మా : ఎందుకు ?
ఇం : నాకే తెలియదు. ఎవర్ని కొట్టాలో -నాకు తెలియడం లేదు. వాణ్ని కొట్టకూడదని నాకు తెలుసు. అయినా కొట్టే వుండేవాణ్ని. బహుశా ఏడెనిమిది యేళ్ళ పిల్లవాడిచేత బూట్ పాలిష్ . పనిచేయిస్తూ, వాటినెత్తిన మరొక పసివాడి బరువు గూడా ఎత్తిన ఈ నియమాలను నేను పాటించలేక కావచ్చును.
మా : ఇది వేరు.
ఇం : వేరు ఎలా అవుతుంది. నీ యింట్లో నియమాలు మరో రూపంలో వుంటాయి. వాటిని నువ్వు పాటిస్తావు. పాటించాలని గూడా నీ నియమాలలో వుంది.
మా : నా మీద కోపం వస్తుంది కదూ?
ఇం : నీ మీద నాకు కోపం రాదనీ నీకు తెలుసు.
(మానసి మాట్లాడదు.)
ఏం : తెలియదా?
మా : తెలుసు.
ఇం : మరి నిష్టూరంగా ఎందుకు మాట్లాడుతున్నావు.
మా : నిన్ను ఇలా చూస్తుంటే ఎందుకో నాకే భయం వేస్తుంది.
ఇం : ఎలా చూస్తుంటే?
మా : నీ కోపం - అదే, నియామాలంటే నీకున్న కోపం చూస్తుంటేను....
ఇం : (కొంచెం నవ్వి)___నా కోపం నిష్ర్పయోజనమైంది. ఈ కోపం గుడ్డిది. దోడకు తలకొట్టుకున్నట్లే - నేను కోపగించుకోవటం.
మా : తెలిసి గూడా, ఎందుకిలా నిన్ను - నువ్వు హింసించుకుంటావు?
ఇం : ఎప్పుడైనా బైబిలా చదివావా?
మా : బైబిలా ? ఎందుకు?
ఇం : జ్ఞానవృక్షాన్ని గురించిన కథ చదివావా? జ్ఞానఫలాన్ని -తిన్న- ఆదమ్, అవ్వ ఎలా స్వర్గచ్యుతులు అయ్యారో విన్నావా?
మా : విన్నాను.
ఇం : నేనుకూడా, జ్ఞానఫలం రుచి చూసి వుండకపోతే - నీ, ఈ సంఘవ్యవస్తలో స్వర్గసుఖాన్ని చూడుగలిగే వాణ్ని. గోడకు తల పగలకొట్టుకోవడంకంటే యిష్టం. నేను చేయగలిగింది ఏమీలేదు.
(కొంతసేపు యిద్దరూ మౌనంగా వుంటారు.)
మా : నువ్వు లేకపోతే, నేనేమౌతానో అనే భయం నాకు అప్పుడప్పుడూ, కలుగుతూ వుంటుంది.
ఇం : ఎందుకు?
మా : చెబుతాను. కోపగించుకోకు. నువ్వు లేకపోతే యీ నియమాలను చూసి నాకు కోపం వచ్చేది. నువ్వు వున్నావు గనుకనే నేను నియమాలను పాటిస్తున్నాను.
ఇం : అంటే నేను వుండటం నీకు హానికరం అన్నమాట
మా : అలా అనకు. ఎలా చెప్పను? నువ్వంటే నాకు ఎంత ఇదో ! నీ ఉనికి నా జీవితానికి శక్తి ఇస్తుంది. ఆ శక్తి నాకు లభించకపోతే యేనాడో నేను మునిగిపోయేదాన్ని.
(ఇంద్ర వింటూ వుంటాడు.)
నాకు కోపగించుకోవడం ఇష్టంలేదు. ఈ జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను. అందుకే జీవితంతో రాజీపడటానికి నేను వెనుకాడను. ఇదంతా నీవల్ల......... ఏమిటో నాకు సరిగా చెప్పటం రావటంలేదు___
ఇం : ఊఁ ! ఆగిపోయావేం ?మాట్లాడు.
మా : నాకు మాట్లాట్టం రాదు. నువ్వే , మరో విషయం మాట్లాడు.
ఇం : మనం మాట్లాడుతూంది అదేగా?
మా : ఈ పుస్తకం, నాకు అర్ధం కాకపోతే చెబుతావు కదూ?
(ఇంద్ర మానసిని చూస్తూ నిలుచొని వుంటాడు.)
ఏమయింది-మాట్లాడవేం?
ఇం : నాకు ఉద్యోగం దొరికిన రెండోరోజు నిన్ను పెండ్లి చేసుకొంటాను.
మా : వద్దు ! వద్దు !
ఇం : చూస్తుండు.
మా : నేను నీ పినతల్లి కూతుర్ని అన్న విషయం మర్చిపోతున్నావే?
ఇం : నువ్వు ప్రతిసారి జ్ఞాపకం చేస్తూనే వున్నావుగా.
మా : అయినా, నువ్వు అదే అంటున్నావు.
ఇం : నిజమే అంటున్నాను. నేను దేన్ని లస్ఖ్యం చెయ్యను.
మా : నన్ను కూడానా?
ఇం : నువ్వు కావాలి. గాని-నీ నియమాలు నాకక్కరలేదు.
మా : నన్ను నీవు ఎక్కువరోజులు భరించలేవు.
ఇం : ఇదొక వంక!
మా : నేను నిజమే చెబుతున్నాను. నేను అతిసాధారణమైన ఆడపిల్లను.
ఇం : నేను పూర్తిగా అసాధారణమైనవాణ్ని.
మా : అవును. నువ్వు అసాధారణమైనవాడివే.
ఇం : సంతోషిస్తున్నాను.
మా : కాదులే ! సాధారణమైనవాడివే.
ఇం : ఇక పేచీ ఏముంది?
మా : అయిపోయిందా?
ఇం : ఒక సాధారణమైన అబ్బాయి, ఒక సాధారణమైన అమ్మాయిని. వివాహం చేసుకోబోతున్నాడు. ఇక గొడవే లేదు.
మా : ఇక చాల్లే ! వెళదాం పద!
ఇం : నేను రాను.
మా : ఆలస్యం కావటంలేదు.
ఇం : కానీయ్.
మా : నీకేం ? నీ మూలంగా నేనేగా ఇంట్లో తిట్లు తినాలి.
ఇం : అది ఇల్లుకాదు. వల్లకాడు.
మా : మళ్ళీ ప్రారంభం. పద వెళదాం!
ఇం : పద!
మా : ఎందుకంత కోపం? నాకేం భయం అనుకున్నావా?
ఇం : ఆలశ్యం అవుతుంది. కదులు-
మా : నేను కదల్ను.
ఇం : అయితే సరే! కూర్చుందాం!
మా : ఏయ్ ! లే లే వెళదాం.
(ఇంద్ర మానసి భుజంమీద చెయ్యి వేస్తాడు. మానసి చెయ్యిని తోసేస్తుంది.)
ఏమిటిది? పార్కులో వున్నాం అన్న సంగతి మార్చిపోయావా?
ఇం : అయితే ఏం?
మా : అదుగో - అటు చూడు! ఆ చెట్టుక్రింద ఎవరో వున్నారు.
[రచయిత చీకట్లో ఓప్రక్కగా కూర్చుంటాడు.]
ఇం : ఉండనియ్ !
మా : అతను చూస్తే ?
ఇం : చూడనియ్ ! బాగా చూడమను.
{మళ్ళీ ఇంద్ర మానసి భుజంమీద చెయ్యి వేస్తాడు. మానసి చేతిని తొలగించింది. ముందుకు నడుస్తుంది. చిరునవ్వుతో ఇంద్రజిత్ ఆమెను అనుసరిస్తాడు. రచయిత ముందుకొస్తాడు.]