Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 7

 

    బాల్యంలో శ్రీరాముడు బంతి ఆడుకుంటూ ఆటకు అడ్డం వచ్చిన మందర కాలు విరగగొట్టినట్లూ ఆ కచ్చే కడుపులో పెట్టుకొని మందర రామపట్టాభిషేకాన్ని భగ్నం చేసినట్లూ ఇందులో కనిపిస్తుంది.
    ఇందలి జంబుకుమారుని వృత్తాంతం వాల్మీకంలో లేదు. సీతారాముల ధమర్భంగానికి ముందే పరస్పరం చూచుకొని ప్రేమించుకొంటారు. ఇది కూడా వాల్మీకంలో లేనిదే. లక్షణుడు పర్ణశాలలో సీతను ఒంటరిగ వదలి వెళ్ళుతూ ఏడు గీతాలు గీసి ఏ పరిస్థతిలోనూ వీటిని దాటి రావలదని నియమం చేస్తాడు.
    రావణుని సభలో హనుమంతుడు తన వాలాన్ని సింహాసనంగా చుట్టుకొని దాని మీద కూర్చుంటాడు. సంజీవి తేవటం కోసం పోయిన అంజనేయునికి కాలనేమి అనే రాక్షసుడు అడ్డుపడి కాలయాపన చేస్తాడు.
    సేతు బంధసమయంలో ఒక ఉడుతబుడుత తన భక్తిని ప్రదర్శించి రాముని అనురక్తిని సంపాదించుకుంటుంది.
    అన్నిటి కంటే ముఖ్యమైనది సులోచనా వృత్తాంతం. ఈమె మహావీరుడైన ఇంద్రజిత్తు భార్య. తన మామగారి అనుజ్ఞపొంది శత్రువుల సైన్యంలో ప్రవేశించి తన పతి మృతకళేబరాన్ని కొనివచ్చి దాంతో సహగమనం చేస్తుంది. వాల్మీకి రామాయణంలో లేని విచిత్రమైన ఈ సన్నివేశాలన్నీ చమత్కారం కోసం, రసపుష్టికోసం, కధాగమనం కోసం రంగానాధరామాయణ కర్త ఇతర సంస్కృత రామాయణాల నుండీ , జనశ్రుతల నుండీ గ్రహించి ఇందు చేర్చాడు.
    రంగనాధరామాయణంలో 17,290 ద్విపదులు ఉన్నవి. ఆరు కాండములున్నవి. ఉత్తరకాండము బుద్దారెడ్డి కుమారులైన కాచవిభుడు, విట్టలనాధుడు పూర్తి చేశారు. అందులో 5,640 ద్విపదులు ఉన్నవి.
    బెంగాలీవారికీ కృతివాసరామాయణం వలె, హిందీ వారికీ తులసీ రామాయణం వలె, తమిళ సోదరులకు కంబరామాయణం వలె, తెలుగువారికి సర్వాంగసుందరమైన రామాయణం రంగనాధ రామాయణం. రంగనాధ రామాయణం వెన్నెల, వెలుగుల్లో విహరించి ఇక భాస్కరుని అరుణారుణ కిరణ కాంతులలోకి అడుగు పెడదాం.
    
    భాస్కర రామాయణం

    హుళక్కి భాస్కరుడనే కవి ప్రాధాన్యం వహించి తనూ, తన కుమారుడూ , తన శిష్యుడు , తన మిత్రుడూ కలిసి రచించినందు]వల్ల ఈ మహా గ్రంధానికి "భాస్కర రామాయణం' అనే పేరు వచ్చింది. కొందరు విమర్శకులు తిక్కన గారి పితామహుడైన మంత్రి భాస్కరుని హస్తం ఇందులో ఉందని అభిప్రాయపడ్డారు. అయితే వాదోపవాదాలు అనంతరం మంత్రి భాస్కరుడికీ ఈ భాస్కర రామయాణానికీ ఏమీ సంబంధం లేదని తేలిపోయింది.
    హుళక్కి భాస్కరుడు అన్న పేరు "హుళక్కి భాస్కరుడు" అయి ఉంటుందనీ "హళక్కి" అన్నది కన్నడంలో తాంబూలబిరుదమనీ భాస్కరుడు పాండిత్యంలో తన ప్రభువును మెప్పించి అగ్రతాంబూలం అందుకొని హళక్కి భాస్కరుడై ఉంటాడని కొందరు విమర్శకుల అభిప్రాయం. భాస్కరరామాయణంలోని ఆరు కాండలలో బాల - కిష్కింద- సుందర కాండలను భాస్కరుని పుత్రుడైన మల్లికార్జునభట్టూ - అయోధ్యాకాండను శిష్యుడైన రుద్రదేవుడూ - అరణ్య కాండనూ , యుద్దకాండలో 1139 పద్యం వరకు భాస్కరుడూ రచింపగా యుద్దకాండ మిగిలిన భాగమంతా భాస్కరుని మిత్రుడైన అయ్యలార్యుడు పూర్తీ చేశాడు.
    భాస్కర రామాయణ రచన వాల్మీకి రామాయణాన్ని అనుసరించి సాగినదే అయినా ఆవాల్మీకాలైన అంశాలు కొన్ని కధావైచిత్రికోసం, రసపోషణకోసం రంగనాధ రామాయణంలో వలెనె ఇందులోనూ ప్రవేశించాయి.
    గౌతముడు అహల్యను శిల కమ్మని శపిస్తాడు. చిన్నప్పుడు రాముడు తన్ను తన్నినాడన్న కసి కొద్దీ మందర కైకకు దుర్భోధ చేసి శ్రీరామ పట్టాభిషేకం చేడగొడుతుంది. (ఈ తన్నులు తిన్న సంగతి వాల్మీకంలో లేదు) శూర్పణఖ కుమారుడైన జంబుకుమారుణ్ణి లక్షణుడు సంహరించిన కధ కూడా ఇందులో చోటు చేసికొంది. భర్త శోక పరితప్తురాలైన తార "రావణసంహారానంతరం నీవు సీతను కొనివచ్చినా శాశ్వతమైన జానకీ వియోగం అనుభావిస్తా"వని రాముణ్ణి శపిస్తుంది. అన్నచే అనమానితుడైన విభీషుణుడు తన తల్లియైన కైకసి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పి, ఆ తల్లి ఆశీర్వాదంతో శ్రీరాముణ్ణి శరణు పొందుతాడు. నాగపాశబద్ధులైన రామలక్షణుల సాన్నిధ్యానికి నారదుడు వచ్చి "గరుత్మంతుని స్మరింపు" మని ఉపాయం చెబుతాడు. కాలనేమి కధ ఇందులో కూడా ఉంది. రావణుని నాభియందలి అమృతకలశం వృత్తాంతం ఇందులో వస్తుంది. ఇవి వాల్మీకంలో లేవు. కొన్ని రంగనాధరామాయణం నుంచీ, మరి కొన్ని ఆధ్యాత్మ రామాయణం నుంచీ భాస్కరాదులు గ్రహించి ఉంటారు.
    భాస్కర రామాయణం అనర్గళధారాసముపేతమై ప్రౌడగంభీర శయ్యాసౌభాగ్యం తో విద్యజ్జన రంజకంగా విరాజిల్లుతూ ఉంటుంది.
    తటాకా సంహారఘట్టంలో వీరోచితంగా వింటినారి మ్రోగిస్తాడు శ్రీరాముడు.
    
        అంత గడంక రాముడు సమగ్రభుజాబలవిక్రమోత్సవం
        బెంతయి బర్వ మౌర్వి మొరయించే దిగంతరదంతికర్ణరం
        ధ్రాంతర సాగరంతరధరాభ్రతాలంతర చక్రవాళశై
        లాంతర సర్వభూధరగుహాకుహరంతర పూరితంబుగన్.

    సుదీర్ఘమైన సమాసంలో సాగిన ఈ ధనుష్టంకారం ఇంకా ఇంకా మన చెవులలో మార్మ్రోగుతూనే ఉన్నది. ఇది మల్లికార్దునభట్టు పద్యం.
    "విఘ్నేశాయ నమో నమో భగవతే వేదండతుండాయ ని
    ర్విఘ్నక్షేమకృతే నమోస్తు భవతే విశ్వప్రభో" అని నిర్విఘ్న పరిసమాప్తి కోసం విఘ్నేశ్వర పూజచేసి నలుడు రామజ్ఞతో సేతువు కట్టడం ప్రారంభించాడు. కార్యరంభంలో గణేశపూజ చేయటం భారతీయుల ఆచారం, వానరవీరులు తలల మీద , భుజాల మీద చేతుల సందున పెట్టుకొని పెద్ద పెద్ద బండలూ కొండలూ తెచ్చి నలుడి చేతికి అందిస్తున్నారు. నలుడు నీటిలో పడవేసిన ఏ పదార్ధమూ - అది కొండగానీ, బండ గానీ - తేలవలసినదే కాని మునుగదు. అది వాని ప్రత్యేకత. నలుడు ఒక పెద్ద కొండ ఎత్తి మొట్ట మొదటసారిగా "ధబీలు" మని సముద్రంలో పడవేశాడు. ఆ సందర్భంలో భాస్కరుడు ఎంత చక్కని కల్పన చేశాడో చూడండి.
        వైచిక నాక లోకమున వారికీ వారిధీపంపు పూని దో
        షాదరనాధు చేటు విన జాట జలచ్చట లేగ - దాసు వే
        వే చని చెప్పి వచ్చె సాహివీరుల కన్నటు లూర్మూ లోక్కపే
        లై చెదరన్ మునింగి వెస నగ్గిరి దేలె గప్రీంద్రు లార్వగన్.

    "దభీ" మని పర్వతం సముద్రంలో పడగానే పెద్ద ధ్వనితో సముద్ర జలం ఆకాశమెత్తు పైకి లేచిందట. అది రావణుడికి చేటు మూడిందని స్వర్గంలో వారికీ చాటి చెప్పడానికి సముద్రుడు తన వారిని పంపించినట్లున్నదట! ఇక పాతాళం దాకా లోపలికి మునిగి బంతిలా పైకి లేచిన పర్వతం రావణుని సర్వనాశనాన్ని రసాతలవాసులకు చెప్పి మళ్ళీ పైకి వచ్చినట్లున్నదట! ఎంత అద్భుతమైన కల్పనో చూడండి!
    రావణ సుగ్రీవులు యుద్ధం చేస్తున్నారు. పరస్పరం అధిక్షేపించుకొంటున్నారు. ముందు సుగ్రీవుడు తరువాత రావణుడూ -

        "వంచన రాముదేవి గొనివచ్చినయట్టులు గాదు రోరి న
        క్తంచర! నన్ను నాహవముఖంబున దాయుట" లన్న "నయ్యరే
        క్రించ సాహూదరున్ గరము గీడ్పడి మానవ చేత బొంచి యే
        యించుట గాదులే నను జయించుట నీకు" నటంచు నవ్వినన్.

    "దొంగతనంగా రాముణ్ణి మోసం చేసి సీతను తీసుకురావటం కాదురా నన్ను జయించటం" అని సుగ్రీవు డాక్షేపిస్తే "పౌరుషం చాలక దొంగతనంగా చెట్టు చాటున పొంచి ఉంచిన ఒక మానవుని చేత అన్నను చంపించటం కాదురా నన్ను జయించటమంటే " అని ఎదురు దెబ్బ తీస్తాడు రావణుడు. ఇద్దరూ ఇద్దరే. బుద్ది మంతులు! పైది భాస్కరుని పద్యం.
    లంకానగరంలో హనుమంతుడు రావణునికి హితోపదేశం చేస్తున్న ఈ పద్యం ఎంత గొప్పగా నడిచిందో చూడండి -
        నీ కంఠర్పితకాలపాశ,ము శిరోనిర్ఘాతపాతంబు లం
        కౌకస్సంచయకాళరాత్రి గళబద్దోదగ్రకాలాహి క
        న్యాకారాగతమృత్యువున్ జనకకన్యన్ వేగ యేప్పించి లో
        కై కత్రాణుని రామునిం గనుము నీ కీ బుద్ది గాకుండినన్.

    ఇది మల్లికార్జునభట్టు పద్యం. మహాకావ్యానికంతా మకుటాయమానంగా మణి దీపంగా ప్రకాశించే ఈ క్రింది పద్యమూ మల్లికార్జునభట్టుదే . వర్షావర్ణనం-
    
        యమునద్గంగము , కృష్ణభూమదిల , మబ్జాక్షన్మనుష్యంబు, నీ
        ల మహీధ్ర న్నిఖిలాచలావాలి , తమాలద్భుజ, మిందీవర
        త్కుముదశ్రేణి, పికద్విహంగము , తమస్తోమద్గ్ర హర్కప్రభా
        సముదాయం జగుచుండె లోక మలఘుశ్యామాభ్రముల్ పర్వినన్.

 Previous Page Next Page