ఇలా అత్తా, కోడళ్ళూ ఎవరికివారే బెంగలేనట్టు నటిస్తూ ఒకరి నొకరు ఓదార్చుకునేవారు.
ఇంచుమించు నరసింహరావుగారూ, వాసుదేవరావుగారూ కూడా అంతే.
ఆర్దర్సు వచ్చేశాయి. మద్రాసులో సంవత్సరం ట్రైనింగ్ పీరీడ్ లో ఖచ్చితంగా మెన్ లోనే వుండాలి. ఫామిలీని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఒంటరిగా ప్రయాణమవుతున్న గోవింద్ ని చూసి వెక్కివెక్కి ఏడ్చింది సుమతి.
"సుమతీ! ఒక్క సంవత్సరం ఇట్టే గడిచిపోతుంది. అందులోనూ మరో ఆర్నెల్లలో 'పాపో, బాబో' పుడతాడు. అప్పుడు నీకు బోలెడంత కాలక్షేపం. అసలు నాగురించి ఆలోచించే టైముంటుందో లేదో కూడా.....ఇదుగో సుమ్మీ.....బాబు పుట్టగానే నమ్న అశ్రద్ధచేశావో ఊరుకునేది లేదు. ఆఁ...."రెండు చేతులలో సుమతిని బందిస్తూ అన్నాడు గోవింద్.
అతని గుండెలమీద తలపెట్టి అతన్ని పెనవేసుకుపోయింది సుమతి. ఆమెకళ్లు తుడుస్తూ ముద్దులవర్షం కురిపించాడు. చక్కలి గింతలు పెట్టి నవ్వించాడు. సుమతి హృదయం తేలికపడింది. పకాపకా నవ్వింది. కామాక్షమ్మగారికీ, నరసింహరావుగారికీ, వాసుదేవరావుగారికీ పాదాభివందనం చేసి కారేక్కాడు. 'ఏర్ పోర్టు' వరకూ నరసింహారావుగారూ, వాసుదేవరావుగారూ వెళ్ళారు. కారు కనుమరుగయ్యేవరకూ సుమతి చెయ్యి వూపుతూనే వుంది. మళ్ళీ సుమతి హృదయం మొయ్యలేనంత బరువెక్కింది. కళ్ళు తిరుగుతూన్నట్టనిపించింది. తూలిపోతూన్న సుమతిని కామాక్షమ్మగారూ, ఆయమ్మా పట్టుకువెళ్ళి మంచంమీద పడుకోబెట్టారు. వేడివేడి కాఫీ తీసుకొచ్చింది ఆయమ్మ. గడ్డకట్టుకుని గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం, కాఫీవేడికి కరిగిందేమో కన్నీరు కాలువలై పారింది. ఆమెని ఎలా ఓదార్చాలో తెలీక ఆయమ్మా, కామాక్షమ్మా కూడా కంగారు పడిపోయారు. ఏడ్చి ఏడ్చి అలిసిపోయిన సుమతి మెల్లగా లేచి మొహం కడుక్కుంది.రాత్రి పెందరాళే భోజనాలు ముగించుకుని, ఏదో తిన్నామంటే తిన్నామని అందరూ అన్యమనస్కులై నిద్ర కుపక్రమించారు.
* * *
రోజులు గడుస్తున్నాయ్. సుమతికి ఏడో నెలోచ్చింది. సుమతి వద్దంటున్నా వినక శ్రీమంతం బ్రహ్మాండంగా చెయ్యాలని పట్టుపట్టింది కామాక్షమ్మగారు. చుట్టాలూ, పేరంటాళ్లూ జనంతో ఇల్లు నిండిపోయింది. అంత హడావుడిలోనూ గోవింద్ లేనికొరత సుమతిని కృంగదీస్తోంది. ఆ రోజు ఎవరినోటంట విన్నా గోవిందుమాటే. సరిగ్గా భోజనాలు చేస్తూవుంటే వచ్చింది గోవిందు దగ్గరనుంచి ఉత్తరం. గబగబా తినేసి చెయ్యి కడుక్కుంది. సుమతి. గదిలోకెళ్ళి ఉత్తరం చదవడం మొదలెట్టింది.
:సుమ్మీ!
ఇవాళ నీ శ్రీమంతం. నా శుభాకాంక్షలు. నాకు నీలాంటి చక్కటి కూతురే కావాలి సుమా! నాలాంటి కొడుకుని కన్నావో, మళ్ళీ వాడితో నువ్వే వేగాలి కూతురైతే నీలాగా బుద్దిగావుంటుంది. ఈరోజు నిన్ను పెళ్ళికూతురిలాగా ఆలంకరిస్తారని రాశావు. చూసే అదృష్టం నాకు లేదు. ఫోటో తీయించుకుని పంపు. సుమ్మీ! నిన్నూ, అమ్మనీ, నాన్ననీ, మామయ్యనీ తలుచుకోని క్షణం లేదు. దగ్గరలో వున్నప్పటికంటే దూరంగా వున్నప్పుడే ఎక్కువ తలుచుకుంటామేమో! అనుక్షణం మీరే జ్ఞాపకం వస్తున్నారు. ఇక్కడి జీవితం క్రమశిక్షణకి బాసిస. ఉదయం నాలుగింటికి లేచి, పి.టి. చెయ్యడంతో ప్రారంభం అవుతుంది రోజు. పి. టి. అంటే 'ఫిజికల్ ట్రైనింగ్' లే. బోలెడంతమంది స్నేహితులయ్యారు, అందులో కొందరు తెలుగువాళ్లూ వున్నారు. సరదాగా కాలక్షేపం అయిపోతోంది. అనవసరంగా నాగురించి బెంగ పెట్టుకుని, నీ ఆరోగ్యం పాడుచేసుకోకు. దబ్బపండులాంటి పాపని కనాలి సుమా! అమ్మా, నాన్నా జాగ్రత్త. మామయ్యా నడిగానని చెప్పు. ఉంటా మరి___
అనేక ముద్దులతో
నీ గోవింద్.
ఉత్తరం చదువుతూంటే గోవింద్ తో మాట్లాడుతూన్నట్టే వుంది సుమతికి. ఒకటికి రెండుసార్లు, మళ్ళీ మళ్ళీ తనివితీరా చదివింది. ఉత్తరాన్ని మడిచి అల్మారాలో పెట్టింది. మనసంతా గోవిందు ఊహలు నిండడంతో మంచంమీద వాలిపోయింది.
"అమ్మాయ్ .....ఏం రాశాడూ. కులాసాగా వున్నాట్టనా?" అంటూ లోపలికొచ్చింది కామాక్షమ్మగారు.
"ఆఁ.....బాగానే వున్నార్ట. అందర్నీ అడిగానని రాశారు" అంది లేచి కూర్చుంటూ.
"కుఱ్ఱ నాగన్న" అంటూ వక్కపొడి తీసి కాస్త సుమతి కిచ్చి కాస్త నోట్లో వేసుకుంది కామాక్షమ్మగారు.
"కాస్సేపు పడుకోండత్తయ్యా! బాగా అలిసిపోయారు" అంది సుమతి పూలబుట్ట ముందేసుకుని పూలు గుచ్చుతూన్న అత్తగారిని చూసి.
"పడుకుంటే ఎట్లా? సాయంత్రం పేరంటం ఏర్పాటు చెయ్యాలి. నువ్వు కాస్సేపు పడుకో పూలజడ కూడా వేసుకోవాలి. నడుం నెప్పెడుతుంది" అంది కామాక్షమ్మగారు.
"అత్తయ్యా...." అంది అయిదు నిమిషాల పోయాక సుమతి.
"వారు ఫోటో పంపించమని రాశారు. మరి....."
"నాకుతెలిసే వాడి సంగతి. అందుకే మీ మామయ్యగారికి ఇందాకే చెప్పా ఫోటో గ్రాఫర్ ని పిలిపించమని" అంది నవ్వుతూ ఆమె.
"చదువుకొకపోయినా, ఆమె తెలివితేటలకి ఆశ్చర్యపోయింది సుమతి. చెప్పకుండానే, బిడ్డల కేంకావాలో తెసులుకునే శక్తి, ప్రతి తల్లికీ భగవంతుడు యిచ్చాడు కాబోలు." అనుకుంటూ తనూ తల్లి కాబోతూన్న విషయాన్ని తలుచుకుని మురిసిపోతూ, కళ్ళుమూసుకుంది సుమతి నిద్దర నాహ్వానిస్తూ.
పెళ్ళివారిల్లులావుంది ఇల్లు. చిలుకపచ్చని ఎఱ్ఱటి పెద్డంచు జరీ కంచి పట్టుచీర, అదేరంగుఅంచు బ్లౌజూ, మల్లెపూలజడ, చేతినిండా గాజిలూ, లక్ష్మిదేవిలా ధగధగా మెరిసిపోతోంది సుమతి. రక రకాల ఫోజులో ఒకడజను ఫోటోలు తీశాడు ఫోటోగ్రాఫర్ . పేరంటాళ్ళందరికీ గాజులు వేయించింది కామాక్షమ్మగారు. అదే సమయంలో ఇంటిముందు టాక్సీ ఆగింది.
అందరూ అటుకేసి చూశారు" అరె! జానకమ్మా, సుబ్బలక్ష్మీ కోడలూ' అంటూ కామాక్షమ్మచేతిలోని శెనగల పళ్ళెం పక్కన బెట్టి, పరుగుపరుగున ఎదురువెళ్ళింది.
"ఏం వొదినా ఇప్పుడారావడం ? పెళ్ళి కెలాగూరాలేదు. ఇప్పుడైనా వస్తారనుకుని ఎంతో ఎదురుచూశాం" నిష్ఠురంగా అంది కామాక్షమ్మగారు.
"వద్దామనే మొన్నటినుంచీ ప్రయాణం పెట్టుకున్నాం. కానీ, కోడలికి జ్వరం వచ్చేసింది. కాస్త నిన్నటినుంచీ తగ్గింది. పొద్దున్నే బయలుదేరాం. నాకు మాత్రం లేదూ నీ కోడల్ని చూడాలనీ" అంది ఆవిడ.
సామాను లోపలపెట్టించారు నరసింహారావుగారు. ఈ హడావిడిలో చాలామంది పేరంటాళ్ళు ఇహ వెళతామండీ అంటూలేచారు. అందరికీ తాంబూలాలిచ్చి పంపింది కామాక్షమ్మగారు జానకమ్మ సుమతిని రెప్పవాల్చకుండా చూసింది. సుమతి సిగ్గుతో తలవంచుకుంది. "నీ కోడలు అందగత్తే" అంది. ఆమె మాటలు అదోలా అనిపించాయి సుమతికి.
"ఈ చీర చాలా బావుంది ఎంతయింది? ఈ గాజులు చక్కగావున్నాయ్. ఎన్నితులాలు? ఇలాంటి ప్రశ్నలతో సుబ్బలక్ష్మి సుమతిప్రాణం తోదేసింది ఎలాగో అన్నింటికీ ఓపిగ్గా జవాబులు చెప్పింది సుమతి. కోడలు మాత్రం ముభావంగా మాట్లాడింది.
"ప్రయాణం చేసోచ్చారు. పెందరాళే భోంచేద్దురుగాని రండి" అంటూ భోజనం ఏర్పాటుచేసింది కామాక్షమ్మగారు. కోడలికి దిష్టితీయించి పూలజడంతా విప్పి బట్టలు మార్చుకు రమ్మంది. నగలన్నీ తీసేసిబట్టలుమార్చుకునే సరికి, ఎదో బరువు దించినట్టనిపించింది సుమతికి. అందరూ భోజనాలకి కూర్చున్నారు. సుమతికి ఆకలిగా లేదని మజ్జిగన్నం తింది.