Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 8

    "మరీ అంత నాజుకేమిటి కోడలుపిల్లా?" అంది జానకమ్మ
    "మనని చూసి సిగ్గు పడుతుందేమో!" అంది జానకమ్మగారి కోడలు సుందరి.
    "అలాగయితే మనంవుండే పదిరోజులూ పాపం ఈవిడగారు పస్తుండవలసిందే" పపిసకా నవ్వింది సుబ్బలక్ష్మి అదేదో పెద్ద జోకులాగా.
    వాళ్ళని చూస్తుంటే సుమతికి తేళ్ళనీ, జెర్రులనీ చూస్తూన్నట్టుంది. మామగారికి జానకమ్మగారు స్వంత చేల్లెలంటే నమ్మశక్యం కావడంలేదు. ఈ కుటుంబానికీ ఆ కుటుంబానికీ ఎంతతేడా! ఈ సుబ్బలక్ష్మినా, గోవిందుని చేసుకొమన్నది? బాబోయ్ గోవింద్ బతికిపోయాడు అనుకుని నవ్వుకుంది అంతలోనే గోవిందు మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఈ సుబ్బలక్ష్మి చేతిలోనా అత్తగారినీ, మామగారినీ పెట్టడం? ఎందుకో మనసు ఒప్పుకోవడంలేదు.
    "అక్కగారేదో ఆలోచనలో పడ్డట్టున్నారు. పరధ్యానంగా వున్నారు. బావాగారి గురించి ఆలోచిస్తున్నారేమో!" అంది నవ్వుతూ సుబ్బలక్ష్మి.
    అందరూ నవ్వేరు.
    సుబ్బలక్ష్మి కలుపుగోలుతనానికి ఆశ్చర్యబోయింది సుమతి.
    "పడుకుంటానత్తయ్యా" అంటూ లేచింది సుమతి.
    "పాలుతాగవూ?" అడిగింది కామాక్షమ్మగారు.
    "ఆయమ్మ పనయ్యాక, తీసుకొస్తుందిలెండి" అంటూ వెళ్ళిపోయింది.
    "ఆయమ్మ వంటమనిషా?" అడిగింది జానకమ్మ.
    మా కోడల్ని చిన్నప్పటినుంచీ పెంచిన మనిషి. తల్లిలా పెంచింది." కామాక్షమ్మగారు జవాబిచ్చింది. జానకమ్మగారిని చూస్తూంటే, తనపెళ్ళిలో పిన్నిని చూసినట్టుగా వుంది సుమతికి. "చుట్టాలంతా ఇంతేకామోసు" అనుకుంటూ వెళ్ళి పడుకుంది. బాగా అలిసిపోయివుందేమో, వెంటనే నిద్దరపట్టేసింది. ఆయమ్మ లేపి పాలిస్తే త్రాగి వెంటనే మళ్ళీ పడుకుంది. వాసుదేవరావుగారు ఇంటి కెళ్ళిపోయారు.
    క్రితంరోజు అలసట ఇంకాతీరలేదేమో, సుమతి బాగా పొద్దెక్కినా లేవలేకపోయింది. అప్పటికే కంగారుగా కామాక్షమ్మగారు రెండుమూడు సార్లోచ్చి చూసివెళ్ళింది.
    "అక్కయ్యగారికి సుప్రభాతం" అంటూ లేపేసింది సుబ్బలక్ష్మి తోమ్మిదింటికి బద్దకంగా లేచింది సుమతి.
    "ఇవాళ లేనగానే ముందు నామొహమే చూశారు" అంది ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న ఫోటోలకేసిచూస్తూ. చిన్నగా నవ్వింది సుమతి.
    "బావ ఎంతబాగున్నాడో యూనిఫారములో! ఇది పెళ్ళి ఫొటోనా.....దీన్లో ఇద్దరూ బాగానే వున్నారు" అంటూ రెండు ఫోటో ప్రేమ్ లని తీసి చేతులో పెట్టుకుని చూస్తోంది. ఆ తరువాత ఫోటోల నక్కడ పెట్టేసి సుమతిగదంతా కలియచూసింది. ఆ నిముషంలో సుబ్బలక్ష్మి మొహంలో ఒకరకమైన ఈర్ష్య చోటు చేసుకోవడం సుమతి గమనించింది.
    "మొహం కడుక్కో అమ్మా..... కాఫీ  తాగుదువుగానీ, పాపం! బాగా అలసిపోయావ్" అంటూన్న కామాక్షమ్మగారి మాటలకి "అమ్మో కోడల్ని నెత్తిన బెట్టుకున్నట్టున్నావల్లే వుందే" అంది జానకమ్మ.
    "తప్పేముంది వదినా! కోడలైనా కూతురైనా అందరూ సమానమే. మనబ్బాయిని చేసుకుని మనింటికొచ్చాక ఆ అమ్మాయి మన అమ్మాయికాక పరాయిపిల్ల ఎలా అవుతుంది?" కామాక్షమ్మ మాటలకి ముభావంగా ఊరుకుంది జానకమ్మ.
    "అలా బుద్ది చెప్పండి. ముద్దూముచ్చట్లు తీర్చాడానికి కూతురూ, చాకిరీ చెయ్యడానికి కోడలూ. ఇదీ మా ఇంట్లో రూలు. కోడలంటే అందరి అవసరాలూ చూస్తూ, నోరు  మొదపకుండా పడుండే బానిస. 'చీఫ్' పనిమనిషన్నమాట. అంతేకానీ, ఆమె మన ఇంటికొచ్చిన ఆడపడుచు, ఇంటిని పెంపొందించే మనిషి అని గౌరవించడం, అభిమానించడం చేతకాదు." దండకం చదివింది సుందరి.
    "అ బ్బ బ్బ బ్బ.... మొదలెట్టావ్? స్వర్గాని కొచ్చినా సవతిపోరు తప్పదనీ, ఇక్కడా నీ గొడవ మానవన్న మాట. నీకేం తక్కువయిందని, నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుంటావు" అధికారపూర్వకంగా అరిచింది జానకమ్మ.
    పక్క రూములోనుంచి పరుగెత్తుకొచ్చాడు రాఘవ. "ఊరుకోవే సుందీ.....ఇక్కడా పరువు తీసేస్తున్నారు. అమ్మా నువ్వైనా కాస్సేపు దాంతో మాట్లాడకుండా నోరు మూసుకోకూడదూ?" ఇద్దరినీ మందలిస్తూన్నట్టు అరిచాడు.
    సుమతీ, కామాక్షమ్మగారు తెల్లబోతూ ఒకరిమొహ లోకరు చూసుకున్నారు. దొడ్లో విచ్చిన జాజిపూలన్నీ కోసేసి దండకడుతోంది సుబ్బలక్ష్మి, కాఫీ తాగి కూర్చుంది. సుమతి. స్నానాలూ, ఫలహారాలు అయ్యాక  ఏవో కబుర్లలో పడ్డారందరూ.
    మరికాస్సేపటికి వాసుదేవరావుగారింటి నుంచి మాలిరామయ్య వచ్చాడు. "అయ్యాగారికి పొద్దుటినుంచీ చాలా జ్వరంగా వుంద"ని చెప్పాడు.
    "అదే అనుకుంటున్నాను, వీడింకా రాలేదేమిటా అని" అంటూ చెప్పు లేసుకుని బయలుదేరారు నరసింహరావుగారు.
    "సుమతమ్మగార్ని కూడా తీసుకురమ్మన్నారండీ" అన్నాడువాడు.
    "సుమతినికూడా తీసుకురమ్మన్నారంటే, జ్వరం బాగా వుండి వుంటుంది. నేనూ వస్తా నుండండి" అంటూ బయలుదేరింది కామాక్షమ్మగారు.
    ఆయమ్మతో  చెప్పి ముగ్గురూ బయలుదేరి వెళ్ళారు. ఇంట్లో పనిమనిషి ఎల్లమ్మ వుంది. వీళ్ళని చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి "పొద్దునుంచీ అయ్యాగారు ఒకటే వాంతులు చేసుకుంటున్నారమ్మగోరూ....శాస జరంగా వుంది. ఒల్లు కాలిపోతన్నాది" అంది సుమతిని చూసి.
    సుమతి గబగబా లోపలికి నడిచింది.
    మంచం దగ్గరికెళ్ళి "నాన్నా" అంటూ అతని సుదుటిమీద చెయ్యి వేసింది. "ఒళ్ళు  కాలిపోతోంది. ఇంతసేపు ఏం చేశారూ? పొద్దున్నే కబురు పెట్టకపోయారా?" అంది కంగారుగా.
    కళ్ళు తెరచి సుమతికేసి చూశారు వాసుదేవరావుగారు. "వచ్చావా అమ్మా" అంటూ  చెయ్యి పట్టుకున్నారు గట్టిగా పసి పిల్లాడిలా.
    "అదేమి టన్నయ్యగారూ, పొద్దున్నే కబురు పెట్టోద్దూ, ఇంత జ్వరంగా వుంటే" అంది కామాక్షమ్మగారు.
    "ఇంతవరకూ రాకపోతే ఏమిటో అనుకున్నా. డాక్టర్ కి కబురుపెట్టావా లేదా?" అన్నారు నరసింహరావుగారు.
    "లేదు" అన్నారు మెల్లగా ఆయన.
    రాములుని పంపించి డాక్టర్ శేషాద్రిని పిలుచుకు రమ్మన్నారు.
    దాహం అంటే మంచినీళ్ళు తాగించి పక్కనే కూర్చుంది సుమతి.
    పది నిమిషాల్లో డాక్టరోచ్చాడు. నాడీ, గొంతు, నాలిక పరీక్ష చేశాడు. ఏదో ఇంజక్ష నిచ్చాడు. కొన్ని మందులు రాసిచ్చాడు.
    "గొంతు ఒకటే మంట, నొప్పి డాక్టర్" మెల్లగా  చెప్పారు వాసుదేవరావుగారు.

 Previous Page Next Page