎదురుగా గౌరి నిల్చొని వుండడం చూశారు.

 

    "ఎంతసేపునుంచి ఇక్కడున్నావే?" అడిగాడు నాగేంద్రం.

 

    "చాలాసేపునుంచీ, మీరు చేసిందికూడా చూశాను!" అన్నది గౌరి తొణక్కుండా.

 

    ఆ జవాబుతో ఆదెమ్మ గతుక్కుమన్నది. నాగేంద్రం గౌరిని సమీపించి, తలమీద చిన్నగా మొట్టుతూ, "ఇదంతా నీకోసమేనే పిల్లా!" అన్నాడు.

 

    "నాకోసవాఁ! ఛీ! మీ దొంగతనం సంగతి కృష్ణారావుగారితో యిప్పుడే చెప్పొస్తాను" అంటూ గౌరి గిరుక్కున వెనుదిరిగింది.

 

    నాగేంద్రం కళ్ళు చింతనిప్పుల్లా అయినై. కోపంగా గౌరి జడ పట్టుకుని వెనక్కు లాగాడు.

 

    "నా జడ వదులు. నువు చంపినా, కోసినా నేను నిజం చెప్పకుండా వూరుకోను" అంటూ గౌరి పెనుగులాడింది.    

 

    నాగేంద్రం రౌద్రమూర్తి అయిపోయి, గౌరి జడపట్టుకుని కిందకు వంచి, వీపుమీద దభీదభీమంటూ బలంగా బాదాడు. గౌరి ఒకటి రెండు కేకలుపెట్టి స్పృహతప్పి కిందపడిపోయింది.

 

    ఆ స్థితిలో గౌరిని చూడగానే నాగేంద్రం కోపమంతా జాలిగా మారింది. అతడు తల వంచుకొని వీధివాకిలి దగ్గరకు వెళ్ళిపోయాడు. కాసేపటికి గౌరి కళ్ళుతెరిచింది. పక్కన కూర్చుని ఆదెమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకోవటం ఆమెకు కనిపించింది. గౌరికి తను ఆదెమ్మనూ, నాగేంద్రాన్నీ ఎదిరించటం పొరపాటన్న భావం కలిగింది. ఆ వెంటనే మారుమటాడకుండాపోయి గోడమూలనున్న మంచం లాక్కొని పడుకొన్నది. ఆ రాత్రి ఆదెమ్మా - నాగేంద్రం ఎంత బతిమాలినా గౌరి అన్నం తినలేదు.

 

    ఒకరాత్రివేళ గౌరికి మెలకువ వచ్చింది. ఆదెమ్మ, నాగేంద్రం ఘర్షణ పడుతున్నారు.

 

    "అదంటే నీ కొక్కదానికే ప్రేమనుకోకు. కొట్టినందుకు నాకూ బాధగానే వుంది. ఏంచేసేది? ఒట్టి మొండిఘటం!" అన్నాడు నాగేంద్రం.  

 

    "మొండో గిండో చాలా నీతిగల పిల్ల. మనం చేసే పాడుపనులు దానికి నచ్చవు. అది పుట్టిన వంశం గొప్పదయివుండాలి," అన్నది ఆదెమ్మ.

 

    "ఏం గొప్పో! దొరికిన పిల్లలందర్నీ అమ్మినట్లే దీన్నీ అమ్మేస్తే ఏ చిక్కూ రాకపోవును," అన్నాడు నాగేంద్రం విసుగ్గా.

 

    "అదీ నిజమేరా! ఎంతమంది పిల్లల్ని తల్లులనుంచి వేరుచేసి అమ్మాంకాదు? ఈ పిల్లను ఇక్కడకు తెచ్చిన క్షణంనుంచీ నాకు దీని తల్లి మనసులో మెదులుతున్నదనుకో. మనం దీన్ని బెంచీమీదనుంచి లాగి భుజాన వేసుకుని రైలుపెట్టెలో జొరపడుతూంటే, పాపం, ఆ తల్లి నిలువుగుడ్లేసి మనకేసి చూస్తూ, పెద్ద కేకపెట్టి దెబ్బతిన్న పిట్టలా కిందపడిపోవటం నాక్కనిపించింది," అన్నది ఆదెమ్మ బొంగురుబోయిన గొంతుతో.

 

    "ఆ కేకేదో నువ్వు రైలు రొదలో విన్నావన్నమాట! అది సరేగాని ఆదెమ్మక్కా! ఈ గౌరంటే నీకు ఎప్పట్నుంచి యింత ప్రేమ పుట్టుకొచ్చిందీ? మాటవరసకంటాను. యిప్పుడు దానికొచ్చిన కష్టమేమిటి?" అన్నాడు నాగేంద్రం.

 

    "కష్టం ఏం వుందిలే - అరే నాగేంద్రం! నాదొక్క కోరికరా. ఎవరైనా మంచి కుర్రాణ్ని చూసి గౌరికి ముడిపెట్టాలనివుంది."

 

    "దానికి ఏ కుర్రాణ్ణో తెచ్చి పెళ్ళిచేస్తావా?" అంటూ ఎగిరిపడ్డాడు నాగేంద్రం. "దాన్ని నా పెళ్ళాం కాకుండా ఎవరూ ఆపలేరు. నీ వొట్టి కుట్రముండవని నాకేనాడో తెలుసు. అది అప్పుడెంత చిన్న పిల్లయితేనేం; దాన్ని దొంగిలించుకు వచ్చినరోజునే, అది నా పెళ్ళాం అనుకున్నాను."

 

    "ఛీ ఏం మాటది! పదేళ్ళ పిల్లకు, ముప్పయేళ్ళు నెత్తిమీదకొచ్చిన నీతో పెళ్ళా?" అన్నది ఆదెమ్మ కోపంగా.

 

    "మగాడి విషయంలో వయస్సేమిటి ఆదెమ్మక్కా! గౌరి నాది; దాని అందానికి హక్కుదారుణ్ణి నేను. చూస్తుండు - రేపోమాపో ముహూర్తం చూసి, దాని మెళ్ళో పుస్తె కట్టేస్తా. ఆ దెబ్బతో దాని పొగరూ అణుగుతుంది, నీ నోరూ మూతబడుతుంది" అంటూ నాగేంద్రం చర్రున మంచంమీంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు.    

 

    ఈ సంభాషణంతా వింటూంటే గౌరికి మతి పోతున్నట్టనిపించింది. వీళ్ళు తనకేమీ కాదన్నమాట! తనను తల్లినుంచి దొంగిలించుకువచ్చిన దుర్మార్గురాలు ఆదెమ్మ తనకు అమ్మమ్మకాదు.... పరమ దుర్మార్గురాలు! తనను కని పెంచిన తల్లిని యిక ఎన్నటికీ తాను చూడలేకపోవచ్చు. అమ్మ ఎలా వుంటుంది? నాన్న ఎవరు? ఏం చేస్తూంటాడు? తనదే వూరు? ఏం కులం?.... యిలా ఆలోచిస్తున్న గౌరి కళ్ళనుంచి అశ్రువులు సంతతధారగా కారసాగినాయి.

 

    ....ఈ దుర్మార్గుడు నాగేంద్రం తనను పెళ్లాడతాడా? నిజమే. వాడు దుష్టుడు. అన్నంతపనీ చెయ్యొచ్చు. వాడికి దొరక్కుండా ఎటయినా పారిపోవాలి. అలా పారిపోగలిగితే, ఆ మధ్య తనూ అమ్మమ్మ.... ఛీ, అమ్మమ్మా? కాదు - ఆదెమ్మ వెంట వెళ్ళి చూసిన సినిమాలో లాగా అమ్మను ఏ ఆస్పత్రిలోనో కలుసుకోవచ్చును. యింతకూ తను ఎక్కడికి పారిపోయేట్టు?  

 

    ఇలా మధనపడుతున్న గౌరి దగ్గరకు ఆదెమ్మ వచ్చి నిద్రపోతున్నదేమో కనుక్కునేందుకు వంగి ముఖంలోకి చూసింది. గౌరి ఆదెమ్మ జుట్టు పట్టుకుని, "మా అమ్మ ఎక్కడుందో చెప్పు? నువ్వు అమ్మమ్మవు కాదు, దెయ్యానివి!" అన్నది.   

 

    "అయితే, మా మాటలన్నీ విన్నావన్నమాట? సరే, యిదీ ఒకందుకు మంచిదే. నేను దెయ్యాన్నే. కాని, నన్ను అసహ్యించుకోకు. నువ్వంటే నాకు కన్న కూతురుమీద వున్నంత ప్రేమ!" అన్నది ఆదెమ్మ.

 

    "అంత ప్రేమయితే, నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకపోయి ఒప్పచెప్పు. మా అమ్మకూ, నాన్నకూ చెప్పి నీకు బహుమానం ఇప్పిస్తా," అన్నది గౌరి! బతిమాలుతున్నట్టు.  

 

    "మీ అమ్మ ఎవరో, ఎక్కడుంటుందో నాకు తెలియదమ్మా గౌరీ! నేను ఒక్క సహాయం నీకు చేస్తాను. ఈ దుర్మార్గుడు నాగేంద్రం నుంచి నిన్ను కాపాడుతాను. లే, పోదాం. వాడు మళ్ళీ యింటికి రాకముందే పోవటం మంచిది" అన్నది ఆదెమ్మ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ.    

 

    గౌరి గబగబా మంచం దిగింది. ఆ క్షణంలో ఆ బాలికకు తాను తన తల్లిని త్వరలో చూడబోతున్నాననే ఆశవల్ల ఎంతో ఆనందం కలిగింది. ఆదెమ్మ ఒక గోతాం సంచిలో గౌరి దుస్తులన్నీ సర్దింది. ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయలుదేరారు. గౌరి మనస్సు సంతోషంతో ఉరకలు వేస్తున్నది. తను తన కన్నతల్లి దగ్గరకు వెళ్ళిపోతున్నది. తల్లి తనను చూసి ఎంత ముచ్చటపడుతుందో!.....     

 

    ఆదెమ్మ ఒక పెద్ద బంగళాముందు ఆగింది. గేటుముందున్న గూర్ఖావాడు ఆదెమ్మకేసీ, గౌరీకేసీ ప్రశ్నార్థకంగా చూశాడు. గౌరి గేటు పక్కనవున్న సైన్ బోర్డుకేసి చూసింది. దానిమీద రాసివున్న అక్షరాలను కూడబలుక్కుని చదివింది "అనాధ శరణాలయం."

 

    గౌరి గుండె గతుక్కుమన్నది ఆదెమ్మ తనను తన తల్లిదగ్గరకు కాదు తీసుకుపోతున్నది.. ఈ శరణాలయంలో వున్న కొందరు పిల్లలను చూసింది. శరణాలయాన్ని గురించి వాళ్ళూ వీళ్ళూ చెప్పుకునే మాటలు కూడా విన్నది. ఆదెమ్మ తిరిగి తనను మోసంచేసి, యీ బందిఖానాలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. తను ఆదెమ్మకు అందకుండా పారిపోతే....

 

    గౌరి పారిపోయేందుకు నాలుగడుగు లేసిందో లేదో, ఆదెమ్మా గూర్ఖా కలిసి ఆమెను పట్టుకున్నారు. ఆ తరువాత విడిపించుకునేందుకు పెనుగులాడుతున్న గౌరిని బంగళావైపుకు లాక్కుపోయారు.

 

    ముతక ఖద్దరు చీర కట్టి లావుగా, నల్లగావున్న ఒక వయసుమళ్ళిన స్త్రీ వాళ్ళకు వరండాలో కనిపించింది. ఆమె ముఖంలో ఏ భావమూ లేదు కళ్ళద్దాలలోనుంచి గౌరికేసి గుచ్చిగుచ్చి చూసింది. గౌరి ఆ చూపుకు బెదురుకున్నది. ఆ స్త్రీ శరణాలయానికి మాట్రిన్.

 

    "అమ్మా! ఈ అమ్మాయిని మీ దగ్గిర చేర్చుకోవాలి," అన్నది ఆదెమ్మ, రెండు చేతులూ ఎత్తి మాట్రిన్ కు దణ్ణం పెడుతూ.

 

    "ఎవరా అమ్మాయి? యిక్కడ దిక్కులేనివాళ్ళను. మాత్రమే చేర్చుకుంటామని తెలీదా?" అన్నది మాట్రిన్ కసురుతూన్నట్టు.

 

    "దిక్కులేని పిల్లేనమ్మా! తల్లి నిన్నే చచ్చిపోయింది. ఆలనా పాలనా చూసేవాళ్ళెవరూ లేరు," అన్నది ఆదెమ్మ.

    "అబద్ధం!" అంటూ గౌరి అరిచింది, తను యింతసేపుగా భావనాప్రపంచంలో కల్పించుకున్న తల్లి చచ్చిపోయిందని ఆదెమ్మ చెప్పటం విని సహించలేక.

 

    "ఈ పిల్లకు యీ పెద్ద బంగళా చూసి భయంవేసింది. అందుకే అట్లా మాట్లాడుతున్నది. నా మాట నమ్మండి" అంటూ ఆదెమ్మ మాట్రిన్ ను ప్రాధేయపడింది.

 

    మాట్రిన్ పెదాలమీద ఓ తృటికాలం చిరునవ్వులాంటిదేదో కనిపించి, యిట్టే మాయమైపోయింది. "ఓఁ, యీ రకం పిల్లలసంగతి నాకు మహ చక్కా తెలుసు!" అంటూ మాట్రిన్ వెనక్కు తిరిగి, "లక్ష్మీ, లక్ష్మీ!" అని కేక పెట్టింది. ఆ కేక వింటూనే తలుపులు బార్లా తెరుచుకుని, రూపంలో మాట్రిన్ ను మేనత్తలావున్న ఆయా బయటికివచ్చి, మాటా పలుకూ లేకుండా గౌరి రెక్క పట్టుకుని ముందుకు లాగింది. గౌరికి భయంతో ముచ్చెమటలు పోశాయి. పెద్దగా అరవాలనుకున్నది. గొంతు పెగలలేదు. ఆయా ఆమెను "ఏయ్, నడు!" అంటూ బరబరా లోపలికి యీడ్చుకుపోయింది. ఆదెమ్మ ముఖం పాలిపోయింది. ఆదిలోనే గౌరిని అంత మోటుగా శరణాలయంవాళ్ళు లోపలకు లాక్కుపోతారని ఆమె అనుకోలేదు.

 Previous Page Next Page