Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 8

 

    వర్షాకాలంలో ఆకాశం నిండా కారుమేఘాలు క్రమ్ముకొన్నాయి. గంగ యమునలాగా అయిపొయింది. నరులు నారాయణులైనారు. కొండలన్నీ కాటుక కొండలైనాయి. చెట్లన్నీ చీకటి చెట్లుగా మారాయి. తెల్ల కలువలు నల్లకలువలై పోయాయి. పక్షులన్నీ కోకిలరూపం ధరించాయి. ఈ పద్యంలో హృద్యమైన వ్యాకరణ సౌందర్యం ఉన్నది. నామధాతువులకై శతృప్రత్యయాలు చేర్చ్ఫ్హి బహువ్రీహి సమాసాలను సంతరించి పద్యమంతా అనపద్యంగా దిద్ది తీర్చాడు కవి. వ్యాకరణం తెలిసిన పాఠకులకు గాని ఇందలి శాబ్దికశిల్పం బోధపడదు. ఉదాహరణకు  ఒక్కటి విన్నవిస్తాను - యమునద్గంగము - కృష్ణభూమదిలము- అబ్జాక్షన్మనుష్యంబు అనే విశేషణాలతో "కృష్ణభూమదిలము" అన్నది చాలా విచిత్రమైన సమాసం. భూమి సమస్తమూ నల్లభూమిగా మారిపోయింది. "క్రుష్ణాచ సా భూమిః కృష్ణభూమిః" అని ఇకారాంతం కావలసి ఉండగా "కృష్ణోదక పాండు సంఖ్యా పూర్వాయా భూమే రజిష్యతే" అనే వార్తికం వల్ల "కృష్ణభూమము" అని ఆకారంత మవుతుంది. ఆ తరువాత నామధాతువై శతృప్రత్యయం వచ్చి అనంతరం "ఇలా" శబ్దంతో బహువ్రీహి సమాసమై "కృష్ణభూమదిలము" అనే రూపం ఏర్పడుతుంది. ఇంత వ్యాకరణకోలాహలం ఎందుకు చెప్పానంటే సమర్ధులైన కవులు శబ్దాన్ని ఎంత నిశితంగా ఎంత నిర్దుష్టంగా ఎంత ప్రతిభాస్పోరకంగా ప్రయోగిస్తారో తెల్పటం కోసం.
    
    మొల్ల రామాయణం

    అదుగో మొల్ల రామాయణం! సుగంధాలు వెదజల్లుతూ చల్లగా తెల్లగా మల్లె పందిరి లాగా మనల్ని ఆహ్వానిస్తున్నది. మొల్ల గురులింగ జంగమార్చన పరుడూ శివభక్తీరతుడూ అయిన కేసరు వరపుత్రినని చెప్పుకొన్నది. మొల్ల రామాయణానికి తెలుగుదేశంలో విశేషమైన ప్రశస్తి ఉన్నది. ఈమె రామాయణం ఆరు కాండలతో సుమారు 900 గద్య ప్రసూనాలతో రసజ్ఞమనోజ్ఞంగా ప్రసన్నసుందరంగా ఉంటుంది. కవిత్వాన్ని గురించి మొల్ల మొగమాటం లేకుండా తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటించింది.

        తేనే సోక నోరు తీయన యగురీతి
        తోడ నర్ద మెల్ల దోచకుండ
        గూడశబ్దములను గూర్చిన కావ్యమ్ము
        మూగచెవిటివారి ముచ్చటగును.
        ఇంకా ఏమంటుందంటే -
        కందువమాటలు సామెత
        లందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
        బొందై రుచియై వీనుల
        విందై మరి కానుపించు విబుధుల మదికిన్.
    మొల్ల శివభక్తుల ఇంటిలో పుట్టినా బమ్మెర పోతన్న వలె తన కృతిని తన యిష్ట దైవతమైన శ్రీరామచంద్రునికే అంకితం చేసింది. రాముని స్తుతించు నాలుక రాజులను స్తుతింపదన్న సంగతిని అందమైన సామెతలో "బెల్లము తినువాడు అల్లమున కాస పడడని" మొల్ల తేటతెల్లంగా చెప్పింది.
    
        సల్లలిత ప్రతాపగుణసాగరుడై విలసిల్లి ధాత్రిపై
        బల్లిదుడైన రామనరపాలకునిన్ స్తుతి జేయు జిహ్వకున్
        చిల్లర రాజలోకమును చేకొని మెచ్చగ నిచ్చ పుట్టునే?
        అల్లము, బెల్లముం దినుచు నప్పటి కప్పటి కాస చేయునే?
    ఈమె కవితామాధుర్యానికి పదసౌందర్యానికీ ఈ క్రింది పద్యం మచ్చుతునక.

        రాజులు కాంతియందు; రతిరాజులు రూపమునందు; వాహినీ
        రాజులు దానమందు; మృగరాజులు విక్రమకేళియందు; గో
        రాజులు భోగమందు; దినరాజులు సంతతతేజమందు; రా
        రాజులు మానమందు నగరంబున రాజకుమారు లందరున్.
    సముద్రం లంఘింపబోతున్న అంజనేయుణ్ణి ఈమె ఈ పద్యంలో బొమ్మ కట్టించింది.

        మొగము బిగించి పాదములు మొత్తముగా నటు నూది త్రొక్కి నీ
        టుగ మొగమెత్తి భీకరకఠోరరవంబున నార్చి బాహుల
        తృగణితలీల సూచి వలయంబుగ వాలము ద్రిప్పి వ్రేగునన్
        నగము సగమ్ము గ్రుంగ కపినాధుడు నింగికి దాటె రివ్వునన్.

    ఎంత చక్కగా దూకించింది హనుమంతుడిని! రాతిని నాతిగా మార్చిన రామభద్రుని పాదాలను తులసీదాసువలెనే గుహునిచేత కడిగించింది మొల్ల.

        "సుడిగొని రాముపాదములు సోకిన ధూళి వహించి రాయి యే
        ర్పడ నొకకాంత యయ్యేనట; పన్నుగ నీతని పాదరెణు వి
        య్యెడ పడి నోడ సోక నిది యేమగునో" యని సంశయాత్ముడై
        కడిగే గుహుందు రామపదకంజయుగంబు భయమ్ము పెంపునన్.
    మొల్లకూడా పోతన్న గారివలెనే-
    "చెప్పుమని రామచంద్రుడు
    చెప్పించిన పలుకు మీద చెప్పుదు' నని తన సంగతి వినయపూర్వకంగా చెప్పుకొన్నది. శ్రీకంఠ మల్లేశ్వరుని వరముచే జన్మించిన ఈమె మొదటి పేరు "మల్లమ్మ" అనీ, మల్లమ్మ మెల్ల మెల్లగా మోల్లమ్మగా మారి ఉంటుందనీ కొందరి అభిప్రాయం. ఈమె కృష్టరాయల కాలంలో ఉన్నట్లు చెప్పబడటం చేత ఈమె కాలం 16వ శతాబ్ది పూర్వభాగం అయి ఉండవచ్చునని విమర్శకుల ఊహ.

    రామాభ్యుదయం
    
    ఇది ఎనిమిదాశ్వాసముల మహాప్రబంధం. రామాయణమునందలి పట్కందముల కధ రామపట్టాభిషేకపర్యంతం అత్యంత రసవంతంగా ఇందు వర్ణించబడింది. అయ్యలరాజు రామభద్రుడు (1540) ఈ రామభ్యుదయ రచయిత ఇందు సుమారు 1800 గద్య పద్యాలున్నాయి.
    రామభద్రుడు ఆంధ్రుల ఆచారాన్ననుసరించి కల్యాణ సమయంలో శ్రీరాముని చేత సీత మెడలో మంగళసూత్రం కట్టించాడు.
    
        హాటక గర్భదైవత మహర్షులు దీవనలియ్యగా , నిరా
        ఘాట మరుద్వదూమధురగానము నింగి జెలంగ, జానకీ    
        పాటలగంధికంధర , శుభప్రదవేళ ఘటించే నాజగ
        న్నాటకసూత్రధారి రఘునాధుడు మంగళసూత్ర మయ్యేదన్.
    రామభద్రుడు కవితాలక్షణాన్ని వర్షర్తువర్ణననీ జోడించి ఒక చక్కని పద్యం చెప్పాడు.

        ధారాశుద్ధి బ్రసిద్ధి గాంచి ఘనశబ్దస్ఫూర్తి వర్తిల్లగా
        దోరంబైన రసస్థితిన్ దరళవిద్యున్మాలికాలక్షనో
        దారంబై కవిసేవ్యమై వనమయూరారూధి బ్రాపించి వ
        ర్షారంభంబు ప్రబంధమట్లభిలపద్యాక్రాంత మయ్యెం దగన్.
    ఈ పద్యంలో ఉత్తమ కవితకు ఉండవలసిన ప్రధానలక్షణాలు ధారాశుద్దీ , ఘనశబ్దస్ఫూర్తి, రసస్థితీ అని కవి స్పురింపజేశాడు శ్లేషచమత్కారంతో, రసజ్జమనోజ్జాలైన పద్యాలు ఈ ప్రబంధంలో ఎన్నో ఉన్నాయి. దశరధ విలాపంలో 'కానక కన్న సంతానంబు కావున కానక కన్న సంతానమయ్యే" అన్న శ్లేషసుందరమైన సీసపద్యం విశేషప్రచారం పొందిందే. "పాలింపు మిజ్జగంబులు పాలింపుగ త్రావి" ఓడవుసురాసురాదుల, కోడపు భవజలధి గడవ" "నీలోపల బెగదొందకు నీలోపలచికుర;" "నలువ గల లోతుపొక్కిలి నలువగల భుజంబులున్ దనర" ఇటువంటి అనుప్రాస గల గమకాలూ యమకాలూ ఈయన కవితలో కోకొల్లలు. అందుకనే "రామభ్యుదయం విజయవిలాసానికి మార్గదర్శక" మని కొందరంటారు.
    
    కట్టా వరదరాజ రామాయణం
    
    వరదరాజు సూర్యవంశ క్షత్రుయుడు. ఈ రాజకవి కడప మండలానికి చెందినవాడు. వీరి పూర్వికులు కావేరికి ఆనకట్ట కట్టించటం వల్ల వీరికి "కట్టా" అనే గృహానామ మేర్పడింది. వరదరాజ రామాయణం యధా వాల్మీకం. రసవత్తరమైన రచన. దీనిలో 23170 ద్విపదలు ఉన్నవి. ఇందులో ఒకటి రెండు అవాల్మీకాలైన అంశాలున్నప్పటికీ వాల్మీకి ననుసరించే రచన సాగింది. శయ్యా సౌభాగ్యానికి ఒక ఉదాహరణ. రణరంగానికి వచ్చి బ్రహ్మాస్త్రం ప్రయోగించిన ఇంద్రజిత్తు జిత్తులను ఇట్లా వర్ణించాడు వరదరాజు -

        అసురేంద్రసుతుడు బ్రహ్మాస్త్రప్రభావ
        లసమానతేజోవిలాసియై డాసి
        నెరయించు నొకచోట నీలమేఘములు
        కురియించునొకచోట ఘోరాస్త్రవృష్టి
        మలయించు నొకచోట మంచు పెందేరలు
        పొలయించు నొకచోట భుగభుగపొగలు        
        వినిపించు నొకచోట విలునారిమ్రోత
        కనిపించునొకచోట కాంచన రధము
    ఋష్యమూక పర్వత వర్ణనం అంత్యానుప్రాసలతో కూడి సంస్కృత సమాసాలతో సాగిపోయింది.

 Previous Page Next Page