Previous Page Next Page 
చిలకలు పేజి 9


    "అందుకేనా ఆయన భార్యకు  భర్త అయ్యారు?" అన్నాడు విజయ్ వ్యంగ్యంగా.
    ఇద్దరూ కొరడా  దెబ్బతిన్న  వాళ్ళలా అయిపోయారు.
    "జరిగింది పూర్తిగా వింటే మీరు ఆ మాట అనరు" అన్నాడు సూర్యనారాయణ.
    "అయితే చెప్పండి" అన్నాడు విజయ్ .
    నరేంద్ర సిగరెట్ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూనే వారి మాటలు వింటున్నాడు.
    "సరిగ్గా ఇప్పటికి మూడు సంవత్సరాల క్రితం ఓ దుర్ఘటన జరిగింది."
    "వెండెంట్టా నవలలో లాగేనా?" నరేంద్ర ప్రశ్నించాడు ననూయ సూర్యనారాయణ తృళ్ళిపడ్డారు.
    "నేను వెండెట్టా చదవలేదు. ఆ కథ నాకు తెలియదు రామకృష్ణ ఉత్తరంలోనే ఆ పేరు గల ఒక నవల ఉందని చదివాను." అన్నాడు సూర్యనారాయణ.
    "కథ మీ కథలాంటి కథే" అన్నాడు నరేంద్ర.
    "అంటే?" భయం భయంగా చూసింది అనసూయ.
    నరేంద్ర విజయ్ ముఖంలోకి చూశాడు.
    "ఆ కథా నాయకుడు  పెద్ద ధనవంతుడు. ఏదో జబ్బు  చేసి చచ్చిపోయాడు. అతడికీ  నీలాంటి స్నేహితుడు, ఈమెలాంటి భార్య ఉన్నారు. అతడు చచ్చిపోయాడని భావించి అతడి శవాన్ని  ఆ కుటుంబానికి సంబందించిన ప్రదేశంలో తలుపులు బిగించి వచ్చారు. అర్థరాత్రి అతనికి స్పృహ వచ్చింది. ఎలాగో అతి కష్టంమీద ఆ పెట్టె నుంచి బయట పడ్డాడు. రెండో రోజంతా  ఎక్కడెక్కడో తిరిగి రాత్రి తన ఇంటి వెనక తోటలోకి వచ్చాడు ఆ తోటలో ఒక బెంచిమీద అతడి ప్రాణస్నేహితుడు, అతడి భార్య కూర్చుని ఏవేవో ప్రేమజ్వరంతో పలపరించడం విన్నాడు. చెట్టుచాటుగా ఉండి విన్నాడు. అతడి చావు అతడి భార్యకు బాధ కలిగించకపోగా ఆనందాన్నే కలిగించందని అర్థం చేసుకొన్నాడు. బాధపడి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మారువేషంలో వచ్చి ఆమెను రకరకాలుగా మానసిక వేదనకు  గురిచేస్తాడు.....టూకీగా  చెప్పాను. ఇది చాలనుకొంటాను....." విజయ్  ముగించి అదోలా చూశాడు అనసూయ ముఖం కోపంతో తమ తమలాడిపోయింది.
    "మీరు మా గురించి పూర్తిగా వినకుండానే  ఏదేదో ఉహించుకొని మాట్లాడుతున్నారు." అన్నాడు సూర్యనారాయణ.
    "మేము ఊహించి చెప్పలేదు. రామకృష్ణ వెండెట్టా గురించి  రాశాడు కనుక ఆ కథ చెప్పారు. అది మీకు  వర్తిస్తుందో లేడో మీకే తెలియాలి. రామకృష్ణ మాత్రం మీ వ్యవహారం అలాంటిదేననే నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఆ నవల చదవమన్నాడు.
    అనసూయ ముఖం  భయంతో బిగుసుకు పోయింది.
    "మా విషయం విని మీరే చెప్పండి! మేము అంతదారుణంగా  ప్రవర్తించామోలేడో. 1986 ఫిబ్రవరిలో ఆ దుర్ఘటన జరిగింది. రామకృష్ణ రామేశ్వరం బయలుదేరాడు."
    "అంటే అతనికి జీవితం మీద విరక్తి కలిగిందనేగా! అంత డబ్బు ఉన్నవాడు  కాశ్మీర్ వెళ్ళాక రామేశ్వరం ఎందుకు  వెళ్తాడు అలా కాకపోతే." అన్నాడు విజయ్. 
    "దయచేసి ముందు నేను చెప్పేది పూర్తికా వినండి. రామకృష్ణ అక్కా నేనూ, అనసూయ, స్టేషన్ కు వెళ్ళి  సాగనంపి వచ్చాం. దుర దృష్టవశాత్తు అతడు ప్రయాణం చేస్తున్న ట్రైన్ యాక్సిడెంటుకు గురి అయింది. బ్రిడ్జి విరాగి కొన్ని భోగీలు నదిలో పడిపోయాయి. రామకృష్ణ ఎక్కినా ఫస్టుక్లాసు పెట్టె నదిలో పడి కొంత దూరం కొట్టుకొని వెళ్ళింది.
    ఆ వార్తవిని నేనూ, అనసూయ, కమలాంబ, ఆ ప్రదేశానికి వెళ్ళాం. రెండో రోజుకు చేరుకున్నాం. శవాలు గుట్టలుగా  పడి ఉన్నాయి. చాలావరకు  గుర్తువట్టే స్థితిలోలేవు."
    "రామకృష్ణ శవాన్ని గుర్తు పట్టి దహనం చేసి వచ్చారా? లేక ఇక్కడకు తెచ్చారా?" సాలోచనగా అన్నాడు నరేంద్ర. ఈ రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం ఇస్తారనీ," నీళ్ళలో పెట్టె  కొట్టుకుపోతే శవం ఒడ్డున ఎలా దొరికిందని నిలదీసే అవకాశం దొరుకుతుందని ఆశించాడు.
    "లేదు శవం దొరకలేదు. అతడు ఎక్కిన పెట్టె నదిలో కొట్టుకు పోయిందిగా! అందువల్లనే రామకృష్ణ పడిపోయినట్టేఊహించుకొన్నాం అందరం తిరిగి హైదరాబాద్ చేరుకొన్నాం. అయితే మా హృదయాల్లో రామకృస్ణ బ్రతికే ఉన్నాడనే ఆశపూర్తిగా చావలేదు."
    "అంటే వెండెట్టాలోలా మీరు మరీ తొందరపడలేదన్న మాట విజయ్  అన్నాడు.
    "ఆపదలో  ఉన్న మమ్మల్ని సానుభూతిలో అర్థం చేసుకొని రక్షిస్తారని మీ దగ్గరకు వచ్చాం. కాని మీరు చాలా క్రూరంగామాట్లాడుతూ మమ్మల్ని మరీ బాధ పెడ్తున్నారు." అనసూయ దాదాపు ఏడుస్తూనే అన్నది.
    "విజయ్ నువ్వు మాట్లాడకు" అని సూర్యనారాయణ వైపు తిరిగి "మీరు చెప్పండి" అన్నాడు నరేంద్ర.
    "అతడు తిరిగి వస్తాడని ఎదురు చూశాం."
    "తిరిగి రావాలని కోరుకోలేదా?" విజయ్  అని నరేంద్ర  ముఖం చూసి నెల చూపులు చూడసాగాడు.
    "ఎందుకు కోరుకోలేదు? మేము మీరనుకొన్నంత దుర్మార్గులం కాదు. వారాటూ, నెలలూ, సంవత్సరాలూ గడీచాయ్. రామకృష్ణ రాలేదు."
    "మీరు అనసూయను ఎంతకాలం అయింది పెళ్ళిచ్సుకొని?" నరేంద్ర సాలోచనగా అడిగాడు.
    "రెండేళ్ళ ఐదు నెలలు అయింది."
    "మరి రామకృష్ణ కోసం నెలలు, సంవత్సరాలు ఎదురు చూశామన్నారు?" అన్నాడు విజయ్.
    ఛళ్ళుణ చెంప దెబ్బ తగిలిననట్టయి పోయాడు సూర్యనారాయణ.
    "ట్రైన్ యాక్సిండెంట్ నుంచి ఆరునెలలు తిరిగి రాకపోతే చాలదా చనిపోయినట్టు నిర్ధారించుకోవడానికి?" విజయ్ ను కొరకొర చూసింది అనసూయ.
    "కానియ్! చెప్పండి! ఆ తర్వాత ?" నరేంద్ర హెచ్చరించాడు.
    "రైలు ప్రయాణంలో భర్త చనిపోయాడనే దిగులుతో అనసూయ మంచంపట్టింది. మొదట్లో రామకృష్ణ తప్పక తిరిగి వస్తాడనే ఆశ ఆమెలో కల్పించి దైర్యం చెప్పాడు. రానురాను ఆ ఆశపోయింది. ఆమెకు. "నా" అనే వాల్లెవరూలేరు. నాకు చేతనయిందంతా ఆమె సుఖం కోసం చేశాను. ఆమె నా స్నేహితుడి భార్య మాత్రమే కాదు.నేను  పనిచేస్తున్నా కంపెనీకి యజమాని." 
    "అదీ ! అలా  చెప్పు!" విజయ్, ఏదో క్లూ దొరికినవాడిలా ఉత్సాహంగా అన్నాడు. ఇంకా ఏదో అనబోతూ నరేంద్ర ముఖం చూసి ఆగిపోయాడు.
    "అసలు కారణం ఆమెకు నా హృదయంలో స్థానం ఉంది."
    "ఆ స్ధానం ఎప్పుడు ఏర్పడింది. రామకృష్ణ చనిపోయాకా లేక ముందా?" నరేంద్ర సీరియస్ గా చూశాడు.
    "ఆ తర్వాతేండీ?" తడబడుతూ సమాధానం ఇచ్చాడు.
    "మీ ప్రశ్నల్ని బట్టి చూస్తుండే మీకు మా మీద పద్భావం ఉన్నట్టులేదు." విసురుగా అన్నది అనసూయ.
    "అదేంలేదు.  నిద్రవస్తోంది త్వరగా కానివ్వండి." అన్నాడు నరేంద్ర.
    "మీరే చెప్ప నివ్వడంలేదు."
    "ఇక చెప్పండి. అడ్డు ప్రశ్నలు వెయ్యకుండా వింటాం అన్నాడు విజయ్.
    "థ్యాంక్స్! కాలం గడుస్తున్న కొద్ది రామకృష్ణ  జ్ఞాపకాలు మనసు వెనక్కు వెళ్ళిపోయాయి. మరణించిన వారి కోసం ఎవరు  మరణించరు. ప్రతి  జీవి సుఖంగా బతకాలనే కోరుకుంటుంది. చచ్చిన వారి కోసం  నిండు  జీవితాలను బలిచెయ్యచెంగదా? అనసూయా నేనూ  రిజిస్టర్ మేరేజ్  చేసుకొన్నాం. ఇది  రామకృష్ణ కుటుంబంలో అలజడి  లేవదీసింది. కమలాంబా, ఆమె కూతురూ లాయరు శంకర్రావు అండతో అనసూయను రామకృష్ణ ఇంటి నుంచి తరిమేశారు. ఆ  బంగళా ఇప్పుడు పది లక్షలకు పైగా ఉంటుంది. అది జూబ్లీహీల్స్ ఉంది. ఇప్పుడు ఇంటి మీద 5000 రూపాయలు అద్దెవస్తోంది నెలకు  అనసూయ బయటికి వచ్చాక ఆ బంగ్లాను కమలాంబ ఆక్రమించు కొన్నది. రంగారెడ్డి జిల్లాలో రామకృష్ణకు వందఎకరాలకు పైగా  పొలం ఉండేది. సికింద్రాబాద్ లో  రెండు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. మరో ఇళ్లు ఖైరతాబాద్ లో ఉంది. లక్ష్మీ మిల్స్ లోనూ, నేషనల్ టెక్స్ టయిల్స్ కంపెనీలలో వాటాలున్నాయి. ఆ ఆస్తంతా తల్లీ  కూతుళ్ళు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు." ఓక్షణం ఆగి మళ్ళీ ప్రారంభించారు.
    "కాని అనసూయకు వాళ్ళతో పేచీకి దిగడం ఇష్టంలేదు. నేను కోర్టుకు పోదామంటే అనుభవించినంతవరకు అనుభవించనివ్వండి. ఎటూ వాళ్లకు ఆ ఆస్తి ఆమ్మే హక్కు లేదు, ఇక మన విషయం! ఆటోమోబయిల్ కంపెనీలో వచ్చేదేచాలు-అనసూయనాతో అనేది.
    "అందుకు మీరేమనే వారు?" విజయ్  ప్రశ్నించాడు.
    "రామకృష్ణకు ఇప్పటికే ఎంతో రుణపడి ఉన్నాను. నారు ఆ ఆస్తి మీదా దురాశలేదు. అనసూయ సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది. అదే చెప్పేవాడిని."
    "నాకు నిద్రవస్తోంది." అన్నాడు విజయ్ .
    "ఆ నాకు అలాగే ఉంది. వీళ్ళు  చెప్పేది విన్నాక మనం చెయ్యగలిగింది ఏమీ ఉన్నట్టుగా కన్పించడంలేదు." అన్నాడు నరేంద్ర ఆవలిస్తూ.
    "ప్లీజ్ నరేంద్రగారూ! మా కోసం కొంచెం సేపు నిద్ర ఆపుకోండి సార్."
    "ఇందులో నేను  చెయ్యగలిగిందేమిటో నాకు అర్థం కావడం లేదు. హాయిగా నిద్రన్నాపోతాను" అన్నాడు నరేంద్ర.
    "మీరు చెయ్యగలిగిందీ, చెయ్యాల్సిందీ చాలా ఉంది."
    "ఏమిటది?"
    "మూడేళ్ళ క్రితం చనిపోయాడనుకున్న మనిషి తిరిగొచ్చాడు."
    "అతడు తిరిగొస్తే నన్నేం చెయ్యమంటారు? అతడ్ని ఏ లారీ కిందోపడి చావమని సలహా ఇవ్వమంటారా?" విసుగ్గా అన్నాడు నరేంద్ర.
    "ప్లీజ్ నేను చెప్పేది కాస్తవినండి."
    "త్వరగా చెప్పండి ఆ చెప్పేదేదో ఎక్కువ సేపు కూర్చునే ఓపిక నాకులేదు."
    "తన భార్య మరొకడి భార్య కావడం ఏ మగవాడూ సహించలేడు."
    "అవును- నిజమే, మళ్ళీ ఈమెను ఏలుకోమని నేను సలహా ఇవ్వాలా ఏమిటి ఖర్మం?" నొసలు చిట్లించాడు నరేంద్ర.
    "వినండి సార్, ముఖ్యంగా తన సహాయంతో నిలబడిణ వ్యక్తే తన భార్యను  పెళ్ళి చేసుకోవడం ఘోర అపరాధంగా భావిస్తాడు మేము తననుదగా చేసినట్టు భావిస్తాడు.
    "అంటే మీరు చేసింది దగాకాదా?"
    "ఇది మోసం ఎలా అవుతుంది సార్? నేను అతడ్ని చంపించడానికి ప్రయత్నించలేదు. అతడు బ్రతికి ఉండగా అతడిభార్యను వలలో వేసుకొని లేవదీసుకొని పోలేదు. చనిపోయాడనిభావించి ఆమెను వివాహం. చేసుకొన్నాను. అతడి ఆస్తి కోసం  నేను  ఆశ పడటంలేదు."
    "మీ లాజిక్ బాగానే. ఉంది అదేదో  అతడికే చెబితే పోలా! నేనేం చెయ్యగలనయ్యా?" విసుగ్గా అన్నాడు నరేంద్ర.
    "రామకృష్ణ చట్టరీత్యా మా ఇద్దర్నీ జైలుకు పంపించవచ్చును."
    "అవును!" అన్నాడు నరేంద్ర.
    "అది ఎలా జరుగుతుంది? ఆయన చనిపోయాడునుకొనికదా మీరు పెళ్ళిచేసుకొన్నది. పైగా మూడేళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు" అన్నాడు విజయ్.
    లేదు చచ్చిపోతే చేసుకోవచ్చు. చచ్చిపోయాడు అనుకోవడం వేరు. ఆ పరిస్థితుల్లో ఏడేళ్ళు ఎదురు చూడాలి చట్టరీత్యా" అన్నాడు నరేంద్ర.
    "అవునుసార్! లాయర్ కూడా అదే చెప్పాడు. భర్తబ్రతికి వుండగా అతని భార్యతో కాపరం చెయ్యడం చట్టరీత్యా నేరం" అన్నాడు సూర్యనారాయణ.
    "ఊ" అన్నాడు ఏదో ఆలోచిస్తూ నరేంద్ర.
    "రామకృష్ణ దృష్టిలో మేము మోసగాళ్లం___విశ్వాసఘాతుకులం. ఆ కసితో మమ్మల్ని ఏమైనా చెయ్యొచ్చు. "వెండెట్టా" నవలను చదవ మనడంలోని అంతర్యం అదేగదా? ఆ  నవలలోలా మమ్మల్ని  చిత్రహింసలకు గురిచేస్తాడు. తప్పదు." సూర్యనారాయణ కంఠం వణికింది.
    "మరి మీరు చేసింది మోసంకాదా?" రెట్టించాడు నరేంద్ర.
    "నిజమే! మీరు రామకృష్ణకు ఘోరమైన అన్యాయంచేశారు. నేను  రామకృష్ణ పరిస్థితిలో ఉంటే "వెండెట్టా" లోని హీరోలా నా భార్యను చిత్రహింసకు గురిచేసేవాణ్ణి జానపద కథల్లోని హీరలోలా ఇద్దర్నీ  ముక్కలు ముక్కలుగా  నరికి ఉప్పుపాతరవేసేవాణ్ణి అసలు రామకృష్ణ  తిరిగి రావడానికి కారణం మీ ఇద్దరిమీదా ప్రతీకారం తీర్చుకోవడానికేనని నా నమ్మకం " అన్నాడు అనసూయ ముఖంలోకి నిశితంగా చూస్తూ విజయ్.
    అనసూయ నిలువెల్లా వణికిపోయింది.
    నరేంద్ర ఆమె కేసి "అంత భయం వేస్తుందా?" అన్నట్టు చూశాడు.
    సూర్యనారాయణ ముఖానికి పట్టినచెమట్లు చేతులతో తుడుచుకొన్నాడు.

 Previous Page Next Page