ఈ వాదోపవాదాలకు డాక్టర్ జి. నాగయ్య ఎం. ఏ. పిహెచ్ డి. గారు చక్కని పరిష్కారం సూచించారు. పట్టాభిషేకసమయంలో ప్రభువుల పేరు మార్చుకొనే సంప్రదాయం ఉంటుందట. "బుద్దారెడ్డి యువరాజుగా ఉన్నప్పుడే రామాయణం రచించి ఉంటాడు. అయన పట్టాభిషేకంలో "రంగనాధు" డనే పేరు బుద్దారెడ్డికి ఏర్పడి ఉంటుంది. ఆ పేరుతోనే బుద్దారెడ్డి రచించిన రామాయణానికి "రంగనాధరామాయణ" మనే ప్రసిద్ది వచ్చి ఉంటుంది. బుద్దారెడ్డి రంగనాధులు భిన్నులు కారు. గోన బుద్దారెడ్డియే రంగనాధుడు. రంగనాధుడే గోన బుద్దారెడ్డి"!
ఇక రంగనాధరామాయణంలోని రచనారామణీయకం చిత్తగించండి. మాయ లేడి వర్ణన మిది.
అంతంత బోదసూపు నటజేరవచ్చు
నంతలో బెదిరి బిట్టదరి కుప్పించు
తరుల నీడల కేగు తగ బర్ణశాల
జోరబారు నంతంత స్రుక్కి క్రేళ్ళురుకు
వసుధ మూర్కొని చూచు వాల మల్లార్చు
దేసలకు చెవి చేర్చి తెలియ నాలించు
గంచు మించై పారు గ్రమ్మర జేరు
కుంచితాకృతి చెవికోన గడలించు
పచ్చిక పట్లఫై బవళించు లేచు
మచ్చిక నోచ్చోటి మౌనుల జేరు
ఖురముల జెవి గోకు కొమ్ముల తుదల
విరుల తీగ కదల్చి విరులెల్ల రాల్చు -
తన్ను కొనిపోవచ్చిన వేశ్యలతో ప్రపంచ మెరుగని ఋష్యశృంగుడు -
"మాకు కొమ్మొక్కటి మస్తకమ్మునను
మీకు కొమ్ములు రెండు మెరసె రొమ్మునను"
అని తన అమాయకత్వాన్ని ప్రకటించుకొంటూ అంటాడు
శూర్పణఖ ప్రణయఘట్టం హస్యస్పోరకంగా చిత్రింపబడింది.
"తన మొద్దు మొగము నాతని ముద్దు మొగము
తన మహెదరము నాతని తనూదరము
తన కప్పకన్ను లాతని గోప్పకన్ను
లెనయంచు తన కితడే తగునంచు
మొగము చేటంతగ ముసి ముసి నగవు
లీగురింప రఘురామ నీక్షించి పలికే".
బుద్దారెడ్డి వర్ణనలు తీర్దానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదం కాకుండా కధతో పెనవేసికొని నడుస్తాయి. వర్షాకాలవర్ణనం చేస్తున్నాడు కవి -
కైకొని యింక నిక్ష్వాకువల్లభుడు
నాకారిపై దండు నడచుచున్నారు
అని సురలకు జెప్ప నరిగెనో ధాత్రి
యన వాయువులతోడ నట ధూళి యెగసే
అలంబులో దైత్యు నడగింపు మనుచు
కాలుందు తనచేతి కాలపాశంబు
పొనర రామునికయి పుత్తెంచె ననగ\
తనరార దివి నింద్రధను వోప్పే జూడ
రాక్షసాంగములపై రాము బాణములు
లక్ష్మీంపబడు నిట్టి లాగ యన్నట్లు
పర్వతాగ్రములపై భయదఘోషముల
పర్వ నిర్ఘాతముల్ పడియె నందంద
రావణు జంపుచో రఘురాముమీద
దేవతల్ దీపించి దివ్యపుష్పమ్ము
లేదనేడ వర్షింతు రీక్రియ ననిన
వదుపున మహి రాలె వర్షోపలములు.
సుమనో మనోజ్జమైన ఈ ఉత్ప్రేక్ష చిత్తగించండి -
కుదియని కడకతో గోరి యాకాశ
నది నాడబోయిన నాగకన్యకలు
చనిచని మగుడ రసాతలంబునకు
జనుదెంచుగతి వర్షజలధార లొప్పే.
ఆకాశమునుండి అవని పై పడుచున్న వర్షధారలు ఆకాశగంగలో స్నానం చేసి రసాతలానికి తిరిగిపోతున్న నాగకన్యలవలె ఉన్నవట! ఎంత సహజంగా ఉందో!
ఉత్తరాగోపురంలో కొలువు తీరి ఉన్న లంకేశ్వరుడు, ఒక్క బాణంతో తన సభావైభవమంతా చెల్లాచెదురు చేసిన శ్రీరాముని ధనుర్విద్యాకౌశలాన్ని ఈ విధంగా కొనియాడుతాడు.
నల్లవో 'రఘురామ నయనాభిరామ'
విల్లు విద్యగురువ! వీరవతార!
బాపురే! రామ! భూపాలలోకముల
నీపాటి విలుకాడు నేర్చునే కలుగ
పాటించి పురములపై బడ్డ హరుని
యేటొప్పు నిందు నీ యేటోప్పు గాక.
రావణుడు ఇట్లా పలికాక "పగవాని నీరీతి పంతంబు విడిచి పొగడుదురే దైత్యపుంగవ!' అని మంత్రులు హెచ్చరిస్తారు. 'మేటిశూరుల పెంపు మెచ్చంగ వలదె" అంటాడు రావణుడు. ఈ విధంగా ప్రతినాయకుడైన రావణున్ని అతిలోక శూరునిగానే కాకుండా మహోదారునిగా గుణగ్రహణపారీణునిగా బుద్దారెడ్డి చిత్రించాడు.
సుగ్రీవుడు సీతమ్మ సొమ్ములను శ్రీరామునకు చూపినప్పుడు -
"మున్నుగా వగలను మున్నీట మునిగి
కన్నీట నాసొమ్ము కసటెల్ల గడిగి "
రాముడు శోకించటం పఠితల హృదయాన్ని కదిలిస్తుంది. "అపరాధం చేసిన కైకనూ భరతుడిని రావణాసురుడిని ఏమీ చేయకుండా నిరపరాధుడైన వాలిని ఎందుకు చంపా" వని ఏడుస్తూ తార శ్రీరాముణ్ణి ఎత్తిపొడవటం ఎంతో సహజంగా ఉంది.
"మెరసి ని న్నిటుచేయ నీ తండ్రి తోడ
గరపెనే రఘురామ! గరుతింప వాలి?
వెరపున నీ రాజ్యవిభవంబు గొన్న
భరతుడే రఘురామ! పరికింప వాలి?
చెనటియై నీదేవి జేరగొని చనిన
దనుజుడే రఘురామ! తలపోయ వాలి?
వాలి సకారణవైరంబు పూని
ఏలయ్య తెగటార్చి తిబ్బంగి బేర్చి?
నీయట్టి సుకృతికి నీయట్టి పతికి
నీయట్టి కారుణ్యనిధి కిట్లు తగునే?
జనకజతో గూడ జనియేనే ఎఱుక
ఘనమైన విరహాగ్ని గ్రాగెనే ఎఱుక?"
రావణాసురుణ్ణి సంహరించిన రామబాణం భూమిలో జొచ్చి మరలివచ్చి రాముని అమ్ములపొదిలో ప్రవేశించిందట. ఈ సందర్భాన్ని కవి ఇలా స్మభావిస్తున్నాడు.
"నీ కూతు చెరపట్టి నీచభావమున
గైకొనదలచిన ఖలుని ప్రాణములు
గై కొంటి నే" నని కదిపి భూస్థలికి
ప్రాకటంబుగ జెప్ప బరచేనో యనగ
రామునిబాణం భూమిలోదూరి మళ్ళీ అమ్ములపొదిలోకి చేరిందట. ఈ విధంగా రంగనాధరామాయణంలోని సాహిత్య సౌందర్యం సహృదయహృదయంగమంగా ఉంటుంది.
'అదికవీశ్వరుడైన వాల్మీకి చెప్పిన తెరగున శ్రీరాము చరితము చెప్పుదు" నన్నప్పటికీ ఆవాల్మీకాలైన అంశాలు కొన్ని ఈ రామాయణంలో రచయిత చేర్చాడు.
గౌతముని ఆశ్రమంలో ఇంద్రుడు "కుక్కటంబైపోయి కూటజంబు చేరి కొక్కొరోకో యని కూయటం" కొత్త విషయం . ఇది వాల్మీకంలో లేదు.
గౌతముడు భార్యయైన అహల్యను పాషాణమై పడియుండుమని కఠోరంగా శపిస్తాడు. ఇది కూడా వాల్మీకంలో లేదు.