Previous Page Next Page 
ఏవమ్ ఇంద్రజిత్ పేజి 9


    రచ : ఇంద్రజిత్ -మానసి తిరిగి తిరిగి వాళ్ళు చాలాదూరం చేరుకున్నారు. చాలాదూరం! చాలాదూరం వెళ్ళి పోయారు. వివాహం చేసుకుంటారు. మళ్ళీ అదే  చక్రంలో యిరుక్కుంటారు. ఒకటి, రెండు, మూడు - మూడు, రెండు, ఒకటి. ఇదో పెద్ద పాషన. పూర్ణ  ప్రశ్న. దానికి జవాబు శూన్యం. అందుకే లెక్కల్లో పూర్ణం వర్జించి, వేరు వేరుగా తీసుకుంటారు. జవాబు జీవితం యిస్తుంది. ప్రతి జీవితం వేరు. వేరు జవాబుల్ని యిస్తుంది.
    దిక్ చతుష్టయం చూస్తూనే వుంది
    నియమబద్దంగా
    అనంతమైన ఆట
    నడుస్తూనే వుంది అనాదిగా.
    అంధకార ఆలింగనంలో ఆబద్ద ప్రకాశం
    సమయపు రక్తిమధ్వని
    కాలంలో ప్రతిద్వినించింది
    దివారాత్రుళ్ళు ఖండఖండంగా
    ఏ సూత్రంలో బంధించబడ్డాయి.
    భూత భావిష్యత్తుల్ని అన్వేషిస్తూ
    తెలియని దిక్కుల్లో ప్రయాణం
    నేనే వర్తమానాన్ని-నాకు అన్వేషణ లేదు.
    సూక్ష్మమీనమేషాల్లో ఏం లభిస్తుంది?
    ఈ ప్రశ్నలకు సమాధానం
    కాదు అసంభవం
    స్వప్నాల వాయుతంత్రులతో
    ఆగంతకునికి వస్త్రం నేస్తే ప్రయోజనం!
    దివారాత్రుల మధుర పదధ్వనికి
    అనవరతంగా పడుతున్న తాళం
    ఎందుకు పెంచుకుంటావు?
    ప్రశ్నల్ని మనో మందిరంలో
    కాలం వేస్తున్న తాళంతో బంధించు హృదయస్పందనను
    అందుకో భవిష్యత్తు యిచ్చిన ప్రసాదం-
    (అమల్, విమల్, కమల్, ప్రవేశిస్తారు.)
    రచ : ఆగు! ఇంకా సమయం మించిపోలేదు.
    (ముగ్గురూ వెళ్ళిపోతారు.)
    ఒక్కక్షణం మాత్రమే! ఈ క్షణం యిచ్చిన దాన్ని స్వీకరించు. అంటే ఎదురైన సమస్యను సంపూర్ణంగా స్వీకరించు. ఒక్కక్షణం- వర్తమానంలోని ఒక్కక్షణం- అదే జీవితం - అయినా అమాయక హృదయం దీన్ని స్వీకరించదు.  నిరంతరం లెక్కల బరువును మోస్తూనే వుంటుంది. దుస్సాధ్యమైన ప్రశ్నలకు సమాధానం వెతకటానికి ప్రయత్నించదు.
    జవాబు అనంతమైన శూన్యం అని ఎలా అంగీకరించను? మౌనంగా కూర్చొని అల్పమైన రోజుల్ని లెక్కించుకుంటున్నాను ప్రకృతిలోని ప్రతి  పత్రం  మీద శిశువు అక్షరాల్లో క్షణక్షణం జీవితభాష మిగిలిపోతూనే వుంది.
    [కవితా పాఠంతో పాటు రచయిత మీద పడుతున్న వెలుగు తగ్గిపోతుంది. వెనుక టేబులూ, కుర్చీలు- వాకిలి దగ్గరగా బెంచి- అమల్, విమల్ కమల్, ఇంద్రజిత్ బెంచీమీద కూర్చొని వుంటారు. టిఫ్ టాఫ్ గా ముస్తాబయి గంభీరంగా కూర్చుని వుంటారు. గంటమోగుతుంది. అమల్ లేచి టేబుల్ దగ్గరకు వెళ్ళి అదృశ్యవ్యక్తులకు నమస్కరించి కుర్చీలో కూర్చుంటా మౌనంగానే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాడు. బెంచిమీద కూర్చున్నవాళ్ళు మాట్లాడుకుంటూ వుంటారు.]
    విమల్ : క్యాబినెట్ మినిస్టర్ల పేర్లు జ్ఞాపకమున్నాయా?
    కమల్ : లేదు. అవన్నీ చదవలేదు.
    విమల్ : ఇయర్ బుక్ తెచ్చుకొంటే బాగుండేది.
    కమల్ : ఏంబాగు? ఎన్నని వల్లిస్తాం !
    విమల్ : టైం ఎంతయింది ఇంద్ర్ !
    ఇంద్ర : పన్నెండు యిరవై !
    కమల్ : పదకొండుకల్లా మనల్ని రమ్మనారు. బాబుగార్లు పన్నెండుకు వచ్చారు ఇంటర్వ్యూ చెయ్యటానికి.
    విమల్ : ఇదంతా ఒక ఫార్స్ ! ఉద్యోగం ఎవరికివ్వాలో ముందే నిర్ణయం జరిగి వుంటుంది.
    కమల్ : ఎవరైవుంటారు ? అమల్ కంటే ముందు వెళ్ళిన వాడేనా?
    విమల్ : తెలియదు. కాని మనం మాత్రం కాదు.
    కమల్ : అమల్ వెళ్ళి ఎంతసేపయింది ?
    ఇంద్ర :  ఐదు నిముషాలు.
    విమల్ : ఏం అడుగుతున్నారో?
    (అమల్  లేస్తాడు. దర్వాజాదగ్గరకు రాబోయి మరో వైపునుంచి బయటకు వెళ్ళిపోతాడు.)
    కమల్ : టెక్నికల్ ప్రశ్నలు వేస్తారేమో?
    విమల్ : అదేంకాదు. జవాబులకంటే  జవాబులిచ్చే తీరు తెన్నులు చూస్తారు.
    కమల్ :  అవును. జవాబు తెలియకపోతే స్మార్టుగా చెప్పడం చాలా కష్టం.
    [గంట విమల్  లోపలకు వెళతాడు. వీళ్ళిద్దరూ బెంచి మీద, దగ్గరకు జరిగి కూర్చుంటారు విమల్ అమల్ లాగే మూకాభినయం చేస్తాడు.]
    కమల్ : గొంతు పూడిపోతుంది. నీ దగ్గర లవంగం వుందా?
    ఇంద్ర : లేదు.
    (కమల్ సిగరెట్టు తీస్తాడు.)
    గోంతు బాగాలేదని సిగరెట్ తాగుతావేం?
    కమల్ : మంచిది కాదనుకుంటా ! (సిగరెట్ పెట్టేస్తాడు.)
    ఇంతకు ముందెప్పుడైనా ఇంటర్వ్యూకు వెళ్ళావా ?
    ఇంద్ర : ఐదుసార్లు.
    కమల్ :  నేను నాలుగుసార్లు వెళ్ళాను. ఎప్పుడైనా నీకు వాళ్ళనుంచి ఏమైనా కబురువచ్చిందా ?
    ఇంద్ర : వచ్చింది. ఒకమాత్రం రిగ్రెటింగ్ లెటర్ పంపారు.
    కమల్ : (ఆలోచించి) వచ్చేనెల్లో మానాన్న రిటైరు అవుతున్నాడు.
    (ఇంద్రజిత్ జవాబివ్వడు. రచయిత ప్రవేశిస్తాడు. చిరునవ్వుతో ఇంద్రజిత్ పక్కనే కూర్చుంటాడు. కొంచెంసేపు అందరూ మౌనంగా వుంటారు.)
    కమల్ : ఎంతయింది?
    ఇంద్ర : పన్నెండున్నర.
    కమల్ : మిమ్మల్ని ఎన్నిగంటలకు పిల్చారు ?
    రచ : పదకొండు. నేను మరో ఇంటర్వ్యూకు వెళ్ళాల్సి వచ్చింది. అసలు యిక్కడికి రాలేననుకున్నా! అయినా ఒక చాన్సు చూద్దామని వచ్చాడు.
    కమల్ : మిమ్మల్ని పిలవలేదనుకుంటా !
    రచ : లేదు. అందుకే యింత దైర్యం!
    కమల్ : మీకేం అదృష్టవంతులు.
    [అదే సమయంలో విమల్ మూకాభినయం ఆపి, రెండోవైపుగా బయటకు వెళ్ళిపోతాడు. గంట మోగుతుంది. కమల్ లేచి లోపలకి వెళతాడు.)
    రచ : సిగరెట్ !
    ఇంద్ర : నేను తాగను. థాంక్స్ !

 Previous Page Next Page