Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 9

    "ఫరవాలేదు. తగ్గిపోతుంది" అన్నాడు డాక్టరు చిరునవ్వుతో.
    "ఆహారం ఏమైనా ఇవ్వాచ్చా డాక్టరుగారూ" అడిగింది కామాక్షమ్మగారు.
    "పాలు, కాఫీ, టీ, డబుల్ రొట్టె ఏది కావాలంటే అది ఇవ్వండి."
    "ఒరేయ్ వాసూ! పదరా, మా యింటికి పోదాం" ఆన్నారు నరసింహరావుగారు.
    "ఒద్దురా. ఇక్కడే వుంటాను. సుమతిని రెండ్రోజులు ఇక్కడే వుంచు."
    "రండి అన్నయ్యగారూ! అదేమన్నా పరాయిల్లా!"
    "ఒద్దమ్మా. అదీ  నా ఇల్లే. నాకు తెలుసు. జ్వరం తగ్గాక వస్తాను."
    "వాణ్ణి బలవంతంచేసి లాభంలేదే. అమ్మా సుమతీ, నువ్వింటికొచ్చి భోంచేసి, నీ బట్టలు అవీ సర్దుకుని రా. అలాగే  వీడికి పాలో, కాఫీయో ఫ్లాస్కులో పోసి తెస్తే సరి" అన్నారు నరసింహరావుగారు. రాములికీ, పనిమనిషికీ అతన్ని చూసుకోమని చెప్పి ఇంటికి బయలుదేరారు.
    సుంతికి మనసంతా అదోలా వుంది. ఏదో నాలుగు మెతుకులు తిని ఆయమ్మతోసహా ప్రయాణమైంది సుమతి. సుమతి వెళ్ళి పోతూవుంటే చిన్నబుచ్చుకుంది కామాక్షమ్మాగారు.
    "మేము రాగానే నువ్వూ వెళ్ళిపోతున్నావు. ఒక్కరోజైన కలిసివున్నట్టు లేదు" అంది జానకమ్మ.
    "నేనూ అదే బాధపడుతున్నాను" అంది నెమ్మదిగా సుమతి.
    "అక్కా! నేనూ రానా? అంది సుబ్బలక్ష్మి.
    "పోనీలే తీసుకెళ్ళమ్మా కాస్త కాలక్షేపంగా వుంటుంది" అంది కామాక్షమ్మ.
    పనికుర్రాణ్ణి పిలిచి వీళ్ళని ఇంటిదగ్గర దింపిరమ్మన్నారు నరసింహారావుగారు.
                             *        *        *
    సుమతి ఇంటిని చూడగానే సుబ్బలక్ష్మి కళ్లు తిరిగినట్టయింది. ఇంత పెద్ద ఇల్లే. రెండువైపులా ఇంత ఆస్త్రీ, గోవిందు లాంటి భర్త, ప్రేమించే అత్తమామలూ, ప్రాణప్రదంగా చూసుకునే తండ్రీ, సుంతీ అదృష్టాన్ని చూసి అసూయపుట్టింది. మరో లోకంలో వున్నదానిలా ఆ ఇంటిలోని ఒక్కొక్క వస్తువునే చూస్తూ వుండిపోయింది.
    తండ్రిని మెల్లగా లేపి, కాసిన్ని పాలు త్రాగించింది సుమతి. వెయ్యాల్సిన మందులేవో వేసింది. "అమ్మా వచ్చావా?" అన్నారు అప్యాయంగా తల నిమురుతూ.
    "సుబ్బలక్ష్మి, ఆయంమా కూడా వచ్చారు నాన్నా" అంది సుమతి.
    "నువ్వు వెళ్ళిపోయిం దగ్గరనుంచీ ఇల్లు బోసిపోయిందమ్మా. మళ్ళీ ఇంట్లో నందడి పుట్టింది. నాకెంతో ఆనందంగా వుంది" అన్నా రాయన.
    ఒంట్లో బాగులేనప్పుడు బాధలన్నీ ఒక్కసారిగా  గుర్తు కోస్తాయేమో, సుమతి లేని లోటుకి ఆయన ఎంత బాధపడుతున్నారో అర్ధం చేసుకుంది సుమతి. తనకీ ఏడుపోచ్చింది. కన్నావాళ్ళనీ,  పుట్టిన ఇంటినీ వదిలిపెట్టి ఆడపిల్ల భర్తచేతుల్లో కీలుబొమ్మలాగా ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎందుకు వెళ్ళిపోవాలో, తన భావాలనీ, తన మమతలనీ చంపుకుని, ఎందుకు త్యాగం చెయ్యాలో తలుచుకుంటే ఏడుపోచ్చింది.
    "వచ్చేశానుగానాన్నా! కొన్నాళ్ళపాటు ఇక్కడే వుంటాను. మీరు పడుకోండి" అంది దుప్పటి సరిగ్గా కప్పుతూ. కళ్లు మూసుకుని నిద్రలోకి జారిపోయారు ఆయన.
    అప్పుడే జైలునుంచి విడుదలలైన ఖైదీలా ఇల్లంతా తిరుగుతోంది సుబ్బలక్ష్మి. మల్లెలు, మరువం, గులాబీలు తనకి  నచ్చిన పూలన్నీ కోసేసి దండలు గుచ్చేసింది. "అక్కా! నీ బ్లూ జార్జెట్ చీర ఎంతో బాగుంది. నే నొకసారి కట్టుకొనా?" అంది సుమతి చీరలు చూస్తూ ఓరోజు.
    సుబ్బలక్ష్మి అమాయకత్వానికీ, కలుపుగోలు తాననికీ కొంచెం ఆశ్చర్యబోయినా, ఒక రకమైన సంతోషమూ కలిగింది. తోబుట్టువులు కానీ, మరే దగ్గరబంధువులుకానీ, అటూ ఇటూ కూడా లేకపోవడంతో సుమతిని ఇట్లా అడిగేవాళ్లు ఎవరూ లేరు అందుకనే ఒక రకమైన సంతోషం కలిగింది సుమతికి. అస్తమానం పుచ్చుకోవడమే కాకుండా ఒక్కొక్కసారి ఇవ్వడంలోనూ ఒక రకమైన తృప్తి కలుగుతుంది. "నీ ఇష్టమొచ్చిన చీరలు తీసి కట్టుకో" అంది నవ్వుతూ సుమతి. రోజుకో చీర తీసి కడుతోంది సుబ్బలక్ష్మి.
    వారంరోజులు దాటినా వాసుదేవరావుగారికి జ్వరం  నయంకాలేదు. నరసింహారావుగారూ, కామాక్షమ్మగారూ రోజూ వస్తూపోతూనే వున్నారు.
    ఆరోజున జానకమ్మవాళ్ళు ప్రయాణం పెట్టుకున్నారు. కామాక్షమ్మగారికి దగ్గూ, పడిశం, కాస్త బి.పి కూడా ఎక్కువయింది. అందర్నీ సుమతి ఇక్కడికే భోజనానికి పిలిచింది.
    తండ్రికి జ్వరం తగ్గనే లేదు. అంతవరకూ తనిక్కడ వుండక తప్పదు. అత్తయ్యా, మామయ్యా అక్కడ ఒంటరిగా వుండాలి. ఆవిడ ఆరోగ్యమూ ఏమంత బాగాలేదు. గోవిందు మాటలు జ్ఞాపకం వచ్చాయి తనకి. "అత్తయ్యా! సుబ్బలక్ష్మిని కొన్నాళ్లు మనం ఇక్కడ వుంచుకుంటే, నాన్నగారి జ్వరం తగ్గినే నోచ్చేవరకూ అయినా మీకు తోడుగా వుంటుంది" అంది సుమతి.
    ఎగిరి గంతేసింది సుబ్బలక్ష్మి.
    "ఆఁ.....ఎందుకులే అమ్మా. ఎదిగిన ఆడపిల్ల నా దగ్గరుండడమే మంచిది" అంది అదోలా జానకమ్మ.
    "ఇదేం పరాయిల్లా వొదినా? సుబ్బలక్ష్మిని నా కూతురిలా చూసుకుంటాను" అంది కామాక్షమ్మగారు. నరసింహరావుగారికి ఈగొడవంతా ఇష్టం లేకపోయినా సుమతికూడా బలవంతం చెయ్యడంవల్ల ఏమీ అనలేకపోయారు.
    జానకమ్మగారు "సరే కానివ్వండి. మీరింతగా అంటే కాదంటానా" అంది.
    సుందరీ, రాఘవ మొహామొహాలు చూసుకున్నారు. సుందరి మూతి విరిచింది సుబ్బలక్ష్మి కేదో లక్షరూపాయలు లాటరీలో వచ్చినట్టు.
    జానకమ్మగారికీ, సుందరికీ పట్టుచీరలు పెట్టేరు. రాఘవకి టెర్లీను ఫాంటూ, షర్టూ ఇచ్చారు.
    "ఇవన్నీ ఎందుకమ్మా" అంది పుచ్చుకుంటూనే జానకమ్మ.
    "పెళ్ళికికూడా మీరు రాలేదు. ఇంటి ఆడపడుచుని. ఏదో మా శక్తికొద్దీ తృప్తికోసం పెడుతున్నాం" అంది కామాక్షమ్మ గారూ సున్నలక్ష్మితో సహా వెళ్ళిపోయారు.
    సుబ్బలక్ష్మి వెళ్లిపోవడంతో ఏమిటో  సందడి పోయినట్టుగా ఫీలయింది సుమతి. ఒంటరిగా వున్నట్టనిపించింది. తన ఆలోచనకి తనకే నవ్వోచ్చింది. 'పెళ్ళికాకముందు తనూ, తండ్రీ, ఆయమ్మా ముగ్గురేకదూ వుండేవారు. అప్పుడది బాగానే వుండేది. ఇప్పుడు నలుగురిలోంచి వచ్చేసరికి ఇలా అనిపిస్తోంది. ఈ మనసుకి  ఏది అలవాటయితే అదే బాగున్నట్టనిపిస్తుందేమో!' అనుకుని నవ్వుకుంది.
    వాసుదేవరావుగారికి జ్వరం వస్తూ పోతూ వుంది. గొంతు నొప్పి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. డాక్టరు రోజూ వచ్చి ఏవో మందు లిచ్చే వెళుతున్నారు.
    "డాక్టరుగారూ! నాన్నగారి పరిస్ధితి ఏమీ మెరుగవలేదు. పోనీ ఎవరైన స్పెషలిస్టుకి చూపిస్తే?"
    "నేనూ అదే అనుకుంటున్నా  నమ్మా.  కాన్సర్ హాస్పటల్లో డాక్టర్ పురుషోత్తంగారు నా ఫ్రెండు. ఉత్తరం రాసిస్తాను, అక్కడికి తీసికెళ్ళండి."     

 Previous Page Next Page