రచ : (సిగరెట్ వెలిగించుకుంటాడు.) ఏమి అడుగుతున్నారో ఏమైనా తెలిసిందా?
ఇంద్ర : లేదు. అటునుండే బయటకు పంపించేస్తున్నారు.
రచ : సాధారణంగా అలాగే చేస్తారు. ఆ సోదరుల దగ్గర ప్రశ్నావళి చిన్నదే వుంటుంది.
ఇంద్ర : మీరు యిప్పుడు వెళ్ళివచ్చిన యింటర్వ్యూ ఎలా వుంది?
రచ : ఏమంత బాగా జరగలేదు. ఉద్యోగం చాలా మంచిది.
ఇంద్ర : అందుకే యిదివదిలి అక్కడికెళ్ళారు.
రచ : కాని నేనుచేసింది పోరబాటని గ్రహించారు. ఉద్యోగం కావాలంటే, చిన్న ఉద్యోగానికే ప్రయత్నించాలి. కనీసం ఉద్యోగం దొరికే అవకాశం వుంటుంది.
ఇంద్ర : రెంటిలో ఏదో ఒకటి దొరకోచ్చుగా?
రచ : అదృష్టం ఎలావుందో? నాకు ప్రస్తుతం ఉద్యోగం చెయ్యవలసిన అవసరం చాలా వుంది.
ఇంద్ర : అవసరం ఎవరికిలేదు?
రచ : అది నిజమేననుకో ! అందరికీ ఉద్యోగం అవసరం కావచ్చు. కాని నాకు మరీ అవసరం. మీదగ్గర దాపరికం ఎందుకు? అప్పుచేసి ఒక చిన్నగది అద్దెకు తీసుకున్నాను. చిన్నగది కావాలన్నప్పుడు అద్దెకు దొరక్కపోవచ్చు. ఆ గదికి వేరే వసతులు లేకపోయినా నీటిసదుపాయం వుంది.
ఇంద్ర : మీరు చెప్పేది నాకు సరిగ్గా అర్ధం కాలేదు.
రచ : అదే.... నేను పెళ్ళిచేసుకున్నాను. నాన్నగారికి ఇష్టంలేదు. అద్దె కట్టలేకపోతే గది ఖాళీ చెయ్యాల్సి వుంటుంది. అప్పుతో ఎంతకాలం అని అద్దె కట్టగలను చెప్పు?
[కమల్ బయటకు వెళ్ళిపోతాడు. అమల్, విమల్, కమల్ ప్రవేశిస్తారు. ముగ్గురూ ఇంటర్వ్యూ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటారు. అమల్ గంట వాయిస్తాడు. ఇంద్రజిత్ లేచి వెళ్ళి వాళ్ళదగ్గర కూర్చుంటాడు. మూకాభినయం నలుగురూ చేస్తుంటారు. రచయిత సిగరెట్ తాగుతూ-అంతలోనే పారేస్తాడు. లేచి ముందుకు వస్తాడు.
రచ : అమల్ రిటైర్ అవుతాడు - అమల్ కొడుకు అమల్ ఉద్యోగం చేస్తాడు- విమల్ జబ్బు పడతాడు- విమల్ కొడుకు విమల్ ఉద్యోగం చేస్తాడు. కమల్ చనిపోతాడు- అతని కొడుకు కమల్ ఉద్యోగం చేస్తాడు. ఏవం ఇంద్రజిత్- ఇంద్రజిత్ కుమారుడు ఇంద్రజిత్. అక్కడ పేవ్ మెంట్ మీద ఏడు సంవత్సరాల పిల్లవాడు చేత్తో చెక్కపెట్టె పట్టుకొని, చంకలో సంవత్సరం పిల్లతో నిల్చుని వుంటాడు. అక్కడే మరో అమ్మాయి నిల్చునివుంది. పేరు లీల. మరొకచోట ఆకాశం రాగరంజితంగా కన్పిస్తుంది. అది చూస్తూ కూర్చున్న మానసి జీవితం మీద ఆశల్ని పెంచుకుంటోంది. చాలా ఆశలు - తెలిసినవి - తెలియనివి- మంచివీ - చెడ్డవి - ఎన్నో ఆశలు - అన్నింటినీ కలిపితే రంగులరాట్నం....పైకీ కిందకూ తిరిగే రాట్నం.... నిరంతరం ఈ సృష్టి గిర్రున కిందకూ తిరుగుతూనేవుంది.
నియమబద్దంగా తిరుగుతూనేవుంది.
ఆకాశం అస్తవ్యస్తంగా వుంది.
అచేత చేతన సంఘర్షణ.
జ్ఞాన- అజ్ఞాన ప్రసారం.
బంధించే ప్రయత్నం.
చేస్తున్నాను నిరంతరం.
తప్పదు. వీళ్ళకథ చెప్పక తప్పదు.
వీరి గాధల్ని నాటకబద్దంచేస్తాను.
కాని భాష ప్రాచీనం.
కథ బలహీనం.
ప్రకాశరేఖ క్షీణం.
మనక మసక ప్రకాశం.
స్మశాన ప్రశాంతి.
నాగరాజు బంధాలు.
నాలుగుదిక్కుల చుట్టాయి.
అక్కడే చితి అంటించి
వెలిగించాలి దివ్యజ్యోతి.
(ఇంద్రజిత్ వెళ్ళిపోతాడు. గంటప్రోగుతుంది.)
గంట మ్రోగుతోంది. (ఒక పరమాణువు పడిపోయింది. మరో పరమాణువు ఆహ్వానించబడుతోంది. మూడు పరమాణువులు పరస్పరం పిలుచుకుంటున్నాయి.) అసంఖ్య పరమాణువులు కలయికతో జన్మించిన ఈ భూమి తిరుగుతోంది. సెకండ్, నిమిషం, గంట- ఒకదాని తర్వాత ఒకటి. గిర్రున తిరుగుతున్నాయి.
(మళ్ళీ గంటమ్రోగుతుంది. అమల్, విమల్, కమల్, చిరాగ్గాలేచి నిల్చుంటారు.)
గంట మ్రోగింది. మళ్ళీ మ్రోగుతుంది. అయినా పృథ్వి, శతాబ్దం వున్నాయి. మన పృథ్వి. మన శతాబ్దం. చక్రం.....ప్రశ్నలు-పోనియ్! వాటి దారిని వాటిని పోనియ్! మేము ఉంటాం! అమల్, విమల్, కమల్, ఏవం ఇంద్రజిత్ . నేను, మేము ఉన్నాం. ఈ పృథ్విమీద వున్నాం.
(అమల్ , విమల్, కమల్ - విసుగుతో గంట గట్టిగా మ్రోగిస్తారు. వారి మీదకు క్రమంగా చీకటి పాకుతుంది. రచయితమీద వెలుతురు తీక్షణంగా పడుతుంది.)
నేను అఖండిత పదార్ధాన్ని.
కణ కణ నిర్మిత వ్యక్తిని.
బ్రతికివున్నాను - బ్రతికివుంటాను.
వృద్ద శతాబ్ది కూర్చొనివుంది.
వివాలని నా గానం.
కర్ణవుటాలను విచ్చుకొని
విసుగూ విరామం లేకుండా
తిరుగుతూనేవుంది వసుధ నిరంతరం.
అపరాజిత - అజేయ.
(అకస్మాత్తుగా వెలుగు ఆరిపోతుంది. చీకట్లో యవనిక పడుతుంది. అయినా పాట విన్పిస్తూనేవుంది.)
వృద్ద శతాబ్ది కూర్చోనివుంది.
వినాలని నాగానం
కర్ణవుటాలను విచ్చుకొని
విసుగూ విరామం లేకుండా
తిరుగుతూవుంది వసుధ నిరంతరం
అపరాజిత - అజేయ.
[ప్రథమాంకం సమాప్తం]