Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 10


    "డాక్టర్.....ఏమిటి మీ రానిది? నాన్నగారికి కాన్సర్ అనుకుంటున్నారా?" పిడుగుపడ్డట్టు అరిచింది.
    "అవునమ్మా! అనుమానంగా వుంది."
    "కాదు .....కాదు డాక్టర్....మా నాన్నగారి కాన్సర్ కాదని చెప్పండి.....ప్లీజ్ ....." పిచ్చిదానిలా ఏడవడం మొదలెట్టింది.
    ఈ మాటలు విన్న  ఆయమ్మ  సుమతిని ఓదారుస్తూ లోపలికి తీసుకెళ్లింది. డాక్టరుగారు ఉత్తరం రాసి ఆయమ్మ చేతి కిచ్చి వెళ్లిపోయారు.
    డా|| పురుషోత్తంగారి రిపోర్టు విన్న నరసింహారావుగారు కుప్పలా కూలిపోయారు. "రెండు మూడు మాసాలకన్న ఎక్కువ బతకరు." ఈ మాటలే అతనిచెవుల్లో రింగు మంటున్నయ్. సుమతి కేం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధంకాక తికమకపడిపోతున్నారు. ఆలోచించి ఒక నిర్ణయాని కొచ్చారు. "డాక్టరుగారూ, దయచేసి ఈ  విషయం మా సుమతికి తెలియనివ్వకండి. ఆమె ఉత్తమనిషి కూడా కాదు. ఈవార్త ఆమె భరించలేదు" అంటూ ప్రాధేయపడ్డారు.
    "అట్లాగే....." అన్నారాయన.
    "ఏమన్నారు మామయ్యా?" కంగారుగా అడిగింది సుమతి.
    "ఏం లేదమ్మా..... తగ్గిపోతుంది" అన్నా రాయన అతిమామూలుగా. ఈ విషయం ఆయన కామాక్షమ్మగారితో కూడా  చెప్పలేదు, ఎక్కడ  బయటపడి పోతుందేమోనని వీలైనంతవరకూ వాసుదేవరావుగారితోటే కాలక్షేపం చేస్తున్నారు. వారానికీ, పది రోజులకీ తనే స్వయంగా  వుండి డాక్టరు దగ్గరికి తీసుకెళుతున్నారు. ఆరోజు గోవిందు దగ్గర్నుంచి రెండు ఉత్తరాలోచ్చాయి.
    శ్రీమంతం ఫోటోల అందాయంటూ, చాలా బావున్నాయంటూ గోవింద్ మొదట రాసిన ఉత్తరం ఒకటి. వాసుదేవరావుగారికి ఒంట్లో బాగుండటం లేదని తెలిశాక వ్రాసిన ఉత్తరం ఒకటి. రెండో ఉత్తరంనిండా మామయ్య ఆరోగ్యం జాగ్రత్త అంటూ, నీ ఆరోగ్యం జాగ్రత్త అనీ, సుబ్బలక్ష్మిని వుండమనడం మంచిపని చేశావనీ, మీ అందరినీ ఎప్పుడు చూస్తానా అని వుందనీ వ్రాశాడు. ఉత్తరాలు చదివి నిట్టూర్చింది సుమతి. భగవంతుడు ప్రసాదించే కష్టాలు కొన్నైతే, కోరి తెచ్చుకునే కష్టాలు కొన్ని, అసలు ఉద్యోగమే చెయ్యవలసిన అవసరంలేని కుటుంబం వాళ్ళది. అటువంటిది 'వెన్న పారేసి వేలు నాక్కునట్టు' అన్నీ వదలి  ఒంటరిగా ఈ జీవితం గడపడం కోరి తెచ్చుకున్నదే నన్న బాధ, కోపంతో ఒక్కొక్కసారి సుమతికి ఒళ్ళు మండుకోస్తుంది.
    ఇది ఇలా వుండగా కష్టాలు ఒంటరిగా రావని, కామాక్షమ్మగారు కాలు జారి పడింది. అసలే బ్లడ్ ప్రెషరూ, దానికి తోడు ఈ ఫ్రాక్చరూ. కామాక్షమ్మగారు మంచంమీంచి దిగడం లేదు.  ఇంటి పెత్తనం సుబ్బలక్ష్మి కొచ్చింది. వంటఇంటి గరిటెల దగ్గరనుంచి, అల్మారాలోని నోట్లవరకూ సుబ్బలక్ష్మి చూసుకుంటోంది. తన  తెలివితేటలతో నరసింహరావుగారి అభిమానానికి పాత్రురాలయింది. సుబ్బలక్ష్మి లేనిదే ఇల్లు  నడవదు అనే స్ధితికి వచ్చారు నరసింహరావుగారు. సుబ్బలక్ష్మి అన్నదమ్ముల రాకపోక లెక్కవయ్యాయి. అప్పుడప్పుడు సుబ్బలక్ష్మిని డబ్బడగటం, ఆవిడ అడిగినంతా స్వతంత్రించి  ఇవ్వడం కామాక్షమ్మగారికి  కొంచెం కష్టంగానే అనిపించింది. ఆమాటే భర్తతో అంటే, "పోనీలేవే. మన కింత చేస్తూన్నదానికి ఆ మాత్రం మనంచేస్తే తప్పేం లేదు" అనేపేవారు  తేలిగ్గా. రానురాను ఆ ఇంట్లో  అన్నింటికీ సుబ్బలక్ష్మి మాటేసాగేది.
    సుబ్బలక్ష్మి ఇప్పుడు సుబ్బలక్ష్మి కాదు. ఎన్. లక్ష్మి. ప్రయివేటుగా ఎన్.ఎన్. ఎల్ .సి.కి రాయడానికి ట్యూషనులు పెట్టుకుంది. ఆ శ్రద్ధకి మురిసిపోయేవారు నరసింహరావుగారు.
    ఇప్పుడు లక్ష్మి కట్టని చీరా, పెట్టని నగా లేదు. మనిషి నాజూగ్గా తయారైంది. పట్నవాసపుగాలి బాగానే వంటపట్టింది. ఇరుగుపోరుగుల స్నేహాలు, బాగానే పెరిగాయి. స్నేహితులతో సినిమాలూ, విహరాలూ అలవాటయ్యాయి. కామాక్షమ్మగారి మాటకి వీసామెత్తు విలువ లేదు. ఆమె  ఏమయినా చెబితే అసూయతో చేబుతోందేమో ననుకునేవారు నరసింహరావుగారు అందుకే  ఆమె  మాటల్ని పట్టించుకునేవారు కాదు. ఆ అలుసు  తెలుసుకున్న లక్ష్మికి ఆడింది ఆట, పాడింది పాట.
    అప్పుడప్పు డోచ్చి సుమతి అత్తగారిని చూసి వెడుతోంది. సుబ్బలక్ష్మిలోని మార్పు ఆమెనీ ఆశ్చర్యపరచింది. కామాక్షమ్మ గారి గోడు విని మరింత మదనపడింది. ఆమాటే ఒకనాడు మామగారితో అంది.

    "నువ్వూ అసూయపడుతున్నావా అమ్మా ఆ కుఱ్ఱదంటే" అన్నా రాయన. అంతే! మరెప్పుడూ లక్ష్మిసంగతి ఆయన ముందెత్తలేదు సుమతి.
                                                            *        *        *
    ఏ నిముషంలో వర్షిస్తుందో అన్నట్టు  దట్టంగా మబ్బులు కమ్ముకున్న ఆకాశంలా వుంది సుమతి. లేవలేక లేవలేక తిరుగు తోంది ఇంట్లో.
    కామాక్షమ్మగారి చేతి కట్లు విప్పారు. మంచంమీదనుంచి లేచి ఆమెపనులు ఆమె చేసుకుంటోంది మెల్లగా.
    వాసుదేవారావుగారి గొంతునొప్పి రోజురోజుకీ ఎక్కువవుతోంది. పాలూ, కాఫీ లాంటి ద్రవపదార్ధాలు తప్ప ఏమీ తినలేకపోతున్నారు. ప్రతిరోజూ రోచ్చి మందు లిస్తూనే వున్నాడు.
    ఆ రోజు శుక్రవారం. తలంటి పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటోంది సుమతి. డాక్ట రొచ్చి ఇంజక్షనిచ్చి వెళ్ళాడు. వాసుదేవ రావుగారు నిద్రపోతున్నారు. కెవ్వున కేకపెట్టింది సుమతి. వంటింట్లోంచి పరుగెత్తుకొచ్చింది ఆయమ్మ. వెంటనే కామాక్షమ్మగారికి ఫోన్ చేసింది. ఈమధ్య తండ్రి మంచం పట్టినప్పటినుంచీ డైవర్ ని పెట్టింది సుమతి. నరసింహరావుగారికి కారు పంపించింది. అందరూ వచ్చేశారు. ఆయమ్మా, కామాక్షమ్మగారూ సుంతిని 'నర్సింగ్ హొం'లో చేర్పించారు.
    సాయంత్రం ఆరింటికి "మగపిల్లవాడు పుట్టాడు" అని చెప్పింది నర్సు.
    అప్పటివరకూ మంచినీళ్ళయినా తాగకుండా కూర్చున్నారు ఆయమ్మా, కామాక్షమ్మగారూ. వెంటనే ఇంటికి ఫోన్ చేసి "మీకు మనవడు పుట్టాడు" అని చెప్పింది కామాక్షమ్మగారు.
    సంబరపడిపోయారు నరసింహరావుగారు. ఫోన్ అందుకున్నారు వాసుదేవరావుగారు. మాట్లాడోద్దంటే వినకుండా "పిల్లాడెలా వున్నాడు? ఎన్ని పౌన్లుండాడు? సుమతెలా  వుంది? హాలా కష్టపడిందా?" ప్రశ్నల వర్షం కురిపించేశారు. ఆయన ఆనందానికి అవధులు లేవు. మనవడిని చూడ్డానికి 'వర్సింగ్ హొం'కి వెళదామంటారు.
    "వాళ్ళు నాలుగు రోజుల్లో వచ్చేస్తాడు. మీరు వెళ్ళలేరు" అని ఒప్పించడానికి తల ప్రాణం తోక కొచ్చింది అందరికీ.
    గోవిందుకి టెలిగ్రాం పంపించారు నరసింహరావుగారు. కామాక్షమ్మ నర్సింగ్ హొంలోనే వుండిపోయింది. సుబ్బలక్ష్మి భోజనం తీసుకెళ్లేది. అయిదో రోజున 'డిన్ చార్జ్' చేశారు.
    పిల్లాణ్ణి తీసికెళ్ళి తండ్రిచేతిలో పెట్టింది సుమతి. సంతోషంతో కన్నీళ్లుకార్చా రాయన. ఒకరి తరువాత ఒకరు ఇద్దరు తాతలూ మార్చి మార్చి ఎత్తుకున్నారు వాణ్ణి. గోవింద్ దగ్గరనుంచీ ఉత్తరం వచ్చింది. 'చింటూగాణ్ణి చూద్దామా అని వుందనీ. సెలవు కోసం ప్రయత్నం చేస్తే రెండురోజుల కోసం ట్రైనింగ్ పిరీడ్' లో  సెల వివ్వరని చెప్పారనీ వ్రాశాడు. వెంటనే చింటూ ఫోటో తీసి పంపించమని వ్రాశాడు.
    "తను అవస్థపడుతుంటే భర్త పక్కన లేకపోవడం, బాబు పుట్టినా రావడానికి వీల్లేని పరిస్థితి సుమతికి బాధగా వుంది.  పైగా తండ్రి ఆరోగ్యం గురించి మరింత బెంగగా వుంది. రెండు నెలలనుంచీ మంచం దిగలే దాయన. అసలు జబ్బేమిటో చెప్పడం లేదు, తగ్గిపోతుందంటున్నారే తప్ప" కన్నీళ్ళు జలజలా చెంపల మీదుగా జారాయి.
    "క్యారు" మన్నాడు బాబు ఒళ్ళో, కళ్ళు తుడుచుకుని వాణ్ణి గుండెలకి హత్తుకుంది బాధలన్నీ మరిచిపోయి.
    గోవిందు రావడానికి వీల్లేకపోవడంవల్ల కామాక్షమ్మగారి 'బారసాల' 'ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బాబుకి "చింటూ" నామధేయం స్థిరమయింది.

 Previous Page Next Page