ఏదో అలికిడి విని కృష్ణారావు తలెత్తి చూశాడు. చంద్రం పిల్లిలా తన గదిలోకి దూరటం కనిపించింది. చంద్రాన్ని చూడగానే కృష్ణారావులో అంతవరకూ ఉన్న పశ్చాత్తాపం, భయం స్థానాన్ని కోపం ఆక్రమించుకుంది.
"చంద్రం!" కృష్ణారావు కేకకు ఇల్లు ప్రతిధ్వనించింది. చంద్రం ఆ కేకకు అదిరిపడ్డాడు. అపరాధిలా అడుగులో అడుగువేసుకుంటూ వచ్చి అన్నముందు నిలబడ్డాడు.
"ఏరా గాడిదా! ఎక్కడి కెళ్ళావ్?"
చంద్రం భయంగా అన్న మొహంలోకి చూశాడు. జవాబివ్వలేదు.
"ఏరా మాట్లాడవు? ఆ డబ్బు ఎక్కడ దాచావు?"
ఈసారి చంద్రం మొహంలో భయం స్థానాన్ని ఆశ్చర్యం ఆక్రమించుకొన్నది. బిగుసుకొని కొయ్యలా నిలబడ్డాడు.
"అలా చూస్తావేం? ఆ డబ్బు ఎక్కడ దాచావో చెప్పు!"
మాట పూర్తికాకుండానే చంద్రం చెంప ఛెళ్ళుమన్నది. చంద్రం కళ్ళకు ఏదో వెలుగు కనిపించి అంతలోనే చీకట్లుకమ్మాయి.
"నాకు తెలియదు" అన్నాడు, అన్నగారు మళ్ళీ ఎత్తిన చేతికి భయంతో తన రెండు చేతులను అడ్డం పెడుతూ.
"దొంగవెధవా! అబద్ధాలుకూడా?" కసికొద్దీ రెండు చేతులతో అందినచోటల్లా బాదడం మొదలుపెట్టాడు కృష్ణారావు. చంద్రం శరీరాన్ని అప్పగించి నిల్చున్నాడు.
కొట్టి కొట్టి చేతులు నొప్పిపుట్టాయి. కృష్ణారావుకు.
"చెబుతావా చెప్పవా? రాత్రి ఈ ద్రాయరులో దాచిన డబ్బు ఎందుకు తీశావు?"
"నేను తియ్యలేదు, నాకేం తెలియదు" అన్నాడు చంద్రం, ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ.
చంద్రం చెబుతున్నది నిజమేనేమో ననిపించింది కృష్ణారావుకు ఒక క్షణకాలం. "అయితే ఇంత పొద్దుటే ఎక్కడి కెళ్ళావు?" గద్దించాడు కృష్ణారావు.
చంద్రం మాట్లాడలేదు. తలవంచుకొని నిలబడ్డాడు. అతని మౌనం కృష్ణారావు హృదయంలో మళ్ళీ అనుమానాన్ని రేకెత్తించింది.
"మాట్లాడవేంరా?" గట్టిగా అరిచాడు.
"హేమావాళ్ళ ఇంటికి....."
చంద్రం దొంగతనం చేసినందుకు బాధపడుతున్న కృష్ణారావుకు అతను నిజం చెప్పకపోవటం, పైగా అబద్ధాలు చెప్పటం పిచ్చివాణ్ణి చేశాయి. అతనిలో వివేకం నశించింది. ఆవేశం ఆవహించింది. పిచ్చిగా బాదసాగాడు.
ప్రసాదరావూ, హేమా - చంద్రం పొద్దుటే ఎక్కడికి వెళ్ళివుంటాడా అనీ, యింకా మరెన్నో శంకలతో కృష్ణారావు ఇంటికి వచ్చారు. వాకిట్లో అడుగు పెడుతూనే అక్కడి దారుణ దృశ్యంచూసి, ఒక్క క్షణకాలం నివ్వెరపోయారు.
హేమ తెప్పరిల్లి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, 'నాన్నా! చంద్రం -' అంటూ తండ్రి చెయ్యిపట్టుకొని చంద్రాన్ని చూపుతూ గట్టిగా లాగింది.
ప్రసాదరావు గబగబా వెళ్ళి కృష్ణారావు భుజం పట్టుకొని పక్కకు తోసి, చంద్రాన్ని దగ్గరకు తీసుకున్నాడు. అంతసేపూ అణచుకున్న దుఃఖం చంద్రంలో కట్టలు తెంచుకున్నది. బావురుమంటూ ప్రసాదరావు చేతుల్లో ఒదిగిపోయాడు.
"ఏమిటిది కృష్ణారావు? మీకేమైనా పిచ్చిగాని ఎత్తలేదుగదా! రత్నంలాంటి బిడ్డ! ఎప్పుడూ తప్పు పని చేసినవాడు కాదే! ఇప్పుడేం జరిగిందీ?" అంటూ ప్రసాదరావు చంద్రాన్ని గుండెలకు హత్తుకున్నాడు.
"హుఁ, రత్నం! అలా అనుకుంటూ వుండబట్టే ఇప్పుడు కడుపు దహించుకుపోతున్నది. ఇంత నీచానికి పాల్పడతాడని ఏనాడూ అనుకోలేదు. మా వంశంలో తప్ప పుట్టాడు," అంటూ కృష్ణారావు రొప్పుతూ నిలబడలేక పక్కనేవున్న వాలుకుర్చీలో కూలబడ్డాడు.
కృష్ణారావులో అంత కోపోద్రేకాలు ఏనాడూ చూసివుండని ప్రసాదరావు, యిప్పటి అతడి తీవ్ర ప్రవర్తనకు ఏదో పెద్ద కారణమే వుండి వుంటుందనుకున్నాడు. అతడు కృష్ణారావుకేసి ఒకడుగు వేసి "అసలు యింతకీ చంద్రం ఏం చేశాడు?" అని ప్రశ్నించాడు.
కృష్ణారావు ప్రసాదరావుకు జరిగిన సంగతంతా వివరంగా చెప్పాడు. తండ్రి పక్కనే నిలబడి అంతా శ్రద్ధగా విన్న హేమ మనసు కలవరపడింది. చంద్రం అలాంటిపని చేసి వుండవలసింది కాదని తండ్రీ కూతుళ్ళిద్దరూ భావించారు.
"నిన్న మీముందే వాడ్ని గురుకుల్ కు పంపిస్తానని చెప్పాగదా? ఇంతలో దొంగతనం చెయ్యవలసిన అవసరం ఏం వచ్చిందో మీరే ఆలోచించండి" అన్నాడు కృష్ణారావు రెండు చేతులతో తల పట్టుకుని.
"ఏదో చిన్నతనం.... తెలియక చేసివుంటాడు. అయినా, ఆ చేసిన దొంగతనం పరాయి యింట్లో కాదుగదా? ఆ డబ్బు ఎక్కడ దాచిందీ నేను చెప్పిస్తాను. మీరు కొంచెం శాంతంగా ఉండండి" అంటూ ప్రసాదరావు చంద్రంకేసి చూశాడు. చంద్రం దించిన తల ఎత్తకుండా అంత దూరంలో నిలబడి వున్నాడు.
"బాబూ, చంద్రం! గురుకుల్ వెళ్ళటానికి మీ అన్నయ్య డబ్బివ్వరేమో అన్న అనుమానం నీకెందుకు కలిగింది? నీవు వయసులో, విద్యలో చిన్నవాడివైనా, ఆ రెండింటినీ మించిన వివేకం వున్నవాడివి. యిలాంటి తప్పిదం చెయ్యవచ్చునా? బహుశా, చదువుమీద వున్న ప్రేమకొద్దీ అలా చేసివుంటావ్. ఇప్పుడు తప్పొప్పుకుని, ఆ డబ్బు ఎక్కడ దాచిందీ మీ అన్నగారికి చెప్పెయ్యి. ఆయన తప్పక నిన్ను క్షమిస్తారు. ఆయన నిన్ను గురుకుల్ కు పంపుతారు" అన్నాడు ప్రసాదరావు.
చంద్రం జవాబివ్వలేదు. కనీసం తలైనా ఎత్తలేదు. ప్రసాదరావు అతణ్ణి సమీపించి ప్రేమగా గడ్డం పట్టుకుని, తల పైకెత్తి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళు వర్షభారంతోవున్న మేఘాల్లా వున్నాయి. వాటి వెనక దాగివున్న చంద్రం మనోభావాలేమిటో అంత అనుభవశాలి అయిన ప్రొఫెసరుకూ అర్థం కాలేదు.
చంద్రం చేత నిజం చెప్పించబోయి ప్రసాదరావుగారే ఏదో తికమకలో పడిపోయాడని అనుకున్న కాంతమ్మ భర్తచేతిదెబ్బతిన్న చెంపను వేళ్ళతో రాచుకొంటూ, "కాళ్ళూ చేతులూ విరిచికట్టి గొడ్ల చావిట్లో పడేస్తే క్షణాలమీద వాడే నిజం చెబుతాడు," అన్నది కసిగా.
కృష్ణారావుకు భార్య అన్న మాటలు సబబుగా తోచకపోయినా, ఆ క్షణాన తమ్ముడిమీద వున్న కోపంతో భార్యను సంతృప్తిపరచటానికి, ఆమె చెప్పినట్టు చేయటం బావుంటుందన్న నిర్ణయానికి వచ్చాడు.
కృష్ణారావు, భార్య అన్నంతపనీ చేయబోతున్నాడని గ్రహించిన ప్రసాదరావు చంద్రం తల నిమురుతూ, "బాబూ చంద్రం! ఆ డబ్బు ఎక్కడ దాచావో నిజం చెప్పెయ్యి" అని అడిగాడు.
ఆ మాటలతో చంద్రం తలయెత్తి ప్రసాదరావు ముఖంలోకి దీనంగా చూశాడు. 'మీరూ నేను దొంగననే నమ్ముతున్నారా?' అని ప్రశ్నిస్తున్నాయి, అతడి చూపులు.
ప్రసాదరావుకు ఏమిచేయటానికి తోచలేదు. చంద్రంచేత నిజం చెప్పించటం తనకు సాధ్యమయేలా లేదు. భార్య ప్రోత్సాహంతో కృష్ణారావు తమ్ముణ్ణి పెడరెక్కలు విరిచి కట్టివేసేందుకు సంసిద్ధమవుతున్నాడు. ఇక అక్కడ వుండి ఏం ప్రయోజనం? ఆయన ఎవరితోనూ ఏమీ అనకుండా గిరుక్కున వెనుదిరిగి బయటి కెళ్ళాడు. హేమ తండ్రిని అనుసరించింది.
కృష్ణారావు కుర్చీలోంచి లేచాడు. తను చేయబోతున్నది కిరాతక కృత్యం అన్న భావం అతడి హృదయంలో మెదలింది. కాని, దాన్ని మించిన క్రోధం అతడి నరనరాన్నీ పట్టి కుదిపింది. తమ్ముడి ముఖంకేసి చూడకుండా, అతడి రెండు చేతులూ వడిసిపట్టుకుని గొడ్ల చావిడికేసి లాక్కుపోయాడు. చావిట్లో ఒక గుంజకు చంద్రాన్ని పెద్ద తాడుతో బిగించికట్టేశాడు.
"వాడికి.... రాత్రికి నేను తిరిగివచ్చేవరకూ అన్నం పెట్టవద్దు. విన్నారా?" భార్యను ఉద్దేశించి అంటూ కృష్ణారావు తలవంచుకుని వేగంగా వీధిలోకి వెళ్ళిపోయాడు.
మధ్యాహ్నం రెండుగంటలు దాటింది. చంద్రం ఆకలితో దహించుకుని పోతున్నాడు. దాహంవల్ల గొంతు పిడచకట్టుకుపోతున్నది. కళ్ళు అవమానాగ్నితో మండుతున్నాయి. హృదయంలో పేరుకున్న బాధ కన్నీరు రూపంలో వెలువడి అతడి చెంపలను తడుపుతున్నది.
తను దొంగతనం చేసినట్టు వదిన అనటమే తడవుగా అన్నయ్య నమ్మేశాడు. అసలు తనకు దొంగతనం చెయ్యాలన్న ఆలోచన రాలేదు. అవకాశం లేదని అతనెందుకు గ్రహించలేక పోయాడు? తనకూ ఆస్తిలో భాగం ఉంది. డబ్బు తను ధైర్యంగా అడిగి తీసుకోగలడు. కాని ఇంట్లో దొంగతనం జరిగినమాట నిజం.... ఆ దొంగ ఎవరి వుంటారు? తన వదిన! మొట్టమొదటిసారిగా అతడి హృదయంలో ఆమె అంటే అసహ్యభావం కలిగింది.
తను చేసిన తప్పల్లా పొద్దున్నే ఎవరితోనూ చెప్పకుండా ప్రకాశం ఏమయాడో తెలుసుకునేందుకు వాళ్ళ యింటికి వెళ్ళటమే. ప్రకాశం తన ప్రాణ స్నేహితుడు. మెత్తని మనసు కలవాడు. ఒకరకంగా పిరికివాడు. భయస్థుడు. పరీక్ష తప్పితే ఆత్మహత్య చేసుకుంటానని తనతో అన్నాడు. పరీక్ష తప్పాడు - అన్నంతపని చేస్తాడేమో అన్న ఆదుర్దాలో తను తెల్లవారుతూనే వాళ్ళింటికి వెళ్ళాడు. అది అన్నయ్య ఆజ్ఞను ధిక్కరించటమే.